26, సెప్టెంబర్ 2023, మంగళవారం

సూర్యోదయ వర్ణనం!*



*పోతనగారి  సూర్యోదయ వర్ణనం!* 


  కం:  అరుణహరి నఖర  విదళిత


గురు తిమిరేంద్ర  కుంభకూట  వినిర్ము


      క్త  రుధిర మౌక్తికముల  క్రియ


సురపతి దిశఁ   గెంపు తోడఁ  జుక్కలు  మెఱసెన్;  


         భాగ-  దశ-స్కం;  1302  పద్యము-  పోతన  మహాకవి;


సీ:   పౌలోమి  తన బాలు  పాన్పుపైఁ  గనుపట్టఁ


బన్నిన  బవడంపు  బంతియనఁగ;


    నాయురర్ధముల  వ్యయంబు  లొత్తిలి  చాటు

  కాల జాంఘకు  చేతి  గంట  యనఁగ :

ఘనజంతు  జీవిత   కాలరాసులు  విధిఁ గొల్వ                                            నెత్తిన  ఘన  హేమకుంభమనఁగ;


పశ్చిమ దిక్కాంతఁ  బరగఁ  గైసేయుచో

                                             ముందర  నిడుకొన్న  ముకురమనఁగ; 


     గీ:  కోక తాపోప శమన  దివ్య  ఘుటిక  యనఁగ,


           పద్మినీకాంత  నోముల  ఫలమనంగ ,


           మూడు మూర్తుల  సాకారంపు  ముద్దయనఁగ


      మిహిర  మండల  ముదయాద్రి  మీద  నొప్పె!  


         భాగ-  దశ-స్కం;  1303  పద్యం ;  బమ్మెఱ పోతన మహాకవి!


      ఎందరో కవులు  తమకావ్యాల్లో  సందర్భాను సారంగా  సూర్యోదయ  సూర్యాస్తమయ  దృశ్యాలను  వర్ణించారు.

ఒక్కొక్క కవిది  ఒక్కొక్కబాణి.  పోతన వర్ణించిన  సూర్యోదయ దృశ్యమిది.


   బలరామ  కృష్ణులు  మేనమామ  పిలుపున  మధురలో   విడిసిన  సందర్భమున  నీవర్ణనమున్నది.


రెండు  పద్యాలుగా  మనమిప్పుడు  చెప్పుకో బోతున్నాం.  మొదటిది కందపద్యం!


*మొదటి పద్యభావం:*  అరుణోదయం  సిహంలా  ఉన్నదట. అది  రాత్రియనే మదపుటేనుగు  కుంభస్ధలం  బ్రద్దలుకొడుతున్నదట. ఆసందర్భంలో  ఆకుంభస్ధలం  నుండిరాలే ముత్యాలవలె తారకలు సంధ్యారాగంలో  చూపరులకు

కాననౌతున్నవట! 


రాత్రి అనేఏనుగు, అరుణోదయమనే సింహము, నక్షత్రములనే  ముత్యములు, ఇవీపోలికలు:


           రాత్రియనే  మత్తేభంమీద అపుణోదయ  సింహంలఘించింది  కుంభస్థలం ఛేదించింది.  అంతే అందులో ఉన్న ముత్యాలు రాలిపడుతున్నాయి. ఆదృశ్యాన్ని తలపిస్తోంది. తొలివెలుగురేఖలు తూర్పున ఉదయిస్తుంటే.


    (సముద్రం, మొసలినోరు, ఏనుగు కుంభస్థలం,  ముత్యాలకు  నెలవులని  కవిసమయం )

               

      ఇఁక  రెండవ పద్యానికి వద్దాం!   ముందు భావం  చెప్పుకుందాం!


"తూరుపు దిక్కున   కనబడుతున్న  అరుణకాంతి  శచీదేవి (పౌలోమి) తనకొమరుడాడుకునుటకు  వేలాడదీసిన పగడాల  బంతియా, యనునట్లుగను,


    ఆయుః పరిమాణముల  లెక్కలు  వినిపించుటకు కాలమనే  గణకుడు వాయించే  చేతిలోనిగంటయా, యనునట్లును,


ప్రాణుల  ఆయుఃప్రమాణమును  కొలుచుటకై  బ్రహ్మగారు  యెత్తిపట్టుకొన్న   బంగరు కుండయా, యనునట్లుగను,


      పశ్చిమ  దిక్కనే వనిత  యలంకరణమునకై  తనయెదుట  నిలుపుకొన్న  నిలువు  టద్దమా, యనునట్లుగను,


చక్రవాకముల  విరహతాపమును దీర్ప కాలవైద్యుడిచ్చిన  మందుమాత్రయా, యనునట్లును,


పద్మినీ కాంత(తామరపూవు)  నోచిన  నోముల  ఫలమా, యనునట్లుగను,


లోకాలనేలు  ముగ్గురు  మూర్తుల  ఆకారపు  మద్దయా, యనునటులను               సూర్యమండలము  ఉదయాద్రిపై  ఒప్పారెను.


*విశేషాంశములు:-* 

 ముందు కంస వధ జరుగ నున్నది. తత్ సూచనలను  యీపద్యమున కవి నిపుణముగా  ప్రవేశపెట్టి

నాడు. గణకుడు గంటలు మ్రోగించుట  మనలోకొందరికి పరిచయమే. ఆస్తుల వేలంపాటలలో అమీనా  పాట పూర్తయిందని చెప్పటం

కోసం ఒకటోసారి (గంట ) రెండోసారి (గంట)  యీవిధంగా హెచ్చరస్తాడు.అదిగో ఆగంటమాదిరి అరుణుడున్నాడట!


        పల్లెలలో  ధాన్యకొలవటానికి  లోహాలతో  చేసిన పాత్రలుంటాయి. ప్రాణుల ఆయువునుకొలిచే కొలపాత్రలా అరుణోదయమున్నదట.  

       చంటి పిల్లలు ఆడుకుంటానికి  ఉయ్యాలపైన రంగురంగుల  బంతులు కడుతూ ఉండేవారుగదా  ఆమాదిరిగా శచీ

దేవి తన కొమారునకు ఆటల నిమిత్తం కట్టిన పగడాల బంతిలా అరుణుడున్నాడట.


       పశ్చమ దిగంగన  అలంకారం   చేసికోవటానికి   ముందు నిలుపుకొన్న  అద్దంలా ఉన్నాడట.

సూర్యోదయం జరిగేది తూర్పుననే , కానీ  అది  పశ్చిమ దిశాభి ముఖంగానేకదా! చక్కగాఉందివర్ణన.


         చక్రవాకములని  ఒకరకం పక్షులున్నవట. వాటికి రాత్రి వియోగం  పగలు  సమాగమం.  రాత్రంతా  పడిన విరహ తాపం తగ్గటంకోసం అవివేసుకునే  ఔషధ గుళిక లాగ అరుణుడున్నాడట. 


ఆడవారు సౌభాగ్యంకోసం  యెన్నో నోములు నోచుతూ ఉంటారు.    పద్మినిచేసిన నోములఫలమా  యనేవిధంగాఅరుణోదయమైనదట.


        త్రిమూర్త్యాత్మక  స్వరూపం  సూర్యభగవానుడు. బ్రహ్మ  విష్ణు  మహేశ్వరులకు  ప్రతిరూపమని వేదములుఘోషిస్తున్నాయి. 


ఆవిధంగా  సూర్యోదయమైనదంటారు  పోతనగారు!                                               *స్వస్తి!* 


*సేకరణ:- శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారి పోస్ట్* 

🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: