26, సెప్టెంబర్ 2023, మంగళవారం

చాటు పద్య సుమ మాలిక **

 ((((( ఆలోచనాలోచనాలు ))))) *


**** చాటు పద్య సుమ మాలిక *****    

           1* కం. సిరిగలవానికిఁ జెల్లును / తరుణులఁ బదియాఱువేలఁ దగఁ బెండ్లాడన్ / తిరిపమున కిద్దఱాండ్రా? / పరమేశా? గంగ విడువు పార్వతి చాలున్.  

     2* ఉ. బూడిద బ్రుంగివై యొడలుపోఁడిమిఁదప్ప మొగంబు వెల్లనై / వాడలవాడలన్ దిరుగ వారును వీరును జొచ్చొచో యనన్ / గోడలగొందులన్ దిరిగి కూయుచు నుండెదు కొండవీటిలో / గాడిద? నీవునుం గవివి కావుగదా? యనుమానమయ్యెడున్.    

  3* ఉ. కొందఱు భైరవాశ్వములు, కొందఱు పార్థుని తేరిటెక్కెముల్ / 

కొందఱు ప్రాక్కిటీశ్వరులు, కొందఱు కాలునియెక్కిరింతలుం / కొందఱు కృష్ణజన్మమునఁ గూసినవారలు, నీ సదస్సులో / నందఱు నందఱే మఱియు నందఱు నందఱె యందఱందంఱే!       

  (1 నుండి 3 పద్యములు శ్రీనాథ మహాకవి కృతము)    

   4* శ్రీనీరేజదళేక్షణాహృదయ రాజీవభ్రమచ్చంచరీ / కానూనాస్త్ర దురంధురుండు హరుఁడార్యాప్రాణానాథుండు ని / త్యానందుండు శివుండు నాహృదయపద్మాసనస్థుడై యుండగా / స్నానంబా? తలకా? జపంబు మడికా? జందెంబు నా తప్పుకా?         

   5* ఉ. పండితులైనవారలు సభాస్థలి నుండగ నల్పుఁడొక్కఁడు / ద్దండతఁ బీఠమెక్కిన బుధప్రకరంబున కేమి లోటగున్/ గొండొకకోఁతి చెట్టుకొనకొమ్మకు నెక్కినఁ గ్రిందమత్త వే / దండ మహోగ్రసింహములు తాలిమినందవె రాజచంద్రమా!                   

   6* కం. కవి యల్లసానిపెద్దన / కవి తిక్కన సోమయాజి గణుతింపంగాఁ / గవి నేను రామకృష్ణుఁడఁ / గవియను నామంబు నీరుకాకికి లేదే?      7* కం. "" వాకిటి కావలి తిమ్మా""/ "" ప్రాకటమగు సుకవివరుల పాలిటి సొమ్మా!""/ "" నీకిదె పద్యము కొమ్మా!""/ "" నాకీ పచ్చడమె చాలు నయముగ నిమ్మా!""              

  (5, 6 మరియు 7 పద్యములు తెనాలి రామకృష్ణ కవి గారివిగా ప్రసిద్ధాలు)               చివరగా చమత్కార పద్యం 

8* అసమాన కోదండుడైన రాజెవ్వండు ?                         రాజు పేరిట గల్గు రత్నమేది?                            రత్నంబు పేరిట రంజిల్లు ఋతువేది?                          ఋతువు పేరిట గల్గు రుద్రుడెవరు?                        రుద్రుని పేరిట రూఢిల్లు జగమేది?                             జగము పేరిట గల జంతువేది?                          జంతువు పేరిట జన్మించు పక్షేది?                                   పక్షి పేరిట గల వృక్షమేది?      అన్నిటికి జూడ మూడేసి యక్షరములు / ఆదులుడుపంగ తుదలెల్ల నాదులగును / సమ్మతిగ జెప్ప భావజ్ఞ చక్రవర్తి / చెప్పలేకున్న నగదు నే చిన్ని నవ్వు!!    

                    ( ఈ పద్యంలో ప్రశ్నలన్నింటికి మూడేసి అక్షరాల సమాధానాలుంటాయి. ఒక సమాధానంలోని చివరి అక్షరం , రెండో సమాధానానికి మొదటి అక్షరం అవుతుందనే నిబంధన మామాలే! ఇప్పుడీ పద్యంలోని ప్రశ్నలకు సమాధానాలు ఇట్లా ఉంటాయి

. 1* శ్రీరామ 2* మౌక్తిక 3* కర్కశ  4* శంభువు 5* వసుధ 6* ధేనువు 7* వాయసం 8* సంపంగె.ఈ పద్యంలోని రత్నం పేరిట గల ఋతువు  గ్రీష్మం. గ్రీష్మాన్ని కర్కశ ఋతువంటారు. కాబట్టి ఆ ప్రశ్నకి సమాధానాన్ని దారివిడిచి వెదుక్కోవలసి వస్తుంది.)                                      తేది 26--9--2023, మంగళవారం, శుభోదయం.


కామెంట్‌లు లేవు: