24, అక్టోబర్ 2023, మంగళవారం

*శ్రీ ఈశోపనిషత్తు

 *శ్రీ ఈశోపనిషత్తు*

***""*

ఉపనిషత్తులలో ఇది చాలా ముఖ్యమైనది .ఈ ఈశోపనిషత్తు గురించి ఎందరో మహానుభావులు  గొప్పగా వివరించారు.

ఈ ఉపనిషత్తులో మొత్తం 18 శ్లోకాలు అంటే 18 మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలు ముఖ్యంగా భక్తుడు భగవంతుడిని తనను సరిదిద్దమని ,సరైన మార్గంలో పెట్టమని చెబుతూ ,దేవుని గొప్పతనాన్ని, జీవుడు తాను ఎలా జీవించాలో, ,ఆత్మ గురించి ,చీకటి ఆవల ఉండే వెలుగు గురించి, నవజీవన మార్గంలో జీవించడానికి సూర్యదేవుని ప్రణమిల్లుతూ వేడుకుంటాడు.

      మొదటగా ఈ ఉపనిషత్తులో శాంతి మంత్రం ఉంటుంది అంటే మంగళాచరణ ఉంటుంది. అలాగే వేదమంత్రాలన్నీ చివర ఓం శాంతి శాంతి అంటూ మూడుసార్లు శాంతిని తెలియజేస్తాయి. శాంతి అంటే ప్రశాంతత అని అర్థం. మూడు విధాలైన ఆటంకాలు నుండి మనము బయటపడడానికి శాంతిని మూడుసార్లు ఉచ్చరించాలి. ఆ మూడు విధాలైన ఆటంకాలు ఏవంటే...

1.*ఆధ్యాత్మిక ఆటంకాలు*

శరీరం వలన ,మనసు వలన ఏర్పడే ఆటంకాలు. అవి శారీరక రుగ్మత, మానసిక రుగ్మత, అనారోగ్యము, రోగాలు

2.*ఆధిభౌతిక ఆటంకాలు*

ఇతర జీవరాశుల వాటిల్లే ఆటంకాలు .జంతువులు ,పాము, తేళ్లు వాటి వలన జరిగే హానికరాలు

3.*ఆధిదైవిక ఆటంకాలు*

ప్రకృతి శక్తుల వలన జరిగే ఆటంకాలు. వర్షము, పిడుగు ,అగ్ని ,గాలి వలన జరిగే హానికరాలు.

   మూడుసార్లు శాంతిః అని ఉచ్చరించడం వలన మూడు రకాల ఆటంకాల నుండి విడివడి మానవుడు ప్రశాంతంగా ఉండాలని ఈ ఉపనిషత్తు ఉద్దేశం.

ఆది... అంటే  మొదలు, మొదటి అని అర్థము

ఆధి... మనసుకు చెందిన.. మనోవ్యధకు చెందిన అని అర్థము.


    ఏ పని చేస్తున్నప్పటికీ, అందుకు అనుకూలమైన మానసిక స్థితి ఉండటం తప్పనిసరి .ఏ పని చేయబోతున్నా, అందుకు తగిన మానసిక స్థితిని పెంపొందించుకొని ,ఆ తరువాతనే ఆ పనికి ఉపక్రమిస్తే చక్కని ఫలితాన్ని పొందవచ్చు. అందుకే ఉపనిషత్తులు పఠించడానికి ముందు శాంతి మంత్రాలను ఉచ్చరిస్తారు .ఉపనిషత్తు శాంతి మంత్రం ఇదిగో...


*ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే*:

   *పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే**

.... తెల్లము (అర్థము)

భగవంతుడు పరిపూర్ణుడు. ఈ లోకం పరిపూర్ణమైనది .పరిపూర్ణమైన భగవంతుడు నుండి పరిపూర్ణమైన ఈ లోకం ఉద్భవించింది. పరిపూర్ణము నుండి పరిపూర్ణతను తీసివేసిన ,కూడిన తరువాత కూడా పరిపూర్ణత మిగిలి ఉంటుంది.

**అంటే ఒక దీపం నుండి అనేక దీపాలు వెలిగించవచ్చు. ఇందువలన మొదటి దీపపు పరిపూర్ణతకు ఎలాంటి లోటు ఉండదు. దాని నుండి వెలిగించబడిన దీపాలు కూడా పరిపూర్ణ సంపూర్ణంగానే వెలుగుని ఇచ్చేవిగా ఉంటాయి.

  అంటే చెట్టుకు అనేక పుష్పాలు ఉంటాయి. ప్రతి పుష్పము సంపూర్ణంగానే ఉంటుంది. ఆ చెట్టు పరిపూర్ణత కూడా తగ్గదు. ఎందుకంటే చెట్టు పరిపూర్ణత వేరు పుష్పం పరిపూర్ణత వేరు .అదేవిధంగా భగవంతుని నుండి ఎన్నెన్నో పరిపూర్ణమైన లోకాలు పిండాండ బ్రహ్మాండాలు ఉద్భవించవచ్చు. అందువలన ఆయన పరిపూర్ణతకు ఏ విధమైన లోటు ఉండదు.

... ఇంకా సులభంగా అర్థం కావాలంటే శూన్యం నుండి శూన్యాన్ని తీసివేసిన, శూన్యాన్ని కూడిన శూన్యమే ఉంటుంది. అంటే సున్నా విలువకు సున్నాను కలిపిన సున్నాను తీసివేసిన సున్నాయే మిగులుతుంది.


*పూర్ణమనగా సున్నా ఏమీ లేనిది .అది నీవు గాని ,నేను గాని కావచ్చు. ఆత్మ గాని ,పరమాత్మ గాని కావచ్చు .అది ఇది అంటే నీవు ,నీ అహం, నీ ఆత్మ ,నీ పరమాత్మ ,అన్నింటికీ మూలమైన ఈ సృష్టి. ఈ విశ్వం నుండి ఏదీ క్రొత్తగా పుట్టదు. నశించదు .పదార్ధ రూపాలు మారుతాయి అంతే. ఈ విశ్వం నుండి ఏది తీసిన ,ఏది కూడిన ఆ విశ్వ భావన అలాగే ఉంటుంది .నీ జీవితానికి ఎన్ని ఆస్తిపాస్తులు,ఎన్ని సుఖదుఃఖాలు కలిపిన, తీసివేసిన చివరకు శూన్యమై అది పరిపూర్ణమై విశ్వంలో కలిసిపోతుంది. అంటే చివరికి నీకు పరిపూర్ణమైన సున్నాయే మిగులుతుంది. ఇది వివిధ తాత్వికుల వివిధ భాష్యాల సారాంశం. మన వేద ఋషుల వివేచన.ఎంత చక్కని తాత్విక ఆలోచనో చూడండి..

ఓం శాంతి శాంతి శాంతిః (రేపటి నుంచి ఈశాఉపనిషత్తు  మంత్రాలను తెలుసుకుందాం)

 *రాఘవ మాస్టారు కేదారి*



కామెంట్‌లు లేవు: