20, జనవరి 2023, శుక్రవారం

సప్త పవిత్రాలు

 సప్త పవిత్రాలు ఏవి?


ఆచార వ్యవహారాలు బాగా తెలిసిన, కర్మలు/అకర్మాలు చేయించే వైదికులు ఉన్న సభలో, ఒక పండితుడు తల్లి తండ్రులు మరణించిన పిదప చేయు పితృ శ్రాద్ధము/కర్మల యొక్క ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి చెబుతున్నాడు.


“సప్త పవిత్రః అంటే అర్థం ఏమ”ని సభనుద్దేశించి ప్రశ్నించారు మహాస్వామివారు.


ఒక వైదికుడు శాస్త్రం చెప్పిన ఏడు పవిత్ర వస్తువుల గురించి ఇలా చెప్పాడు. “ఆవుపాలు, శివ నిర్మాల్యము లేదా గంగ, తేనె, తెల్లని పట్టు, కుమార్తె కొడుకు, సరైన సమయం(పితృ కార్యం చెయ్యడానికి) మరియు నువ్వులు అని చెబుతారు”


తరువాత పరమాచార్య స్వామివారు దాని గురించి ఇలా వివరణ ఇచ్చారు.


“అందులో ఉన్న ‘సవపర్పతమ్’ అంటే పట్టు పురుగులను చంపి దానినుండి సేకరించిన పట్టుతో తయారుచేసిన వస్త్రం అని అర్థం తీసుకోరాదు. ‘సవం’ అంటే సహజంగా చనిపోయిన పట్టుపురుగు. అంటే అలా సహజంగా చనిపోయిన పట్టుపురుగుల యొక్క దారంతో చేసిన పట్టు పంచె. అందుకే నేటికి కేరళలో శ్రాద్ధ కర్మలకు వచ్చిన వైదికులకు తెల్లని పట్టు పంచెలు ఇస్తారు. తరువాతి పదం ‘దౌహిత్యం’. ‘దౌహిత్రః’ అంటే కుమార్తె కుమారుడు అనే పదం నుండి ఉద్భవించింది. శ్రాద్దంలో కుమార్తె కొడుకు భోజనం చేయాలని తరచుగా చెప్పే అన్వయం. ‘దౌహిత్యం’ అంటే ఖడ్గమృగం కొమ్ముతో తయారుచేసిన పాత్ర. కొమ్ములున్న జంతువులన్నీ రెండేసి కొమ్ములతో ఉంటాయి. కాని ఖడ్గమృగానికి మాత్రం ఒక్క కొమ్ము ఉంటుంది. అందుకే దాన్ని ‘ఏక శృంగి’ అంటారు. దాని భాష్యం ‘దౌహిత్యం ఏకశృంగి పాత్ర విశేషః’ అని ఉంటుంది. అంటే ‘ఒక్క కొమ్ము పాత్ర ఉత్తమమైనది’ అని అర్థం”


పరమాచార్య స్వామివారు ఇటువంటి విషయాలను ఎంతో విపులంగా, సరళంగా విషదపరచేవారు.


--- బ్రహ్మశ్రీ రామకృష్ణ దీక్షితర్, శ్రీమఠం విద్వాన్. మహా పెరియవళ్ దరిశన అనుభవంగళ్


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

గురువాక్కు మహత్యం*

 *గురువాక్కు మహత్యం*


ఒకానొకప్పుడు ఒక గురువు గారు, ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి తిరిగి వెళ్తున్నారు...


ఇంతలో హఠాత్తుగా గురువుగారు ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ *"తథాస్తు"* అన్నారు. 

గురువుగారి చర్యకి కారణం ఏంటి? అని అడిగాడు శిష్యుడు. 


"ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షంతో చెప్తుంటే నాకు వినబడి 'తథాస్తు' అన్నాను." 

"ఏమిటా కోరిక గురువు గారూ?" 

*"తాను చక్రవర్తి అయి భూమండలాన్ని ఏలాలని."* 

"వచ్చే జన్మలోనా?" 

"కాదు ఈ జన్మలోనే" 

శిష్యుడు పగలబడి నవ్వాడు, "గురువు గారూ, ఇది మరీ గొంతెమ్మ కోరిక కదూ! అంత అత్యాశ తగునా? అర్హత చూసుకోవాల్సిన పనిలేదా? "


*"అర్హతకేం నాయనా! జీవితమంతా ప్రతఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది. ఎన్నో జీవరాశులకి ఆశ్రయం ఇచ్చింది. అదంతా పుణ్యమే కదా!"* 

"అవుననుకోండి. కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది" అన్నాడు శిష్యుడు.


అది విని *"ఏమో, భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు!"* అన్నారు గురువుగారు.


ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహా వృక్షం నేలకూలింది. 


శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మరిచి పోయాడు.

*సరిగ్గా సంవత్సరం తరువాత*


ఒక్కరోజు ఆ శిష్యుడు పరుగు పరుగున వస్తూ "గురువు గారూ,ఈ వింత విన్నారా!

శ్రీరామచంద్రులవారి పాదుకలకి పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతులవారు. ఇక నుండీ పధ్నాలుగేళ్ళు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట!అన్నాడు.


దానికి గురువు గారు నవ్వి, *"చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు. ఇప్పుడు అయింది కదా!"* అన్నారు.

అంటే? అడిగాడు శిష్యుడు.

అవున్నాయనా,  ఆ మహావృక్షం కలపతోనే వడ్రంగులు పాదుకలు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు. ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో,

ఎన్ని పుణ్యాలు చేసుకుందో, ఆ మహావృక్షం పాదరక్షలుగా మారి శ్రీరామచంద్రులవారి పాదాల వద్దకు చేరింది. 


శ్రీరామచంద్రులవారు ఆ పాదుకల్ని భరతుల వారికివ్వడం, 

భరతులవారు పాదుకలకి పట్టాభిషేకం చేయడం అంతా ఒక్కరోజులో జరిగిపోయింది.


ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహా వృక్షం కోరిక నెరవేరింది. 

అని చెప్పిన గురువు గారికి సాష్టాంగ ప్రణామం చేశాడు ఆ శిష్యుడు. 


*సద్గురువు వాక్కు సత్యం అయ్యి తీరుతుంది.*

కాదు కాదు, *ఆ భగవంతుడే మహాత్ముల నోటినుoచి వచ్చిన మాటలు నిజమయ్యేలాగా సoకల్పిస్తాడు.*🏵️


              🙏 ఓం నమః శివాయ 🙏

వేమనపద్యాలు

 *(అ)వేమనపద్యాలు*


సీ.

రాజ్యాధికారాన ప్రభవించి శ్రుతిమించి

          సుఖభోగముల నెల్ల జుఱ్ఱి జుఱ్ఱి 

స్పర్శవేధిని నేర్చి బైరాగిగా మారి 

          వేదాంతవేదియై వెలసి నిలచి 

లోకహితములెన్నొ రూఢిగా నెఱిగించె 

          తనదైన శైలిలో ధాటి మెఱయ 

దృష్టాంతముల జూపి దీటైన పద్యాల 

          సన్మార్గమును జూపె జనుల కొఱకు 

వేవేల పద్యాల వేలనీతుల జెప్పి 

          వేమన్న యనుపేర వెలసె నతడు 

మూఢపద్ధతుల రోసి మోసాల తెగటార్చి 

          సన్మార్గముల జూప సాగినాడు 

ఆ.వె.

సంస్కరించె నాడు సంఘోన్నతిని గోరి 

ప్రజలలోని మూఢపథములన్ని 

వినుము విను మటంచు వేదమ్ము పలికిన 

వేమనార్యు తలతు వినతితోడ 

*~శ్రీశర్మద*

19, జనవరి 2023, గురువారం







 

అగస్త్యాశ్రమం

 *కాశీ ఖండం - 2*


🌻🌻🌻🌻🌻🌻🌻🌻


 *అగస్త్యాశ్రమం* 


 దేవతలందరూ వారణాసి చేరి, అయిదు రోజులు నిత్యము గంగా స్నానం చేస్తూ, విశ్వేశ్వర విశాలాక్షీ అన్నపూర్ణా, దుండి గణపతి, కాలభైరవులను దర్శించారు. 


 ఆ తర్వాత అగస్త్యముని ఆశ్రమాన్ని చేరుకొన్నారు. అగస్త్యుడు తన పేర, అగస్త్యేశ్వర స్వామిని స్థాపించి, జప,హోమాలను చేస్తూ, పరమేశ్వర ధ్యానంలో, భార్య లోపాముద్ర తో, గడుపుతున్నాడు. 

 

 సముద్రాలను తన పుక్కిలిలో ఉంచి పానం చేసినప్పుడు, అందులో ఉండే బడబాగ్ని, ఆయన శరీరంలో ప్రవేశించి, దివ్యకాంతులను వెలువరుస్తోంది. ఆయన తన తపస్సుచే, సూర్యుని ప్రకాశింప జేస్తున్నాడు, అగ్నిని మండింప జేస్తున్నాడు, ఆయన తపో బలం వల్ల, చపలాలు ఆచపలాలుగా మారాయి. ఆశ్రమంలో క్రూర మృగాలతో సాధుజంతువులు, కలిసి మెలుగుతున్నాయి. మహా 

ప్రశాంతంగా అగస్త్యాశ్రమం ఉన్నది. దుష్ట మృగాలు మాంసభక్షణ మాని, పచ్చ గడ్డి మేస్తున్నాయి. కొంగలు చేపలను, పెద్ద చేపలు చిన్న వాటిని తినటం లేదు. ఆశ్రమంలో‘మాంసం ఎక్కడ? శివ భక్తీ ఎక్కడ? మందిర మెక్కడ ?శివార్చనం ఎక్కడ? మద్యమాంసాలు తిన్న వారికి, శంకరుడు దూరంగా ఉంటాడు. "శివానుగ్రహం లేక అజ్ఞానం నశించదు‘’ అన్న వాక్యం వ్రాసి, అందరికి అహింసా ధర్మాన్ని బోధిస్తోంది - అగస్త్యాశ్రమం. 


 ఈ ప్రశాంతతను చూసి దేవతలు ఆశ్చర్యపడ్డారు. ’’ఇక్కడున్న పక్షులు, విశ్వేశ్వరుని ధ్యానిస్తున్నాయా? చిలుకలు విశ్వనాధుని కీర్తిస్తున్నాయా ?కోకిలలు కలికాల పరిస్థితులకు కలత చెంది, విశ్వేశ్వర 

తలంపుతో చిత్తశాంతి పొందుతున్నాయి. స్వర్గంలో నుండి పతనం చెడటం ఉంది కాని, కాశీ లో పతనం ఉండదు. యముడి దగ్గర ఉండటం కంటే, కాశీలో ఉండటం శ్రేయస్కరం. బ్రహ్మాండంలో ఏ ప్రదేశంలో ఉన్న దాని కంటే, కాశీ లో నివశించటం శ్రేష్టం. ఇక్కడ ఉన్నా, ఈశ్వరదర్శనం లేకపోతే వ్యర్ధం. ఉత్తర వాహిని అయిన గంగానదిలో స్నానం చేసి, విశ్వేశుని దర్శించిన వారి శ్రేయస్సుకు, అంతం ఉండదు. *’’దేవ దేవ మహా దేవ శంభో! శివా శివా! ధూర్జటే ! నీల కంఠేశ! పినాకీ! శశి శేఖర! నన్ను రక్షించు‘’* అంటూ ముక్తిమండపం పై కూర్చోవటం, ధర్మ విషయాలు మాట్లాడుకోవటం, పురాణ శ్రవణం చేయటం, నిత్య కర్మలు చేయటం, పిండాదులు పెట్టటం, పరోపకారం చేయటం, అంటే సమస్త ధర్మాలను ఆచరించటమే.  


 శుక్లపక్షంలో చంద్రకళ  అభివృద్ధి చెందినట్లు, కాశీ క్షేత్రంలో ఉన్నవారికి, పుణ్యం అలా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ పురుషార్ధాలను ఇచ్చేది, భవానీమాత.  కోరికలను తీర్చేవాడు డుంఢి విఘ్నేశ్వరుడు. విశ్వేశ్వరుడు మరణ కాలంలో సమస్త ప్రాణులకు, రామ తారక మంత్రాన్ని చెవిలో, బోధించి మొక్షాన్నిస్తాడు. విశ్వేశ్వరుడు ధర్మార్ధ కామ మోక్ష స్వరూపుడు. పరమాత్మ స్వరూపుడు. అందుకనే కాశీ వంటి పట్టణం, మూడు లోకాలలోనూ లేదనే ప్రఖ్యాతి వచ్చింది. అని దేవతలందురూ అను కొంటూ, అనేకమంది బ్రహ్మచారి శిష్యులతో పరివేష్టించి ఉన్న అగస్త్య మునిని దర్శించారు. శ్యామక ధాన్యాన్ని, హోమంకోసం చేతులో పట్టుకొన్న రుషి కన్యలను చూశారు. సాధ్వి,  లోపాముద్ర పాద ముద్ర లను చూసి పులకించారు. ఆ పాద ముద్రలకు భక్తీ గా నమస్కరించారు. అక్కడ సమాధి నుండి మేల్కొన్న, బ్రహ్మదేవునిలా ప్రకాశిస్తున్న అగస్త్య మహర్షిని దర్శించి, నమోవాకాలనర్పించారు. 

 

 ఆయన వీరిని సాదరంగా ఆహ్వానించి, అతిధి మర్యాదలు చేసి, శుఖాసీనులను చేశాడు. వారి రాకకు కారణాన్ని అడిగాడు మహర్షి.

                                               

 *పతివ్రతాఖ్యానం*


అప్పుడు దేవతలందరి తరఫున, దేవ గురుడు బృహస్పతి, మహర్షితో,  ‘’లోపాముద్ర వల్లభా !నీవు ఘనులలో ఘనుడవు. 

నీవంటి తపోధనులు లేరు. ఈ కల్యాణి లోపాముద్ర, నీ సహాధర్మచారిణిగా నీ ఛాయలాగా ప్రవర్తిస్తోంది. మహా పతివ్రతలైన అరుంధతి, అనసూయ, సావిత్రి, శాండిల్య , సత్య , లక్ష్మి , శతరూపలతో ఈమె సమానం. ఈమెను మించిన పతివ్రతను ఊహించలేము." అని, లోపాముద్రాగాస్త్యులను కీర్తించాడు. 


 తర్వాత, పతివ్రతా ధర్మాలను వివరించాడు బృహస్పతి. 


 ‘’కన్య వివాహ సందర్భంలో, పెండ్లి కుమార్తెతో పురోహితుడు, ‘’భర్త తో జీవించినా లేకపోయినా సహచరిగా ఉండు‘’ అని చెబుతారు. కనుక భార్య, భర్తను నీడ లాగా అనుసరించాలట. అది పతివ్రత లక్షణం. యమ దూతలు పతివ్రతను చూస్తె, అగ్నిని చూసి నంత భయంతో, పారిపోతారు. ఆమె తేజస్సు ముందు, సూర్యాగ్నుల తేజస్సు, దిగదుడుపు. స్త్రీల పతివ్రతాచారణం వల్లనే, భూమి భారం తగ్గుతోంది.  ఈ లోకానికి, పరలోకానికి, భార్యయే మూలం. భార్య తో కలిసి, దేవ ,పితృ కార్యాలు చేయాలి. భర్తను కోల్పోయిన స్త్రీ, ఏ దానం చేసినా, ‘’నా భర్త సంతోషించు గాక ‘’అని చేయాలి. శ్రావణ, భాద్రపద మాసాలలో, ఆమె, భోజనాలు అతిధులకు పెట్టాలి. కార్తీకంలో మౌనాన్ని పాటించాలి. ఆకులలో భుజించాలి. దీప దానం చేయాలి. ఈ దానంతో ఏదీ సమానం కాదు. సూర్యోదయం అవగానే, మాఘస్నానం చేయాలి. దీపాన్ని దానం చేసేటప్పుడు, పరమేశ్వర స్వరూపుడైన తన భర్త సంతోషించాలి, అని అనుకోవాలి. కొడుకు అనుమతితో, పనులు చేయాలి . పాతివ్రత్యం గల స్త్రీ ని పూజిస్తే, గంగా స్నానం చేసినంత ఫలితం కలుగుతుంది. 


 అమ్మా! లోపాముద్రా దేవీ ! మీ దర్శనం మాకు గంగా స్నానం తో సమానం‘, అని చెప్పాడు. 


 బృహస్పతి తాము వచ్చిన కారణాన్ని ఇప్పుడు వివరించి చెబుతున్నాడు.  


 ‘’మహర్షీ వీరు అగ్ని , యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, రుద్రదేవతలు. లోకంలో జనం, వీరివల్ల అన్ని అర్ధాలను పొందుతున్నారు.

 

 వింధ్య పర్వతం మేరుగిరి పై ఈర్ష్య పెంచుకొని, విపరీతంగా పెరిగింది. సూర్యుని మార్గానికి అవరోధమేర్పడింది. దానిని మీరే దారిలోకి తేవాలి, లోక కార్యాలన్నీ మళ్ళీ యధాప్రకారం జరిగేటట్లు చేయాలి. అందుకే మేమంతా మీ దర్శనం చేసి అర్ధించటానికి వచ్చాం. అని విన్నవించాడు.

 

 అగస్త్య మహర్షి,  ‘’అలాగే చేస్తాను. నిశ్చింత గా వెళ్ళండి."  అని అభయమిచ్చి దేవతలను పంపించాడు. 


 *కాశీఖండం సశేషం..*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻

*🅰️🅿️SRINU*

మీరొస్తారని

 మీరొస్తారని...


నీ తల్లికి దూరమాయే

నీ ఊరుకి దూరమాయే

నీ తల్లి కన్నీరాయే

నీ ఊరు సిన్న బోయే.


నినుగన్న తల్లి పెంచేలే

పుట్టిన ఊరు బలమునిచ్చేలే

అమ్మను మరిచి

ఊరమ్మను వదిలావా.


పల్లెలోని ఇళ్లు బోసిపోయాయి.

ముసలి కాళ్ళు ఈడుస్తుంటే

రచ్చబండ రాయిలా

కనిపిస్తుంటే... 

ఏమయ్యి పోయావు

నీవు మరిచిపోయావా...


బాల్యమంత ఆడి పాడావా

చెరువులు మావే అన్నావా

కుంటలు మావే అన్నావా

పొలంగట్ల పైన ఆటలాడావా

పల్లెతల్లి ఒడిలో బిడ్డలయ్యారా.


పండగ రోజున అందంగా దిద్దావా

సంకురాతిరి సంబరం జేశావా

మట్టి బొమ్మలను పూజించావా

ఊయల పండగ ఊరేగేవా


వరసలు పెట్టి పలికి

అక్కాబావంటు

అత్తమామంటు

కూతురా కోడాల అంటూ

పిలుచు కున్నారా.


పొలాన ఏరువాక పండగ చేసావా

పంటకు కోతలు నూర్పులు జేసావా

పండిన పంటలు ఇంటముందు 

ధాన్యపు సిరులు జేసి

పల్లె పండగ జరిపారా.


పట్నం మోజులో

పల్లె విడిచి పరుగులు పెట్టి

వెళ్ళి పోయావా

బ్రతుకే భారమైయిందా...

నన్ను మరచి పోయావా.


బస్తీలో బందీ ఆయ్యావా

ఒంటరి బతుకు బ్రతికేవా

నీవు దూరంగా ఉంటేను

అమ్మ అల్లాడి పోతుందో.


కొడుకా కొమరయ్య

బిడ్డా లచ్చమ్మ 

పల్లెమ్మను నేనున్నా

సేద తీర రారండో...

నా చెంతన చేరండో...


అమ్మను మరువకు

ఊరమ్మను మరచకు

ఎదురు చూపులు

చూస్తున్నాము..



మీరొస్తారని....!


అశోక్ చక్రవర్తి.నీలకంఠం.

కచ్ఛపేశ్వరుడు - కంచి

 కచ్ఛపేశ్వరుడు - కంచి


పరమాచార్య స్వామివారు కాంచీపురంలోని కొల్ల చత్రంలో చాలా రోజులపాటు మకాం చేశారు. ప్రతిరోజూ కచ్ఛపేశ్వర దేవాలయ కొలనులో స్నానం చేసేవారు. కార్తీక సోమవారాలలో ఆ కొలనులో స్నానాదికాలు చెయ్యడం ఎంతో పుణ్యప్రదమని పురాణాలు చెబుతున్నాయి.


అలా ఒకనాటి కార్తీక సోమవారం రోజు పరమాచార్య స్వామివారు కొలనులో స్నానం చేసి, దైవదర్శనం కోసమని దేవాలయంలోనికి వెళ్ళారు. చెన్నై నుండి వచ్చిన ఒక భక్తుడు కూడా ఇతర భక్తులతో మహాస్వామివారి వెంట వెళ్తున్నాడు. అతను ఎకామ్రేశ్వర దేవాలయానికి వెళ్ళవలసి ఉన్నందున మహాస్వామివారి వద్ద నుండి సెలవు కావాలని ప్రార్థించాడు.


“ఈరోజు కార్తీక సోమవారం. ఇటువంటి రోజున శివాలయంలో పరమశివ దర్శనం అత్యంత పుణ్యప్రదం. కాంచీపురంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. ఎన్ని వీలైతే అన్ని శివాలయాలను దర్శించుకో. నాకు వయస్సు అయిపొయింది. కాబట్టి నేను అన్ని ఆలయలాను దర్శించలేను. ఈ పృథ్వీ క్షేత్రమైన కంచిలో అత్యంత పురాతన దేవాలయంగా ఈ కచ్ఛపేశ్వర దేవాలయాన్ని చెబుతారు. ఈ దేవాలయ నిర్మాణము, ప్రతిష్ట జరిగిన తరువాతనే ఎకామ్రేశ్వర దేవాలయ నిర్మాణం జరిగిందని చెబుతారు. కచ్ఛపేశ్వరుడు వెలసి ఉండడం వల్ల ఈ కాంచీపురానికి కచ్చిముదూర్, కచ్చి ఏకాంబరం అను పేర్లు కూడా కలవు. ఆ ‘కచ్చి’యే సంస్కృతమున ‘కంచి’గా మారిందని చెబుతారు” అని సెలవిచ్చారు స్వామివారు.


ఆ చెన్నై భక్తుడు గొప్ప విద్వాంసుడు. పరమాచార్య స్వామివారు చెబుతున్న విషయాలను విని అమిత ఆశ్చర్యానికి లోనయ్యాడు. అంతటి గొప్ప చారిత్రిక విషయాలను స్వయంగా స్వామివారి నుండే వినే భాగ్యం పొందాడు. స్వామివారి ఆంతరంగిక సహాయకులకు తెలుసు. స్వామివారికి కంచి చరిత్రే కాదు ప్రపంచ చరిత్ర కూడా తెలుసని.


--- శ్రీ మఠం బాలు మామ, మహాపెరియవళ్ దరిశన అనుభవంగళ్ 3


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

వడ్డీ వ్యాపారం - వేద ధర్మం

 వడ్డీ వ్యాపారం - వేద ధర్మం


ఒకరోజు మహాస్వామి వారు మేనాలో కూర్చుని ఉన్నారు. ఎప్పటిలాగే చాలామంది భక్తులు మహాస్వామి వారి దర్శనం కోసం వేచియున్నారు. స్వామివారు భక్తులందరితో మాట్లాడుతూ వారిని ఆశీర్వదిస్తున్నారు.


వారిలో శామ అనే ఒక భక్తుడు కూడా ఉన్నాడు. వరుసలో అతని వంతురాగానే మహాస్వామి వారు మేనా తలుపు వేసుకునారు. శామ మరియు అక్కడున్నవారందరూ నిరాశపడ్డారు. ఎందుకంటే శామ వల్ల వారికి దర్శనం లభించలేదు. అతను ఏదో తప్పు చేసి ఉంటాడు. కాని అతని కోసం అందరిని శిక్షించడం సబబు కాదు కదా.


అప్పుడు మహాస్వామివారి పరిచారకుల బంధువులొకరు వచ్చారు. అతను స్వామివారి ఆంతరంగిన శిష్యుడైనందువల్ల స్వతంత్రించి, మేనా తలుపులు తెరిచి వారి బంధువులు వచ్చిన విషయం విన్నవించాడు. కాని స్వామివారు మరలా తలుపులు వేసుకున్నారు. అరగంట గడిచిన తరువాత స్వామివారు మేనా తలుపులు తెరిచి యధావిధిగా దర్శనం ఇస్తున్నారు. వరుసలో మళ్ళా శామ వంతు వచ్చింది.


పరమాచార్య స్వామివారి కళ్ళు ఎర్రబడ్డాయి. వెంటనే వారు ఒక చిన్న వస్త్రం తీసుకుని గొంతుకు చుట్టుకుని బిగించసాగారు. వెంటనే పక్కకు తిరిగి ఎవరితోనో ఎక్కడో మాట్లాడుతున్నట్టుగా, “ఈ మనిషి ఇలాగే ఇచ్చిన అప్పుయొక్క వడ్డీ డబ్బులకోసం అందరి జీవితాలను పిండుతాడు. పేదవారు అవసరం కోసం వడ్డీపై అప్పు చేస్తారు. ఇతను అసలకు వడ్డీ, వడ్డీకి వడ్డీ, చక్ర వడ్డీ అని వేసి వారిని ఇబ్బందులకు గురి చేస్తాడు. ఇతని వల్ల ఎంతమంది పేదలు బలయ్యారో తెలుసా? ఈశ్వరుడు నీకు మంచి జీవితం ఇచ్చినప్పుడు ఇలా పేదవారిని బాధించడం ఎంతవరకు సమంజసం? ఇలా వడ్డి వెయ్యడం న్యాయమా? అందుకే కొన్ని మతములయందు మత్తు పదార్థములు తీసుకొనుట, వడ్డికి డబ్బు ఇవ్వుట పాపం అని చెప్తారు. మరి అలాంటి పాపము చేసి ఆ పాప ప్రక్షాళన కోసం ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తే దాన్ని భగవంతుడు అంగీకరించడు”


పరమాచార్య స్వామివారు మేనా తలుపు వేసారు. శామ పశ్చాత్తాపంతో బిగ్గరగా ఏడుస్తున్నాడు. స్వామివారి అంతరంగిక భక్తుడు కలగజేసుకుని మాహాస్వామిని ప్రార్థించారు. “అందరూ పరమాచార్య స్వామిలాగా ధర్మస్వరూపులుగా ఉండలేరు. తెలిసి తెలియక తప్పు చేస్తుంతారు. దయచేసి క్షమించండి. కోపం వలదు”


స్వామివారు శామాను పిలిచి మేనా దగ్గర కూర్చోమన్నారు. అతనితో, “అప్పు ఇచ్చిన వారి వద్దకు కుక్కలాగా తిరిగి వడ్డీ లాక్కుని రావడం ఇక ఆపు. ఉన్నదాన్ని బ్యాంకులో వెయ్యి. అందునుండి వచ్చే వడ్డీ డబ్బులు నీకు సరిపోతుంది. డబ్బుకోసం పరిగెత్తడం బాధపడటం మానుకో. తరువాతి జన్మ మంచిగా ఉండేట్టు చూసుకొ. మిగిలిన సమయాన్ని పూజ, జపము, ధ్యానము, దేవాలయ దర్శనం చేస్తూ గడుపు” అని చెప్పారు.


శామ మహాస్వామి వారికి సాష్టాంగపడ్డాడు. “పెరియవ నా అజ్ఞానం తొలగిపోయింది” అని కళ్ళనీరు తుడుచుకుంటూ చెప్పాడు.


పరమాచార్య స్వామివారు రాశీభూతమైన క్షమ, ఆత్మజ్ఞాన సంపన్నులు. వారి కరుణ అపారం.


--- ‘ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డివైన్’ అనుభవాల సంగ్రహం


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

18, జనవరి 2023, బుధవారం

విశ్వ దర్శనం

 విశ్వ దర్శనం, ఎన్నో ప్రత్యేకతల సమాహారం ! సృష్టిలో ప్రకృతి ఒసగెడి ఆలంబన, వర్ణనాతీతం ! ప్రాతఃకాలపు కుక్కుట నాదామృత సుస్నేహ వీక్షణం, వసుధైక కుటుంబక నిత్య స్ఫూర్తి ! విశాల విశ్వపు వాడవాడలా కలుపుగోలుతనం, భారతీయ సంస్కృతికి ప్రత్యక్ష దార్శనికత ! భారతీయ సనాతన ధార్మిక చింతన, విశ్వ సమున్నత, సమైక్య సంక్షేమాభివృద్ధికి, సుచైతన్య దివ్య ప్రకాశిక ! భారతీయ ఓషధీ సంపద, విశ్వ జీవ నిత్య సత్య చైతన్య సురక్షా మార్గ నిర్దేశక దివ్య జీవన బాట ! విద్వేషాలు, కోపతాపాలు, అసూయానుమానాలు,తేలేవెన్నటికి, నిత్య సుహృద్భావ ప్రశాంత జీవన మార్గ దృక్పథాన్ని ఈ పవిత్ర భువిపై ! సకల చరాచర విశ్వ జీవజాలపు అనునిత్య సన్మైత్రీ భావనాత్మకత, విశ్వ మానవాళికి అత్యవసర విషయం ! విశ్వ సమైక్య చింతనా మార్గ నిర్దేశకులుగా విశ్వ మానవాళి ఈ ఇలపై కలసిమెలసి నడవాల్సిన సమయం ! నేడు విశ్వ వ్యాప్తమైన విలక్షణ పరిస్థితుల దృష్ట్యా, విశ్వ సుసంక్షేమాభివృద్ధికై విశ్వ మానవాళి, తమకు సృష్టి కర్త ఒసగిన మహత్తర శక్తిని సక్రమ రీతిలో వినియోగించాల్సిన ప్రస్తుత ఆవశ్యకత ! సువ్యక్తిత్వ, సుహృద్భావ, సుచైతన్య దివ్య ప్రకాశికగా వెలుగొందేందుకై సృష్టి కర్త విశ్వ మానవాళికి ప్రత్యేక అవకాశం ఈయడం గమనార్హం !                       " సర్వే భవంతు సుఖినః ! సర్వే సంతు నిరామయాః ! సర్వే భద్రాణి పశ్యంతు ! మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్ ! "                                     ' ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః '                                     ✍️గుళ్లపల్లి ఆంజనేయులు

ధర్మం/నీతి/విలువలు సంబంద 78 పుస్తకాలు

 ధర్మం/నీతి/విలువలు సంబంద 78 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో


https://www.freegurukul.org/blog/dharmam-pdf/



17, జనవరి 2023, మంగళవారం

మాతృ భాష

41వ రోజు :
Know about a telugu word Daily.
మన మాతృ భాష పరిరక్షింప బడవలెననిన ముందు అందరకు ఆ భాష మీద అవగాహన, పదకోశము అత్యంతావశ్యకము. అందు నిమిత్తము నా వంతు కృషిలో భాగముగా ప్రజోపయోగము గల ఒక పదమునకు గల పర్యాయ పదములను అందించ సంకల్పించినాను. ఈ నా కృషికి అందరు సహకరించి తమ తమ సమూహములలో ఉంచి విశేష ప్రచారణకు తమవంతు సహాయమును అందింతురని ఆశించు చున్నాను.
41వ రోజు (17-01-2023):
అడవి: అటవి, అరణ్యము, కాంతారవము, కాటిక, కాడు, కారు, కాన, గహనము, గోత్రము, చేను, జంగలము, ఝుషము, తలము, తల్కము, దవము, పొలము, పోడు, ప్రాంతరము, భీరుకము, రిక్తము,వనము, వని, వనిక, సమజము, సానువు. 
ఆంగ్లము: Forest

250 రూపాయలు చాలు

 250 రూపాయలు చాలు


ఈ భక్తుడు కూడా సేలంవాసి. అతనికి చాలా కాలంగా ఒక కారు కొనాలని ఆశ. కొద్దికొద్దిగా ధనం పొదుపు చేసి, చెన్నై వచ్చి ఒక పాత కారును కొన్నాడు. కొన్న తరువాత కారులో సేలం రావాలని అతని కోరిక. అతను మహాస్వామి వారికి పరమ భక్తుడు కావడం వల్ల సేలం వెళ్తూ, కంచిలోని శ్రీమఠానికి వచ్చాడు. పరమాచార్య స్వామివారి దర్శనానికి ఉన్న వరుసలో నిలబడ్డాడు. 


ఆ సమయంలో ఒక వృద్ధుడు వచ్చి తన మనవరాలి పెళ్ళికి సహాయం చెయ్యవలసిందిగా స్వామిని వేడుకున్నాడు. ఇటువంటి విషయాలలో సహాయం చెయ్యడం శ్రీమఠం ఆనవాయితి. పరమాచార్య స్వామివారు వారిని పక్కన కూర్చుందమని చెప్పి, శిష్యులతో ఒక వెదురు పళ్ళాన్ని తెప్పించి, తమ దర్శనానికి వచ్చిన భక్తులకు వారికి తోచినంత సహాయం చెయ్యమని చెప్పారు. 


ఆ వచ్చిన డబ్బు లెక్క కోసం, ఒక శ్రీమఠం సహాయకుణ్ణి పిలిచి ఒక పుస్తకంలో ఇచ్చిన వారి పేరు, చిరునామా, ఇచ్చిన మొత్తం వ్రాయమని చెప్పారు. 


మహాస్వామి వారే ఈ విషయంపై శ్రద్ధ చూపించడంవల్ల, వచ్చిన భక్తులందరూ స్వామివారిని దర్శించి వెళ్ళిపోతూ వారికి తోచినంత వెయ్యడం మొదలుపెట్టారు. కొద్దిసేపటి తరువాత పరమాచార్య స్వామివారు రాసిన వివరాలను గట్టిగా చదవమని చెప్పారు. పేర్లు వారి ఇచ్చిన ధనం చదువుతూ, ఈ సేలం భక్తుని వివరములు కూడా చదివారు. ఆ భక్తుడు తిరుగు ప్రయాణానికి కావలసినంత ధనం ఉంచుకొని మొత్తం అంతా ఇచ్చేసాడు. అతను ఇచ్చిన మొత్తం 500 రూపాయలు. అది చదవగానే మహాస్వామి వారు అతని వంక ఒకసారి చూసి, “రెండువందల యాభై రూపాయలు చాలు. మిగిలినది అతనికి ఇచ్చెయ్” అన్నారు. ఆ భక్తుడు ఖంగుతిన్నాడు. తను ఇచ్చిన మొత్తంలో ఎందుకు కొంత తిరిగిస్తున్నారో అర్థం కాక తన వల్ల ఏదో అపచారం జరిగిందని చాలా బాధ పడ్డాడు. ఖిన్న మనస్కుడై తన కారు దగ్గరికి వచ్చాడు. తన ముక్కు పుటాలకి ఘాటైన వాసన వస్తోంది. అది పెట్రోల్ వాసన. కొద్దిగా పరిశీలించి చూడగా తన కారు పెట్రోల్ ట్యాంక్ కు చిన్న కన్నం ఉండడం వల్ల దాని నుండి పెట్రోల్ బయటకు వస్తోంది. దాన్ని బాగుచేయించకుండా తను ఊరికి తిరిగి వెళ్ళలేడు. పరమాచార్య స్వామివారు తిరిగిచ్చిన డబ్బులు దీనికి ఉపయోగపడ్డాయి. స్వామి వారు తిరిగివ్వకపోయుంటే అతని దగ్గరున్న బంగారాన్ని తాకట్టు పెట్టి లేదా అమ్మి కారు బాగుచేయించ వలసి వచ్చేది. అయినా ఈ ఊళ్ళో తనకు సహాయం చేసేవారు ఎవరు? పరమాచార్య స్వామివారు తప్ప.


--- రా. వేంకటసామి. ‘శక్తి వికటన్’ జులై 2, 2004 ప్రచురణ 


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

మానవుడికి - మార్గదర్శనం*

  *భగవద్గీతను ఎవరు చదవాలి?*


*1) విద్యార్థి - క్రమశిక్షణకు.*

*2) యువకుడు - ఎలా జీవించాలో తెలియడం కొరకు.*

*3) వృద్ధుడు - ఎలా మరణించాలో తెలియడం కొరకు.*

*4) అజ్ఞానులు - జ్ఞానం కొరకు.*

*5) విద్యావంతుడు - వినయం కొరకు.*

*6) ధనవంతుడు - ధయ కొరకు.*

*7) కలలుగన్న వాడు - సాధించుట కొరకు.* 

*8) దుర్భలుడు - భలముకొరకు.*

 *9) భలవంతుడు - దిశా నిర్ధేశం కొరకు.*

*10) వినయవంతుడు - ఔన్నత్యము కొరకు*

*11) అలసిన వాడికి - విశ్రాంతి కొరకు*

*12) అంశాంతిగా ఉన్నవాడికి - శాంతికొరకు.* *13) సందేహస్తుడికి - సమాదానం*

*14) పాపికి - పాపవిముక్తి*

*15) అన్వేషికి - మోక్షం కొరకు*

*16) మానవుడికి - మార్గదర్శనం*

 🪷🪷🪷🙏🕉️🙏🪷🪷🪷

సంకల్పము

 *****

శుభోదయం, శుభమస్తు

********

సంధ్యా వందన మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.17.01.2023

మంగళ వారం (భౌమ వాసరే) 

*******    

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

___________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శుభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే

హేమంత ఋతౌ

పౌష్యమాసే కృష్ణ పక్షే 

దశమ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే) 

భౌమ వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ, 

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః   శ్రీమతః______గోత్రస్య  ______నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే.

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ శుభకృత్  నామ సంవత్సరే    ఉత్తరాయణే హేమంతఋతౌ  పౌష్యమాసే

కృష్ణ పక్షే

దశమ్యాం

భౌమ వాసరే   అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.6.45

సూ.అ.6.01

శాలివాహనశకం 1944 వ సంవత్సరం. 

విక్రమార్క శతాబ్దం లో 2079 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5123 వ సంవత్సరం. 

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణ పుణ్యకాలం హేమంతఋతువు

పుష్య మాసం

కృష్ణ పక్షం దశమి ప.12.58 వరకు.

మంగళ వారం. 

నక్షత్రం విశాఖ  ప.2.25 వరకు.

అమృతం  ఉ.7.35 వరకు. 

పునరమృతం తె.3.35 ల 5.08 వరకు. 

వర్జ్యం సా.6.17 ల 7.50 వరకు. 

దుర్ముహూర్తం ఉ.9.00 ల 9.45 వరకు.  

దుర్ముహూర్తం రా.11.07 ల 11.58 వరకు. 

యోగం గండం రా.2.09 వరకు.

కరణం భద్ర ప.12.58 వరకు.

కరణం బవ  రా. 12.16 వరకు. 

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే.. 

రాహు కాలం మ.3.00 ల 4.30 వరకు. 

గుళిక కాలం ప.12.00 ల 1.30 వరకు. 

యమగండ కాలం  ఉ.9.00 ల 10.30 వరకు. 


పుణ్య తిథి పుష్య బహుళ ఏకాదశి. 

****************** 

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

*ప్రభల విశ్వనాథం*

*శ్రీ పద్మావతి  శ్రీనివాస  వివాహ* *సమాచార సంస్థ*,

వనస్థలిపురం.

*సోమవారం నుండి శుక్రవారం* వరకు

ప్రతిరోజూ సాయంత్రం 7.30 నుండి రాత్రి 9.00 వరకు

*ప్రతి శనివారం,ఆదివారం* 11.30ని||నుండి సాయంత్రం 5.30ని వరకు కార్యాలయం తీసిఉండును.

*కార్యాలయం కు వచ్చువారు దిగువ ఇవ్వబడిన ఫోన్(చరవాణి) నెం లను సంప్రదించగలరు*.

*98487 51577 / 80195 66579*,

*040 241 2 0272*

******************

*మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి*.

🙏🙏🙏

ధర్మం

 శ్లోకం:☝️

*ధర్మస్య దుర్లభో జ్ఞాతా*

    *సమ్యక్ వక్తా తతోఽపి చ ।*

*శ్రోతా తతోఽపి శ్రద్ధావాన్*

    *కర్తా కోఽపి తతః సుధీః ॥*


భావం: ధర్మం తెలిసినవారు చాలా అరుదు. ధర్మాన్ని చక్కగా వివరించేవారు ఇంకా అరుదు. వివరించేవారు లభించినా దానిని భక్తి శ్రద్ధలతో వినేవారు చాలా అరుదు. విని ఆ ధర్మాన్ని ఆచరించే బుద్ధిమంతులు అందరికంటే అరుదు.