వ్యాధి - వారి దృష్టి
1964లో నా రెండవ కుమారుడు మురళీధరకు ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధి కనిపించింది. విజయవాడలో, గుంటూరులో పేరుగల వైద్యులను సంప్రదించాము. వారు ఎక్స్రే ఫోటోలు తీసి, పరీక్ష చేసారు. శస్త్రచికిత్స అవసరం అన్నారు. రాయవెల్లూరు మిషన్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ గోపినాథ్ ఈ వ్యాధికి సంబంధించిన శస్త్రచికిత్సలో చాలా నిపుణుడనీ, ఆయనచేత ఆపరేషన్ చేయించ వలసిందని కూడా సలహా ఇచ్చారు.
మురళిని మద్రాసుకు వెంటబెట్టుకు వెళ్ళి ఆకాడ డాక్టరుతో సంప్రదించాను. వారుకోడా ఆపరేషన్ అవసరమేనన్నారు. అదైనా, అరునెలలు దాటకుండా, ఆ గడువులోపల చేయవలసిందని సలహా చెప్పారు. నాకు ఆప్తమిత్రులైన ఒకరిద్దరు వైద్యులు ‘ఈ అపరేషన్ అంత ప్రమాదరహితం కాదనీ, ఇతరవిధాల నివారణోపాయం ఏదైనా సాధ్యమయ్యేట్టయితే దాని అనుసరించడం మంచిద’ని సూచించారు.
సందిగ్ధంలో పడ్డాను.
ఇన్నిచోట్ల, ఇంతమంది డాక్టరులు ఆపరేషన్ అవసరమని ఏకగ్రీవంగా అభిప్రాయం వెలిబుచ్చిన తరువాత, వారి సలహా త్రోసివెయ్యడం సాధ్యమా? శ్రేయస్కరమా? అయితే గత్యంతరం?
భగవంతుడి మీద భారంవేసి, రాయవెల్లూరు వెళ్ళాము. డాక్టరు గోపీనాథ్ ను సంప్రదించాము. ఆయన జాగ్రత్తగా పరీక్ష చేసి, ఆపరేషన్ అవసరమేనని, మార్గాంతర6 లేదని తేల్చిచెప్పారు.
కొద్దిరోజులలో డాక్టరు గోపీనాథ్ రాయవెల్లూరు ఆస్పత్రి వదిలిపెట్టి, ఢిల్లీ వెళుతున్నాడు. వెంటనే కాకపోతే, ఆరునెలలు మించకుండా ఢిల్లీకి రావలసిందని కూడా సలహా ఇచ్చాడు.
తుదకు, ఆపరేషన్ వయిదా వెయ్యకుండా రాయవెల్లూరులోనే, గోపీనాథ్ చేతనే ఆపరేషన్ చేయించుకోవడానికి నిశ్చయం చేసుకున్నాము. అవసరమైన ఏర్పాట్లన్నీ చేశాము.
అయితే ఆపరేషన్ చేయించుకునే ముందు కంచికి వెళ్ళి, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని దర్శించి, వారి ఆశీస్సును పొంది రావాలనుకున్నాను. వెంటనే కారులో నేనూ, నా కుమారుడు రాయవెల్లూరు నుంచి కంచికి బయలుదేరాము. కంచి చేరేసరికి సాయింకాలమైంది.
స్వామి మఠంలో లేరు. సర్వతీర్థం సమీపాన ప్రత్యేకంగా ఒక పాకలో ఉంటున్నారు. మేము సర్వతీర్థం వెళ్ళేసరికి మసకమసగ్గా ఉంది. అనుష్ఠానాదులు ముగించుకుని స్వామి అప్పుడే పాకలో ప్రవేశించబోతున్నారు. స్వామి వెంట ఇద్దరు శిష్యులున్నారు. శిష్యుల ద్వారా మా రాక స్వామికి ఎరిగించాను.
ద్వారం తెరిచి లోపలికి వెళ్ళబోతున్నవారల్లా ఆగి, మావైపు తిరిగి, “ఏమిటి విశేషం” అన్నారు.
నా రెండవ కుమారుడు మురళీధరకు జబ్బు చేసిందని, శస్త్ర చికిత్సకై రాయవెల్లూరు ఆసుపత్రికి వచ్చామని, ఆపరేషన్ కు ముందు తమ ఆశీర్వాదం కోసం కంచి వచ్చామనీ విన్నవించాను.
”ఏమిటి జబ్బు” అని అడిగారు.
”ఊపిరి తిత్తులకు సంబధించిన వ్యాధి. ‘బ్రాంక్రియాక్టాసిస్’ అంటారు. ఊపిరితిత్తులలో ఎడమ వైపు మచ్చ కనిపించింది ఎక్స్రే తీస్తే” అని అన్నాను.
నకనకలాడే లాంతరు వెలుగులో, ఆ దూరాన్నించే మురళి వక్షస్థలం వైపు చూశారు స్వామి.
“జబ్బు ప్రమాదకరమైనదే అయినా, భయపడవలసిన అవసరం లేదు. ఆపరేషన్ వద్దు. మఠానికి వెళ్ళి ప్రసాదం పుచ్చుకుని, ఇంటికి వెళ్ళండి” అన్నారు. బ్రహ్మదేవుడు ఆయుర్ధాయం పొడిగించాడు! ఇద్దరం స్వామికి సాగిలపడి, సెలవు పుచ్చుకుని, మఠంలో ప్రసాదం స్వీకరించి, రాయవెల్లూరు వెళ్ళి గోపీనాథ్ తో, ఆపరేషన్ వాయిదా వేస్తున్నామని చెప్పి, మద్రాసు మీదుగా విజయవాడ చేరాము.
ఇది జరిగి నేటికి(1990) 26 ఏండ్లు గడిచాయి. ప్రధాన ఆంగ్లపత్రికలో ఈ చిరంజీవి పాత్రికేయుడిగా పేరుగడించాడు. అతని వయస్సు ఇప్పుడు 54 సంవత్సరాలు. నైష్ఠిక బ్రహ్మచారి. ఇంతవరకూ మళ్ళా, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి ఏమిటో ఎరగడు.
--- నీలంరాజు వెంకటశేషయ్య గారి "నడిచే దేవుడు" పుస్తక సౌజన్యంతో
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి