1, జూన్ 2024, శనివారం

మనసార స్మరిస్తే

 జై శ్రీమన్నారాయణ..!

01.06.2024, శనివారం



*“అజాడ్యం వాక్ పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ ”* హనుమంతుని మనసార స్మరిస్తే చాలట బుద్ధి, శరీరబలం, యశస్సు, చెదరని ధైర్యం, ఎవ్వరి వలన భయపడకపోవటమూ, ఆరోగ్యము కలుగుట, పనిలో చురుకుదనం, వాక్కు యొక్క సామర్థ్యం కలుగుతాయని ప్రమాణం. మన భారతీయ సంప్రదాయాలను మనకెన్నో పండుగలున్నా విశేషమైన భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో శ్రీ హనుమజ్జయంతి వొకటి.


 *“వైశాఖే మాసి కృష్ణాయాం దశమి మంద సంయుతా\ పూర్తప్రోష పదాయుక్తా అధనైదృత సంయుతా తసాం మధ్యాహ్ననే వాయాం జనయా మాస వైసుతమ్”* 

అంటే ఆంజనేయస్వామి వైశాఖమాసం, కృష్ణపక్షం, దశమి శనివారం, పూర్వాబాధ్ర నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో నైదృతీ నామయోగం గ్రహాలన్నియు శుభ స్థానాలలో సంచరిస్తున్న మధ్యాహ్న సమయంలో కేసరి ఆంజనాదేవి

ముక్తాఫల గర్భమున జన్మించాడు. ఆనాటి నుండి వైశాఖ బహుళ దశమినాడు *“హనుమజ్జయంతి”* ని జరుపుకుంటాం. 


హనుమ మాతృభక్తి పరాయణుడు. మనం ఆ సుగుణాన్ని అలవరచుకుంటే వృద్ధాశ్రమాలే ఉండవు. పావని ప్రభుభక్తిపరుడు. ప్రభువంటే రాజు, యజమాని. హనుమకి ప్రభువు సుగ్రీవుడు. సుగ్రీవాజ్ఞకు తిరుగులేదు. సీతజాడ కనిపెట్టమని ఆదేశించగా.. ఆంజనేయుడు సముద్రాన్ని దాటి, సీతమ్మ జాడ కనిపెట్టాడు. అటు రామకార్యాన్ని, ఇటు రాజాజ్ఞను నెరవేర్చాడు. ఆ కార్యదీక్షను, ధైర్యసాహసాలను అలవరచుకోవాలి. ఆంజనేయస్వామి- స్వామిభక్తి ప్రపూర్ణుడు. స్వామి అంటే ఎవరు? సాక్షాత్తు శ్రీరాముడు. తన వినయం, విధేయత, భక్తి, సేవలతో స్వామిని అలరించాడు. ఆంజనేయుడిపట్ల అంత నమ్మకం ఉన్నందునే తన అంగుళీయకాన్ని ఇచ్చి పంపాడు రాముడు. అతడే కార్యసాధకుడన్న మహావిశ్వాసం రాముడిది.


అడుగడుగునా ఎదురైన ఆటంకాలన్నిటినీ అధిగమించాడు. సీతా మహాసాధ్విని కలిసి,  ఆనవాలును చూపాడు. ఆ తల్లిని ఓదార్చాడు.తిరిగి రాముని చేరుకుని, ధైర్యం చెప్పి, రావణ సంహారంలో ఎన్నో విధాల సహకరించాడు. సీతారాములను కలిపాడు. అంతేనా! వారిని తన హృదయంలో స్థిరపరచుకున్న భక్తాగ్రేసరుడు అంజనీపుత్రుడు. పరోపకారానికి, లోకశ్రేయస్సుకి మరో రూపం ఆంజనేయుడు. లక్ష్మణుని బతికించడానికి ఏకంగా సంజీవని పర్వతాన్నే పెకలించుకుని వచ్చాడు. దుష్టసంహారం చేసి, జగత్తుకు ఎనలేని మేలు చేకూర్చాడు. నిత్యం రామనామ స్మరణతో భూలోకాన్నే పునీతం చేశాడు. రామభక్త హనుమంతుని ఆరాధనతో ఇన్ని సద్గుణాలు అలవడతాయి.

కామెంట్‌లు లేవు: