*🐒🙏 *నేడు హనుమ జనన ఉత్సవం*🙏🐒
🐒ఆయన భక్తులకి దేవుడు! అదే సమయంలో తానే స్వయంగా మహాభక్తుడు! ఒక భక్తుడే.. దేవుడై పూజలందుకోవటం.. కేవలం హనుమంతుడి విషయంలోనే సాధ్యం!
🐒ఆంజనేయుడనగానే మనకు శ్రీరామ భక్తుడు గుర్తుకు వస్తాడు. ఎక్కడెక్కడ రామ నామం వినిపిస్తుందో అక్కడక్కడ మారుతి ఇప్పటికీ, ఎప్పటికీ ఆనందబాష్పాలు రాలుస్తూ కూర్చుంటాడట! అంటే, మనకు రామదూత రక్షణ, అనుగ్రహం కావాలంటే ‘’రామ’’ అని పలకటమే మార్గం. ఆయన అమాంతం వచ్చి మన వద్ద వాలిపోతాడు. అటువంటి చిరంజీవి అయిన భవిష్యత్ బ్రహ్మ.. రుద్రాంశ సంభూతుడైన హనుమద్ జయంతి మాత్రం వైశాఖ బహుళ దశమి రోజున.
🐒హనుమంతుడ్ని రామాయణంలో ఒక పాత్రలా కాక ఒక పరబ్రహ్మ స్వరూపంగా దర్శించిన మహర్షి పరాశరుడు. ఆయన వ్యాస భగవానుని తండ్రి. అతడు అందించిన మహా పవిత్ర గ్రంథం పరాశర సంహిత. అందులో చెప్పిన శ్లోకమే మనకు ఆంజనేయ జయంతి జరుపుకోవడానికి ప్రమాణం. ఇక పరాశర సంహిత ప్రకారం వైశాఖ మాసంలో అమావాస్యకు ముందు వచ్చే దశమి నాడు హనుమాన్ జయంతి జరుపుకోవటం తెలుగు ప్రాంతంలో తరతరాలుగా వస్తోంది. మన రామాలయాలు, హనుమదాలయాలు వైశాఖ బహుళ దశమినాడు మహోత్సవాలకు కేంద్రాలవుతాయి.
*శివుడే అంజనేయుడుగా జన్మించాడు*
🐒ఒక్కసారి ఆంజనేయ అవతరణంలోకి తొంగిచూస్తే హనుమ రుద్రాంశ సంభూతుడు. ఆయన శివుడే! ఒకానొక సమయంలో గార్ధభాసురుడు అనే రాక్షసుడ్ని సంహరించాల్సి వస్తే విష్ణువు ఆ పనికి పూనుకున్నాడట. కానీ, శంకరుడు ఆ పని నారాయణుడు చేయలేడని పందానికి దిగాడట. చివరకు, గార్ధభాసురుని గోవిందుడే హతమార్చాడు. పందెంలో తాను ఓడిపోయినందుకు కైలాసనాథుడు వైకుంఠధామునికి దాస్యం చేస్తానని అన్నాడు. కానీ, లక్ష్మీపతి ఆ అవసరం వచ్చినప్పుడు చేద్దువుగాని అని మహాదేవునికి చెప్పాడు.
🐒రావణాసుర వధకి విష్ణువు రాముడై వచ్చే ముందు ఇతర దేవతలు అందరూ తమతమ అంశలతో భువిపై వానర, భల్లూకాలుగా జన్మించారు. వారిలో ఒకడిగా పరమ శివుడు తన అంశని అవతరింపజేశాడు. ఆ రుద్రాంశ స్వరూపుడే మన ఆంజనేయుడు! ఆయన పుత్రుడి కోసం తపమాచరించిన కేసరీ సతీ అయిన అంజనా దేవీ గర్భంలో వాయు దేవుని వరంగా ప్రభవించాడు. పైగా హనుమ జననం మన తిరుమల కొండల్లోనే జరిగింది. ఇప్పటికీ ఏడు కొండల్లో ఒక దానికి అంజనాద్రి అనటం అందుకే! అక్కడే ఆంజనేయుని తల్లి నిష్ఠగా తపస్సు చేసి వాయు దేవుని వరంతో మహావీరుడ్ని తనయుడుగా పొందింది.
🐒హనుమంతుడు పెరిగి పెద్దవాడై వాలి తమ్ముడైన సుగ్రీవునికి మంత్రి అయ్యాడు. వాలి భయంతో భార్యని, రాజ్యాన్ని వదిలి కొండపై బ్రతుకుతోన్న సుగ్రీవుడికి మళ్లీ రాజ్యం, భార్య, మరీ ముఖ్యంగా, రామానుగ్రహం కలిగింది హనుమ కారణంగానే! ఆయన దేవుడుగా భావించే శ్రీరాముడికి కూడా సీతమ్మ జాడ వెదికి పెట్టాడు. ఇలా దేవుడికే సాయం చేసిన భక్తుడు ఆంజనేయుడు తప్ప మరొకరు ఎవరూ మనకు కనిపించరు! శ్రీరాముడంతటి వాడికి భార్యా వియోగం పోగొట్టిన వాడు, తమ్ముడైన లక్ష్మణునికి సంజీవని పర్వతం మోసుకొచ్చి ప్రాణదానం చేసిన వాడు మన సంజీవరాయుడు! రాముడి నుంచీ మోక్షం కూడా కోరని పరమ నిస్వార్థ, మహా పవిత్ర భక్త శిఖామణి ఆంజనేయుడు!
🐒హనుమంతుని దేవుడుగా భావించి పూజించవచ్చు. ఆయన లంకకి వెళ్లి ఒంటరిగా సీతమ్మ జాడ తెలుసుకుని తిరిగొచ్చిన సుందర కథనంలో ఆయన ధైర్య, వీర్య, సాహసాల నుంచీ ప్రేరణ పొందవచ్చు. అలాగే, శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన కర్మఫల త్యాగం కూడా మారుతిలో ప్రత్యక్షంగా దర్శించవచ్చు. ఆయన ఏదీ చేయకుండా ఉండలేదు. అలాగని ఏదీ కూడా ప్రతిఫలంపై దృష్టితో చేయలేదు. రాముని కోసం కర్తవ్యంగా చేశాడు. ఆ కర్తవ్య దీక్ష మనమూ అలవర్చుకుంటే విజయాలు ఉప్పెనలా వస్తాయి. ఓటములు ఎన్నొచ్చినా మనల్ని పెకలించకుండా వాటి దారిన అవి పోతాయి. అందుకే, ఆంజనేయుడ్ని పూజించాలి. అంతకంటే ఎక్కువగా ఆయన గాథలు, వ్యక్తిత్వంలోంచి ఎంతో ఎంతెంతో నేర్చుకోవాలి…
*🐒జై శ్రీరామ్! జై హనుమాన్!🐒*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి