31, ఆగస్టు 2020, సోమవారం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


*అష్టమ స్కంధము - ఇరువదియవ అధ్యాయము*

*వామనుడు విరాట్ రూపమున రెండడుగులతో పృథ్విని, స్వర్గమును ఆక్రమించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*

*20.1 (ప్రథమ శ్లోకము)*

*బలిరేవం గృహపతిః కులాచార్యేణ భాషితః|*

*తూష్ణీం భూత్వా క్షణం రాజన్నువాచావహితో గురుమ్॥7061॥*

*శ్రీశుకుడు నుడివెను* మహారాజా! తన కులగురువైన శుక్రాచార్యుడు ఇట్లు పలుకగా ఆదర్శగృహస్థుడైన బలి చక్రవర్తి ఒకక్షణము మౌనము వహించెను. పిమ్మట వినమ్రుడై సావధానముగా శుక్రాచార్యునితో ఇట్లనెను-

*బలిరువాచ*

*20.2 (రెండవ శ్లోకము)*

*సత్యం భగవతా ప్రోక్తం ధర్మోఽయం గృహమేధినామ్|*

*అర్థం కామం యశో వృత్తిం యో న బాధేత కర్హిచిత్॥7062॥*

*బలిచక్రవర్తి ఇట్లనెను* మహాత్మా! మీ వచనములు సత్యములే. గృహస్థాశ్రమములో నున్నవారికి అర్ధము, కామము, యశస్సు, జీవనోపాధి మున్నగువాటి యందు భంగము కలుగకుండ వ్యవహరించుటయే గృహస్థులకు ధర్మము.

*20.3 (మూడవ శ్లోకము)*

*స చాహం విత్తలోభేన ప్రత్యాచక్షే కథం ద్విజమ్|*

*ప్రతిశ్రుత్య దదామీతి ప్రాహ్లాదిః కితవో యథా॥7063॥*

కాని, గురుదేవా! నేను ప్రహ్లాదునకు పౌత్రుడను. ఒకసారి ఇచ్చుటకు ప్రతిజ్ఞచేసియున్నాను. కనుక, ఇప్పుడు ధనలోభముచే *నేను నీకు ఇయ్యను* అని మోసగానివలె ఈ బ్రాహ్మణునితో అబద్ధమును ఎట్లు పలుకగలను?

*20.4 (నాలుగవ శ్లోకము)*

*న హ్యసత్యాత్పరోఽధర్మ ఇతి హోవాచ భూరియమ్|*

*సర్వం సోఢుమలం మన్యే ఋతేఽలీకపరం నరమ్॥7064॥*

అట్లు మాట తప్పినచో ఈ భూమి నన్ను గూర్చి ఇట్లనును- "అసత్యమునకు మించిన అధర్మము మఱియొకటి లేదు. నేను అన్నింటిని సహింపగలను. కాని, అసత్యవాది యొక్క బరువును నేను మోయజాలను" అని యనును.

*20.5 (ఐదవ శ్లోకము)*

*నాహం బిభేమి నిరయాన్నాధన్యాదసుఖార్ణవాత్|*

*న స్థానచ్యవనాన్మృత్యోర్యథా విప్రప్రలంభనాత్॥7065॥*

మహాత్మా! వేదవేత్తలైన బ్రాహ్మణునకు ఇచ్చిన మాటను తప్ఫుటకు భయపడినంతగా, నరకమునకు, దారిద్ర్యమునకు, దుఃఖసముద్రమునకు, రాజ్య నాశనమునకు, కడకు మృత్యువునకు గూడానేను భయపడను.

*20.6 (ఆరవ శ్లోకము)*

*యద్యద్ధాస్యతి లోకేఽస్మిన్ సంపరేతం ధనాదికమ్|*

*తస్య త్యాగే నిమిత్తం కిం విప్రస్తుష్యేన్న తేన చేత్॥7066॥*

ఈ లోకమున మరణించిన పిదప ధనము మొదలగు వస్తువులు ఏవియును మనతో రావు. ఆ వస్తువును సద్బ్రాహ్మణులకు దానము చేసి, వారిని సంతృప్తి పరచినచో, అట్టి దానమునకంటె గొప్ప ప్రయోజనము ఏముండును?

*20.7 (ఏడవ శ్లోకము)*

*శ్రేయః కుర్వంతి భూతానాం సాధవో దుస్త్యజాసుభిః|*

*దధ్యఙ్ శిబిప్రభృతయః కో వికల్పో ధరాదిషు॥7067॥*

దధీచి, శిబిమొదలగు మహాపురుషులు తమకు అత్యంత ప్రియమైన ప్రాణములను గూడ దానము చేసి, ఇతర ప్రాణులకు మేలు చేసిరి. ఇంక పృథివి మున్నగు అశాశ్వత వస్తువులను దానము చేయుటకు వెనుకాడవలసిన పని యేమున్నది.

*బమ్మెర పోతనామాత్యులవారి పద్యము*

శార్దూల విక్రీడితము

కారే రాజులు? రాజ్యముల్
......గలుగవే? గర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరిమూటఁగట్టుకొని
......పోవం జాలిరే? భూమిపైఁ
బేరైనం గలదే? శిబిప్రముఖులుం
 ......బ్రీతిన్ యశః కాములై
యీరే కోర్కులు? వారలన్ మఱచిరే
......యిక్కాలమున్? భార్గవా!

*తాత్పర్యము*

భర్గుని కమారుడైన శుక్రాచార్యా! పూర్వం కూడ ఎందరో రాజులు ఉన్నారు కదా. వారికి రాజ్యాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎంతో అహంకారంతో ఎంతో ఔన్నత్యాన్ని సాధించునవారే కదా. కాని వా రెవరు సంపదలు మూటగట్టుకొని పోలేదు కదా. కనీసం ప్రపంచంలో వారి పేరైనా మిగిలి లేదు కదా. శిబి చక్రవర్తివంటి వారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోరికలు తీర్చారు కదా. వారిని ఈ నాటికీ లోకం మరువలేదు కదా.

*20.8 (ఎనిమిదవ శ్లోకము)*

*యైరియం బుభుజే బ్రహ్మన్ దైత్యేంద్రైరనివర్తిభిః|*

*తేషాం కాలోఽగ్రసీల్లోకాన్ న యశోఽధిగతం భువి॥7068॥*

గురువర్యా! పూర్వముగొప్ప దైత్యప్రభువులు ఈ భూమిని (రాజ్యమును) అనుభవించిరి. వారికి సాఠియైనవారు పృథ్వియందు నేటికినీ మరెవ్వరును లేరు. వారు ఇహలోకము నందును పరలోకమునందును, అనుభవించిన భోగములను అన్నింటిని కాలము కబళించినది. కాని, వారి కీర్తి మాత్రము ఈ భూతలమున నేటికినీ నిలిచియున్నదిగదా!

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ఇరువదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

కామెంట్‌లు లేవు: