31, ఆగస్టు 2020, సోమవారం

బాపూరమణీయం

2014, August 31 న ఓ 80 ఏళ్ళ పెద్దాయన కాలంచేస్తే... *కుంచె కన్నీరు పెట్టుకుంది...ఎప్పుడూ అల్లరి చిల్లరగా తిరిగే బుడుగు బావురుమన్నాడు.... అచ్చ తెలుగు కొంటెకోణంగి, ఇక నాకెవరు దిక్కు అంటూ వాపోయింది...*

కాలభ్రమణంలో ఆరేళ్ళు గిర్రున తిరిగిపోయినా... *సత్తిరాజు లక్ష్మీనారాయణ...* బొమ్మల,సినిమా ప్రపంచానికి ఆమాటకొస్తే... తెలుగు భాషకు విలక్షణ రాతను నేర్పిన పరిచయం అక్కర్లేని పేరు *"బాపు"*

"ముత్యాల ముగ్గులేసి" జరిపించిన "సీతా కళ్యాణం" "సాక్షి" గా... "పెళ్ళిపుస్తకం" తో... "మంత్రిగారి వియ్యంకుడు" ను "తూర్పు వెళ్ళే రైలు" ఎక్కించి... " ఏది ధర్మం ఏది న్యాయం" అంటూ "బుల్లెట్" వర్షాన్ని కురిపించిన "రాజాధి రాజు"...

"సంపూర్ణ రామాయణాన్ని" "రామాంజనేయ యుధ్ధాన్ని" తెలుగు జాతి సొత్తు గా మలచిన "బుధ్ధిమంతుడు".....

" గోరంత దీపం" పెట్టి "బాలరాజు" కథలు చెప్పి, ఆ ముక్కంటినే ప్రసన్నం చేసుకొన్న "భక్త కన్నప్ప"...

"వంశవృక్షాన్ని" "పెళ్ళీడు పిల్లలకు" వివరించి, "పండంటి జీవితం"లో అరమరికలు లేని కాపురంతో..."ఇంటి గౌరవాన్ని" ఎలా కాపాడుకోవాలో... చెబుతూనే... స్త్రీ అంటే "బంగారు పిచ్చుక" మాత్రమే కాదు అవసరమైతే..."Mr.పెళ్ళాం" అంటూ వివరించిన విలక్షణ దర్శక మహర్షి....

"హమ్ పాంచ్"... "ప్యారీ బెహన్" "మొహబ్బత్" కోసం... "ఓ సాత్ దిన్" " ప్రేమ్ ప్రతిగ్య" చేయడం "మేరీ ధర్మ్" అంటూ... బాలీవుడ్ "బేజుబాన్".... ఈ "దిల్ జాలా"...

"కృష్ణావతారం" లో... రాధా గోపాలానికి" "సుందరకాండను" చెప్పిన అపర "శ్రీనాథ కవి సార్వభౌముడు"....

"సీతమ్మ పెళ్ళి" లో.... "అందాల రాముడు" కి... "శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్" లో విడిది ఏర్పాట్లు చేసి, "మన ఊరి పాండవులకు", "కలియుగ రావణాసురునికి", "కళ్యాణ తాంబూలాల"ను ఇచ్చిన "రాంబంటు"...


తన అంతరాత్మ రమణ అస్తమయం తర్వాత.... నా "జాకీ" లేని ఈ "శ్రీ రామ రాజ్యం" నాకొద్దు అంటూ... ఆ "స్నేహం" కోసం "పరమాత్మ" లో ఐక్యమైన *బాపూరమణీయం....*

తరాలు గడచినా... శతాబ్దాలు మారినా... బాపూ గీత, రమణ రాత నిత్యనూతనమే....


కామెంట్‌లు లేవు: