*అష్టమ స్కంధము - పందొమ్మిదవ అధ్యాయము*
*వామన భగవానుడు బలిచక్రవర్తితో మూడు అడుగుల నేలను యాచించుట - బలి ఆయనకు వాగ్దానమిచ్చుట - శుక్రాచార్యుడు అడ్డగించుట*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*19.11 (పదకొండవ శ్లోకము)*
*స తన్నికేతం పరిమృశ్య శూన్యమపశ్యమానః కుపితో ననాద|*
*క్ష్మాం ద్యాం దిశః ఖం వివరాన్ సముద్రాన్ విష్ణుం విచిన్వన్ న దదర్శ వీరః॥7028॥*
హిరణ్యకశిపుడు వైకుంఠమున శ్రీహరికొరకు వెదకెను. కాని, శ్రీహరి జాడమాత్రము తెలియలేదు. అందులకు అతడు క్రుద్ధుడై సింహనాదమొనర్చెను. పిమ్మట ఆ వీరుడు పృథ్వి, స్వర్గము, దిక్కులు, ఆకాశము, పాతాళము, సముద్రములు మొదలగు అన్ని ప్రదేశములయందు విష్ణువు కొరకు గాలించెను. కాని, శ్రీహరి మాత్రము అతనికి ఎచ్చటను కనబడలేదు.
*19.12 (పండ్రెండవ శ్లోకము)*
*అపశ్యన్నితి హోవాచ మయాన్విష్టమిదం జగత్|*
*భ్రాతృహా మే గతో నూనం యతో నావర్తతే పుమాన్॥7029॥*
శ్రీహరి ఎక్కడను కనబడకపోవుటచే హిరణ్యకశిపుడు ఇట్లు అనుకొనెను- "నేను జగత్తంతయును గాలించితిని. నా సోదరుని చంపినవాడు మాత్రము కనబడుటలేదు. తప్పక అతడు ప్రాణులు తిరిగిరాని లోకమునకు వెళ్ళియుండవచ్చును"
*19.13 (పదమూడవ శ్లోకము)*
*వైరానుబంధ ఏతావానామృత్యోరిహ దేహినా|*
*అజ్ఞానప్రభవో మన్యురహంమానోపబృంహితః॥7030॥*
శ్రీహరిపై హిరణ్యకశిపునకు వైరభావము ఉండనవసరములేదు. ఏలయన, దేహధారులకు ఈ దేహము ఉండునంతవరకే వైరభావము చెల్లును. మృత్యువాత పడిన దేహముతో పాటుగా వైరభావము కూడ నశించిపోవును సుమా! క్రోధమునకు కారణము అజ్ఞానము. అది అహంకారముతో వృద్ధియగును.
*19.14 (పదునాలుగవ శ్లోకము)*
*పితా ప్రహ్లాదపుత్రస్తే తద్విద్వాన్ ద్విజవత్సలః|*
*స్వమాయుర్ద్విజలింగేభ్యో దేవేభ్యోఽదాత్స యాచితః॥7031॥*
మహారాజా! ప్రహ్లాదుని పుత్రుడు, నీకు తండ్రియు అగు విరోచనుడు గొప్ప బ్రాహ్మణ భక్తుడు. అతని శత్రువులైన దేవతలు బ్రాహ్మణుల వేషములను ధరించి, అతని ఆయువును దానముగ కోరిరి. వారు బ్రాహ్మణుల వేషములలో వచ్చిన దేవతలు అని తెలిసినప్పటికినీ, వారికి విరోచనుడు తన ఆయువును దానముగా ఇచ్చెను.
*19.15 (పదునైదవ శ్లోకము)*
*భవానాచరితాన్ ధర్మానాస్థితో గృహమేధిభిః|*
*బ్రాహ్మణైః పూర్వజైః శూరైరన్యైశ్చోద్దామకీర్తిభిః॥7032॥*
శుక్రాచార్యుడు మున్నగు గృహస్థబ్రాహ్మణులు, నీకీ పూర్వజులైన ప్రహ్లాదుడు మొదలగు వీరులు గూడ ధర్మమును పాలించి, యశోమూర్తులైరి. నీవును ఆ ధర్మములను పాటించుటలో ప్రముఖుడవు.
*19.16 (పదహారవ శ్లోకము)*
*తస్మాత్త్వత్తో మహీమీషద్వృణేఽహం వరదర్షభాత్|*
*పదాని త్రీణి దైత్యేంద్ర సమ్మితాని పదా మమ॥7033॥*
దైత్యేంద్రా! కోరిన వస్తువులను దానము చేయు వారిలో నీవు శ్రేష్ఠుడవు. కనుక, నేను కేవలము నా మూడడుగుల నేలను మాత్రమే నీ నుండి అర్థించుచున్నాను.
*బమ్మెర పోతనామాత్యుల పద్యము*
8-572 మత్తేభ విక్రీడితము
గొడుగో. జన్నిదమో, కమండలువొ.
......నాకున్ ముంజియో, దండమో,
వడుఁ గే నెక్కడ భూము లెక్కడ?
......కరుల్, వామాక్షు, లశ్వంబు లె
క్కడ? నిత్యోచిత కర్మ మెక్కడ?
......మదాకాంక్షామితంబైన మూఁ
డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది
......బ్రహ్మాండంబు నా పాలికిన్.
*తాత్పర్యము*
“అయ్యా! నేను బ్రహ్మచారిని. నాకు గొడుగు కాని, యజ్ఞోపవీతం కాని, కమండలం కాని, మొలతాడు కాని ఉపయోగిస్తాయి. అంతేకాని బ్రహ్మచారి నైన నా కెందుకు భూములు, ఏనుగులు, గుఱ్ఱాలు, స్త్రీలు. నా నిత్యకృత్యాలకి వాటితో పనిలేదు కదా. కాదని తోసేయకుండ నే కోరిన ఆ మూడు అడగుల చోటిస్తే అదే నాకు బ్రహ్మాండం.
*19.17 (పదునేడవ శ్లోకము)*
*నాన్యత్తే కామయే రాజన్ వదాన్యాజ్జగదీశ్వరాత్|*
*నైనః ప్రాప్నోతి వై విద్వాన్ యావదర్థప్రతిగ్రహః॥7034॥*
మహారాజా! నీవు సమస్త జగత్తునకు ప్రభుడవు. గొప్ప ఉదారుడవు. ఐనను నేను ఇంతకంటె ఎక్కువ నీ నుండి కోరను. విద్వాంసుడు కేవలము తన అవసరమైన మేరకే దానముగా స్వీకరింపవలెను. దానివలన అతనికి ప్రతిగ్రహదోషము అంటదు.
*బలిరువాచ*
*19.18 (పదునెనిమిదవ శ్లోకము)*
*అహో బ్రాహ్మణదాయాద వాచస్తే వృద్ధసమ్మతాః|*
*త్వం బాలో బాలిశమతిః స్వార్థం ప్రత్యబుధో యథా॥7035॥*
*బలిచక్రవర్తి పలికెను* బ్రాహ్మణకుమారా! నీవు పెద్దలవలె మాట్లాడుచున్నావు. కాని, నీ బుద్ధి బాల్యమునే సూచించుచున్నది. నీవు బాలుడవే అగుటచే, నీకు ఏది లాభమో? ఏది నష్టమో? తెలియలేకున్నావు.
*19.19 (పందొమ్మిదవ శ్లోకము)*
*మాం వచోభిః సమారాధ్య లోకానామేకమీశ్వరమ్|*
*పదత్రయం వృణీతే యోఽబుద్ధిమాన్ ద్వీపదాశుషమ్॥7036॥*
నేను ముల్లోకములను ఏకచ్ఛత్రాధిపతిని. ద్వీపసముదాయమును పూర్తిగా ఇయ్యగల సమర్థుడను. నీ మాటలతో నన్ను తృప్తిపరచి, కేవలము మూడు అడుగుల భూమిని మాత్రమే కోరుకొనుట బుద్ధిమంతుల లక్షణము అనిపించుకోదుగదా!
*19.20 (ఇరువదియవ శ్లోకము)*
*న పుమాన్ మాముపవ్రజ్య భూయో యాచితుమర్హతి|*
*తస్మాద్వృత్తికరీం భూమిం వటో కామం ప్రతీచ్ఛ మే॥7037॥*
బ్రహ్మచారీ! ఒకసారి నా యొద్దకు వచ్చి, దేనినైనను యాచించినవాడు, మరల ఇతరుల కడకు వెళ్ళి యాచింపనవసరమే ఉండదు. కనుక నీవు నీ జీవితమునకు కావలసినంత భూమిని కోరుకొనుము.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పందొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి