24, అక్టోబర్ 2023, మంగళవారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


సప్తమ స్కంధము

శౌనకాది మహామునులారా! మా గురువుగారు వ్యాసమహర్షి తనకూ. నారదుడికి జరిగిన

సంభాషణ రూపంగా మాయాశక్తినీ మాయాస్వరూపాన్నీ వివరించి చెబితే శ్రద్ధగా ఆలకించిన జనమేజయుడు

మరికొన్ని విశేషాలు అడిగి తెలుసుకున్నాడు. అవికూడా మీకు తెలియజెబుతాను వినండి అంటూ

సూతుడు కథను కొనసాగించాడు.

సూర్యచంద్రవంశాల్లో ఎందరెందరో మహామహులు జన్మించారనీ వారందరూ దేవీభక్తి పరా

యణులై తరించారనీ విన్నాను. ఆ రెండు వంశాల చరిత్రలనూ సవిస్తరంగా తెలుసుకోవాలని ఉంది,

దయచేసి వివరించమని జనమేజయుడు కోరాడు. వ్యాసుడు అలాగేనని ఉపక్రమించాడు.

* నారదుడికి దక్షుడి శాపం

జనమేజయా! విష్ణుమూర్తికి నాభికమలం నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. గొప్ప తపస్సు

చేసి మహాదేవిని ఉపాసించి వరాలు పొంది జగత్తును సృష్టించడానికి ఉద్యుక్తుడయ్యాడు. అన్నింటినీ

సృష్టించాడు కానీ మానవుణ్ణి సృష్టి చెయ్యడానికి మాత్రం అతడికి శక్తి చాలిందికాదు. ఎంతగానో

ఆలోచించాడు. ఒక ఉపాయం తట్టింది. అశేషప్రజానీకాన్ని ఒక్కసారిగా సృష్టించలేను కనక శక్తి మేరకు

కొందరినే సృష్టిద్దామనుకున్నాడు. ఏడుగురిని మానసపుత్రులుగా ఆవిర్భవింపజేశాడు. “ససర్జ మానసాన్

పుత్రాన్ సప్తసంఖ్యాన్ ప్రజాపతిః". మరీచి, అంగిరసుడు, అత్రి, వసిష్ఠుడు, పులహుడు, క్రతుడు,

పులస్త్యుడు అని వారి పేర్లు. వీరు కాక రోషసముద్భవుడైన రుద్రుడు, ఒడినుంచి పుట్టిన నారదుడు,

బొటనవేలు నుంచి ఆవిర్భవించిన దక్షుడు - బ్రహ్మదేవుని కుమారులే. సనకసనందనాదులు మరికొందురు

మానసపుత్రులున్నారు. వీరందరూ పురుషులేకాగా, ఎడమ బొటనవేలునుంచి ఒక స్త్రీ ఆవిర్భవించింది,

అవిడే దక్షపత్ని. సర్వాంగసుందరి. ఈవిడ పేరు వీరిణి. అసిక్రీతి అనికూడా మరొక పేరు. వీరిణీదక్షులకు

నారదుడు జన్మించాడు. దేవర్షి అయ్యాడు.

వ్యాసమహర్షీ! ఇది చాలా విచిత్రంగా ఉందే! వీరిణీదక్షులకు నారదుడు జన్మించాడంటున్నావు,

ఇంతకు ముందు బ్రహ్మదేవుడి ఒడినుంచి పుట్టాడు అన్నావు. ఏమిటి ఈ వైరుధ్యం? శాపాలేమైనా

ఉన్నాయా?

కామెంట్‌లు లేవు: