3, సెప్టెంబర్ 2020, గురువారం

నేను



 నేను అన్న దగ్గరే మన బాధ మొదలవుతుంది.

నేను అన్యాయం అయిపోయాను*
నాకు అవమానం జరిగింది*
నన్ను నిర్లక్ష్యం చేసారు*
నన్ను తేలిగ్గా చూసారు*
నాకు విలువ ఇవ్వలేదు*
నాకు మర్యాద ఇవ్వలేదు*
నా పరువు పోతుంది*
నాకు చెడ్డపేరు వస్తుంది*

నన్ను నలుగురూ గొప్పగా గుర్తించాలి. నన్ను బాధించినవారి మొహం నేనింక ఎప్పుడూ చూడను.

ఇలా... ఇలా...ప్రతీచోటా "నేను" ని నింపేస్తే జీవితం ఇరుకైపోతుంది..

కొంచెం "నేను" కి విలువ ఇవ్వటం తగ్గించుకుంటూ ఉంటే జీవితం మరీ అంత బరువవ్వకుండా సులువుగా ముందుకి నడుస్తుంది..

మనసులో ఎన్నో గజిబిజి ఆలోచనలకు మూలం నేను..

ఒక్కసారి నేను, నాకు అనే భావం తొలిగించి చూస్తే చాలా అంతర్మధనాలు దూరం అవుతాయి.

చాలా అయోమయాలు, కోపాలు, ఆవేశాలు, ఆలోచనల తాలూకూ బరువును మన మనసు మోయనక్కరలేదు..

నేను అనబడే నన్నుని ఎవరో ఏదో అన్నారని బాధపడి దిగులుపడి, ఆ అన్నవారిని తిరిగి బాధించటానికి ఎన్నో ఆలోచనలు చేయటం అనవసరం..

మనని అన్నవారు అనేసి హాయిగా తమ పనులలో మునిగిపోతారు, వారికి మనము గుర్తు కూడా ఉండము..
మనం మాత్రం ప్రతీకార వాంఛతో నిత్యం వారినే గుర్తుచేసుకుంటూ ఉంటాము..

సమయం వ్రృధా, అనవసర శ్రమ....
పైసా పుట్టించలేము ఈ ప్రతికూల ఆలోచనలతో....

అదే ఒక్కసారి " నన్ను " అవమానించారు అనే బరువుని గుప్పిట్లో పట్టుకుని ఉంచుకోక,
కాసేపు గుప్పిట విప్పి నేను , నన్ను అనే భావనని గాలికి వదిలేస్తే అసలైన శాంతి అక్కడ మొదలవుతుంది..
ప్రయత్నించి చూస్తే ఇది కష్టమైన పనేమో కానీ.... అసాధ్యమైనది మాత్రం కాదు నేస్తం... కాకపొతే... కష్టసాధ్యం.

అస్థిత్వం రూపేణా "నేను" అనే ఆలోచన అవసరం..
కానీ మనం చిన్న చిన్న విషయాలలో కూడా, నేను అనే అంశం ఆధారంగా ఎక్కువగా తీసుకుని, మన మనసుని ఎదుటివారి కంటే కూడా, మనకి మనమే ఎక్కువగా బాధించుకుంటాము అనిపిస్తోంది.
కుటుంబాలలో అందరమూ ఎంతో కొంత నిస్వార్ధంగానే చాలాచోట్ల ఉంటాము

కానీ ఉన్నట్టుండి, ప్రేమలను పోల్చిచూసుకోవటమో, బేరీజు వేసుకోవటమో చేసి, మన అశాంతిని మనమే కొని తెచ్చుకుని కుటుంబాలలో కలహాలు తెచ్చుకుంటాము.. ఇలాంటి చాలా అనవసర, అల్పమైన విషయాల్లో నేను అనే కోణాన్ని వదిలేస్తే అన్నివిధాలా మంచిదేమో..

చాలా మనస్పర్ధలు ఇలాంటివే, అందుకే చాలాచోట్ల నేను ని వదిలేస్తేనే జీవించటం తేలికవుతుంది..
****************************

కామెంట్‌లు లేవు: