మనకొక వామనాలయం!
ఇంతింతై వటుడింతై.. ఆకాశమంతై.. మూడడుగులు కోరి.. ముజ్జగాలకూ మేలు చేసిన స్వామి వామనుడు. బలిని పాతాళానికి తొక్కిన త్రివిక్రమ రూపం మహోన్నతం. ఆ అపురూప మూర్తి కొలువుదీరిన ఆలయాలు మన దేశంలో చాలా అరుదుగా ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు!
ప్రపంచంలోనే ఎక్కడా లేని అపురూప, అద్భుతమైన రీతిలో శ్రీ వామన మూర్తినే శ్రీ త్రివిక్రమ స్వామిగా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉందని తెలిస్తే.. ఆనందం కలగక తప్పదు!!
అసలు శ్రీ వామన మూర్తినే శ్రీ త్రివిక్రమ స్వామి అంటారు అటువంటి ఆ స్వామికి తమిళనాడులో రెండు చోట్ల
కేరళలోని ఎర్నాకులంలో ఆలయాలు ఉండగా.
ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చెరుకూరులో త్రివిక్రమ స్వామి ఆలయం ఉంది. అపురూప శిల్పసంపదతో అలరారు స్వామి ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. తొమ్మిది అడుగుల ఎత్తుండే స్వామివిగ్రహం గోధుమ వర్ణంలో మెరిసిపోతూ దర్శనమిస్తుంది.
చోళరాజుల్లో పదోవాడైన విష్ణువర్ధన మహారాజు ఓ సారి ఈ ప్రాంతానికి విహారానికి వచ్చాడట. ఇక్కడి కోనేటిలో తివిక్రమ స్వామి విగ్రహం ఉండటం గమనించి.. చుట్టూ మంటపం నిర్మింపజేశాడట. తర్వాత రాజరాజనరేంద్రుడి కాలంలో ఆలయం, మంటపాలు నిర్మించారని శాసనాల ద్వారా తెలుస్తోంది.ఆలయంలో అడుగడుగునా ఆనాటి కళావైభవం దర్శనమిస్తుంది. మూలవిరాట్టుకు ఉత్తర దిశలో భూదేవి, దక్షిణాన శ్రీదేవి అమ్మవార్ల విగ్రహాలున్నాయి. ద్వారపాలకుల విగ్రహాలు గంభీరంగా దర్శనమిస్తాయి. గర్భాలయం వెలుపలి గోడలపై రామాయణ గాథ, భాగవత ఘట్టాలు, దశావతారాలతో పాటు ముఖ్యంగా శ్రీ వినాయకుడి విగ్రహం కూడా ప్రముఖంగా దర్శనమిస్తున్నాయి.
ఇంకా అనేకానేక దేవతా విగ్రహాలు కూడా బహుముచ్చటగా కనిపిస్తాయి.
బలిని పాతాళానికి తొక్కిన తర్వాత.. దేవతలు వామనుడిని స్తుతించారు. త్రివిక్రమ రూపాన్ని ఎప్పటికీ దర్శించుకునే వరమివ్వమని కోరుకున్నారు. దానికి సమ్మతించిన వామనస్వామి ఇక్కడ వెలిశారని చెబుతారు. బలిని చరపట్టినందున ఈ ప్రాంతాన్ని చరయూరుగా కాలక్రమంలో చెరుకూరుగా పిలుస్తున్నారు.
ఆలయ పరిసరాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు ప్రశాంతతనూ చేకూరుస్తాయి. శ్రీకృష్ణాష్టమి, వామన జయంతి, దీపావళి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి శనివారం విష్ణు సహస్రనామార్చన, ఏకాదశి సందర్భంగా అభిషేక సేవ శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
ఇక్కడకు ఎలా వెళ్లాలంటే?
ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి చెరుకూరు 19 కి.మీ. దూరంలో ఉంటుంది. గుంటూరు జిల్లా బాపట్ల నుంచీ అంతే దూరంలో ఉంటుంది.
గుంటూరు జిల్లా బాపట్ల నుంచీ అంతే దూరంలో ఉంటుంది. రెండు ప్రాంతాల నుంచి చెరుకూరుకు బస్సు సౌకర్యం ఉంది. చీరాల, బాపట్ల రైల్వేస్టేషన్లలో దిగి చెరుకూరు చేరుకోవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి