6, మార్చి 2021, శనివారం

మన మహర్షులు - 41

 మన మహర్షులు - 41


శుక మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷


పరమ పవిత్రమైన భారత బ్రహ్మర్షుల్లో శ్రీశుక మహర్షి చాలా గొప్పవాడు. వేదవ్యాస మహర్షి తపస్సు చేసి పొందిన కొడుకు. శ్రీశుక మహర్షిని పోలిన మహర్షి త్రిభువనాల్లోనూ ఎక్కడ వెదికినా లేడు.


పూర్వం వేదవ్యాస మహర్షి 'కర్ణికారం' అనే వనంలో పరమేశ్వరుణ్ణి గురించి తపస్సు చేసి పంచభూతాలు సమానమైన కొడుకు కావాలని కోరుకుని వరం పొందాడు.


ఆయన కోరుకున్నట్లుగానే ఘ్నతాచి అనే చిలుక రూపంలో వున్న అప్సరస కారణంగా శ్రీశుకుడు పుట్టాడు.


శుక మహర్షి పుట్టినప్పుడు ఆకాశగంగ వచ్చి స్నానం చేయించింది. ఆకాశం నుంచి కృష్ణాజినం, దండం వచ్చాయి. దివ్యదుందుభులు మ్రోగాయి, దేవతలు గానం చేస్తూ, పుష్ప వర్షం కురిపించారు. పార్వతీ సహితంగా పరమేశ్వరుడు వచ్చి ఉపనయం చేశాడు. ఇంద్రుడు కమండలం, దేవతలు ఎప్పుడూ మాయని దివ్య వస్త్రాలు ఇచ్చారు.


శ్రీశకుడికి పుట్టకతోనే వేదాలు వచ్చేశాయి. అయినా బృహస్పతి దగ్గర మిగిలిన విద్యలన్నీ నేర్చుకున్నాడు. 


కొంతకాలం తర్వాత వ్యాసుడు తన కొడుకు శుకుణి మోక్ష మార్గం గురించి తెలుసుకోమని జనక మహారాజు దగ్గరకి పంపించాడు. 


కాని నడిచి మాత్రమే వెళ్ళమని

చెప్పాడు వ్యాస మహర్షి.


తండ్రి చెప్పిన ప్రకారం శ్రీశుకుడు మిథిలా నగరానికి వెళ్ళాడు. ద్వారపాలకులు మొదట లోపలికి పంపించలేదు, తర్వాత పంపారు. 


. జనక మహారాజు మంత్రితో సహా ఎదురొచ్చి అర్హ్య పాద్యాలిచ్చి లోపలికి తీసుకెళ్ళాడు. బంగారు సింహాసనం మీద కూర్చోపెట్టి పూజచేశాడు.


జనక మహారాజుని మోక్షమార్గం గురించి చెప్పమన్నాడు శుక మహర్షి జనకమహారాజు మోక్షమార్గం గురించి విపులంగా శుక మహర్షికి చెప్పి పంపాడు. 


శ్రీశుకుడు తండ్రి వలన కాలావయవ నిరూపణ, చతుర్యుగ ధర్మాలు, బ్రహ్మం దాని విజ్ఞానం, సర్వ వర్ణ ధర్మాలు, దానగుణ ప్రాశస్త్యం, మైత్రి గుణలాభం, ఇంద్రియ నిగ్రహం ఇలాంటివెన్నో నేర్చుకున్నాడు.


తండ్రితో అన్ని విషయాల గురించి చెప్పించుకుని ఆచరించి బ్రహ్మర్షియై వెలిగాడు శుకుడు. ఆత్మజ్ఞానంతో బాహ్య ప్రపంచం మర్చిపోయి శరీరం మీద దుస్తులు కూడా లేకుండా వుండేవాడు.


తక్షకుడి విషంతో ఏడు రోజుల్లో మరణించేలా శాపాన్ని పొందిన పరీక్షిత్తు దగ్గరకి శ్రీశుకుడు వెళ్ళి అతనికి ముక్తి కలిగేలా తన తండ్రి రాసిన భాగవత కథ వినిపించాడు .మిగిలివున్న ఏడు రోజులు వేరేది ఆలోచించక భగవంతుడి యందే మనస్సుంచి ధ్యానం చెయ్యమని చెప్పి పరీక్షిత్తుకు బ్రహ్మలోకం కలిగేలా చేశాడు.


 ఒక రోజు నారద మహర్షి ఆశ్రమానికి వచ్చి శుకుణ్ణి నీకేంకావాలో అడగమన్నాడు 


ఈలోకంలో పుట్టిన నాకు ఏది మంచో చెప్పమన్నాడు శుక మహర్షి.


యోగసిద్ధి మంచిదని నారదుడు చెప్పగానే శుక మహర్షి నారాదునికి ప్రదక్షిణం చేసి తండ్రికి చెప్పి కైలాస పర్వతం మీద తపస్సు చేసి యోగ సిద్ధి పొందాడు.


నారదుడు శ్రీశుకుణ్ణి చూడ్డానికి వెడితే అతనికి ఆత్మయోగం చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోయాడు శుకుడు. మిగిలిన సిద్దులు ఆశ్చర్యపోయారు. అలా వెళ్ళిపోతూ మృగాలికి పక్షులకి, పర్వతాలకి తన తండ్రి వచ్చి శుకా! అని పిలిస్తే ఓయని పలకమని చెప్పాడు శుక మహర్షి.


శుకుడు ఆకాశ గంగ మీద ఆకాశంలో వెడుతూ వుంటే దాంట్లో స్నానం చేస్తున్న స్త్రీలు అతన్ని చూసి సిగ్గుపడలేదు, కాని అదే వ్యాసుడు వెడుతుంటే సిగ్గుపడ్డారు. అది చూసిన వ్యాసుడికి తనని చూసుకుని తనకే సిగ్గనిపించింది. ఎందుకంటే శ్రీశుకుడు పసిబిడ్డ మనసులాంటి మనసున్నవాడు, ఆడ, మగ ఎవరో తెలియనివాడు.


వ్యాసుడు శుకుడు కనిపించక శుకా! అని పిలుస్తే 'ఓ'యని వినిపింపిందిట. ఇంతలో ఈశ్వరుడు వచ్చి బాధపడుతున్న వ్యాసుణ్ణి ఓదార్చి నీకు కావలిసనట్లే నీ కొడుకు చాలా గొప్పవాడయ్యాడు, ఇంకెందుకు బాధపడతావని చెప్పి పంపించాడు.


శుకుడిని మించిన యోగీశ్వరుడు, తత్వజ్ఞుడు,తపస్వి మూడులోకాలలో మరి లేరు..

అంతటి మహానీయ మహర్షికి మనసులోనే పాదాభివందనం చేద్దాం...🙏🙏


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

ప్రయాణములకు

 *ప్రయాణములకు అనుకూల సమయాలు*

మానవుడు తన నిత్యజీవితంలో ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందన్నట్లు ప్రయాణాలు ఎప్పుడు పడితే అప్పుడు చేయడం మంచిది కాదు. ప్రయాణాలు ఎప్పుడు ఎలా చేయాలో శాస్త్రాలు వివరించాయి.సుదూర ప్రయాణాలకు సోమ, బుధ, గురు, శుక్రవారాలు శుభప్రదం. అలాగే, విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి ప్రయాణానికి శుభ తిథులుగా పరిగణించాలి.

ముఖ్యంగా దీర్ఘకాల ప్రయాణాలకు తీర్థయాత్రలు చేయటానికి అనువైన ముహూర్తాలను నిర్ణయించుకుని బయలుదేరటం మంచిది.అలాగే శుక్ర, ఆది వారాలు పశ్చిమ దిశ ప్రయాణం మంచిది కాదు. గురువారం దక్షిణ దిక్కుకు ప్రయాణం చేయరాదు. భరణి, కృత్తిక, ఆర్థ్ర, ఆశ్లేష, పుబ్బ, విశాఖ, పూర్వాషాఢ, పూర్వభాద్ర అనే స్థిర లగ్నాల్లో ప్రయాణమే పెట్టుకోరాదు.విదియ, తదియ రోజులల్లో కార్యసిద్ధి, పంచమి నాడు శుభం.

సప్తమి నాడు ఆత్మా రాముడు సంతృప్తి చెందేలా అతిథి మర్యాదలు జరుగుతాయి.దశమిరోజు ధనలాభం. ఏకాదశి కన్యలాభమంత సౌఖ్యం.త్రయోదశి శుభాలను తెస్తుంది.


ఇక శుక్ల పాడ్యమి దుఃఖాన్ని కలిగిస్తుంది.చవితి నాడు ఆపదలు వచ్చే అవకాశం.షష్ఠీ నాడు అకాల వైరాలు. అష్టమి నాడు అష్టకష్టాలు. నవమినాడు నష్టాలు. వ్యధలు కలుగుతాయి. ద్వాదశి నాడు మహానష్టాలు.బహుళ చతుర్ధీనాడు ప్రయాణం చేస్తే చెడును కలిగిస్తుంది.శుక్ల చతుర్దశినాడు ఏ పని కాదు.


ఇక మేషం, మిధునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకరం, మీనం వంటి శుభ లగ్నాలలో ప్రయాణం చేపట్టడం మంచింది.ముఖ్యంగా సోమవారం తూర్పు దిశగా ప్రయాణాలు చేయకూడదు.ప్రయాణ ముహూర్తాలకు ఆది, మంగళ, శనివారాలు పాఢ్యమి, పంచ పర్వాలు, ద్వాదశి, షష్ఠి, అష్టమీలలో ప్రయాణాలు చేయకూడదు.


అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, అనూరాధ, శ్రవణం, ధనిష్ఠ, రేవతి శుభ నక్షత్రాలుగా పరిగణిస్తున్నారు.అందువల్ల ఈ నక్షత్ర కాలంలో ప్రయాణాలు ఆరంభించడం మంచిది.


పౌర్ణమి, అమావాస్య నాడు ప్రయాణాలు


మానవుడి మనసుపై గ్రహాల ప్రభావం ఉంటుందని తెలుసుకున్నాము. చంద్ర గ్రహ ప్రభావం మనసుపై స్పష్టంగా ఉంటుంది. పౌర్ణమినాడు చంద్రుడు పూర్ణ కళలతో ఉంటాడు. చంద్రుడు జలానికీ, లవణానికీ, మనసుకీ అధిపతి. అందుకే సముద్రంలో పౌర్ణమినాడు ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి.అలాగే మన శరీరంలో కూడా నీరు, లవణాలు, మనసు ఉంటాయి కదా. వీటికీ అధిపతి చంద్రుడే కనుక మన శరీరానికీ ఆటుపోట్లు ఎక్కువగా వుంటాయి. ఆయితే ఇవి అంతగా పైకి కనబడవు.


మన శరీరంలో ఆటుపోట్లెక్కువగా ఉన్నప్పుడు మనం ఏ విషయంలోనైనా సరైన నిర్ణయం తీసుకోలేక పోవచ్చు. ప్రయాణాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటం ప్రయాణ సమయంలోకానీ, మన పనుల్లోకానీ చాలా అవసరం.అందుకే,ఆ నిర్ణయాలు తీసుకోలేని సమయంలో ప్రయాణం చేయవద్దని చెబుతారు. మొత్తానికి పూర్ణిమ రోజు పనులు ఏవి కావు.


ఇక అమావాస్యనాడు చంద్రుడు కనిపించడు.


దీంతో రాత్రి పూట వెలుతురు చాలా తక్కువగా వుంటుంది.అందుకే అమావాస్నాడు అర్ధరాత్రి ప్రయాణాలు చేయకూడదంటారు.వెలుతురు తక్కువగా ఉండటం మూలంగా దారి సరిగ్గా కనబడక ప్రమాదాలు జరగవచ్చు, చీకట్లో ఏదైనా చూసి ఇంకేదో అనుకుని భయపడవచ్చు,చీకట్లో దొంగల భయం కూడా ఉండవచ్చు.మనం ప్రయాణం చేసే వాహనం ఏ కారణం వల్లనైన ఆగినా ఇబ్బంది పడవచ్చు.


రాత్రి పూట, అందులో చీకటి రాత్రి అలా జరిగితే ఎవరికైనా ఇబ్బందే కదా, అందుకే అమావాస్య అర్ధరాత్రి ప్రయాణాలు, అందులోనూ ఒంటరిగా అసలు ప్రయాణం చేయవద్దు.మొత్తానికి అమావాస్యనాడు ప్రయాణం చేస్తే ఆపదలు వస్తాయని శాస్త్రం చెబుతోంది.అలాగే జన్మ జాతకరిత్య నైదనతారరోజు ప్రయాణం చేయకూడదు.మనం ప్రయాణం ముగించుకుని మన ఇంటికైన సరే తొమ్మిదవ రోజు తిరిగి ఇంటికి రాకూడదు. శాస్త్రం,పెద్దలు చెప్పిన మాటలు వింటే మంచి జరుగుతుంది.

మొగలిచెర్ల

 *గాలిచేష్ఠ..గురువారం దర్శనం..*


"స్వామివారి సమాధి దర్శించుకొని..ఒక్కసారి ఆ అవధూత పాదుకులకు నమస్కారం చేసుకొని వెళ్లిపోతానండీ..ఆ ఒక్క కోరికా తీర్చండి చాలు.." అని ఆ మధ్యవయస్కుడు నన్ను ప్రాధేయపడుతూ అడిగాడు.."మీరేమీ కంగారు పడకండి..మంటపం లోపల సుమారు ఇరువై మంది స్వామివారి సమాధి దర్శనం కొఱకు వేచి వున్నారు..వాళ్లకు అర్చన కూడా చేయించాలి..వరుసక్రమం లో మా సిబ్బంది పంపుతున్నారు..మీరూ లోపలికి వెళ్లి కూర్చోండి..మిమ్మలనూ పంపుతారు..మీ వంతు రాగానే అర్చకస్వామితో సమాధి దర్శనం కొఱకు వచ్చానని చెప్పండి..వారు మిమ్మల్ని స్వామివారి సమాధి వద్దకు పంపుతారు.." అని చెప్పాను.."అలాగేనండీ..మరొక్కమాట..నేను బైటకు వచ్చిన తరువాత మీతో కొన్ని విషయాలు చెప్పుకోవాలి..నాకోసం ఓ పదినిమిషాల సమయం కేటాయించండి.." అన్నాడు.."అలాగేనండీ.." అన్నాను..


ఆరోజు ఆదివారం..ఆదివారం ఉదయం పది గంటల దాకా స్వామివారి సమాధి దర్శించుకునే భక్తుల హడావిడి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది..ఆ సమయం లోనే పై వ్యక్తి తో సంభాషించాల్సి వచ్చింది..మరో గంట గడిచిపోయింది.."ప్రసాద్ గారూ..మీ సిబ్బంది సహకారం తో చక్కగా దర్శనం చేసుకున్నాను..స్వామివారి పాదుకలూ తాకి నమస్కారం చేసుకున్నాను..తృప్తిగా వుందండీ..ఇప్పుడు మీతో మాట్లాడొచ్చా..?" అని అతను అడిగాడు.."చెప్పండి.." అన్నాను..


"నా పేరు ఏడుకొండలు..నెల్లూరు లో చిన్న వ్యాపారం పెట్టుకొని వున్నాను..నా కుటుంబపోషణకు ఇబ్బంది లేదు..ఇద్దరు పిల్లలు..పెద్దది అమ్మాయి..ఇంటర్ చదువుతున్నది..రెండోవాడు అబ్బాయి తొమ్మిదో తరగతి..మా అమ్మా నాయనా కూడా మాతోనే వుంటారు..అందరం కలిసున్నాము..గత రెండేళ్లుగా మా ఆవిడ ప్రవర్తన లో మార్పు వచ్చిందండీ..ఉన్నట్టుండి కేకలు పెడుతుంది..ఏడుస్తుంది..క్రింద పడి దొర్లుతుంది..మళ్లీ ఒక గంట లోపల మామూలు గా మారిపోతుంది..ఏమీ అర్ధం కాలేదు..డాక్టర్ వద్దకు తీసుకెళ్ళాను..పరీక్షలు చేశారు..మానసిక వైద్యం చేయించాలి అన్నారు..అదీ చేయించాను..ఫలితం కనబడలేదు..ఏం చేయాలో దిక్కు తోచలేదు..పిల్లలు, నేను, మా అమ్మా నాన్న..అందరమూ అల్లాడిపోతున్నాము..పిల్లల చదువు దెబ్బతింటున్నది..ఆరునెలల క్రితం నా స్నేహితుడు నారాయణరెడ్డి అనే అతను, ఒక్కసారి మొగిలిచెర్ల వెళ్లి  ఆ దత్తాత్రేయ స్వామి వారి సమాధి వద్ద మొక్కుకో..ఇటువంటి గాలి చేష్టలన్నీ త్వరగా తగ్గుతాయి అని చెప్పాడు..చివరి ప్రయత్నం అనుకున్నాను..ఒక గురువారం పొద్దున్న మేమందరం నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చి..స్వామివారి సమాధి దర్శనం చేసుకొన్నాము..ఆరోజు మీరు లేరు..ఆ రాత్రికి ఇక్కడే మంటపం లో నిద్ర చేసాము..రోజూ మా భార్యలో ఒక్కసారి కనబడే ఆ విపరీత ప్రవర్తన..ఆరోజు దాదాపు మూడు నాలుగు సార్లు కనబడింది..తెల్లవారి శుక్రవారం నాడు కూడా ఇక్కడే ఉన్నాము..స్వామివారి సమాధి మందిరాన్ని శుభ్రం చేస్తుంటే..నేనూ పాల్గొన్నాను..శుక్రవారం నాడు కూడా అదే తంతు..ఆ సాయంత్రం మేము తిరిగి నెల్లూరు వెళ్లిపోయాము..వెళ్లేముందు స్వామివారి విభూతి తీసుకొని వెళ్ళాను..ఇంటికి వెళ్లిన తరువాత ఒక వారం పాటు నరకం చూసాము..నా భార్య జబ్బు తగ్గకపోగా..ఇంకా పెరిగింది..స్వామివారి విభూతి ఆమె నుదుటిపై పెట్టాను..చిత్రంగా ఒక్క అరగంటలో మామూలు మనిషి అయింది..నాకు ఆ విభూతి పై గురి కుదిరింది..రోజూ పెట్టుకోమని చెప్పాను..మొదటి వారం మమ్మల్ని ఎంత ఏడిపించిందో..ఆ మరుసటి వారం ఒక్కసారి కూడా తన గాలి చేష్ట కనబడలేదు..పూర్తిగా స్వామినే నమ్ముకున్నాము..ఆ తరువాత ఆమెను తీసుకొని రెండుసార్లు వచ్చి వెళ్ళాను..ఇప్పుడు తాను మామూలు గా వుందండీ..పిల్లలు కూడా స్వామిదగ్గరకు వెళ్ళొద్దాము నాన్నా అంటున్నారు..ఇప్పుడు పిల్లలకు పరీక్షలు ఉన్నాయండీ..నేను మాత్రం స్వామివారి కి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను..ఎప్పుడూ ఆదివారం నాడు రాలేదండీ..ఇంత జనం ఉంటారని అనుకోలేదు..అందువల్ల ఉదయం కొద్దిగా కంగారు పడ్డాను.." అన్నాడు.."ప్రసాద్ గారూ మేము మొదటిసారి స్వామివారి సమాధిని గురువారం నాడు దర్శించుకున్నాము..ఆరోజు మధ్యాహ్నం ఇక్కడే స్వామివారి అన్నప్రసాదం తీసుకున్నాము..అలాగే శుక్రవారం నాటి మధ్యాహ్నం కూడా స్వామివారి వద్దే భోజనం చేసాము..ఆ తరువాత రెండు సార్లూ గురువారమే వచ్చాము..ఇక్కడే ప్రసాదం తీసుకున్నాము..మా ఆవిడ గాలిచేష్ట పూర్తిగా పోవడానికి మేము గురువారం నాడు రావడం కూడా ఒక కారణం అని అనిపిస్తోంది..అందువల్ల ప్రతి సంవత్సరం ఒక గురువారం అన్నదానానికి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాను..వచ్చే గురువారం నాడు నాకు ఆ అవకాశం ఇవ్వండి.." అన్నాడు..


"అలాగేనండీ..సంవత్సరం లో మొత్తం 52 గురువారాలు..52 మందిని ఎంపిక చేసుకొని..వాళ్ళ సహకారం తో అన్నదానం చేయించాలని ఒక సంకల్పం మీవల్ల కలిగింది..అలాగే శుక్రవారాలు కూడా..చూద్దాం..స్వామివారు కృప చూపితే..అది కూడా సాకారం అవుతుంది.." అన్నాను.."అలా అయితే..ఒక శుక్రవారం కూడా మా కొఱకు కేటాయించండి.." అన్నాడు ఏడుకొండలు..


ఏడుకొండలు సంసారం బాగు పడింది..అంతేకాక..ఏడుకొండలు ద్వారా కొత్త ప్రతిపాదన రూపుదిద్దుకుంది..ఇక అమలు చేయడానికి సన్నద్ధం కావాలి..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

షష్టిపూర్తి ఘనంగా

 🙏🙏🙏🙏🙏

పెళ్లి సాధారణంగా జరగాలి షష్టిపూర్తి ఘనంగా జరగాలి.

     

కొంచం వీలు కల్పించుకొని ప్రతిఒక్కరూ తెలుసుకోవలసిన విషయం.


1. మానవుని  సంపూర్ణ ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని జ్యోతిష్య శాస్త్రం  చెబుతున్నది. 


2. 60 సంవత్సరాలు నిండినప్పుడు  చేసుకునేది షష్టిపూర్తి.

3. ప్రతివారికీ మృత్యువు 60 వ యేట ఉగ్రరథుడు అను పేరుతో , 70 వ యేట భీమరథు డు అను పేరుతో, 78 వ యేట విజయరథు డు అను పేరుతో ఎదురుచూస్తుంటాడు.

      ఎక్కువ మంది ఈ సంవత్సరం లలో గండం...

4. ఆరోగ్య సమస్యలకు తట్టుకోవటానికి  చేసే శాంతి ప్రక్రియ షష్టిపూర్తి.


5.బృహస్పతి , శని 30 సంవత్సరాలకు  మానవుని జన్మకాలంలో ఉన్నరాశికి చేరటానికి 60 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళిద్దరూ తాము బయలుదేరిన రాశికి చేరుకోవటంతో మానవుని జీవితం మరలా ప్రారంభమవుతుంది. తిరిగి జీవితం ప్రారంభం ఐనట్లు సంకేతం.


6. మానవుడు పుట్టిన  తెలుగు సంవత్సరాలు (60) నిండుతాయి కనుక షష్టిపూర్తి. 


7. షష్టిపూర్తి  సందర్భంగా  ఆయుష్కామన యజ్ఞము చేస్తారు. ఆయువును కోరి చేయు యజ్ఞము ఆయుష్కామనయజ్ఞము అని అంటారు.


8. పెద్దలు ఈ ఆయుష్కామన యజ్ఞాన్ని చేసే పధ్ధతిని ఇలా చెప్పారు.


9. ‘’  తెల్లని నూతన వస్త్రముపై తూర్పు దిక్కుగా 12 గీతలు గీచి వాటిమీద అయిదు గీతలు గీసి మొత్తము 60 గదులు వచ్చే విధంగా చేస్తారు . వరుసకు 12 అయిదు వరుసలు తూర్పు దిక్కున బియ్యం పోసి కలశం ఉంచుతారు. ప్రభవ నుంచి క్షయ వరకు 60 సం " అధిదేవతలతో ఆవాహన చేస్తారు. దక్షిణాయన ఉత్తరాయణ దేవతలను, 6 ఋతువులను 12 మాసములను ఆవాహన చేస్తారు. పక్షములను,తిదులను వారములను - వారదేవతలు అయిన - సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని ని ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు - అగ్ని, జలము , భూమి, విష్ణువు ఇంద్రుడు, ప్రజాపతి లని ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు శివుడు, దుర్గ, కుమారస్వామి, బ్రహ్మ - ఇంకా ఏకాదశ రుద్రులు, నక్షత్ర దేవతలు 27 యోగములు 11 కరణములు ఇలా అందరి దేవి దేవతా స్వరూపాలని మృత్యుంజయుని ఆవాహన చేసి బ్రాహ్మణోత్తములు మంగళాచరనములతొ వేదయుక్తంగా ఈ కార్యక్రమం జరిపిస్తారు. అపమృత్యు నివారణార్థం హోమాల్ని, జపాలని కుడా చేస్తారు.తదుపరి బ్రహ్మలను సత్కరించి బంధుమిత్రులతో విందు ఆరగిస్తారు. 


10. పూర్వకాలంలో  పురుషుడు ఏ వేడుక చేసుకున్నా భార్యకు కూడా జరగినట్టే   భావించేవారు కనుక  స్త్రీలకు మళ్ళీ విడిగా షష్టిపూర్తి చేసే ఆచారంలేదు.


11.పెళ్లి సాధారణంగా జరగాలి. షష్టిపూర్తి ఘనంగా జరగాలని పెద్దల మాట. ఎందుకంటే షష్టిపూర్తి దృఢమైన   ఆత్మీయతల సుగంధం పరిమళించే సందర్భం కనుక.


12.బిడ్డలు తమ కృతజ్ఞతను తమ తల్లిదండ్రులకు  అర్పించుకొనే అపురూప సందర్భం  షష్టిపూర్తి.

 గమనిక:- షష్ఠి పూర్తి మాకు ఆచారం లేదండి...... అనేది అవాస్తవం. నిరభ్యంతరంగా అందరూ తమ శక్తి కొలది చేసికోవాలి.

🙏🙏🙏🙏🙏

5, మార్చి 2021, శుక్రవారం

కాశీలో ద్వాదశ (12) సూర్య దేవాలయాలు

 🙏:కాశీలో ద్వాదశ (12)  సూర్య దేవాలయాలు 🙏


దేశం మొత్తం మీద సుమారు పది దాకా ఆలయాలలో మాత్రమే మూల విరాట్టుగా పూజలు అందుకొనే శ్రీ సూర్య నారాయణ స్వామి, కాశీలో ఏకంగా పన్నెండు ఆలయాలలో కొలువై ఉండటం ప్రత్యేకంగా పేర్కొనాలి. 


1) కేశవాదిత్యుడు: ఆదిత్యుడు ఈ క్షేత్రంలో విష్ణుమూర్తిని (కేశవుడు) గురువుగా స్వీకరించి, తపమాచరించి శివానుగ్రహం పొందాడు. అందుకే ఈయన కేశవాదిత్యుడు. శ్రీ ఆది కేశవ స్వామి ఆలయంలో (రాజ్ ఘాట్ ఫోర్ట్ దగ్గర ---> రాజ్ ఘాట్ వేరు... రాజా ఘాట్ వేరు. గమనించ గలరు..) కొలువైన ఈ ఆదిత్యుని సేవిస్తే సద్గురు కృప లభిస్తుంది. విష్ణుమూర్తి కాశీకి వచ్చి, మొదటగా నివాసం ఏర్పరచుకున్న స్థలం ఈ ఆదికేశవాలయం. కాబట్టి ఈ ఆలయాన్ని ప్రతివారు తప్పక దర్శనం చేయాలి.


2) మయుఖాదిత్యుడు: సూర్య భగవానుడు ధూత్ పాప, ధర్మ నదుల సంగమ స్థానం వద్ద  వైకుంఠ వాసుని ఉపదేశం మేరకు, విశ్వనాధుని అనుగ్రహం ఆపేక్షిస్తూ మహోగ్ర తపస్సు చేయసాగాడు. ఆ తపస్సు వలన రోజురోజుకీ సూర్య కిరణాలు లోకాలు భరించలేనంతగా వేడెక్కిపోసాగాయి. సూర్య తాపాన్ని ప్రజలు తట్టుకోలేక పోయారు. గంగాధరుడు సాక్షాత్కరించి తన చల్లని హస్త స్పర్శతో ప్రచండుడిని చల్లబరిచారు. లోకాలకు ఉపశమనం కలిగించారు. నేటికీ ఈ మాయుఖాదిత్యుని విగ్రహం మీద నిరంతరం నీటి బిందువులు ఉండటం గమనించవచ్చును. ఇదే కిరణా నదీ ప్రవాహంగా మారి పంచగంగా ఘాట్ లో కలుస్తుందట. 


సూర్యుడు ప్రతిష్టించిన పరమేశ్వర లింగం గాభస్తీశ్వరుడిగా, అమ్మవారు మంగళ గౌరి గా పంచ గంగా ఘాట్ లో కొలువు తీరి ఉన్నారు. సూర్యుడు కూడా మయూఖాదిత్యునిగా మంగళ గౌరీ ఆలయంలో వెలిసాడు. ఈ స్వామిని ఆరాధించిన వారికి అనారోగ్యం దరిచేరదు. నిత్య జీవితంలోని అశాంతులు అన్నీ తొలగి పోతాయని విశ్వసిస్తారు.


3) గంగాదిత్యుడు: లలితా ఘాట్ వద్ద గల నేపాలీ మందిరం క్రింద భాగాన ఉన్న గంగాదిత్యుని కొలిచిన వారికి ఎలాంటి ధననష్టం ఉండదని అపమృత్యు భయం ఉండదని చెప్తారు.


4) అరుణాదిత్యుడు: గంగ ఒడ్డున సూర్యుని సహాయం కోరి తపస్సు ఆరంభించాడు ఊరువులు లేకుండా జన్మించిన వినత పుత్రుడైన అనూరుడు. సంతుష్టుడైన రవి తన రధానికి సారధిగా నియమించుకున్నాడు. త్రిలోచన ఘాట్ లో, శ్రీ త్రిలోచనేశ్వర స్వామి మందిరంలో వెనక భాగాన ఉన్న శ్రీ ఆంజనేయుని  విగ్రహం క్రింద ఉన్న ఈ రూపాన్ని పూజిస్తే దారిద్య్రం దాపురించదని, సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన పరిపూర్ణ జీవితం సంప్రాప్తిస్తుందని చెప్తారు. 


5) ఖగోళాదిత్యుడు: కద్రువ వద్ద దాస్యం తొలగిన తరువాత, వినత గరుత్మంతునితో కలిసి కాశీ చేరుకొని, తన తప్పులకు పరిష్కారం చేసుకోడానికి సూర్య భగవానుని ఖగోళాదిత్యుని రూపంలో కొలవసాగింది. శుభకరుడు సంతసించి ఆమె కుమారులు లోక పూజ్యులు అవుతారని ఆశీర్వదించాడు. మచ్చోదరి ప్రాంతంలోని శ్రీ కామేశ్వర స్వామి మందిరంలోని ఖగోళాదిత్యుని ఆరాధించిన భక్తుల సంతానం, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకొంటారని  చెప్తారు. 


6) లోలార్కాదిత్యుడు: తులసీ ఘాట్ వద్ద, అసి మరియు గంగా సంగమ తీరంలో లోలార్క కుండం పక్కన కొలువుతీరి ఉంటారు లోలార్కాదిత్యుడు. నదీ సంగమ జలం అంతర్వాహినిగా కుండం లోనికి చేరుకుంటుంది. కుండంలో స్నానం ఆచరించి స్వామిని సేవించిన వారి కోర్కెలు శీఘ్రంగా నెరవేరతాయని చెప్తారు.

 

7) సాంబాదిత్యుడు: నారదుని కారణంగా తండ్రి శాపానికి గురి అయ్యి కుష్ఠురోగం బారిన పడతాడు శ్రీకృష్ణ జాంబవతుల తనయుడైన సాంబుడు. తర్వాత కృష్ణుడి సలహా మేరకు కాశీ చేరి, విశ్వేశ్వరునితో పాటు, సూర్యనారాయణ స్వామిని కూడా నియమంగా ఆరాధిస్తాడు. ప్రభాకరుని కృపతో కుష్టు రోగం తొలగిపోతుంది. సూర్య కుండం (సూరజ్ కుండ్) వద్ద ఉన్న ఈ ఆదిత్యుని ప్రార్ధించిన భక్తులు దీర్ఘ వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారట. 


8 .ద్రౌపది ఆదిత్యుడు: శ్రీ కృష్ణుని సలహా మేరకు ద్రౌపది గంగా తీరాన సూర్య భగవానుని ధ్యానించింది. అభిమానంతో సూర్యుడు ఆమెకు అక్షయ పాత్ర అనుగ్రహించాడు. ఈ ద్రౌపది ఆదిత్యుని కొలిచిన వారి ఇంట ఐశ్వర్యానికి అంతు ఉండదని గ్రంధాలు తెలియజేస్తున్నాయి. అన్నపూర్ణాదేవి ఆలయం మరియు విశ్వేశ్వర స్వామి ఆలయాల మధ్యలో ఒక ఆంజనేయ స్వామి మందిరం ఉంటుంది. అక్కడ ఒక పక్కగా ఈ స్వామి కనపడతారు.


9) ఉత్తరార్క ఆదిత్యుడు: జాతక రీత్యా ఉన్న దోషం కారణంగా చిన్నతనం లోనే తల్లితండ్రులను పోగొట్టుకొన్నది సులక్షణ. నియమంగా గంగా తీరాన సుర్యారాధన చేస్తుండేది. ఆమెతో పాటు ఒక మేక కూడా రోజంతా ఏమీ తినకుండా అలా అక్కడే ఉండేది. కొంత కాలానికి ఆమె దీక్షకు మెచ్చిన ఆది దంపతులు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నారు. సులక్షణ, శివ పార్వతులకు మొక్కి తనకు బదులుగా ఆ మేకకు ఉత్తమ జన్మ ప్రసాదించమని కోరుకొన్నది. బాలిక నిస్వార్ధ బుద్దికి సంతసించిన సర్వేశ్వరుడు శాశ్వత కైలాసం ప్రసాదించాడు. మేక మరు జన్మలో కాశీ రాజుకు పుత్రికగా జన్మించినది. స్థానికంగా 'బకరీ కుండ్' అని పిలిచే కోనేరులో స్నానమాచరించి, ఉత్తరార్క ఆదిత్యుని ఆరాధించిన వారికి ఇహ పర సుఖాలు లభిస్తాయట. వారణాశి సిటీ రైల్వే స్టేషన్ కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలంపూర్ లో ఉంటుందీ మందిరం.


10 విమలాదిత్యుడు: అంతు తెలియని చర్మ వ్యాధితో బాధ పడుతున్న విమలుడు అనే బ్రాహ్మణుడు కాశీ వచ్చి అచంచల భక్తి శ్రద్దలతో దినకరుని ప్రార్ధించసాగాడు. స్వామి అనుగ్రహంతో అతని వ్యాధి సంపూర్ణంగా నిర్మూలించబడినది. విమలుడుకి ఆరోగ్యం ప్రసాదించిన స్వామిని విమలాదిత్యుడు అని పిలుస్తారు. ఖారీకువా గల్లీ (జంగంబారి)లో ఉండే విమలాదిత్యుని సేవించిన వారిని అనారోగ్య బాధలు దరి చేరవని చెప్తారు. 


11) వృద్దాదిత్యుడు: హరితుడు అనే వ్యక్తి నిరంతరం ధ్యానంలో ఉంటూ అనేక దివ్యానుభూతులు అనుభవించేవాడు. జీవులకు సహజమైన వార్ధక్యం కారణంగా గతంలో మాదిరి ధ్యానం చేయలేక ఆదిత్యుని అర్ధించాడు. స్వామి కృపతో పునః యవ్వనాన్ని పొందాడు. శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళే దారిలో కుడి వైపుకు తిరిగితే (కనుక్కుంటూ వెళ్ళాలి) అక్కడ పెద్ద హనుమాన్ మందిరం ఉంటుంది. అక్కడ చిన్న గదిలాంటి మందిరంలో ఉన్న వృద్ద ఆదిత్యుని పూజించిన వారికి వృద్దాప్య బాధలు ఉండవని చెప్తారు. 


 12) యమాదిత్యుడు: సూర్యుని పుత్రుడైన యమధర్మరాజు, తండ్రి ఆనతి మేరకు శ్రీ విశ్వేశ్వరుని దర్శనం కొరకు గంగా తీరాన తపస్సు చేసాడు. దర్శన భాగ్యం పొందాడు. యముడు ప్రతిష్టించిన శ్రీ యమేశ్వర స్వామిని, యమాదిత్యుని నిశ్చల భక్తితో వేడుకొంటే, శాశ్వత స్వర్గ ప్రాప్తి లభిస్తుంది అని కాశీ ఖండం తెలుపుతోంది. సింధియా ఘాట్ లోని సంకట దేవి ఆలయం సమీపంలో యమాదిత్యుడు కొలువై ఉన్నాడు                       .🙏శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పీఠం🙏    ch భాస్కర శర్మ

భారతీయులు వ్రాసిన శాస్త్రాలు..

 ➖➖➖➖➖➖➖➖➖➖

*మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు..*

➖➖➖➖➖➖➖➖➖➖

★నేడు అమలులోలేని మనకు తెలియని మన పూర్వీకులు మనకందించిన అపూర్వగ్రంథ శాస్త్ర రాజములు:

నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద?

క్రింది మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు చూస్తుంటే నేడు మనకు ఇవి ఎలా అందకుండాపోయాయా? అని ఆశ్చర్యం కలుగక మానదు.


*1.అక్షరలక్ష:*

ఈ గ్రంథం ఒక ఎన్సైక్లోపీడియా గ్రంథము.రచయిత వాల్మీకి మహర్షి.రేఖాగణితం,బీజగణితం,త్రికోణమితి,భౌతిక గణితశాస్త్రం మొదలైన 325 రకాల గణితప్రక్రియలు, ఖనిజశాస్త్రం,భూగర్భశాస్త్రం,జలయంత్ర శాస్త్రం,గాలి,విద్యుత్,ఉష్ణం లను కొలిచే పద్దతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెల్పబడ్డాయి.


*2.శబ్దశాస్త్రం:*

రచయిత ఖండిక ఋషి.సృష్టిలోని అన్ని రకాల ధ్వనులను,ప్రతిధ్వనులను ఇది చర్చించింది.ఇందులోని ఐదు అధ్యాయాలలో కృత్రిమంగా శబ్దాలను సృష్టించడం,వాటి పిచ్(స్థాయి),వేగాలను కొలవడం వివరించారు.


*3.శిల్పశాస్త్రం:*

రచయిత కశ్యపముని. ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి.307 రకాల శిల్పాల గురించి,101 రకాల విగ్రహాలతో కలిపి సంపూర్ణంగా చర్చించారు.గుళ్ళు,రాజభవనాలు,చావడులు మొదలైన నిర్మాణవిషయాలు 1000కి పైబడి ఉన్నాయి.ఇదే శాస్త్రం పై విశ్వామిత్రుడు,

మయుడు,మారుతి మొదలగు ఋషులు చెప్పిన విషయాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి.


*4.సూపశాస్త్రం:* 

రచయిత సుకేశుడు.ఇది పాకశాస్త్రం.ఊరగాయలు,పిండివంటలు

,తీపిపదార్థాలు,108 రకాల వ్యంజనాలు మొదలగు అనేకరకాల వంటకాల గురించి,ప్రపంచవ్యాప్తంగా ఆ కాలం లో వాడుకలో ఉన్న 3032 రకాల పదార్థాల తయారీ గురించి చెప్పబడింది.


*5.మాలినీ శాస్త్రం:*

 రచయిత ఋష్యశృంగ ముని.పూలమాలలను తయారుచేయడం,పూలగుత్తులు,పూలతో రకరకాల శిరోఅలంకరణలు,రహస్యభాషలో పూవులరేకుల పైన ప్రేమసందేశాలు పంపడం లాంటి అనేక విషయాలు 16 అధ్యాయాలలో వివరింపబడ్డాయి.


*6.ధాతుశాస్త్రం:* 

రచయిత అశ్వినీకుమార.సహ

జ,కృత్రిమ లోహాలను గురించి 7 అధ్యాయాలలో కూలంకుషంగా వివరించారు.మిశ్

రలోహాలు,లోహాలను మార్చడం,రాగిని బంగారంగా మార్చడం మొదలగునవి వివరించారు.


*7.విషశాస్త్రం:* 

రచయిత అశ్వినీకుమార.32 రకాల విషాలు,వాటి గుణాలు,ప్రభావాలు,విరుగుడులు మొదలైన విషయాలు చెప్పారు.


*8.చిత్రకర్మశాస్త్రం(చిత్రలేఖనశాస్త్రం):* 

రచయిత భీముడు.ఇందులో 12 అధ్యాయాలు ఉన్నాయి.సుమారు 200 రకాల చిత్రలేఖన ప్రక్రియల గురించి చెప్పారు.ఒక వ్యక్తి తలవెంట్రుకలను గాని,గోటిని కాని,ఎముకను కాని చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే ప్రక్రియ చెప్పబడింది.


*9.మల్లశాస్త్రం:* 

రచయిత మల్లుడు. వ్యాయామాలు,ఆటలు,వట్టిచేతులతో చేసే 24 రకాల విద్యలు చెప్పబడ్డాయి.


*10.రత్నపరీక్ష:* రచయిత వాత్సాయన ఋషి.రత్నాలు కల్గిఉన్న 24 లక్షణాలు చెప్పబడ్డాయి.వీటిశుద్దతను పరీక్షించడానికి 32 పద్దతులు చెప్పబడ్డాయి.రూ

పం,బరువు మొదలగు తరగతులుగా విభజించి తర్కించారు.


*11.మహేంద్రజాల శాస్త్రం:* సుబ్రహ్మణ్యస్వామి  స్వామి శిష్యుడైన వీరబాహువు రచయిత.నీటిపై నడవడం,గాలిలో తేలడం వంటి మొదలైన భ్రమలను కల్పించే గారడిలను ఇది నేర్పుతుంది.


*12.అర్థశాస్త్రం:*

రచయిత వ్యాసుడు.ఇందులో భాగాలు 3.ధర్మబద్ధమైన 82 ధనసంపాదనా విధానాలు ఇందులో వివరించారు.


*13.శక్తితంత్రం:*

 రచయిత అగస్త్యముని.ప్ర

కృతి,సూర్యుడు,చంద్రుడు,గాలి,అగ్ని మొదలైన 64 రకాల బాహ్యశక్తులు,వాటి ప్రత్యేక వినియోగాలు చెప్పబడ్డాయి.అణువిచ్చేదనం ఇందులోని భాగమే.

*14.సౌధామినీకళ:*

రచయిత మతంగ ఋషి.నీడల ద్వారా,ఆలోచనల ద్వారా అన్ని కంటికి కనపడే విషయాలను ఆకర్షించే విధానం చెప్పభదింది.భూమి మరియు పర్వతాల లోపలిభాగాల ఛాయాచిత్రాలను తీసే ప్రక్రియ చెప్పబడింది.


*15.మేఘశాస్త్రం:* 

రచయిత అత్రిముని.12 రకాల మేఘాలు,12 రకాల వర్షాలు,64 రకాల మెరుపులు,33 రకాల పిడుగులు వాటి లక్షణాల గురించి చెప్పబడింది.


*16.స్థాపత్యవిద్య:* 

అదర్వణవేదం లోనిది. ఇంజనీ రింగ్,ఆర్కిటెక్చర్,కట్టడాలు,నగరప్రణాలిక మొదలైన సమస్త నిర్మాణ విషయాలు ఇందులో ఉన్నాయి.

ఇంకా భగవాన్ కార్తికేయ విరచిత కాలశాస్త్రం,సామ

ుద్రిక శాస్త్రం,అగ్నివర్మ విరచిత అశ్వశాస్త్రం,కుమారస్వామి రచించిన గజశాస్త్రం,భరద్వాజ ఋషి రచించిన యంత్రశాస్త్రం మొదలగునవి ,ఆయుర్వేదం,ధనుర్వేదం,గాంధర్వవేదం మొదలగు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి.

నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద?

వీటిలో చాలా వరకు నేడు అందుబాటులో లేవు​.

             🍃🌷🤗🌷🍃

అదిగదిగో రాయితీ... అందాల ఓ సతి!

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*నాకు నచ్చిన శ్రీమతి శశికళ ఓలేటి గారి కథ* 

              🌷🌷🌷

అదిగదిగో రాయితీ... అందాల ఓ సతి! 


( చిట్టి మందారం...కొత్తకథ)


ఉమ్మడి కుటుంబం లో... పెద్దగా సయోధ్య లేని ఆ ఐదుగురు తోడికోడళ్ళను... కలిపి ఉంచే... ఒకే ఒక అభిరుచి... షాపింగ్ ! 

ఇంచుమించు ప్రతి నెల మొదటి వారం ...తమ మగమహారాజుల జేబూలు.. జీతాలతో నిండడమేమిటి...ఈ అమ్మలక్కలు ఐదుగురూ., ఒక శుభమధ్యాహ్నం ... వారం-వర్జ్యం చూసుకుని మరీ..తమ మామగారి కారు లోనో...

 లేదా ఓ రెండు ఆటోలు మాట్లాడుకునో... జగదాంబ జంక్షన్ కు ...షాపింగ్ కోసం బయలుదేరుతారు! 


దానికి ముందే.. ఈనాడు పేపర్ లో... సిటీ ఎడిషన్ ఎదురుగా పరుచుకుని ...ఏషాపులో  ఏ విధమైన రాయితీలు... డిస్కౌంట్లు ప్రకటించారో.. ఎంత ప్రకటించారో... ఇత్యాదివి చూసుకొని ...మరీ బయలుదేరుతారు! 


ఆ నగరంలో ...ఆ ఒక్క ఇంట్లోనే ఐదుగురు ఉంటే... మొత్తంనగరం లో అలాంటి షాపింగ్ శిరోమణులు మరి ఇంకెంతమంది  ఉండాలో కదా ! 


వీరంతా ప్రతి మధ్యాహ్నం... 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ...ఆ  వ్యాపార సముదాయాలను ...వెలుగులతో నింపి... ఖాళీ అయిన పర్సులు ..బరువైన  బ్యాగులు మోసుకుంటూ... ఇళ్లకు చేరుతారు ఏ అర్ధరాత్రో! 


ఆ మర్నాడు ఉదయమే... మళ్ళీ., వారి సున్నితమైన మనసులను పాడుచేస్తూ...అన్ని టీవీ ఛానల్స్ లో... సర్వాంతర్యామి ...సర్వవ్యాపి ..లాగా ..ఫలానా సవితా జువెలరీ సేటు ఒకాయన..." బంగారం నాణ్యత చూసుకోండి... మోసపోకండి.. మాషాపులోనే కనుక్కోండి... తరుగు తక్కువ ..మెరుగు .. ఎక్కువ. మా ఆడపడుచుల కోసం మజూరీని రద్దు చేసాము ...రండి బాబు రండి!"... అంటూ మెస్మరైజింగ్ గా...పిలుస్తూ ఉంటే.. నాగస్వరం విన్న నాగుపాము ల్లాగా ... మారిపోతారు మహిళా లోకం!


...తమ ఇళ్ళల్లో ఉన్న పాత బంగారాలు ..విరిగిపోయిన ,నల్ల పడిపోయిన ...పిల్లలగొలుసులు ,మురుగులు ...ఇంట్లో భర్త గారి మండ చెయిను ...ఉంగరాలు, బొంగరాలు...అత్తగారి అరిగిపోయిన దుద్దులు ...పెరిగిపోయిన నానుతాడు...చంటి పిల్లాడి మొలతాడు తో సహా... సమస్తం... లాక్కుని.. పీకేసుకుని ...ఉదయం 10

 గంటలు కొట్టేటప్పటి కల్లా .... భోజనం కేరేజీల తో సహ వచ్చేసి...సవిత జువెలరీ కొట్టు ముందు... షట్టర్లు తెరవమని ...సెక్యూరిటీతో వాదిస్తూ తోసుకుంటూ ...కుమ్ము కుంటూ..  ...అక్కడే టెంట్లు వేసుకుని కూర్చుంటారు! ఈ దృశ్యం ఏ పట్టణంలో నైనా నగరంలోనైనా  సర్వసాధారణం!  ఆ ఆవరణొక ఆభరణ మహిళా తోరణం! 

 


ఇంతలో ... తెలుగు రాష్ట్రాలలో...చారుమతీ దేవి కథలో చెప్పినట్టు... స్త్రీలందరూ ఎంతగానో ఎదురు చూసేటటువంటి... వరలక్ష్మీ వ్రతం... శ్రావణ మాసంలో.. రానే వచ్చింది!  ఇహ చూడాలి మన  కాంతామణులందరి  హడావిడి ...ఆత్రుత! 


మన ఐదుగురు తోటి కోడళ్ళు వీరికి భిన్నం ఏమాత్రం కాదు! కానీ వీరి ముందు..  పాపం వీరి షాపింగ్ వినిమయ నియంత్రణకై... అనేక అడ్డంకులు! 😞!  


మొట్టమొదటి సవాలు.... బడ్జెట్! అవసరం ఉన్నా లేకపోయినా ...అయినదానికి కానిదానికి .. డిస్కౌంట్ సేల్.. అంటూ పరిగెట్టి ..   అడ్డమైన సరుకు ఖరీదు చేస్తున్నారని ...వీరి భర్తలకు ...అత్తమామలకు.. వీరిపై చాలా గుర్రుగా ఉంది ! వీరి కొనుగోళ్ల జోరుకు ఆనకట్ట వేస్తూ ...ముందు వీరి షాపింగ్ కొరకై కేటాయించే ...బడ్జెట్ మీద కోత విధించి తీరాలని తీవ్ర నిర్ణయం తీసుకున్నారు  వారు! 


    ఈ అన్యాయాన్ని తీవ్రంగా నిరసిస్తూ...సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి నప్పటికీ లొంగనందువలన ...తక్షణ కర్తవ్యం ఆలోచించి కార్యోన్ముఖులు అవ్వడం కోసం.... ఐదుగురు కోడళ్ళు ...డాబా మీదకు చేరారు! ఆ సమాలోచన లో భాగంగా...


" చీరకు 5000/- ఇచ్చాడు అక్కయ్యా మా ఆయన!  దానితో పట్టుచీర కాదు కదా పట్టురుమాలు...కూడా రాదు ! అందుకే పొమ్మన బ్రదర్స్ లో ..80% డిస్కౌంట్ ఇస్తున్నారు కదా... ఈసారికి అక్కడే కొనేసుకుందామని అనుకుంటున్నాను "..అంది..అందరిలోకి చిన్న కోడలు కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుని! 


" అరే పిచ్చి మొహమా! తొందర పడిపోకు! లక్ష రూపాయల దాకా సంపాదించే మార్గం నా దగ్గర ఒకటుంది ".. అంది పెద్ద తోటి కోడలు...! ఆమె కన్నీరు తుడుస్తూ 


" ఎంతైనా సీనియర్స్ సీనియర్సే!  చెప్పక్కా చెప్పు!".. అంటూ మిగిలిన అందరూ ప్రాణాలు లేచొచ్చి.. ముక్తకంఠంతో అరిచారు! 


" ఏం లేదర్రా ! మన ఇంట్లో మగవారివి.  వాడని వాచీలు, బెల్టులు , బ్రీఫ్ కేస్ లు..బూట్లూ, సూట్లు ,పర్సులూ, కెమెరాలు, పాత కంప్యూటర్లు , సెల్ ఫోన్లు...అన్నీ కూడా ...ఓఎల్ఎక్స్ లో గప్ చుప్ గా పెట్టేద్దాం !ఎవరో ఒకళ్ళు కొనడానికి రాకపోరు!".... ఆవిడ ఐడియా చెప్పగానే... మిగిలిన వారందరికీ మరింత హుషారు వచ్చింది! 


" కార్ షెడ్ లో పడేసిన యాంటిక్ ఫర్నిచర్ అమ్మేద్దాం అక్కా...!..అంది రెండో ఆవిడ! 


" మన పాత పట్టుచీరలు  అమ్ముదాం"


" ఆడపిల్లల గాగ్రాలు ..మగ పిల్లల పాత సైకిళ్ళు అమ్మేద్దాం".... 


"చంటి పిల్లల బొమ్మలు అమ్మేద్దాం"...అనుకుంటూ...ఈ విధంగా.. ఇంట్లో ప్రస్తుతం ఏవేవి వాడకంలో లేవో ..అవన్నీ కూడా అమ్మేద్దామని రహస్యంగా నిర్ణయించుకున్నారు! 


" ఈ డబ్బు మన పట్టు చీరలు కి ,వర్క్ బ్లౌజెస్ కి సరిపోతుంది ! మరి బంగారం కోసం ఏం చేద్దాం?".. అని అడిగింది నాలుగవ తోటికోడలు దిగులుగా! 


ఆఖరి తోడికోడలు సిసింద్రీ ! అందిస్తే అల్లుకు పోగలదు!   ఆమె అందుకుని..." మీరంతా తిట్టనంటే.. అంటే .....నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఉపాయం ఉంది! మన పెళ్లిళ్లలో మనఅత్తారు పెట్టిన నగలన్నీ ...మోటుగా.. పాత మోడల్స్ లో.. పెట్టుకోవడానికి వీలుగా లేకుండా ఉన్నాయి!  పాత బంగారం నాణ్యం...అంటూ...మార్చకుండా మనను ఆపుతున్నారు ఇన్నాళ్ళూ!  మనం ఇంట్లో...ఎవరికీ చెప్పకుండా ..పదేసి తులాల నగలు మార్చేసి ...మంచి టెంపుల్ డిజైన్ ... తంజావూరు మోడల్సు...  రెడీమేడ్ లో కొనుక్కుందాం! వాటి గురించి అడిగితే.. అప్పటికి ఏదో ఒక కట్టుకథ చెప్పేయొచ్చు!" ... అంటూ తన సూపర్ ఐడియా వాళ్ల ముందు ఉంచింది! అందరూ సంతోషంగా సమ్మతి తెలిపారు! 


ఓఎల్ఎక్స్ లో వాళ్ళు అనుకున్న దానికంటే.. కాస్త ఎక్కువే వచ్చింది డబ్బు! పండుగ  మరొక నెలలోనే.. ఉన్నందువలన ...వెంటనే బట్టల షాపింగ్కు

కు బయలుదేరారు! 


ప్రతి చోటా మైళ్ళ పొడవున క్యూ లే !  ఆ జాతరలో ... పద్మవ్యూహాలన్నీ  ఛేదించుకుని.... పొమ్మన బ్రదర్స్ లో 80 %.. నార్త్ ఇండియా షాపింగ్ మాల్ లో.. 50% డిస్కౌంట్ తో ...తలొకరూ..రెండేసి పట్టుచీరలు  కొనుక్కుని బయట పడ్డారు! చీరల ధరలతో సరి తూగే ...ఖరీదు పెట్టి.. బ్లౌజులు డిజైన్ చేయడానికి ఇచ్చుకున్నారు! 


ఇక్ఠడ...చీరల సెలక్షన్ లో.. మీకు ఒక ముచ్చట చెప్పి తీరాలి! అక్కడ  ఏ ఒక్కరికి ...తమ సొంత ఎంపిక నచ్చదు! పక్కవారు తీసుకున్నదే... తమకు కావాలని లాగుతూ ఉంటారు! ఈమె కావాలని ..ఆమె ఇవ్వనని.. పెద్ద పోట్లాటలూ... వాగ్వివాదాలు అవుతూ ఉంటాయి! సాధించిన ఆ చీరను తీసుకోకుండానే ...చివరకు..కౌంటర్ దగ్గర ఉన్న గుట్టల్లో...పడేసి పోతారు చాలామంది! స్త్రీ సహజమైన విచిత్రమైన మానసిక పరిస్థితి అది!😃😉


పండగ వారం ఉందనగా పాత బంగారాలు పట్టుకుని సమత జ్యువెలర్స్ చేరారు ఐదుగురు! తరుగులో 60 శాతం మజూరీలో 50 శాతం రాయితీలతో బంగారం కొనబోతున్నామని ..చాలా ఉద్వేగానికి గురయ్యారు తోడికోడళ్ళు! 


 అక్కడ లోపల నున్న జన సందోహాన్ని దాటి కౌంటర్ను చేరడానికే చాలా కష్టపడాల్సి. వచ్చింది!  వీరు తెచ్చిన  పాత బంగారాలను  చూసిన సేల్స్ మన్ కు కళ్ళు జిగేల్ మని మెరిసాయి!  అది పైకి కనిపించనీకుండా... నిర్లక్ష్యం గా మొహం పెట్టి ...బంగారానికి గీటు పెట్టి ... దానిలో బంగారం 60 శాతం కన్నా లేదని ..మిగిలినదంతా రాగి  అంటూ...తీసి పడేసాడు! తన క్యాలిక్యులేటర్ లో ఏవేవో లెక్కలు వేసి ..ఇంత అమౌంట్ వస్తుంది అని చూపించాడు! 

తమ బంగారం ఖరీదు కి సరిపడా... టెంపుల్ డిజైన్  నగలు చూపించమని.. అడిగారు వీళ్ళు! 


పండుగ సీజన్లో సేల్స్  ఎక్కువగా ఉండడంతో..కొత్త డిజైన్ నగలు అన్నీ అయిపోయినట్టున్నాయి! .. ఏవో పాత మోడల్స్ లో కొన్ని నగలు తీసి చూపించాడు సేల్స్ మాన్!  వీరికి నచ్చకపోయినా... పెద్ద ఛాయిస్ లేకపోయినా.. సవిత జువెలర్స్ లో కొన్నామన్న పేరు కోసం... ఐదుగురు 5 హారాలను సెలెక్ట్ చేసుకున్నారు! ఇంతా చేసి ఒక్కో హారం నాలుగు తులాలు కూడా తూగలేదు! 


 మజూరి, తరుగు బాగా పెంచేసి... దానిమీద దొంగ రాయితీలు ఇచ్చారు వాళ్ళు ! దానితోపాటు సేల్స్ టాక్స్ అని ..వాట్ అని.. రకరకాల పన్నులు  వేసి... మొత్తం మీద ...10 తులాల పాత బంగారానికి ...నాలుగు తులాల గొలుసులు చేతిలో పెట్టారు ! డల్ గోల్డ్ లో పాత డిజైన్లలో... పేలవంగా ఉన్న ఆ హారాలు ...బంగారం బేరాలు ...తోటి కోడళ్ళకు... తీవ్రమైన అసంతృప్తిని మిగిల్చాయి! 


      మానసికంగా..భౌతికంగా ..అలిసిపోయి ,మొహాలు వ్రేలాడేసుకుని ఇంటికి చేరారు ! ఇంతలో టైలర్ దగ్గర నుండి ఫోను ! వీరు కొన్న పట్టు చీరలు ..జాకెట్ తో సహా... 5 గజాలు మాత్రమే ఉన్నాయని ...ఆ జాకెట్ కూడా 60 సెంటీమీటర్లు మాత్రమే ఉందని... జాకెట్లు కుట్టడం సాధ్యం కాదని ఆ ఫోన్ కాల్ సారాంశం! కింకర్తవ్యం.. అనుకుంటూ తలపట్టుకు కూర్చున్నారు ఐదుగురు! 


అంతకు ముందే .... వెయ్యిరూపాయలకు ఆరుచీరల స్కీమ్ లో.....”పీకే బ్రదర్స్” లో పనిమనుషుల కోసం కొన్న సింథటిక్ చీరలు .... వాళ్ళకు నచ్చక.... తమ మొహానే కొట్టి.... తలో వెయ్యిరూపాయిలూ పండుగచీర నిమిత్తం ఎత్తుకుపోవడం గుర్తుకు తెచ్చుకున్నారు!  


రాత్రి భోజనాలయ్యాక...ఐదుగురు తోటికోడళ్లూ...మరోసారి.. డాబా మీదకు చేరారు!  ఐదుగురు ..తమ చేతులు చాపి.... ఆకాశంలోకి చూస్తూ

.." దేవుడా! చచ్చినా.. ఇకమీదట ...ఆఫ్లైన్ లో కానీ ...ఆన్లైన్ లో కానీ.. డిస్కౌంట్ ల మీద... సేల్లో ...బట్టలు కానీ.. నగలు గాని ..వస్తువులు గాని కొననే కొనుము! కొంటే... గింటే.... మా పాత బంగారంషాపు “ మంగళం జువెలరీస్ “లో కానీ...”చిరుగుల బాబూరావ్ & సన్స్ “ బట్టల కొట్టులో కానీ కొనుక్కుంటాం!మా భర్తల మీద ప్రమాణం చేస్తూ... ఇదే మా ప్రతిజ్ఞ!"... అంటూ ఒట్లు వేసుకుని...దుఃఖాశృవులు తుడుచుకుంటూ... భారమైన మనసులతో....కిందకు పోయారు! 


అదిగదిగో రాయితీ...

అందాల ఓ సతి...

లేదమ్మా పరిమితి...

పోగొట్టును మీ మతి...

 వేసారును నీ పతి...

 పెరిగి పోవు భారమితి...

 దాటబోకు నీ మితి...

 ఎండమావి రాయితీ...

 వ్యాపారంలో లేదు నీతి...

 తెలుసుకోవె పడతి! ...

 పడ బోకుము గోతిలోకి!


 ధన్యవాదాలతో

 

 *ఓలేటి శశికళ*

మొగలిచెర్ల

 *సీతాలక్షమ్మ గారి సలహా..*


"ఏరా ప్రసాదూ బాగున్నావా?..పదేళ్ల తరువాత ఇప్పుడు కుదిరింది నాయనా ఈ స్వామిని దర్శించుకోవడానికి.." అంటూ సీతాలక్షమ్మ గారు నా ప్రక్కన వచ్చి కూర్చున్నారు..స్వామివారు మాలకొండలో తపస్సు చేసుకునే రోజుల్లో సీతాలక్షమ్మ గారు మా తల్లిదండ్రులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు..సీతాలక్షమ్మ గారింటి ఇలవేల్పు మాల్యాద్రి లక్ష్మీనారసింహుడు..ఆ కారణం చేత ఆవిడ భర్త తో కలిసి ఆరోజుల్లో తరచూ మాలకొండకు వచ్చేవారు..మా తల్లిదండ్రులకు కూడా మాలకొండ వద్దే సీతాలక్షమ్మ గారు, ఆవిడ భర్త లక్ష్మీనరసయ్య గారు పరిచయం అయ్యారు..మాలకొండలో ఒక యువక యోగి తపస్సు చేసుకుంటున్నాడనీ..ప్రతి వారం ఆ యోగి ని తాము కలుస్తున్నామనీ మా అమ్మగారు సీతాలక్షమ్మ గారికి చెప్పడం..ఆ దంపతులు కూడా ఆ యోగిని చూడాలని కుతూహలం చూపడం జరిగింది..ఒక శనివారం మధ్యాహ్నం మూడు గంటల వేళ, సీతాలక్షమ్మ గారి దంపతులను వెంటబెట్టుకొని..స్వామివారిని కలవడానికి మాలకొండకు ఉత్తరం వైపున దిగువున ఉన్న పార్వతీదేవి మఠం వద్దకు మా తల్లిదండ్రులు వెళ్లారు..


ఒక పది పదిహేను నిమిషాల తరువాత స్వామివారు శివాలయం పైన ఉన్న గుహల వద్దనుంచి మెల్లిగా దిగి వీళ్ళవద్దకు వచ్చారు.."శ్రీధరరావు గారూ మీతో బాటు అతిథులను కూడా తీసుకొచ్చారా?.." అని నవ్వుతూ పలకరించారు.."మీగురించి నేనే చెప్పాను నాయనా..మిమ్మల్ని కలవాలని ఆసక్తి చూపించారు..మాతోపాటు వెంట బెట్టుకొని వచ్చాము.." అని మా అమ్మగారు బదులిచ్చారు.."పర్లేదమ్మా.." అని..సీతాలక్షమ్మ దంపతుల వైపు తిరిగి.."అమ్మా..బాగున్నారా?" అని అడిగారు స్వామివారు..సీతాలక్షమ్మ గారికి గానీ..లక్ష్మీ నరసయ్య గారికి కానీ..ఏం మాట్లాడాలో తెలీని అచేతన స్థితిలో ఉండిపోయారు..స్వామివారి చల్లని చూపు వారిని కట్టిపడేసింది..మాటలు కూడబలుక్కుంటునట్లు.."బాగున్నాము స్వామీ.." అన్నారు.."మీ ఇలవేల్పు లక్ష్మీనృసింహుడి పాదాలు విడవకుండా పట్టుకోండి..మీకు ఏలోటూ లేకుండా ఆయన చూస్తాడు..సంతానం కూడా వృద్ధిలోకి వస్తుంది.." అని స్వామివారు ఆశీర్వదించారు..మరో పదినిమిషాల తరువాత అందరూ స్వామివారి వద్ద సెలవు తీసుకొని వచ్చేసారు..


ఆ తరువాత కూడా ఆ దంపతులు స్వామివారిని మాలకొండలో రెండు మూడు సార్లు కలుసుకున్నారు..స్వామివారు మొగిలిచెర్ల లో ఆశ్రమం కట్టుకుని సాధన చేసే రోజుల్లో కూడా వచ్చి వెళ్లారు..స్వామివారు కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన విషయాన్ని మా నాన్నగారు ఉత్తరం ద్వారా ఆ దంపతులకు తెలియచేశారు..ఆ ఉత్తరం చదివిన వెంటనే మొగిలిచెర్ల వచ్చి స్వామివారి సమాధిని దర్శించుకున్నారు.."ప్రభావతీ..మీ ఇద్దరూ అదృష్టవంతులు..ఈ మహానుభావుడు కొన్నాళ్ళు మీ ఇంట్లోనే వున్నాడు..మీచేతి ఆహారం స్వీకరించాడు.." అని తరచూ చెప్పేవారు.."వీడు కూడా పెట్టి పుట్టాడు ప్రభావతీ..అంతటి యోగిపుంగవుడికి రోజూ అన్నం తీసుకెళ్లి ఇచ్చి వచ్చాడు కదా.." అని నాగురించి చెప్పేవారు..


నేను మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిర బాధ్యతలు తీసుకున్న తొలినాళ్లలో..అనారోగ్యం తో ఉన్న మా నాన్నగారిని చూడటానికి సీతాలక్షమ్మ గారు భర్త తో సహా వచ్చారు..నాన్నగారిని పరామర్శించి..స్వామివారి మందిరానికి వచ్చారు..స్వామివారి సమాధిని దర్శించుకొని.."జీవితం లో ఇటువంటి అవధూతను చూడగలిగే భాగ్యం మా దంపతులకు మీ తల్లిదండ్రుల వల్ల కలిగింది..మీకు ఏ లోటూ ఉండదు అని ఆరోజు ఈ స్వామివారు చెప్పిన మాట అక్షరసత్యం నాయనా..మా పిల్లలూ సుఖంగా వున్నారు..స్వామివారు మొట్టమొదటి రోజు మమ్మల్ని చూసిన  చూపు ఇప్పటికీ మర్చిపోలేము..మీ తల్లిదండ్రుల లాగే నువ్వుకూడా స్వామివారి సేవ చేసుకుంటున్నావు..జాగ్రత్త నాయనా..ఎక్కడా అహంకరించొద్దు..ఎవ్వరినీ అమర్యాదగా చూడొద్దు..ఈ మందిరానికి వచ్చే ప్రతి భక్తుడినీ గౌరవించు..వాళ్ళు ఎంతో దూరం నుంచి వాళ్ళ బాధలు తీరుతాయనే ఆశతో ఇక్కడికి వస్తారు..నువ్వు పలికే స్వాoతన పలుకులు వాళ్లకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయి..అది గుర్తు పెట్టుకో.."అని నా ప్రక్కన కూర్చుని చెప్పారు.."వీలుంటే ఇక్కడ అన్నదానం జరిగే ఏర్పాటు చూడు ప్రసాదూ.." అని సలహా ఇచ్చారు.."అన్నదానం ఖర్చుతో కూడుకున్న పని..ఆలోచిస్తున్నాను.." అన్నాను.."నువ్వు ప్రారంభించు..ఆపై స్వామివారు చూసుకుంటారు..ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులన్నీ నీ వల్ల జరుగుతున్నాయా..అంతా ఆయన కృప వలనే నడచిపోతున్నది..ఇదీ అంతే.." అన్నారు..


సీతాలక్షమ్మ గారు భౌతికంగా ఈరోజు లేకపోయినా..ఆవిడ చెప్పిన మాటలు నా చెవుల్లో వినబడుతూనే ఉన్నాయి..ఒక్కొక్కసారి సహనం కోల్పోయి..కొంత పరుషంగా మాట్లాడిన సందర్భాలలో..సీతాలక్షమ్మ గారి సలహా గుర్తుకొస్తుంది..ఒకరకంగా స్వామివారే ఆమెచేత ఆ పలుకులు పలికించారేమో..ఈరోజు అన్నదానం చేయగలుగుతున్నాము..చూడటానికి సీతాలక్షమ్మ గారు లేకపోయినా..ఆవిడ ఆశీస్సులు వుంటాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

4, మార్చి 2021, గురువారం

అమ్మతోఒక మాట !!

 చొప్పకట్ల!


ॐ                    అమ్మతోఒక మాట !!

   

 (తప్పక చదవండి మీ అనుభూతిని నలుగురితో పంచుకోండి )


    ఏంటమ్మా ఇది.. 

    ఎప్పుడూ ఆ ఆదిశంకరుడు, కాళిదాసు, మూకశంకరులేనా! 

    కొంచెం మావైపు కూడా చూడొచ్చు కదా! 

   “ఏమిట్రా నీ గోల! నేను మీవైపు చూడకుండానే మీరంతా పెద్దాళ్ళైపోతున్నార్రా!” అని ఉరమకు. 

    చూడటం అంటే అలా ఇలా చూడమని కాదు. 

    పామరుడిని మహాకవిని చేయడానికీ, మూగవాడితో అయిదొందల పద్యాలు చెప్పించడానికీ, నువ్వొక చూపు చూశావే! అదీ, ఆ చూపూ చూడాలి. 

    అమ్మా! అవడానికి అక్షరాలను పుట్టించింది మీ ఆయనే అయినా, నీ చూపు పడకపోతే అవి కదలనే కదలవేంటమ్మా! 

     ఆమాట కొస్తే, సర్వేశ్వరుడైన నీ మగడే, నీ అనుమతి లేనిదే ఏ పనీ చేయడు. 

     అప్పట్లో హాలాహలం పుట్టి లోకాలను దహించి వేస్తుంటే.. 

    పాపం ఆ దేవతలంతా మీ ఇంటిముందు బారులు తీరి.. “కుయ్యో! మొర్రో! విను; మాలింపుము; చిత్తగింపుము; దయన్ వీక్షింపు” అని ఏడుపులు, పెడబొబ్బలూ పెడుతుంటే.., 

    అప్పుడు కూడా అంతటి ఆ భోళాశంకరుడూ, వెళ్ళిరానా?  అన్నట్టు నీవైపు చూశాడు. 

   “పాపం మీ అన్నయ్య ఒక్కడే అక్కడ కష్టపడుతున్నాడు. నేను వెళ్ళి ఈ హాలాహలం సంగతేదో చూస్తే, అతను పొంగిపోతాడు” అంటూ నీ పుట్టింటి వారి మాటలు చెప్పి మరీ, నిన్ను ఒప్పించి బయల్దేరాల్సి వచ్చింది. 

    మరి నువ్వు భర్తను కొంగున ముడేసుకున్న *“స్వాధీనవల్లభ”* వు కదా! 

    పుట్టింటివాళ్ళ పేరు చెబితే పొంగిపోతావన్న మాట నిజమే కానీ, వాళ్ళైనా మీ ఆయన గురించి, ఒక చిన్నమాట తప్పుగా అన్నా, కళ్ళెర్ర జేస్తావు. అసలే నువ్వు *సదాశివపతివ్రతవు*. 

    *కామేశ బద్ధ మాంగల్య సూత్రశోభిత కంధరవు.* 

     మీ నాన్న దక్షుడు నీ మగని కోసం నానా మాటలు అంటే, ఆ తరువాత ఏం జరిగిందో మాకు తెలియనిదా! 

    మీ  ఆయనకు కూడా నీవంటే ఎంత ప్రేమో కదా! నువ్వు నవ్వితే ఉబ్బితబ్బిబ్బైపోతాడు ఆ కామారి. 

   మరి *“మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశమానసా”* అని ఊరికే అన్నారా ఆ వసిన్యాది దేవతలు. 

    నీ నవ్వులో ఉన్న మధురిమముందు ఆ చదువుల తల్లి వీణానాదమే వెలవెల బోయిందటగా. *“నిజసల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్ఛపీ”* అని వాళ్ళువీళ్ళూ చెప్పుకుంటుంటే ఈ విషయం తెలిసింది. 

    మా ఆది శంకరులు కూడా సౌందర్య లహరిలో *“విపంచ్యా గాయంతీ వివిధమపదానం పశుపతేః.. ”* అంటూ మొదలయ్యే ఓ శ్లోకంలో ఈ విషయాన్నే చెప్పారు. 

    సరస్వతీ దేవి నీ దగ్గర కూర్చొని, మీ ఆయన లీలలను తన వీణ కచ్ఛపిపై గానం చేస్తోందట. నువ్వేమో పొంగిపోయి, “భలే పాడుతున్నావ్!” అన్నావట. అసలు నీ మాటలలో ఉన్న మాధుర్యం ముందు నా వీణానాదం మరీ తీసికట్టుగా ఉందనుకుంటూ, ఆవిడా గభాలున ఆ వీణను మూటకట్టేసిందట. 

    ఇక్కడ ఇంకొక విషయం.. మీ ఆయనన్నా, మీ ఆయనను కీర్తించేవారన్నా నీకు ఎంతిష్టమో కదా! 

 *“ఓ మహా కామేశ మహిషీ”* అని పిలిస్తే చాలు పొంగిపోతావ్. అవున్లే అసలు ఉన్నదంటూ మీ ఇద్దరే కదా! 

    ఈ సృష్టి మొత్తం లయం చేసేసి, నీ మగడు ఆనంద తాడవం చేస్తుంటే.. అసలు పోలికే లేనంత అందమైన చుబుకం గల *“అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా”* వైన నువ్వు, నీ పల్లవముల వంటి అందమైన చేతులను అలా ఆ చుబుకం కింద పెట్టుకుని, ఆ తాండవాన్ని చూసి పరవశించిపోతూ.. *“మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి”గా* ఉన్నావు. 

    నువ్వసలే *“లాస్యప్రియ”వు* కూడానాయే. 

   ఎంతటి *“మహాలావణ్య శేవధి”వి*. *“ఆబ్రహ్మకీటజనని”వి* అయినా, 

    నీకు మీ ఆయన తొడమీద కూర్చుని, *“శివకామేశ్వరాంకస్థా”* అని అనిపించుకోవడమే ఇష్టం.  

    అందుకే మా కాళిదాసు 

*"వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే*

*జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ”* అంటూ మీ ఇద్దరి అభేదాన్ని చూపిస్తూ, నమస్కరించుకున్నాడు. 

  అసలు మా కాళిదాసు నీపై వ్రాసిన *“దేవీ అశ్వధాటి”* స్తోత్రం చదివితే తెలుస్తుందమ్మా! మా కవుల కవిత్వంలోని సొగసు. 

    సంగీతం ఏమాత్రం రానివాడికి కూడా తనకు సంగీతం వచ్చేసునేమో అన్న భ్రమకలిగించేంత అందంగా ఉంటుందా శ్లోకాల నడక.


*చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవన వాటీషు నాకి పటలీ* 

*కోటీర చారుతర కోటీ మణీ కిరణ కోటీ కరంబిత పదా* 

*పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీ మగాధిప సుతా* 

*ఘోటీఖురా దధికధాటీ ముదార ముఖ వీటీరసేన తనుతామ్* 


    ఆహా! మొదటి శ్లోకమే ఎంత అందంగా ఉందో చూశావా? 

    ఇలాంటివి 13 శ్లోకాలున్నాయి ఆ స్తోత్రంలో. ఈ శ్లోకాలలో కూడా ఒకచోట నీకు మీ ఆయన మీద ఉన్న ప్రేమను రసవత్తరంగా చెప్పాడు కాళిదాసు. 

   *“శంభా వుదార పరిరంభాంకుర త్పులక దంభానురాగ పిశునా..”* అంటాడు. 

    మీ ఆయన నిన్ను గాఢంగా ఆలిగనం చేసుకున్నప్పుడు నీకు కలిగే పులకరింతలు నీకా పరమేశ్వరునిపై ఉన్న అపారమైన అనురాగానికి సూచికలట. 

    మీ ఆయన కోసమే చెప్పుకుంటూ కూర్చుంటే నీకూ, నాకూ ఇద్దరికీ ఇక ఈ లోకం పట్టదు. 

    కనుక కాసేపు వేరే విషయాలు కూడా మాట్లాడుకుందాం.


    అమ్మా! అసలు మీ అన్న దశావతారాలను అలా నీ చేతివేళ్ళ గోళ్ళలో నుండి అలా ఎలా పుట్టించేశావమ్మా! చిత్రం కాకపోతేను. 

   *“కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః”* అన్న మాట తలచుకుంటేనే భలేగా ఉంటుంది. ఇక్కడే ఇంకొక్క విషయం చెప్పాలి. మళ్ళీ మరచిపోతానేమో! 

   *“సాగరమేఖలా”* అనే నీ పేరు కూడా నాకెంత ఇష్టమో!  

     సముద్రాన్నే వడ్డాణంగా పెట్టుకున్న దానివంటకదా! ఎంత బావుంటుందో తెలుసా ఈ మాట. 

     ఈ నీ నామాన్నే మా ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు 

   *“తేనెలతేటల మాటలతో, మన దేశ మాతనే కొలిచెదమా..”* అనే ఓ చక్కని గీతంలో అందంగా వాడారు. 

  *“సాగర మేఖల చుట్టుకొని -  సురగంగ చీరగా మలచుకొని”* అంటూ నీ నామాన్ని దేశమాతకు అన్వయిస్తూ వ్రాశారు. 

    అసలు మా సినీ కవులు కూడా నీమీద పాట రాయాల్సిన సందర్భం వచ్చినప్పుడు చెలరేగిపోతారు. 

    ముందుగా మాత్రం నేను మా మల్లాది రామకృష్ణశాస్త్రి గారినే చెబుతాను. 

*“లలిత భావ నిలయ నవ రసానంద హృదయ*

*విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ*

*మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ*

*సుమరదన విధువదన.. దేవి…”* అంటూ ఆయన వ్రాస్తే, 

    ఆ సాహిత్యానికి మా ఘంటశాల వేంకటేశ్వర్రావు గారు బాణీ కట్టారు. 

    మల్లాది వారి సూచన మేరకు, ఈ పాటలో 

    సరస్వతీ దేవి కోసం వచ్చినప్పుడు సరస్వతి రాగంలో, 

     శ్రీదేవి కోసం వచ్చినప్పుడు శ్రీరాగంలో, 

     లలితాదేవి కోసం వచ్చినప్పుడు లలితరాగంలో స్వరరచన చేశారు మా ఘంటశాల. 

     ఇలాంటి పాట వింటూ నాలాంటి పామరుడే పులకించిపోతుంటే.. 

   *“కావ్యాలాప వినోదిని”వి,* 

  *“రసజ్ఞ”వు.* *“కావ్యకాళా”* రూపిణివి అయిన నీవెంత మురిసిపోతుంటావో కదా! 

    ఆయనే వ్రాసిన *“శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా”* పాట కూడా మరో మేలిమి ముత్యం! 

   *“జగముల చిరునగవుల పరిపాలించే జననీ*

    *అనయము మము కనికరమున కాపాడే జననీ”* అంటూ.. 

   *“అనేకకోటిబ్రహ్మాండజనని”* వైన నిన్ను కీర్తిస్తూ.. 

   *“మనసే నీ వశమై స్మరణే జీవనమై*

    *మాయని వరమీయవె పరమేశ్వరి మంగళనాయకి”* అంటూ మా అందరి తరపునా ఆయనే ప్రార్థించేశారు.

    ఇక సముద్రాలగారి *“జననీ శివకామినీ..”*, పింగళిగారి *“శివశంకరీ..”* పాటలు కూడా మమ్మల్ని ఆనందడోలికల్లో మునకలేయించేవే.

    మా వేటూరి గారి సంగతైతే చెప్పనక్కరనే లేదు. 

*“అఖిలాండేశ్వరి చాముండేశ్వరి*

 *పాలయమాం గౌరీ*  *పరిపాలయమాం గౌరీ”* అంటూ మొదలయ్యే ఆ పాట, కాళిదాసు కవిత్వంలా సొగసుగా పరుగులు తీస్తుంది.

*“శుభగాత్రి గిరిరాజపుత్రి*  

 *అభినేత్రి శర్వార్ధ గాత్రి* 

 *సర్వార్థ సంధాత్రి* 

 *జగదేక జనయిత్రి”* ఇలా అద్భుతంతా సాగిపోతుందా పాట. 

    మీ ఆయన అయిన శర్వునిలో నీవు సగభాగం కాబట్టి *శర్వార్ధ గాత్రి* అన్నారు. గాత్రము అంటే శరీరం అనే అర్థం ఉంది కదా!  అలానే సర్వ కార్యసిద్ధిని ఇచ్చుదానవు కనుక *సర్వార్థ సంధాత్రి* అన్నారు. అసలు శర్వార్థ, సర్వార్థ అనే పదాలు వినడానికి కొంచెం ఒకేలా ఉన్నా, ఎంతటి భేదం ఉందో కదా వాటి మధ్య. అదీ మరి మా వేటూరంటే! 

    అదీ నీ కరుణ ప్రసరించిన వారి కవిత్వమంటే. 

    ఈరోజు  నీతో ఇలా ఏవోవో చెప్పేస్తున్నాను. 

    అప్పట్లో శివరాత్రికి మీ ఆయనకోసం, 

    శ్రీరామనవమికి మీ అన్నయ్యకోసం రెండుత్తరాలు వ్రాశాను. 

    వాళ్ళకు వ్రాసి, మీ అందరికీ తల్లినైన నాకు మాత్రం వ్రాయవా అంటావమోనని ఈ మాటలన్నీ అరచి మరీ చెబుతున్నాను. వింటున్నావు కదా! 

    ఇక్కడ వంటింట్లో పని చేసుకుంటున్న మా అమ్మకు ఏదో ఒకటి చెబుతూ, 

    మధ్యమధ్యలో “ఇదిగో అమ్మా, వింటున్నావా? ఓ అమ్మా!!” అని అరుస్తుంటాను. 

    మా అమ్మేమో, ఊ! చెప్పరా” అంటుంది తన పని తాను చేసుకుంటూనే. కాకపోతే ఆవిడకు ఇక్కడ ఒకింటి పనే కాబట్టి ఇబ్బంది లేదు. 

    కానీ నీ సంగతి అలా కాదు కదా! 

    అనంతకోటి బ్రహ్మాండాలన్నింటినీ పరిపాలించే తల్లివి. 

    లోకాలన్నీ తన బొజ్జలో దాచుకున్న ఆ పరమశివుని భార్యవు. *“సదాశివకుటుంబిని”వి.* 

    అందుకే, కోట్లాదిమంది పిలుపులలో నా పిలుపెక్కడ వినబడదో అన్న భయం చేత, ఇంకాస్త గట్టిగా అరచి చెబుతున్నాను. 

    *ఇదిగో అమ్మా! ఇటూ.. ఈవైపు.. నావైపు చూడు! నేనూ..* 

          *స్వస్తి!*


చాలా బాగుంది కదా!

తండ్రి లేని పిల్లలు

 *నాకు నచ్చిన శ్రీమతి శశికళ  ఓలేటి గారి కథ.*

             🌷🌷🌷

తండ్రి లేని పిల్లలు( కొత్త కథ) 


" సంధ్యా! ఆలస్యం అయిపోతోంది. లోపలికెళ్లి సాయమ్ ను, సమీర్ నూ పిలుచుకుని రా..", మెట్లమీద కూర్చుని షూలేస్ బిగించుకుంటున్న మనవరాలితో చెప్పారు రాఘవరావుగారు. 


మరో పదినిమిషాల్లో పదేళ్ల తమ్ముడు సమీర్ ను ఒకచేత్తో, వాడి షూస్, టై, బేడ్జ్ ఒకచేత్తో పట్టుకుని దాదాపు లాక్కుంటూ తెచ్చి కారులో కుదేసింది పదిహేనేళ్ల సంధ్య. ఈలోపున సైకిలు మీద చక్కర్లు కొడుతున్న పదమూడేళ్ల సాయం.. సైకిల్ ను గుమ్మం దగ్గరే పడేసి, బేగ్ తో ఫ్రంట్ సీట్ లో తాతగారి పక్కనే కూలబడ్డాడు. " బొయ్ బొయ్యంటు పక్కనే ఆగిన ఆటోలో మరో ఐదుగురు పిల్లలు ... ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు... రాఘవరావుగారి పెద్దబ్బాయి, రెండవ అబ్బాయి పిల్లలు. వాళ్లను చూసి సంబరంగా చెయ్యూపిన సమయ్ ను వాళ్లు నిరసనగా చూస్తూ.. మొహాలు తిప్పుకున్నారు. 


        నగరంలో ఉన్నవాళ్ల పిల్లలంతా చదివే ప్రముఖపాఠశాల చేరారు పిల్లలందరూ. కారు దిగగానే సంధ్యకు.. తమ మేనత్త రమ తన కూతురు సుమతో దిగడం కనిపించి స్నేహపూర్వకంగా సుమను పలకరించడానికి వెళ్లింది. సుమ సంధ్యను చూడనట్టే స్కూల్ లోపలికి పరిగెట్టింది. 


       రాఘవరావుగారు ఇదంతా క్రీగంట గమనిస్తూనే ఉన్నారు. పిల్లల మధ్య సయోధ్య తేవడం ఎలాగో తెలియడం లేదు. పిల్లలు సరే.. ముందు ఇంట్లో పెద్దవాళ్లే ఈ తండ్రిలేని పిల్లల మీద ద్వేషం సాధిస్తుంటే... ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదాయనకు. 


       రాఘవరావుగారి నలుగురు సంతానం ఏడాదిన్నర వయసు తేడాలతో పుట్టినవాళ్లే. గెజిటెడ్ రాంక్ లో ఆయన రిటయిర్ అయ్యేటప్పటికి, నలుగురూ మంచి స్థాయిలో స్థిరపడ్డారు. తండ్రి కట్టించిన విశాలమైన డాబా ఇంటిమీద రెండు డూప్లేలు, ఒక పెంట్ హవుస్ కట్టుకున్నారు. అమ్మాయికి వేరే చోట ఫ్లాట్ కొనిపెట్టారు. రాఘవరావుగారి ఆఖరికొడుకు పరశురాం. ముందునుంచీ చదువులో మహాచురుకు. జీవితంలో బాగా ఎదగాలి, తనకంటూ సమాజంలో ఒక ప్రత్యేకస్థానం సంపాదించుకోవాలని ఆశయాలతో వుండేవాడు. ఎందుకో ఆ కొడుకంటే తండ్రికి మహాప్రీతి. 


       బెంగుళూరులో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తూ తన కొలీగ్ ప్రీతిని ప్రేమవివాహం చేసుకున్నాడు. ముచ్చటయిన ముగ్గురు పిల్లలు, పదిలక్షలకు పైబడి జీతం, మంచియిల్లు... హాయిగా సాగిపోతున్న జీవితాన్ని అతని బిజినెస్ బగ్ చెదలా కుట్టడం మొదలుపెట్టింది. 


చాలామంది చేసే పొరపాటే అది. తాము పనిచేసిన సంస్థ తమవలనే ఇంత అభివృద్ధిలోకి వచ్చిందంటే.... తామే స్వయంగా కంపెనీ తెరిస్తే మరిన్ని అద్భుతాలు చేయగలమని అనుకుంటూ ముందుకురికేయడం!


 తండ్రి ఇచ్చిన ఆస్థులు, భార్యకున్న ఆస్థులు కరిగించి, తన కొలీగ్స్ ఇద్దరితో బయటకొచ్చి మొదలుపెట్టిన బిజినెస్.... ఫార్ట్యూన్ 500లో ఉన్న  కంపెనీప్రాజెక్టులు సంపాదించి నాలుగేళ్ళు మంచిలాభాలలోనే నడిచింది.కంపెనీ  

ఎక్స్ పాన్షన్ అంటూ వివిధసిటీల్లో ఆఫీస్ లు తెరిచారు. వాటికి తగ్గ ప్రాజెక్టులు చేతిలో లేక.. అవన్నీ మూతపడే సమయానికి... ఒక పార్ట్నర్ తన వాటా లాభాలతో బయటకు వెళ్లిపోయాడు. అతనితో పాటూ వీరి క్లయంట్లు కూడా బయటకు నడిచిపోయారు. 

కల్లోలకడలిలో నావలా ఉన్న కంపెనీని మరో రెండేళ్లు నడిపించి, పరశురాం చేతులెత్తేసాడు. 


           భర్తకు అతని విజయాల్లో,అపజయాల్లో వెన్నంటి ఉండాల్సిన ప్రీతి , అతనికి పెద్ద ప్రతికూలమై కూర్చుంది. ఎలా అలవాటు చేసుకుందో తెలీదు పేకాటకు బానిసయింది. హై సొసైటీ లేడీస్ తో క్లబ్ లో హైస్టేక్స్ కు ఆడుతూ... రాత్రీపగలూ అక్కడే గడిపేంత పతనావస్థకు చేరింది. 

పిల్లలను పనివాళ్లమీద వదిలేసి వ్యసనంలో కూరుకుపోయిన భార్య, నష్టాలవూబిలో వ్యాపారం... ఎక్కడా చిరువెలుగు కూడా కనిపించని జీవితం పరుశురాంను ఆత్మహత్యవేపే. మొగ్గుచూపేలా చేసాయి. రాఘవరావు దంపతులకు పుట్టెడు గర్భశోకం మిగిలింది. 


             ముందునుంచీ అత్తింటివేపు పెడమొహమే అయిన ప్రీతి.. పిల్లలతో పుట్టింటికి చేరి భంగపడి , తప్పనిసరై అత్తగారింటికే రావలిసి వచ్చింది. 

❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️


మార్చినెల మొదలవుతోంది. మెల్లగా సూర్యుడు నడినెత్తిమీదకు పాకుతూ చిరచిరలాడిస్తున్నాడు. పెరట్లో మామిడిచెట్టు చుట్టూ ఉన్న చప్టామీద కూర్చుంది సంధ్య. టెన్త్ బోర్డ్ పరిక్షలయిపోయాయి. తమ్ముళ్లిద్దరూ అక్కడే గట్టు మీద కూర్చుని వాళ్లు సేకరించిన కార్డులేవో చూసుకుంటూ కూర్చున్నారు. ముగ్గురినీ ముప్పిరిగొన్న వంటరితనం!

భవిష్యత్తేమిటో తెలీని అయోమయం!

ముద్దుముచ్చట్లలో ముంచితేల్చిన నాన్న ఒక్కసారి వైదొలగిపోయాడు.!

కడుపులో పెట్టుకుని దాచుకోవలసిన తల్లి నిశ్చేష్టగా, గదిని విడిచిరాదు. !

తాము బతికిన్నామో లేదో కూడా కనుక్కోదు.

అమ్మానాన్నలా బాధ్యత తీసుకున్న తాతగారూ, బామ్మా వయసు పరిమితులకు లొంగిపోతున్న పరిస్థితి. !

తండ్రితో వచ్చినప్పుడు తెగ గారం చేసిన బంధువులకు తామిప్పుడు పెనుభారం.!

వారి ఆర్ధికప్రణాళికల్లో తమకోసం పక్కన పెట్టాలిసిన భాగం , వారిలో మిగిలిస్తున్న అసహనం! 

అక్కరలేని తద్దినంలా తమ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టి... తమకు మిగలని హక్కులను సాధించికోడానికి తయారయిన వీరంటే మిగిలిన పిల్లలకు అభద్రత! 


ఇన్ని అపసవ్యాల మధ్య.... ఆ ముగ్గురూ ఒకరికి ఒకరుగా బతకాల్సిన పరిస్థితి! 

" ఎందుకు నాన్నా! అంత మోసం చేసావు నన్ను. నా ఒళ్లో తలపెట్టుకుని పడుకున్నావ్. అమ్మనీ, తమ్ముళ్లనూ బాగా చూసుకోమన్నావు. నా చదువులతల్లి సంధ్య అన్నావు. ఎందుకో క్షమించమన్నావు. పొద్దున్నకే నువ్వు కాల్చుకుని చచ్చిపోయావ్!" ......... " డబ్బెందుకు నాన్నా! నువ్వుంటే చాలదా మాకు. తప్పంతా తనమీద పడేసుకుని అమ్మ క్రుంగిపోయి మాకు తను ఉన్నా లేనిదయింది. తాతగారు రక్షణకవచంలా నిలబడ్డా చుట్టూ కనబడని నిరాదరణ.... ఏం కోరి మమ్మల్ని ఇలా వదిలేసావు?..." .... సంధ్య ఆలోచనలు తెగడం లేదు. ఆడుకుంటూనే .... సజలనేత్రాలతో శూన్యంలోకి చూస్తూ ఆలోచనల్లోకి పారిపోతున్న అక్కను దిగులుగా చూస్తున్నారు సాయం, సమయ్! 


" అమ్మా! "...... పెద్దగా కేకపెట్టి... హఠాత్తుగా తలపట్టుకుని కూలబడిపోయింది సంధ్య. నుదిటిమీదనుంచి బొటబొటా కారిపోతున్న రక్తం. పక్కనే కాగితం చుట్టిన చిన్నరాయి. బహుశా కేటాపల్ట్ తో పైడాబా మీంచి విసిరినట్టున్నారు. " లీవ్ దిస్ ప్లేస్ యూ ఆర్ఫన్స్"... అని ఉంది ఆ చీటిలో. సంధ్య గబగబా దాన్ని ఉండచుట్టి పడేసింది. 

రక్తశిక్తమయిన మొహంతో అలాగే స్థాణువులా నిలబడిపోయిన సంధ్య తేరుకునే సరికి.... చుట్టూ ఇంటిల్లిపాదీ! అన్నాళ్లలో తన గది వదిలిరాని ప్రీతి... పరుగున మేడదిగొచ్చి కూతుర్ని ఒడిసిపట్టుకుంది. కొంగుతో గాయాన్ని నొక్కిపెట్టి.... భీతహరిణిలా చూస్తూ... మాటలకు తడబడుతూ నత్తుతున్న  తల్లిని చూసేసరికి..... సంధ్య ఇన్నిరోజులూ కూడగట్టుకుని నటిస్తున్న ధైర్యమూ కరిగి నీరయిపోయింది. తల్లిని పట్టుకుని బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది. 


తల్లీబిడ్డలను ఆ స్థితిలో చూసి.... అన్నాళ్లూ కరుకుగా ప్రవర్తిస్తున్న వారందని మనసులూ కూడా ద్రవీభవించాయి. 


             సంధ్య పెద్దనాన్న డాక్టరు. గాయం కడిగి, ఫస్టెయిడ్ చేసి, కుట్లు వేసి సంధ్యను మంచిమాటలతో సాంత్వన పరిచారు. 


ఆ ఇంటిలో మారిన పరిస్థితులను, పిల్లల అమానవీయ ప్రవర్తన గమనిస్తున్న రాఘవరావు దంపతులు ఆ సాయంత్రం కుటుంబసభ్యులనందరినీ సమావేశ పరిచారు. 


సంధ్య తనను ఎవరుకొట్టారో నోరిప్పలేదు. అస్థిమితంగా కదులుతున్న ఆ ఇంటిపెద్ద మనవడు ధీరజ్ చేసినపనే అని అందరికీ తెలుస్తోంది. 


ఇంతలో అక్కడి మౌనాన్ని ఛేదిస్తూ సంధ్య నోరిప్పింది. 

" తాతగారూ! మమ్మల్ని ఏదయినా అనాధాశ్రమానికైనా, ఎవరికయినా దత్తతగానయినా ఇచ్చేయండి. మేము ఇక్కడ ఉండకూడదు. మాకు హక్కు లేదు...." ఆమాటలకు ఉండేలు దెబ్బతిన్న పక్షిలా గిలగిల లాడిపోయారు ఆ వృద్ధదంపతులు.


" సంధ్యా! చిన్నపిల్లవు ఏంటా పెద్దమాటలు. మా మరిది పిల్లలు ...మీరుమా బాధ్యత. అలా పిచ్చిగా మాట్లాడకు..."... పెద్దకోడలు గట్టిగా అరిచింది. 


" మరేం చెయ్యాలి దొడ్డా? మా నాన్న ఈఇంట్లో ఏ హక్కులూ మిగుల్చుకోలేదు.అన్నీ తీసేసి వాడేసుకున్నాడు. మా పెంట్ హౌజ్ కూడా పెద్దనాన్నకు ఇచ్చేసి డబ్బు తీసుకున్నారు. మేము ఏ హక్కుతో ఇంకా అక్కడ ఉండాలి? మరి మీ పిల్లలకు కోపం రావడం సహజమే కదా! మా అమ్మ చదువుకుని ఒకప్పుడు పెద్ద ఉద్యోగం చేసేది. తను మా నాన్నకూ సపోర్ట్ చెయ్యలేదు. మమ్మల్నీ చూసుకోవడం లేదు. మా చదువులకీ, పోషణకీ మీరెందుకు మంత్లీ కంట్రిబ్యూట్ చెయ్యాలి? వెరీ అన్ ఫెయిర్! మేము ఆర్ఫన్స్ మి దొడ్డా! మా నాన్న పిరికివాడులా లోకంలోంచి పారిపోయాడు. మా అమ్మ మాకోసం ఏమీ చెయ్యదు. మరి మేము ఎవరికి చెందినవాళ్లం? చెప్పండి"


" సంధ్య తల్లీ! ఎందుకురా అంతలా మనసు కష్టపెట్టుకుంటున్నావ్? ఈ ఆరునెలల్లో మీకు ఏమన్నా లోటు రానిచ్చామా నేను కానీ తాతకానీ? చెట్టంత కొడుకు పోయినా, వాడిపిల్లల్లో వాడిని చూసుకుంటున్నాం.....".... రాఘవరావుగారి భార్య గద్గదస్వరంతో అంటుంటే, అడ్డుకుని సంధ్య...

.

" బామ్మా! మీరు నిజానికి మాకు అర్హతున్న దానికన్నా ఎక్కువ చూసుకుంటున్నారు. మా అమ్మ గది వదలకపోయినా... అన్నీ అక్కడికే పంపుతారు. మాకు ఏదంటే అది చేస్తున్నారు. బెస్ట్ స్కూల్ లో వేసారు తాతగారు. ఈ ప్రోసెస్ లో మిగిలిన పిల్లలు ఎంత కోల్పోతున్నారో మీరు గమనించడం లేదు. పదిమందిపిల్లలపై చూపించే ప్రేమ ఇప్పుడు మా ముగ్గురిమీదే కేంద్రీకరిస్తున్నారు. కుర్రాళ్లు ఆటల్లోనో, స్కూల్లోనో గొడవపడితే ... సాయం, సమయ్ లను మినహాయించి.... మిగిలిన వారిని దెబ్బలాడతారు. ఇది వరకూ తాతగారి కారులో స్కూల్ కెళ్లే వాళ్ళు ఇప్పుడు ఆటోలో వెళ్లాలి. ఇదివరకటి ఆదివారం కుటుంబసమావేశాలు, తాతగారితో సినిమాలూ, హోటల్ కూ వెళ్లడాలు ఆగిపోయాయి.తాతగారి కాలమంతా మాకోసమే వెచ్చిస్తున్నారు. ఎందుకంటే మాకు నాన్న లేడు. వాళ్లకున్నారు. పెద్దమ్మలు కానీ, అత్తకానీ పొద్దున్నే టిఫిన్ చెయ్యకపోతే పిల్లలు కిందకొచ్చి, బ్రేక్ ఫాస్ట్ తినేవారు. కానీ ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర మేము ముగ్గురం ఆవాటా తినేస్తూ. ధీరజ్ అన్న ఆటల్లో ఫస్ట్. నేను చదువులో బ్రైట్. ఇద్దరినీ పోలుస్తూ..... తండ్రిలేకపోయినా నేను బాగా చదువుతున్నానని నాకే కితాబులిస్తుంటే.... వాళ్లకు ఎందుకు నచ్చాలి? మా అమ్మానాన్నలకే అక్కరలేని మాకు జాలితో వచ్చే ఈ ప్రివిలేజెస్ వద్దండి తాతగారూ. మేము అనాధలుగా బయట బతకడం సమంజసం. మాకు మమ్మల్ని గారంగా చూసే పెద్దనాన్నలు , పెద్దమ్మలూ కావాలి. సుమతో సమంగా ముద్దలు పెట్టే అత్తకావాలి. వాళ్ల బడ్జెట్ నుంచి మాకోసం కేటాయించే పైసలు వద్దు. మేము తండ్రిలేని పిల్లలుగా ఈ ఛారిటీ తీసుకోలేము. ...".... తెలుగూ, ఇంగ్లీషు కలగలుపుతూ ఆ పదిహేనేళ్ల పిల్ల ఆవేశంతో , ఆవేదనతో తన మనసు పరుస్తుంటే.... అక్కడ అందరి తలలూ సిగ్గుతో అవనతమయ్యాయి. 


అందరికన్నా ముందు ప్రీతే నోరిప్పింది. " ఐ యాం వెరీ సారీ సంధ్యా...."...... తల్లిమాటలను షార్ప్ గా ఖండిస్తూ... సంధ్య...


" షేమ్ ఆన్ యూ అమ్మా! యు ఆర్ ఎ డిస్ గ్రేస్ టు మదర్ హుడ్ అండ్ ఉమన్ హుడ్ అమ్మా. ఏ త్యాగాలు చేసావు నువ్వు? నాన్నకు నువ్వు సపోర్ట్ గా నిలబడివుంటే , తను మనకు మిగిలి ఉండేవాడు. మా బాధ్యత ఎంత తీసుకున్నావు? నీ చదువు, నీ తెలివితేటలు మరిచిపోయి డిప్రెషన్ అనే కకూన్ లోకి దూరిపోయి మమ్మల్ని కూడా పారసైట్స్ చేసావు. షేమ్ ఆన్ యూ! వీళ్లు మమ్మల్ని ఎందుకు పోషించాలి? చెప్పు! అందరి రైట్స్ మాకోసం ఎందుకు త్యాగం చెయ్యాలి? ఈ ఓల్డేజ్ లో గ్రాండ్ పా కు మా రెస్పాన్సిబిలిటీ ఎంత భారమో ఆలోచించావా? గదిలో శూన్యంలోకి చూస్తూ గడిపేయడం ఎస్కేపిజమ్ అమ్మా. నువ్వు పిరికిదానివి. మమ్మల్ని పెంచలేవు. అందుకే వి ఆర్ ఆబ్ సల్యూట్ ఆర్ఫన్స్ టు ద కోర్......."...। పిల్ల ఏడుస్తోంది.

" అలా అనకు సంధ్యా! నేను మారతాను. నేను మిమ్మల్ని చూసుకుంటా. మనం వెళ్లిపోదాం. నేను మళ్లీ ఉద్యోగంలోకి వెళ్తా! మీ నాన్నలాగే చూసుకుంటా. ఐ ప్రామిస్. నమ్ము సంధ్యా! ..... పిలలను పొదువుకుని దెబ్బతిన్న తల్లిపక్షిలా కదిలిపోతోంది ప్రీతి ! 


🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼


మరో నెల్లాళ్లలో పిల్లలంతా కైలాసగిరి ట్రెక్కింగ్ కు వెళ్లినప్పుడు సంధ్యతో అన్నాడు ధీరజ్... " సంధ్యా! నువ్వు ఆ రోజు నాపేరు ఎందుకు బయటపెట్టలేదు? నువ్వు నన్ను చూసావు కూడా డాబామీద. మోరోవర్ ఆరోజు ఎందుకంత ఆవేశంగా మాట్లాడావు? ....

" అన్నా! ఆరోజు నేను అలా నా మనసులో బాధ బయటకు చెప్పడం వలనే కదా... ఈరోజు మనమంతా స్నేహంగా ఉన్నాము. మా అమ్మ ఉద్యోగానికి వెళ్తోంది. మా నాన్నలేకపోయినా మేమూ గౌరవంగా బతుకుతాము ఇకముందు. మేము ఎప్పటికీ పోగొట్టుకున్నామనుకున్న కుటుంబం ప్రేమ మళ్లీ మాకు దొరికింది. ఇది చాలు అన్నా మాకు. తండ్రిలేని పిల్లలన్న సానుభూతి వద్దు. ...మా నాన్న అది ఎప్పటికీ హర్షించడు.ీ " 


తనకన్నా రెండింతలు మెచ్యూరిటీతో అందరి మన్ననలూ పొందిన సంధ్యను చూసి..." నువ్వు లైఫ్ లో చాలా పైకి వస్తావు సంధ్యా. ఐయాం సో ప్రౌడ్ ఆఫ్ యూ" అన్నాడు ధీరజ్


ధీరజ్ మాటలు నిజం చేస్తూ సంధ్య.. చాలా గొప్పచదువులు చదివి... తండ్రి ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే... తన తమ్ముళ్లతో కలిసి, తల్లి గైడన్స్ లో "పీ ఆర్ సాఫ్ట్ సొల్యూషన్స్" అనే సాఫ్ట్ వేర్  కంపెనీ పెట్టి, పదేళ్లలో పదిదేశాలలో ....వేల ఉద్యోగులతో విజయవంతంగా విస్తరించి...సాయంసంధ్యా సమయ్ లు ... తండ్రిలేని పిల్లలయినా ఎంత పైకి వచ్చారని నలుగురిలో గొప్పమెప్పుపొందడం కొసమెరుపు! 


శశికళ ఓలేటి

21-2-2020

నువ్వు చాలా అందం గా వున్నావ్

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*నాకు నచ్చిన వింజమూరి వెంకట అప్పారావుగారి పోస్టు* 

              🌷🌷🌷

#నువ్వు చాలా అందం గా వున్నావ్!!.

👌

తలుపు ఎవరో కొడుతున్నారు !!

"పారాణి" వచ్చి తలుపు తీసింది!

ఎదురుగా ఓ 70 ఏళ్ల పెద్దాయన నిలబడి వున్నాడు!!!

"ఎవరు? ఎం కావాలి??" అని అడిగింది "పారాణి"

"మీ ఆయన వున్నారా??" అని అడిగాడు ఆ పెద్దాయన !!

"లేరండీ !! ఆఫీసుకెళ్లారు!" అంది అమాయకం గా "పారాణి"

"ఓహో!! నువ్వు చాలా అందం గా వున్నావ్!!" అన్నాడు .

"పారాణి" నిశ్చెస్టురాలయ్యిన్ది !!

ఏమిటీ...చూస్తె పెద్ద మనిషి లా వున్నాడు, నా తండ్రి వయస్సువాడు, 

ఇలా అంటున్నాడెమిటీ అని!!

"పారాణి" తలుపు ధడాలున వేసేసింది!!

ఇలా 4,5 రోజులు ఆ పెద్దాయన రావడం,

"నువ్వు చాలా అందం గా వున్నావ్" అనడం జరుగుతూనె వుంది !!

ఇక ఉండబట్టలేక తన భర్త కి చెప్పింది, "పారాణి"

"ఔరా !! వాడీ అంతు... నేను తెలుస్తానుండు...వాడు ఈ సారి వచ్చినప్పుడు

 వాడిని మాటల్లో పెట్టు...నేను తలుపు చాటునే వుంటాను!!" అన్నాడు 

"పారాణి" భర్త ,"మన్మధ రావు"!!

తెల్లవారింది !!

పెద్దాయన వచ్చాడు!!

తలుపు కొట్టాడు!!!

"పారాణి" తలుపు తీసింది!!

"నువ్వు చాలా అందం గా వున్నావ్!!" అన్నాడు పెద్దాయన!

తలుపు చాటున "పారాణి" భర్త నక్కి వున్నాడు !!

"నాకు తెలుసు...మీరు రొజూ చెప్పక్కర్లేదు ....." అని ఇంకా ఏదో 

చెప్పబోయింది "పారాణి"..

వెంఠనె మన పెద్దయాన , చేతులు రెన్దూ జోడించి .....

"అద్గదీ !!..నాక్కావలసింది అదే!!...ఇదే ఆత్మా విశ్వాసమ్ తో మీ ఆయనకీ 

తెలియ చెయ్యి, నువ్వూ అందంగా ఉంటావని, ఎందుకంటే నాకు నీ వయసున్న కూతురు వుంది , రొజూ మీ ఆయన మా ఇంటి మీదుగా వెళ్ళేటప్పుడు, మా ఇంటికేసి, మా అమ్మాయికేసి, చూస్తూ, వెకిలి నవ్వులు 

నవ్వుతూ వెళుతూ వుంటాడమ్మా.  మాకు కాస్త ఇబ్బందిగా ఉంటోంది.  ఆ 

విషయం మీ ఆయనికి తెలియాలనే, నిన్ను ఇబ్బంది పెట్టాను.  ఏమీ అనుకోకమ్మా!" అంటూ కళ్ళ  జోడు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆ పెద్దాయన!

👌🏿🍂👌🏿🍂👌🏿🍂👌🏿🍂

మొగలిచెర్ల

 *భక్తి..సేవ..ఫలితం..*


"నా పేరు లీలావతి..ఎల్లుండి శుక్రవారం నాడు మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దకు రావాలని అనుకుంటున్నాను..పదకొండు రోజులు అక్కడే ఉండాలని అనుకున్నాను..వసతి చూపించగలరా?." అని ఆ యువతి నన్ను ఫోన్ ద్వారా అడిగింది.."ఈవారం ప్రత్యేకంగా మీకు కేటాయించడానికి రూములేవీ ఖాళీ లేవండి.." అన్నాను.."ప్రత్యేకంగా రూము వద్దండీ..నేను స్వామివారి మంటపం లోనే ఉంటాను..అక్కడ ఉండటానికి అనుమతి ఇవ్వండి అని అడుగుతున్నాను.." అన్నది.."అలా అయితే సరేనమ్మా..మీరు రండి.." అని చెప్పాను.."అలాగేనండీ.." అన్నది..


ఆ ప్రక్క శుక్రవారం నాతో ఫోన్ లో మాట్లాడిన లీలావతి గారు ఉదయం 10 గంటలకు మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దకు బస్సులో వచ్చారు..ఆమెతో పాటు మరో యువతి కూడా వచ్చింది..శుక్రవారం నాడు శ్రీ స్వామివారి మందిరం శుభ్రం చేసే కార్యక్రమం ఉంటుందని పాఠకులకు తెలుసు..లీలావతి గారు, ఆమెతో వచ్చిన యువతి ఇద్దరూ నా వద్దకు వచ్చారు.."అయ్యా..మీతో మాట్లాడిన లీలావతి ని నేనే..ఈమె నా కూతురు..పేరు పుష్పవల్లి..అమ్మాయికి కొన్ని సమస్యలున్నాయి..ఈ స్వామివారి వద్ద కొన్నాళ్ళు ఉంటే..ఆ సమస్యలు తీరిపోతాయని ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చాము..మాది పల్లెపాలెం.." అన్నది.."అమ్మా..అందరితో పాటు వుండగలము అనుకుంటే..మందిరం వెనకాల ఒక షెడ్ ఉన్నది..అందులో వుండండి..రాత్రికి ఇక్కడ మంటపం లో పడుకోవచ్చు.." అని చెప్పాను.."సరేనయ్యా.." అని మా సిబ్బంది చూపించిన షెడ్ లో వాళ్ళ సామాన్లు పెట్టుకొని వచ్చారు..స్వామివారి పూజకొఱకు వాడే వస్తువులను ఇతర ఆడవాళ్ళతో కలిసి తామూ శుభ్రంగా కడిగి పెట్టారు..ఆరోజు మధ్యాహ్నం హారతి తీసుకొని..అన్నదాన సత్రం వద్దకు వెళ్లి భోజనం చేసి వచ్చారు..శుక్రవారం సాయంత్రం స్వామివారి వెండి పాదాలను శుభ్రం చేసిన నీళ్లను తీర్ధంగా తీసుకొని..ఆపై హారతి తీసుకొని మంటపం లోనే వున్నారు..శని, ఆదివారాలు మా పనిలో మేము ఉండిపోయాము..


"అయ్యా..మొన్న వచ్చిన తల్లీకూతుళ్ల కు ఆరోగ్య సమస్యలేవీ ఉన్నట్లుగాలేవు..ఇద్దరూ బాగున్నారు..మరి వాళ్ళు ఏ బాధతో ఇక్కడికి వచ్చారో తెలియడం లేదు..ఉదయం మూడు గంటలకే ఇద్దరూ బావి వద్ద స్నానం చేసి..ఆ తడిబట్టల తోనే లోపలికి వచ్చి..నూటయెనిమిది ప్రదక్షిణాలు చేస్తున్నారు..స్వామివారి హారతి కళ్లకద్దుకొని..వెళ్ళిపోయి..మళ్లీ ఎనిమిది గంటల కల్లా మందిరం లోకి వస్తున్నారు..ఊరికే ఉండటం లేదు..మంటపం లో ఏమూల శుభ్రంగా లేకపోయినా..వెంటనే శుభ్రం చేస్తున్నారు..ఏదో ఒక సేవ చేస్తూనే వున్నారు..మరి వాళ్ళు ఏ కోరికతో స్వామివారి వద్దకు వచ్చారో తెలియడం లేదు..వాళ్ళ వల్ల ఎవ్వరికీ ఇబ్బంది లేదు సరికదా..స్వామివారి పూజా వస్తువులన్నీ శుభ్రం చేయడానికి సహాయం కూడా చేస్తున్నారు..." అని మా సిబ్బంది చెప్పారు..


పదకొండు రోజుల పాటు ఉంటానని చెప్పిన లీలావతి, ఆమె కూతురు నెల రోజులు గడిచినా స్వామివారి సన్నిధి లోనే వున్నారు..ఒకరోజు ఉదయం నా వద్దకు వచ్చి.."అయ్యా..మేము పదకొండు రోజులు వుందామని అనుకున్నాము..కానీ మేము నలభై రోజులు ఉండాలని అనుకుంటున్నాము..మా సమస్య తీరుతుందని ఆశగా ఉంది..మీరు పెద్ద మనసుతో అంగీకరించండి.." అన్నది.."అమ్మా..అడుగుతున్నానని అనుకోవద్దు..అసలు మీ సమస్య ఏమిటి..?" అన్నాను..


లీలావతి ఆమె కూతురు ముఖాముఖాలు చూసుకున్నారు..ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అనుకొని.."అయ్యా..మా అమ్మాయికి వివాహం జరిగి ఐదేళ్లు అయింది..సంతానం లేదు..ఈ అమ్మాయి అత్తగారు "పిల్లలు పుట్టని కోడలు మాకెందుకు..? మా అబ్బాయికి మేము ఇంకో పెళ్లి చేసుకుంటాము..నువ్వు వెళ్లిపో.." అన్నారట..ఇది ఏడుస్తూ మా ఇంటికి వచ్చింది..మేము మా అల్లుడితో మాట్లాడాము..అతను అటు తల్లిని ఒప్పించలేక..మాతో మీ అమ్మాయిని కొన్నాళ్ళు మీ దగ్గర వుండనియ్యండి..మా అమ్మ ను ఒప్పించి నా భార్యను తీసుకెళతాను..అని చెప్పాడు..అమ్మాయి కాపురం చక్కబడాలని స్వామివారి కి మొక్కుకున్నాను..నేనూ మా అమ్మాయి స్వామివారి సేవ చేసుకుంటూ కొన్నాళ్ళు ఇక్కడే ఉంటే..దీని కాపురం నిలుస్తుందని..స్వామి దయ చూస్తాడని నాకు నమ్మకం..ఆ నమ్మకం తోనే దీన్ని తీసుకొని ఇక్కడకు వచ్చాను.." అన్నది..నాకు చిత్రంగా అనిపించింది..ఈరోజుల్లో కూడా ఇటువంటి అత్తగార్లు ఉన్నారా?..అని.."మీ నమ్మకమే మిమ్మల్ని కాపాడుతుంది..మీ ఇష్టప్రకారమే నలభై రోజులూ వుండండి.." అన్నాను..ఇద్దరూ నమస్కారం పెట్టి వెళ్లిపోయారు..


మరో ఆరు రోజులు గడిచాయి..ఒకరోజు ఉదయాన్నే మొదటి బస్సు లో ముగ్గురు వ్యక్తులు వచ్చారు..ఇద్దరు దంపతులు..వాళ్ళ కుమారుడు..నేరుగా మందిరం లోపలికి వచ్చి.."ఇక్కడ లీలావతి అనే వారు ఉన్నారా?.." అని అడిగారు..మంటపం లో కూర్చున్న లీలావతి ని మా వాళ్ళు చూపించారు..ఈ ముగ్గురూ అక్కడికి వెళ్లారు..వాళ్లలో వాళ్ళు సుమారు గంటసేపు మాట్లాడుకుంటున్నారు..ఆ దంపతులు లీలావతి చేతులు పట్టుకొని..ఏదో చెపుతున్నారు..మరి కొద్దిసేపటికి లీలావతి కూతురు పుష్పవల్లి, ఆ దంపతులతో పాటు వచ్చిన యువకుడూ ఇద్దరూ కలిసి..స్వామివారి వద్ద అర్చన చేయించుకున్నారు..ఇద్దరూ స్వామివారి సమాధి దర్శనం చేసుకున్నారు..ఆ తరువాత లీలావతి నా వద్దకు వచ్చి.."అయ్యా..స్వామివారు మా మీద దయ చూపారు..మా వియ్యంకులు వచ్చింది..అమ్మాయిని కాపురానికి తీసుకెళతానని చెప్పారు..అల్లుడూ వచ్చాడు..అన్ని విషయాలూ మాట్లాడుకున్నాము..కాకుంటే..మేము స్వామివద్ద నలభై రోజులు ఉంటామని అనుకున్నాము..ఈనాటికి ఇంకా ఐదు రోజులు గడవాలి..అందుకని ఈ నలభై రోజులూ పూర్తయిన తరువాత..మంచిరోజు చూసి అమ్మాయిని పంపుతామని చెప్పాను..ఒప్పుకున్నారు..స్వామివారు దాని కాపురం నిలబెట్టారు.." అంటూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నది..


మరో ఐదురోజులు ఆ తల్లీకూతుళ్ళు ఎప్పటిలాగే స్వామివారి సేవ చేసుకుంటూ గడిపారు..నలభై ఒకటోరోజు..స్వామివారికి పూజ చేయించుకొని..సమాధి దర్శనం చేసుకొని..తమ గ్రామానికి వెళ్లిపోయారు..ఆ తల్లీకూతుళ్లకు స్వామివారి మీద ఉన్న అపరిమిత భక్తి విశ్వాసం మేము కళ్లారా చూసాము..అంతేకాదు ఆ భక్తి విశ్వాసాల ఫలితాన్ని కూడా ప్రత్యక్షంగా చూడగలిగాము..


ఈ సంఘటన జరిగిన రెండేళ్ల తరువాత..లీలావతి తన కూతురు అల్లుడు ..వాళ్లకు పుట్టిన పాప తో సహా స్వామివారి వద్దకు వచ్చి..స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..ప్రక్కరోజు అన్నదానం చేసింది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

వేంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీనగరం,

 జై శ్రీమన్నారాయణ్ ...

   భక్త మహాశయులకు

మనవి. 

శ్రీ ఆదిలక్ష్మి అలిమేలు మంగా సహిత శ్రీ (బాలాజీ ) వేంకటేశ్వర స్వామి దేవస్థానం  గ్రామం శ్రీనగరం, తుక్కుగుడా మున్సిపాలిటీ(మంఖాల్) లో భాగ్య నగరమునకు 22 కి.మి  దూరంలో దేవాద్రి,గరుడాద్రి ,కుక్కుటాద్రి, నీలాద్రి, బ్రహ్మ, విష్ణు ,మహేశ్వరులు గా పిలువబడే (త్రిగుణ పర్వతములు ) సప్త మహాపర్వతములలోని దేవాద్రిగా పిలువబడే మహాపర్వత గుహాంతరాళం లో  అత్యంత  వైభవంగా 3700 సంవత్సరాల క్రితం  స్వయంభుగా  వ్యక్తమై వెలసిన   శ్రీ  ఆదిలక్ష్మి ,అలిమేలు మంగా సమేత శ్రీ (బాలాజీ) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రప్రథమంగా శ్రీ పార్వతి  సమేతుడై ఈశ్వరుడు దర్శించి పూజించిన ఈ దివ్య సన్నిధిలో మరియు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వానమాముల జీయ్యర్ స్వామివారు, అత్తాన్ శఠగోపదేశికులవారు ,

ప్రతివాదిభయంకరం శ్రీ రంగాచార్యులవారు, శ్రీ రంగ రాజభట్టర్ వారు, ఆసూరిమరింగంటి లక్ష్మణాచార్యుల వారు ఇంకెందరో పీఠస్తులు మరియు భాగవతోత్తములు తీర్థపరిగ్రహణముచేసి మంగళాశాసనములు చేసిన ఈ మహాస్థలములో, అణువణున భగవంతుడు ఉన్నాడు అన్న నిదర్శంగా చూపే ఈ దివ్య సన్నిధిలో 


స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సర మాఘ బహుళ సప్తమి తేదీ 5-3-2021శుక్రవారం మొదలు తేదీ 14-4-2021 వరకు మండల దివసములు 

(41,రోజులు)

దేవాద్రిగా (దేవుని గుట్టగా) కొనియాడబడే మహాపర్వతమునకు మహా గిరి ప్రదక్షిణ మహోత్సవం లోక కళ్యానార్థం మరియు ఆలయ సర్వతోముకాభి వృద్ధిని కాక్షింస్తు  భగవత్ కైంకర్య సేవగా  అత్యంత వైభవంగా జరుగును.

కార్యక్రమం ప్రారంభం 

తేదీ 5-3-20221 శుక్రవారం ఉదయం 7-00 గంటలకు అఖండ  దీపారాధన  స్వామివారికి తిరుమంజన అభిషేకం,

శ్రీ విష్వక్సేనారాధన స్వస్తి పుణ్యాహవాచనం ,రక్షాబంధనం, కలశ స్థాపన  ,అర్చన అనంతరం  మంగళవాద్యములు ముందు సాగుతుఉంటే, భాగవతతోత్తములు వేదమంత్రములు ,దివ్య ప్రబంధం అనుసంధానం చేస్తూ,భక్తులు గోవింద నామాలను గానం చేస్తూ దేవాద్రి (దేవుని గుట్ట)మహాగిరి  పదక్షిణ 

 మహోత్సవం ప్రారంభం అవుతుంది. 

ఈ గిరి ప్రదక్షిణ మన పూర్వజన్మ సుకృతంవల్ల  భగవంతుడే తన అపార కృపతో మనను  అనుగ్రహించి అందించిన మహత్తరమైన, అద్భుతమైన సదావకాశంగా భావించి 

ప్రతి ఒక్కరు త్రికరణ శుద్ధితో ఈ మహత్కార్యంలో పాల్గొని భగవత్ కృపకు పాత్రులై తరించగలరు. 

సర్వేజనా సుఖినోభవంతు.  

 

భక్తులకు సూచనలు..


1. గిరి ప్రదక్షిణ ప్రతిరోజు ఉదయం గం 6-30 ని నుండి ఉ: 9-30 ని వరకు కొనసాగుతుంది. 

2. ప్రదక్షిణ పూర్తిచేసిన తరువాత స్వామి వారిని దర్శించండి. 

3.మహాగిరి ప్రదక్షిణ 1,2 లేదా 3 చేయవచ్చును. 

4. ప్రదక్షిణ సమయం లో భక్తులు గోవింద నామాలను గానం చేయాలి. 

5. 11రోజులు, 21రోజులు లేదా 41 రోజులు గిరి ప్రదక్షిణ చేయు భక్తులు( గోవింద మాల)ధారణ చేసి   నియమాలను పాటించాలి. 

6.అన్ని గ్రామాల్లో ఉండే భజన బృందాలు భజన చేస్తూ దేవాద్రి మహాగిరి ప్రదక్షిణ చేయండి. 

7.ఇతర వివరములకు ఈ క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

9848947776

9848056485

             ఇట్లు 

వంశపారంపర్య

ధర్మకర్తలు. 


అశేష భక్తకోటి.

మన మహర్షులు- 39

 మన మహర్షులు- 39


వైశంపాయన మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


ఈ రోజు మనం  వైశంపాయన మహర్షి గురించి తెలుసుకుందాం. ఈయన చాలా గొప్ప ఋషి, మహాభారతంలో ఈ ఋషి పేరు ఎక్కువ విని వుంటాం. అసలు వేదాల్ని అన్ని వైపులా వ్యాప్తి చేసింది ఈ వైశంపాయన మహర్షి.


వైశంపాయన మహర్షి ఒక ముని కొడుకు. చిన్నప్పుడే వ్యాస మహర్షికి అప్పగించాడు తండ్రి. వ్యాసుడు ఈ పిల్లవాడికి విద్యాబుద్ధులు చెప్పి కొంచెం పెద్దవాడయ్యాక యజుర్వేదం

నేర్పి ఈ వేదాన్ని అన్ని లోకాల్లోనూ వ్యాపించేలా చెయ్యమన్నాడు.


 వైశంపాయనుడు యజుర్వేదాన్ని ఇరవై ఏడు శాఖలుగా విభజించి తన శిష్యుల్తో అన్ని లోకాల్లోనూ వ్యాపించేలా చేశాడు.


 వైశంపాయనుడి ఆశ్రమంలో ఎంతోమంది శిష్యులు వేదం నేర్చుకుంటూ వుండేవాళ్ళు.


యాజ్ఞవల్యుడనే శిష్యుడు నాలుగు వేదాలు నేర్చుకుని గురుభక్తి కలిగి ప్రియశిష్యుడుగా ఉండేవాడు.


 కాని రానురాను యాజ్ఞవల్క్యుడికి గర్వం ఎక్కువయి పోయింది.


 అహంకారం ఉండకూడదని గురువుగారు ఎంత చెప్పినా వినకపోవడంతో తాను నేర్పిన వేదం తన దగ్గరే కక్కేసి వెళ్ళమని చెప్పి బయటకి పంపేశాడు యాజ్ఞవల్క్యుడుని వైశంపాయనుడు.


తనకి అత్యంత ప్రియమైనవాడు, గురుభక్తి వున్నవాడు అయినా సరే! అహంకారి కాబట్టి శిష్యుణ్ణి శిక్షించాడు వైశంపాయనుడు.


  వేదవ్యాసుడు తన విజ్ఞానంతో మహాభారతాన్ని రచించి విశ్వానికి ఉపయోగించేలా చేశాడు.

 మహాభారతాన్ని భూలోకంలో జనమేజయుడికి చెప్పడానికి

వైశంపాయన మహర్షిని పంపాడు. 


వైశంపాయనుడు గురువుగారికి మనస్సులో నమస్కారం చేసి వినేవారికి కోరిన కోరికలిచ్చేది, జన్మజన్మల పాపాన్ని పోగొట్టేది, ధర్మార్థ కామమోక్షాలకి గొప్ప సాధనమైంది, సత్యవాక్యాలతో వంద వేల శ్లోకాలతో వున్నది, వ్యాసమహామునితో వ్రాయబడింది అయిన భారతాన్ని జనమేజయుడికి వివరంగా చెప్పాడు.


జనమేజయుడు మళ్ళీ సందేహాలు అడిగాడు. ..


యుద్ధం తర్వాత పాండవులు కౌరవులు స్వర్గానికి వెళ్ళి ఎక్కడ వున్నారు? అని


వైశంపాయనుడు రాజా! కొంచెం పుణ్యం చేసుకున్న వాళ్ళు ముందు స్వర్గానికి వెడతారు. తర్వాత నరకానికి వెడతారు. దుర్యోధనుడు వీరస్వర్గం పొందాడు. కాబట్టి ముందు స్వర్గానికి వెళ్ళి తర్వాత కలిలో కలిసిపోయాడు. అతని తమ్ముళ్ళు రాక్షసులయ్యారు అని చెప్పాడు.


ఎవరెవరు ఎక్కడెక్కడ చేరారో చెప్తాను విను. అర్జునుడు నారాయణుడి ప్రక్కన చేరాడు, కర్ణుడు ద్వాదశాదిత్యుల ప్రక్కన, భీముడు మరుద్గణాల్లో, నకుల సహదేవులు అశ్వినీ దేవతల్లోనూ ఉన్నారు అని చెప్పాడు వైశంపాయనుడు


ధృతరాష్ట్రుడు కుబేర లోకంలోనూ, పాండురాజు ఇంద్ర భవనంలో, అభిమన్యుడు

చంద్రుడిలో, ద్రోణుడు బృహస్పతిలో, భీష్ముడు వసువులో, ధర్మరాజు, విదురుడు ధర్మదేవతలో


ఇలా ఇంకా ఎవరెక్కడెక్కడ ఉండిపోయారో వివరంగా చెప్పాడు వైశంపాయనుడు.


 తర్వాత వైశంపాయనుడు జనమేజయుడికి హరివంశ కథలన్నీ చెప్పాడు.


పృథు చక్రవర్తి చరిత్ర, మన్వంతర వివరణ, కువలయాశ్వ చరిత్ర, త్రిశంకు చరిత్ర జాంబవతీ చరిత్ర, దత్తుని చరిత్ర, యయాతి చరిత్ర, ఇలా చాలాచాలా కథలున్నాయి ఇవన్నీ వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు.


 చివరగా జనమేజయుడు వైశంపాయనుణ్ణి అడిగి మోక్ష మార్గం గురించి కూడా

తెలుసుకున్నాడు.


వైశంపాయనుడు రాసిన 'నీతిప్రకాశిక' అనే గ్రంథంలో యుద్ధ నీతి గురించి తెలియచెయ్యబడింది.


 దాంట్లో సేనా నాయకుడి విధులు, సైనిక విన్యాసం, ప్రాచీక భారతదేశ శస్త్రాస్త్రాల గురించి, సుమారు నూట ముఫై ఆరు రకాల ఆయుధాల గురించి రాశాడు .యుద్ధం వివరంగా ఎలా చెయ్యాలి సైన్య సమీకరణ మొదలు ఎనిమిది సర్గలున్నాయి దీంట్లో.


 ఇంతటి మేధావిని గురించి తెలుసుకున్న మనం ఎంతో ధన్యులం.🙏🙏


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

3, మార్చి 2021, బుధవారం

తేనె గురించి సంపూర్ణ వివరణ - 4 .

 తేనె గురించి సంపూర్ణ వివరణ - 4 . 


 *   పౌత్రికం అనెడి తేనె  - 


        ఇది నల్లని తేనెటీగల వలన చెట్ల తొఱ్ఱలలో పెట్టబడును. ఉష్ణం కలిగించును. విదాహమును పుట్టించును . వేడిని పుట్టించి విరేచనం కలిగించును. విషము , ఛర్థి , పిత్తము , వాతములను పోగొట్టి మిక్కిలి హితము చేయును . 


 *  పౌష్పికము అనెడి తేనె  - 


       ఇది పచ్చగా ఉండును . విషహరము . 


 *  భ్రామరము అనెడి తేనె  - 


        దీనిని చిన్న ఈగలు సమకూర్చును.  రూపమునకు ఇది తెల్లగా , జిగటగా , తియ్యగా ఉండును . పిత్తమును పెంచును. అనారోగ్యము కలిగించును. వాత శరీరం కలవారు వాడవచ్చు . 


  *  మాక్షికం అనెడి తేనె  - 


        మంచి గంధపు చెట్ల నుంచి తీసినట్టి తేనె దీనికి "కిట్ని " అను పేరు కలదు. కొంచెం చేదు , వెగటు కలిగి రుచికరంగానే ఉండును . ఉష్ణమును , అగ్నిదీపనము ఇచ్చును . వాతము , మేహము , క్షయ , కుష్ఠు , నేత్రరోగములు , ఛర్థి , ఉపిరిగొట్టు నొప్పి మొదలైన వానిని , విషదోషములను పోగొట్టును . వ్రణములను మాన్పును తేనెలన్నింటిలో మిక్కిలి శ్రేష్ఠమైనది . 


  *  సౌషిరము అనెడి తేనె  -  


        నురుగు రంగులో ఉండును . రుచిగా ఉండును. శ్వాస , కాస రోగ హరమై పథ్యకారిగా ఉండును . 


  *  క్షాద్రం అనెడి తేనె  - 


         ఇది పింగళ వర్ణముగా ఉండే ఈగలతో ఏర్పరచబడును. మలబద్దకం కలిగించును . అగ్నిమాంద్యం కలుగ చేయును . మేహమును హరించును . వీర్యవర్ధకము , చలువని ఇచ్చును . బలాన్ని కలిగించును. ఆరోగ్యకరం . 


                              సమాప్తము 


 మరింత విలువైన సమాచారం నేను రచించిన గ్రంథముల యందు ఇవ్వడం జరిగింది. 

    

  

     గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు