🕉 మన గుడి : నెం 1345
⚜ తమిళనాడు : సింగిరికుడి - కడలూరు
⚜ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం
💠 సింగిరికుడి క్షేత్రం నందు ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ ఆలయం ఉంది. మూడు పవిత్ర క్షేత్రాలలో సింగిరికుడి ఒకటి.
మిగిలనవి పూవరసన్ కుప్పం మరియు పరిక్కల్ క్షేత్రం.
ఈ ప్రాంతము వారు ఒకే రోజులో మూడు క్షేత్రాలు సందర్శించుట శుభకరంగా భావిస్తారు.
🔆 స్ధలపురాణం
💠 ఇక్ష్వాకు వంశమునకు చెందిన నిమి చక్రవర్తి గొప్ప ధర్మాతుడు, సత్యవంతుడు, నీతిమంతుడు. అతడు అనేక యజ్ఞాలు నిర్వహించి, దేవతల నుండి అనేక వరాలను పొందాడు.
మానవాళి క్షేమం కోసం పరాశక్తి యజ్ఞం చేయాలనుకున్నాడు.
💠 నిమి చక్రవర్తి, తన గురువైన వశిష్టుని వద్దకు వెళ్లి యజ్ఞం గురించి తెలియజేసి, యజ్ఞాన్ని నిర్వహించమని అభ్యర్థించాడు.
అంతకు ముందే వశిష్టుడు స్వర్గములో ఇంద్రుడు నిర్వహించు యజ్ఞంలో పాల్గొనటకు వాగ్దానం చేసియున్నాడు. వశిష్టుడు ఈ విషయం నిమి చక్రవర్తికి వివరించి, ఇంద్రుడు తలపెట్టిన యజ్ఞాన్ని ముగించి, తిరిగి వచ్చిన తర్వాత పరాశక్తి యజ్ఞం నిర్వహించుటకు హామీ ఇచ్చాడు.
💠 వశిష్టుడు కోసం నిమి చక్రవర్తి వేచి ఉండకుండా, గౌతముడు, కౌశిక ఋషి మొదలగు వారి సహాయంతో యజ్ఞాన్ని ప్రారభించాడు.
స్వర్గములో ఇంద్రుడు నిర్వహించిన యజ్ఞాన్ని పూర్తిచేసిన వశిష్టుడు తిరిగి నిమి చక్రవర్తి రాజ్యంకు వస్తాడు.
యజ్ఞ కార్యాక్రమాలలో అలసిన రాజు విశ్రాంతి కోసం రాజభవనములో నిద్రించు చుంటాడు.
💠 రాజభవనంలోని కాపలాదారులు వశిష్టుని అడ్డుకొంటారు.
రక్షక భటులు చర్యతో కోపోద్రిక్తుడైన వశిష్టుడు,రాజును శపించాడు. మరణం పొంది, శరీరం లేకుండా ఆత్మతో వాతావరణంలో సంచరించమని శపించాడు.
నిద్ర నుంచి మేల్కొన రాజు కలత చెందాడు.
💠 నిమి చక్రవర్తి కూడ వశిష్టునికి ప్రతి శాపం ఇస్తాడు.
ఆ ఇద్దరూ ఒకరి శాపంతో ఒకరు చనిపోవడంతో, యజ్ఞం అసంపూర్తిగా నిలిచిపోయింది.
యజ్ఞ పురుషులు, దేవతలు, బ్రహ్మ దేవుడు మొదలగువారు నిమి చక్రవర్తి యజ్ఞాన్ని పూర్తి చేయడానికి శరీరం లేని ఆత్మగా నిమికి జీవితాన్ని ప్రసాదిస్తారు.
💠 విదేహ రూపాన్ని (శరీరం తక్కువ రూపం) ధరించి యజ్ఞాన్ని నిమి చక్రవర్తి పూర్తి చేశాడు.
యజ్ఞ దేవత అయిన అంబికా దేవి, నిమి చక్రవర్తి ఒక వరం ప్రసాదించుతుంది.
చక్రవర్తి లోకములో గుర్తుండిపోయే పేరు కావాలని అభ్యర్థించాడు.
పరాశక్తి రాజు కోరిక మన్నించింది.
💠 సకల జీవుల కనురెప్పలల్లో స్ధానం కల్పించింది.
జీవుల కనురెప్పలను తెరవడానికి మరియు మూసుకునేలా చేయడాని పట్టు సమయం "నిమిషం" అంటారు. ఆ విధముగా నిమి చక్రవర్తి వరం నెరవేరింది.
బ్రహ్మ ఆదేశం ప్రకారము వశిష్టుడు సింగర్కుడి (సింగిరికుడి) క్షేతం నందు తపస్సు చేసి మోక్షాన్ని పొందాడు.
💠 అతని భక్తికి మెచ్చిన నరసింహుడు దర్శనం ఇచ్చాడు. సింగపెరుమాళ్ (నరసింహుడు) దర్శనమిచ్చిన ప్రదేశాన్ని "సింగర్కుడి" అని పిలుస్తారు.
💠 ఆలయం రాజరాజ చోళుడు మరియు విజయనగర రాజులచే పునర్నిర్మాణం జరిగింది.
ఐదు అంతస్ధుల రాజగోపురం, ఏడు కలశాలతో పశ్చిమాభిముఖంగా ఉంది. ఆలయ ప్రాంగణములో ప్రధానాలయంతో పాటు ఎత్తైన ధ్వజస్తంభం ఉంది.
💠 శ్రీ కనకవల్లి అమ్మవారు తూర్పు ముఖంగా ప్రత్యేక మందిరంలో కొలువై ఉన్నారు.
శ్రీ ఆండాళ్, గరుడ, విశ్వక్సేన, మంగళ స్తోత్రాలు పాడిన ప్రముఖ 12 మంది ఆళ్వార్లు, మణవాళ మామునిగల్, తుంబిక్కై ఆళ్వార్, విష్ణు, దుర్గ మరియు శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలు ఉన్నాయి.
💠 సింగర్‌కుడి కోయిల్ నందలి నరసింహుడు 16 చేతులతో ఉగ్రరూపంగా కనిపిస్తాడు.
నరసింహ స్వామికి ఎడమవైపు హిరణ్యడు భార్య లీలావతి, కుడివైపున ప్రహ్లాదుడు, శుక్రుడు మరియు వశిష్టుడు, ఉత్తరం వైపున యోగ నరసింహుడు మరియు బాల నరసింహుని చిన్న విగ్రహాలు ఉన్నాయి.
ఒకే క్షేత్రంలో ముగ్గురు నరసింహులు కొలువై ఉండడం చాలా అరుదు.
💠 ఉత్సవ ముర్తిని శ్రీ ప్రహ్లాద వరదన్ గా సేవించుతారు.
దేవేరి శ్రీ కనకవల్లి తాయార్, శ్రీ ఆండాళ్, శ్రీరామ మరియు ఆళ్వార్లకు ప్రత్యేక సన్నధిలు ఉన్నాయి.
ఆలయ శిఖరమును "పావన విమానం" గా పిలుస్తారు.
జమదగ్ని తీర్థం, ఇంద్ర తీర్థం, భార్గవ తీర్థం, వామన తీర్థం మరియు గరుడ తీర్థం అను ఐదు తీర్థాలు కలవు.
💠 ఆలయంనందు ప్రతి నిత్యం అర్చనలు ఆగమం పద్ధతిలో జరుగుతాయి.
స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భముగా విశేష అర్చనలు ఉంటాయి.
నరసింహ జయంతికి బ్రహ్మోత్సవాలు పది రోజుల పాటు వైభవంగా జరుగుతాయి.
💠 తమిళ మాఘ మాసములో తీర్థవరి వైభవంగా నిర్వహిస్తారు. తమిళ ఐపాసి (ఆశ్వీయుజం) మాసములో పవిత్ర ఉత్సవం జరుగుతుంది.
వైకుండ ఏకాదశి రోజు సాయంత్రం గరుడ సేవ మరియు మట్టుపొంగల్ (భోగీ) రోజున తీర్థవరి జరుగుతాయి.
💠 మానసికంగా బాధపడేవారు, అప్పుల బాధలు, శత్రువుల బెదిరింపులు, వివాహ ప్రతిపాదనలలో ఆటంకాలు, గ్రహాల ప్రతికూల ప్రభావంతో బాధపడేవారు సింగిరికుడి క్షేత్రంలోని నరసింహ స్వామిని ప్రార్థిస్తారు.
మంగళవారాల్లో నెయ్యి దీపాలు వెలిగించి, తులసి ఆకులతో అర్చన కూడా చేస్తారు.
💠 ఈ ఆలయం కడలూర్ నుండి 16 కి.మీ
రచన
©️ Santosh Kumar
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి