సర్వస్య శరణాగతి
(Importance of unwavering faith and complete surrender)
కరిరాజును ఊరికే బ్రోచాడా ఆ శ్రీహరి? మదంతో, కామావేశంలో ఉన్న ఆతని దుర్గుణాలన్నీ స్థానబలిమి లేని నీట మకరికి చిక్కి, పోరాడినప్పుడు అణగి, శరీరబలమంతా నశించి కృంగి కృశించి, పాపకర్మఫల సంచయమంతా పటాపంచలయ్యే సమయంలో కలిగే భావన -
లావొక్కింతయి లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప నితః పరంబెరుగ మన్నింప దగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా
ఇలా శరణాగతితో, ఆర్తితో రక్షింపుము అన్న స్థితి రావటానికి చాలా సమయం పట్టింది. మనకూ అంతే. నేను, నా వల్ల, నన్ను మించిన వాడు లేడు అన్న ఆలోచనలో పరమాత్మ ఉలకడు పలకడు. అన్నీ వదిలి, సమస్తము ఆయనే అన్న భావనతో శరణు కోరితే ఆయన ఒక్క క్షణం కూడా ఆగడు.
సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముం చేదోయి సంధింపడే
పరివారంబును జీరడభ్రగపతిన్ మన్నింపడాకర్ణికాం
తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాదప్రోద్ధిత శ్రీ కుచో
పరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై
పూర్తిగా తనను విశ్వసించి ఆర్తితో ప్రార్థించిన గజరాజును కాపాడటానికి ఒక్క ఉదుటున బయలుదేరాడు ఆ హరి. అప్పుడు ఆయన మనసులో ఒక్కటే - ఆ గజరాజుని కాపాడటం. మిగిలినవన్నీ పట్టవు - లక్ష్మీదేవి చెప్పడు, శంఖ చక్రములు చేతులకు అలంకరించుకోడు, పరివారానికి చెప్పడు, గరుడుని మాట వినడు, కేశములు సవరించుకోడు, లక్ష్మీదేవి పైటను సరిగా విడిపించుకోవాలన్న ఆలోచనే రాదు..కేవం ఆ భక్తుని కాపాడటమొక్కటే ఆయన ధ్యేయం, ధ్యాస.
పోతన గారి వర్ణనలోని వివరాల కన్నా అంతరార్థం భక్తుల ఆర్తిపై పరమాత్మ దృష్టి ఎలా ఉంటుంది అన్నది మనం గ్రహిస్తే మనం ఎలా ఉండాలో అర్థమవుతుంది. కావవే వరదా! నా వల్ల ఇంక కావటం లేదు (నేను, నావల్ల అన్న అహంకారం నశించినప్పుడే ఆ భావన కలుగుతుంది) అన్నది త్రికరణ శుద్ధిగా అనుభవానికి వచ్చినప్పుడు సంరక్షించు భద్రాత్మకా అన్న భావన ఉప్పొంగినప్పుడు ఆయన వింటాడు, కాపాడి తీరతాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి