1, జూన్ 2024, శనివారం

అర్జునుని ముఖం

 స్వజనులైన యాదవులను, శ్రీకృష్ణుని చూడాలని అర్జునుడు ద్వారకు వెళ్లి చాలా రోజులు పిమ్మట తిరిగి వచ్చాడు.


 అర్జునుని ముఖం తేజో హీనంగా ఉంది. అది చూసి ధర్మరాజు అర్జునా ద్వారక నుండి సుఖంగా వచ్చావా. ద్వారకా నగరంలొ అందరూ కులాసాగా ఉన్నారు కదా దేవకి వసుదేవులు బలరామకృష్ణులు సుఖులే కదా. వారంతా మన యందు మైత్రితో మనం క్షేమం కోరుతున్నారా. 16,108 భార్యలు శ్రీకృష్ణ సేవ చేస్తూ అన్యోన్యమైన మైత్రి గలవారై చరిస్తున్నారా. ఈ కుశల వార్త వినే వరకు నా మనసు ఆత్రుత చెందుతూ ఉంది. నీ ముఖం చూస్తే శ్రీహినంగా కనిపిస్తోంది.


నిన్ను ఎవరు అవమానించలేదు కదా ఎక్కడా ఎవరూ నిన్ను నిందించలేదు కదా. ఎవరినైనా ఏ వస్తువైనా ఇస్తాన్ని వాగ్దానం చేసి ఇవ్వలేకపోయావా. బ్రాహ్మణులు బాలురు వృద్ధులు, రోగులు, స్త్రీలు మొదలైన వారు ఎవరైనా శరణంటే వారిని రక్షించలేనని విడిచి వేయలేదు కదా. 


(ఇక్కడ విశేషమేమిటంటే రాజు ప్రజల పట్ల ఏ విధంగా విధేయుడై ఉండాలి అని ధర్మరాజు ద్వారా అర్జునుని ప్రశ్నించాడు.)


నీ ముఖం చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది ఇంతవరకు ఎట్టి ఆపత్తులు కలిగిన నీ ముఖం ఇలా లేదే అని ప్రశ్నించాడు ధర్మరాజు.

కామెంట్‌లు లేవు: