26, సెప్టెంబర్ 2023, మంగళవారం

భక్తి -ముక్తి..అంటే

 భక్తి -ముక్తి..అంటే


శంకర భగవత్పాదులు ఇలా అంటారు. “మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ స్వస్వరూపానుసంధానం భక్తి రిత్యభిదీయతే” అంటే మోక్షానికి కార​ణాలైన వాటిల్లో “భక్తి” ​గొప్పది​ అని ​. “స్వస్వరూప అనుసంధానమే” భక్తి అనబడుతుంది. భగవంతుడు దూరంగా ఉన్నాడనుకొంటే దూరంగానే ఉంటాడని, దగ్గర ​ఉన్నాడని ​అనుకొంటే దగ్గరే ​ఉంటాడని ​అని చెప్తారు! అవగాహన కానంతసేపూ దూరంగా ఉంటుంది​,​ అర్థమయితే దగ్గరే (లోపలే) ఉంటుందని అర్థం. 


చిత్త వృత్తులు పరమేశ్వరుని ​చేరి చేరి ఎల్లప్పుడూ ఉండట​మే భక్తి. ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్రా, స్మృతి అనే ఐదూ చిత్త-వృత్తుల నిరోధమే “యోగ” మనబడుతుందనీ పతంజలి మహర్షి ​చెప్పాడు . అదే భక్తి ​అని శంకరుల వివరణ.


ఇలాంటి భక్తి వలనే మానవుడు తరిస్తాడు.​ ఒక్క మాటలో చెప్పాలంటే ​భగవంతుని పట్ల ప్రేమనే భక్తి ​అనొచ్చు. అటువంటి​ ​​భక్తుల పట్ల పరమేశ్వరుడు ​సంతృప్తిగా ఉండి ,వారి బాధ్యతలను తానే భరిస్తాడు.


 “అనన్యాశ్చింతయంతోమాం​ ​ యే జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం” ఎవరైతే నన్ను అనన్య భక్తితో సేవిస్తారో వారి యోగక్షేమాలు నేనే వహిస్తాను అన్నది భగవంతుడి ​హామీ!


ఇంతకన్నా మనకు ఏమి కావాలి? ఈ భక్తి ఎప్పుడైతే ​ఏమీ ఆశించదో అప్పుడే దానిని శరణాగతి అంటారు.


చాలా మంది భక్తి భావాన్ని వివిధ కారణాల చేత ఏర్పరుచుకుంటుంటారు.​ ​కొంత మంది పుణ్యం కోసం భక్తిని పెంచుకుంటే,​ ​కొందరు పాప ​భయంతో , మరికొందరు మన అవసరాలను భగవంతుడు తీరుస్తాడ​ని భక్తిని అలవరుచుకుం​టున్నారు. భక్తులలో నాలుగు రకాల

వారుంటారని ,ఈ నాలుగు రకాల వారు భగవంతుడితో సంబంధం పెట్టుకుంటారని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు.


ఆ​ ​నాలుగు రకాలవాళ్ళు–​కష్టాల్లో ఉన్నవాడు, కోరికలున్నవాడు​, జిజ్ఞాసువు (అంటే జ్ఞానం పొందాలనే ఆసక్తి ఉన్నవాడు​)​​, జ్ఞాని.​ 


నేటి ప్రపంచంలో మొదటి రెండు కోవలకు చెందినవాళ్లనే మనం ​ఎక్కువగా ​​చూస్తున్నాం!


భక్తి అనేది ఒక యోగం.​


దీన్ని గురించి రెండు ఉదాహరణలు చెప్పారు.


మొదటిది మర్కట కిశోర న్యాయం. మర్కట కిశోరం అంటే కోతిపిల్ల. ఇది తన తల్లి ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకు ఎగిరేటప్పుడు తల్లి కడుపును జాగ్రత్తగా పట్టుకునే ఉంటుంది. ఇది కష్టమైన పని. వేదాంత మార్గంలో ​నడిచేవాడు దీన్ని అనుసరిస్తాడు.


రెండవది మార్జాల కిశోర న్యాయం. మార్జాల కిశోరమంటే పిల్లిపిల్ల. దీన్ని దాని తల్లే నోటితో పట్టుకుని జాగ్రత్తగా తీసుకెళుతుంది. భక్తి మార్గంలో ​నడిచేవాడు దీన్ని అనుసరిస్తాడు.


ఎవరైతే మనసా, వాచా, కర్మణా భగవంతుని యందు భక్తి కలిగి ఉంటారో ,వారి యోగక్షేమాన్ని ​భగవంతుడే భరిస్తాడనేదానికి ​ఒక యదార్ధ సంఘటనకు ఉదాహరణ.


కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చంద్ర​శేఖర​ ​సరస్వతుల​ ​వారికి ముందు పీఠాధిపతులుగా ​అదే పేరుతో ఇంకో స్వామి వారుండేవారు. వారు అమ్మవారి​కి​ ​గొప్ప ఉపాసకులు.


 వారితో వాదభిక్ష (వాదించాలని కోరుకోవడం) కావాలని ఒకసారి కొందరు వచ్చారు.


వారిని వాదం మొదలెట్టమన్నారు స్వామి వారు.


అందుకు ​వారన్నారు “స్వామీ మీ ఒళ్ళో కూర్చున్న ఆ అందమైన పాపను చూస్తుంటే మా నోట మాట ​రావటం లేదు. ఆ పాపను ​ మాకు కనిపించకుండా చేస్తే మేము మాట్లా​డగలం ” అన్నారు.


అప్పుడు స్వామి వారన్నారు “నేనొక సన్యాసిని. నా ఒళ్ళో పాప ఆడుకోవడం ఏంటి? మీరేదో పొరబడుతున్నారు” అన్నారు.


అప్పుడు వారన్నారు “కాదు స్వామీ! మీ ఒళ్ళో పాపను ​ప్రత్యక్షంగా ​మేం చూస్తున్నాం. ​అందువల్లే మేము మాట్లాడలేకపోతున్నాం! “


అప్పుడు ​ఆ ​స్వామి ​వారు ”ఆ పాప మరెవరో కాదు. నేను ఉపాసిస్తున్న కామాక్షి అమ్మవారే​! ఆమె​కు నామీద కల ​​దయ వలనే మీరు వాదించలేక పోతున్నారు.” అన్నారు.


శరణాగతి స్థితికి చేరుకున్న భక్తులతో ,భగవంతుడు ఇలా ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటాడు​.​ భక్తి భావా​నికి అంతిమ ​లక్ష్యం ​ఏమిటంటే-జన్మరాహిత్యం.


దీనికోసం​ నిరంతరం ​భగవంతుడిపై భక్తిని ​కలిగివుండాలి . ఆ భగవత్ స్వరూపాన్ని మనలో నిక్షిప్తం ​చేసుకుంటే ​ఏదో ఒకరోజు ​ఈ జీవు​డు పరమాత్ముడితో అనుసంధానం ​అవుతాడు. దాన్నే ఆత్మ సాక్షాత్కారమని అంటారు.


భగవంతుడికి కావలసింది భక్తి మాత్రమే.


మనకు ఎంత సంపద ఉందన్నది అనవసరం.​ ​భక్తితో​ ​ఎంత సమర్పించా​మన్నది మాత్రమే ​ప్రధానం.


విజయమాల్యా లాంటి వాళ్ళు దేవునికి సమర్పించిన కొన్ని వేల కోట్ల కంటే​,​ బడుగుజీవి కష్టపడి కూలీనాలీ చేసుకొని సంపాదించి భక్తితో ఇచ్చిన ఒక్క రూపాయే భగవంతుడికి ప్రీతి.


కొన్ని బారువుల ​బంగారంతో సత్యభామ శ్రీ కృష్ణుడిని తూచలేకపోయింది. రుక్మిణీ దేవి అదే శ్రీ కృష్ణుడిని భక్తితో ఒక తులసీద​ళంతో ​తూచి దక్కించుకుంది. యశోద కృష్ణుడిని ఏకంగా భక్తి , ప్రేమ, అనురాగాలతో కట్టి పడేసింది!

                 స్వస్తి!

కామెంట్‌లు లేవు: