1, జూన్ 2024, శనివారం

పంచగ్రహ కూటమి


సోషల్ మీడియా పుణ్యామా అని మనం ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నాం. జూన్ లో ఏర్పడబోతున్న పంచగ్రహ కూటమి గతంలో ఏర్పడ్డ వాటితో పోల్చుకుంటే చాలా చిన్నది. ఇక్కడ గత కొంత కాలం క్రితం ఏర్పడిన వివిధ గ్రహ కూటముల వివరాలు తేదీలు సమయాలతో సహా ఇచ్చాను. అంతే కాకుండా అవి జరిగినప్పుడు లేదా జరిగిన తర్వాత ఏర్పడిన ప్రకృతి విపత్తుల వివరాలు కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఇచ్చిన తేదీలు మరియు సమయాలు భారత కాలమానం ప్రకారం ఇవ్వబడ్డాయి.


అష్ట గ్రహ కూటమి

ఫిబ్రవరి 3, 1962 సాయత్రం 5.50 నుంచి ఫిబ్రవరి 5, 1962 సాయత్రం 5.46 వరకు ఈ అష్టగ్రహ కూటమి మకర రాశిలో ఉన్నది. ఈ సమయంలో రాహువు కర్కాటక రాశిలో ఉంటే, మిగిలిన గ్రహాలన్ని మకర రాశిలో ఉన్నాయి. ఈ అష్టగ్రహ కూటమి అయ్యాక చెప్పుకోదగిన ప్రకృతి విపత్తులు ఏమి జరగలేదు. కానీ ఈ అష్టగ్రహ కూటమి అయ్యాక కొంత కాలానికి రాజకీయంగా చాలా దేశాల్లో చెప్పుకోదగిన మార్పులు జరిగాయి. కాకపోతే ఈ మార్పులు వెంటనే జరిగినవి కాదు.


పంచగ్రహ కూటమి

జనవరి 10, 1994 తెల్లవారు ఝామున 03.58కి చంద్రుడు ధనూరాశిలోకి ప్రవేశించటంతో పంచగ్రహ కూటమి ప్రారంభమయ్యి అదేరోజు మధ్యాహ్నం 12.27 కు బుధుడు మకర రాశిలోకి మారటంతో ఈ పంచగ్రహ కూటమి ముగిసింది. ఈ పంచగ్రహ కూటమి జరిగిన వారం రోజులకు అంటే జనవరి 17, 1994 రోజున అమేరికాలోని లాస్ ఏంజల్స్ ప్రాంతంలో 6.7 మాగ్నిట్యూట్ తో భారీ భూకంపం వచ్చింది.


పంచగ్రహ మరియు షడ్గ్రహ కూటమి

మే 3, 2000, అర్ధరాత్రి 12.01 కి మేష రాశిలోకి చంద్రుడి ప్రవేశంతో ఈ షడ్గ్రహ కూటమి ప్రారంభమయ్యి మే 5, 2000 రోజున అర్ధరాత్రి 01.51కు చంద్రుడు వృషభరాశిలోకి ప్రవేశించటంలో ఈ షడ్గ్రహ కూటమి ముగిసింది. చంద్రుడితో పాటు సూర్యుడు, బుధుడు, గురువు, శుక్రుడు, మరియు శని గ్రహాలు ఈ సమయంలో మేష రాశిలో సంచరించాయి. అయితే చంద్రుడు మేష రాశినుంచి వృషభరాశిలోకి మారినప్పటికి, ఏప్రీల్ 27, 2000, తెల్లవారు ఝామున 5.51కి ప్రారంభమయిన సూర్యుడు, బుధుడు, గురువు, శుక్రుడు, మరియు శని గ్రహాలతో కూడిన పంచ గ్రహ కూటమి మే 11, 2000 సాయత్రం 04.51 కి బుధుడు మేష రాశినుంచి వృషభరాశిలోకి మారటంతో ముగిసింది.


ఈ షడ్గ్రహ కూటమి జరుగుతున్న సమయంలో అంటే మే 4న ఇండోనేషియా, సుమత్ర దివుల్లో 7.6 మాగ్నిట్యూట్ తో భారీ భూకంపం వచ్చింది.


పంచగ్రహ కూటమి, షడ్గ్రహ కూటమి, సప్తగ్రహకూటమి

ఏప్రీల్ 26, 2002, తెల్లవారు ఝామున 05.50కి బుధుడు వృషభరాశిలోకి మారటంతో. రాహువు, బుధుడు, కుజుడు, శుక్రుడు మరియు శనితో కూడిన ఈ పంచగ్రహ కూటమి ప్రారంభమయ్యి మే 12, 2002, రాత్రి 8.48 చంద్రుడు వృషభరాశిలోకి రావటంతో షడ్గ్రహ కూటమిగా మారింది. ఆ తర్వాత మే 15, 2002 రోజున తెల్లవారు ఝామున 04.48కి సూర్యుడు వృషభరాశిలోకి ప్రవేశించటంతో సప్తగ్రహ కూటమిగా మారింది. అదే రోజున తెల్లవారు ఝామున 05.44 కు చంద్రుడు మిథున రాశిలోకి మారటంతో తిరిగి షడ్గ్రహ కూటమిగా మారింది. అదేరోజు సాయత్రం 4.49కి శుక్రుడు మిథున రాశిలోకి మారటంతో తిరిగి పంచగ్రహ కూటమిగా మారింది. మే 19, 2002 రోజున ఉదయం 11.12కు కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించటంతో ఈ పంచగ్రహ కూటమి కూడా ముగిసింది.


ఈ పంచగ్రహ కూటమి ప్రారంభమవటానికి ఒక రోజు ముందు అఫ్ఘనిస్తాన్ లో 6.1 మాగ్నిట్యూట్ తో భారీ భూకంపం వచ్చింది.


ఈ ప్రకృతి విపత్తులకు గ్రహ కూటములకు గల సంబంధాన్ని జ్యోతిష పరంగా ఇంకా పరిశోధన చేయాల్సి ఉంది. ఇక్కడ నా దృష్టిలోకి వచ్చిన కొన్ని విషయాలు మాత్రమే చెప్పటం జరిగింది. అయితే ఈ గ్రహకూటములేవి కూడా వ్యక్తిగతంగా ఎటువంటి సమస్యలు ఇవ్వలేదనే విషయాన్ని అందరూ గుర్తించాలి.

కామెంట్‌లు లేవు: