🌹శ్రీరామచంద్రుడు 🌹
శ్రీరామచంద్రుండు శ్రితపారిజాతుండు
సుగుణాభిరాముండు సుందరుండు
అన్యుల నుండియు న్ననయంబు గ్రహియించు
నగణితమ్మైనట్టి సుగుణములనె
సద్గుణంబులలోన సముడు భూజానికి
కౌసల్య కన్నట్టి కలిమిపంట
సతత ప్రశాంతుండు సౌమ్య వచోభాషి
యాగ్రహం బెరుగని నిగ్రహుండు
ఒరులెన్ని పరుషముల్ నొనరంగ పల్కినన్
మనముందు నిల్పని మాన్యవరుడు
అంతియే కాకుండ ననునయ వాక్యాల
సర్ది చెప్పెటి గొప్ప సౌమ్య శాలి
తండ్రి దశరథునకు మించు తనయు డతడు
సురుచిరోజ్వల గుణగణ శోభితుండు
సర్వమంగళరూపుండు సన్నుతుండు
జగతి జననుత శ్రీరామచంద్రమూర్తి.
శ్రీకరుండైనట్టి శ్రీరామచంద్రుండు
నతి మృదుల స్వభావి యంతరమున
యొరులచే కించిత్తు నుపకార మొందినన్
భావించు నద్దాని పర్వతముగ
యెవరిచే యపకార మెంతేని గల్గినన్
పట్టించుకొనడది భావమందు
నన్యుల నెవరైన నాత్మీయ మదితోడ
పలకరించును తానె ప్రథమముగను
శత్రు విషయము నందైన సౌమ్యభాషి
శరణు గోరిన వారిపై కరుణ జూపి
పగతురను జంపి నాతని భయము బాపు
రమ్య గుణగణయుక్తుడు రామవిభుడు.
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి