నిరంతర భక్తి భావన - చంద్రశేఖర భారతీ స్వామి శ్రీ చరణులు
శ్రీ గురుభ్యోనమః సభాయై నమః
ఒక శిష్యుడు దూరదేశంనుండి రైలు ప్రయాణం చేసి శృంగేరి వచ్చి అప్పటి శృంగేరి పీఠాధిపతులైన జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారిని దర్శించిన తరవాత వారి సంభాషణ ఇలా జరిగింది.
శ్రీ చరణులు : ఇంటినుంచి నేరుగా వస్తున్నావా? లేక మధ్యలో ఎక్కడైనా ఆగి వస్తున్నావా ?
శిష్యుడు : లేదు స్వామీ నేరుగానే వస్తున్నాను.
శ్రీ చరణులు : మొన్న భోజనం చేసి బయలుదేరి ఉంటావు. రాత్రి భోజనం చేయటానికి వీలు లేదు మరి నిన్నటిమాటేమిటి?
శిష్యుడు : జోలార్పేట స్టేషన్లో రెండుగంటల వ్యవధి దొరికింది. అక్కడే తొందరగా స్నానం చేసి లఘువుగా జపం ముగించుకుని రెండు అరటి పళ్ళు మాత్రం తిన్నాను.
శ్రీ చరణులు : ఓ స్నానం వదలక చేస్తావన్నమాట. మరి పూజ
శిష్యుడు : స్టేషనులో పూజ సాంతం చేయడానికి వీలు లేదు.
శ్రీ చరణులు : ఔను. నిజమే స్టేషనులో పూజ సాంతం చేయడినికి కుదరదు. మరి క్లుప్తంగా?
శిష్యుడు : పూజచేయటానికి వ్యవధి ఎక్కడ?
శ్రీ చరణులు : మరి స్టేషనులో అరటిపండ్లు తినడానికి వ్యవధి ఉన్నది కదా?
శిష్యుడు : పూజ అంత సులభంగా చేయడానికి వీలు లేదు కదా?
శ్రీ చరణులు : ఎందుకు కాదు? నువ్వు తెచ్చిన అరటిపళ్ళు తినడానికి ముందు దేవతార్చనకు అర్పించి తరవాత ప్రసాదంగా స్వీకరించవచ్చును. కాదా?
శిష్యుడు : నేను అలా చేయలేదు. మూర్తి పెట్టెలోపెట్టి నా మూటలో ఉన్నది కదా.. బయటకు తీస్తే కదా నివేదనం చేసేది.
శ్రీ చరణులు : నీవు మూర్తి పెట్టెలో పెట్టి బుట్టలో ఉన్నందువల్ల నువ్వు చేసే నివేదనం ఆ మూర్తి గ్రహించలేదని నీ భావన. నువ్వు ఉపాసించే దేవతను గూర్చి నీకు తెలిసిందింతేనా?
శిష్యుడు : మీరు చెప్తుంటే అర్థం అవుతోంది. నేను నివేదన చేసి ఉండవచ్చు........
శ్రీ చరణులు : ఇంతా చెప్పడం...... మన స్థితి ఎటువంటిదైనా ఉన్నదానిలో మన కర్తవ్యం చేయాలి అని. భగవంతుడు సర్వ వ్యాపి. విస్తారంగా పూజ చేయడానికి వీలు లేనిచోట నిండు మనసుతో భగవంతుని స్మరిస్తే చాలు. ఆయన అపరిమిత అనుగ్రహాన్ని వర్షిస్తాడు.
శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య పరమ హంస పరివ్రాజకాచార్య చంద్రశేఖర భారతీ స్వామి పాదారవిందములకు నమస్సుమాంజలులతో....
--అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి