3, సెప్టెంబర్ 2020, గురువారం

మొగలిచెర్ల అవధూత

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
విభూతి..గంధం..

"మేము అండమాన్ లో వుంటామండీ..మా బంధువులు ఇక్కడికి దగ్గరలో ఉన్న చుండి గ్రామం లో వుంటారు..ఒకప్పుడు మేమూ ఈ ప్రాంతం వాళ్ళమే.. కానీ కొన్ని సంవత్సరాల క్రిందట అండమాన్ వెళ్లి..అక్కడే వ్యాపారం చేసుకుంటూ స్థిరపడ్డాము.. మావాళ్ళు ఈ క్షేత్రం గురించి..శ్రీ స్వామివారి గురించి గొప్పగా చెపితే..చూసిపోదామని వచ్చాము..మాకు ఈ క్షేత్రం గురించి వివరాలు చెపుతారా?.." అన్నారా దంపతులు..వాళ్ళు మాట్లాడుతున్నది తెలుగులోనే అయినా..కొద్దిగా తేడాగా ఉంది..

శ్రీ స్వామివారు మాలకొండ క్షేత్రం లో తపస్సు చేసుకుంటూ ఉన్నప్పటి నుంచి..మొగలిచెర్ల లోని ఫకీరు మాన్యం లో తాను నిర్మించుకున్న ఆశ్రమం లో కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన దాకా జరిగిన సంఘటనలన్నీ క్లుప్తంగా వివరించాను..శ్రద్ధగా విన్నారు..శ్రీ స్వామివారు సమాధి చెందిన అనంతరం..వేలాదిమంది వచ్చి దర్శించుకొని వెళుతున్నారని..వారికేమైనా సమస్యలు ఉన్నా..ఈ సమాధి దగ్గర మ్రొక్కుకుంటే..అవి తీరిపోతున్నాయనీ ..తమ బంధువుల ద్వారా విన్నామని వాళ్ళు నాతో అన్నారు..

ఆ తరువాత ఆ దంపతులు శ్రీ స్వామివారి మందిరానికి మూడు సార్లు ప్రదక్షిణాలు చేసి..శ్రీ స్వామివారి విగ్రహం వద్ద పూజ చేయించుకుని..శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..ఒక ఐదారు నిమిషాల పాటు ప్రార్ధన చేసుకొన్నారు..శ్రీ స్వామివారి విభూతి..గంధం..రెండూ తీసుకున్నారు..వెళ్ళొస్తామని చెప్పి వెళ్లిపోయారు..

మరో మూడు నాలుగు నెలల తరువాత..మందిరానికి నూరు రూపాయల మనీ ఆర్డర్ వచ్చింది..అందులో..తమ చిరునామాకు..శ్రీ స్వామివారి విభూతి, గంధం..రెండూ పోస్ట్ ద్వారా పంపమని వ్రాసారు..ఆ చిరునామా..అండమాన్ లోని పోర్టుబ్లయర్ కు సంబంధించినది..అప్పుడు మాకు గుర్తుకు వచ్చింది..కొంతకాలం క్రిందట వచ్చి వెళ్ళింది వీళ్ళే కదా అని..అందులో వారి ఫోన్ నెంబర్ ఇవ్వలేదు..వారు కోరిన విధంగా విభూతి..గంధం..పోస్ట్ ద్వారా పంపాము..మరో రెండు నెలల తరువాత..చుండి గ్రామం నుంచి ఒక వ్యక్తి వచ్చి..తాను అండమాన్ వెళుతున్నాననీ..తమ బంధువుల కోసం శ్రీ స్వామివారి విభూతి, గంధం కావాలని అడిగారు..ఇచ్చాము..వచ్చిన ఆ వ్యక్తి ద్వారా తెలిసింది..అప్పుడు వచ్చిన ఆ దంపతుల కోసమే ఈ విభూతి.. గంధం..

మరో ఆరేడు నెలల తరువాత..ఒక శనివారం నాడు ఆ దంపతులు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు.."శ్రీ స్వామివారు చాలా మహిమ కలవాడు..మేము పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సమస్యల్లో ఉన్నామండీ..ఒక రకంగా చెప్పాలంటే ఆర్ధికంగా..మానసికంగా కృంగిపోయి వున్నాము..ఎటూ దిక్కుతోచని పరిస్థితి లో వున్నాము..ఇక్కడినుంచి పోతూ పోతూ..శ్రీ స్వామివారి విభూతి..గంధం..తీసుకెళ్లాము..ప్రతిరోజూ ఇంటినుంచి ఉదయాన్నే స్నానం చేసి..దీపారాధన చేసుకొని..శ్రీ స్వామివారి విభూతిని..గంధాన్ని.. నుదుటిన ధరించడం అలవాటు చేసుకున్నామండీ..కేవలం పదిహేను రోజుల లోపే మాకు చాలా మార్పు కనబడింది..మా దగ్గర అప్పు తీసుకొని..ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు..ఇంటికొచ్చి మరీ చెల్లించి వెళ్లారు..దాదాపు డెబ్భై శాతం వసూలు అయ్యాయి..ఆ డబ్బు చేతికి వచ్చిన మరుక్షణం మేము చెల్లించాల్సిన వాళ్లకు చెల్లించివేశాము..ఇప్పుడు మాకున్న అప్పులన్నీ తీరిపోయాయి..వడ్డీ వ్యాపారం కూడా మానేసాము..ఒకళ్లను పీడించి..ఏడిపించి.. వాళ్ళ ఆర్ధిక బలహీనత మీద చేసే ఆ వ్యాపారం మంచిది కాదని..మాకు తోచింది..వేరే వ్యాపారం చూసుకున్నాము..అంతా ఆ స్వామివారి విభూతి మహిమ..అందుకే మీ దగ్గరనుంచి విభూతి..గంధం..రెండు మూడు సార్లు తెప్పించుకున్నాము..ఈరోజు శ్రీ స్వామివారిని దర్శించుకుని మా మ్రొక్కు చెల్లించుకోవాలని అనుకున్నాము.." అన్నారు..

" రాబోయే శనివారం, ఆదివారం రోజులలోఅన్నదానం చేయాలని అనుకున్నాము..సరుకులన్నీ మేమే తీసుకొస్తాము..సుమారు ఎంతమందికి తయారు చేయాలో మీరు చెపితే..దానికి తగ్గ విధంగా ఏర్పాటు చేసుకుంటాము.." అన్నారు..శనివారం రాత్రికి సుమారుగా వేయి మంది భక్తులు వుంటారనీ.. ఆదివారం మధ్యాహ్నం అయితే..ఎనిమిది వందల మంది భక్తుల కొరకు ఏర్పాట్లు చేయాలనీ.. చెప్పాము..వచ్చే శని, ఆదివారాల్లో రెండుపూటలా తామే చేస్తామని చెప్పారు..

అనుకున్న విధంగానే ఆ దంపతులిద్దరూ అన్నదానం చేశారు..అవకాశం ఇచ్చినందుకు నాకూ మా సిబ్బందికి ధన్యవాదములు తెలిపారు..తిరిగి వెళుతూ..మర్చిపోకుండా శ్రీ స్వామివారి విభూతి..గంధం..రెండూ ఎక్కువ మోతాదులో తీసుకొని వెళ్లిపోయారు..ఇప్పటికీ సంవత్సరం లో కనీసం మూడు నాలుగు సార్లు మనీ ఆర్డర్ ద్వారా నగదు పంపి..విభూతి..గంధం..తెప్పించుకుంటూ వుంటారు..

విభూతి..గంధం..ఈ రెండింటి ద్వారా ఆ దంపతుల భక్తిని శ్రీ స్వామివారు స్థిరపరచారు..

సర్వం..
దత్తకృప.

(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114.. సెల్..94402 66380 & 99089 73699).
***************************

కామెంట్‌లు లేవు: