3, సెప్టెంబర్ 2020, గురువారం

అనంతమైన అనుభవాలు

 

కేరళ నుండి ఒక జ్యోతిష్కుడు పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు. ఆరోజు స్వామివారు కాష్టమౌనంలో వున్నారు. ఆ జ్యోతిష్కునితో ఏమీ మాట్లాడలేదు కానీ, చిరునవ్వుతో ఒక పండును అతనికి అనుగ్రహించారు.


జ్యోతిష్కుడు బయటకు వచ్చాడు. శ్రీమఠం సిబ్బంది అతణ్ణి చుట్టుముట్టారు. ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉండడం సహజం కదా? ఆ సమస్యలు ఎప్పుడు అంతం అవుతాయో అని తెలుసుకోవడం అందరికీ ఇష్టమే కదా.


వెంటనే ఆ జ్యోతిష్కుడు, “ఇక్కడ నేను జోస్యం చెప్పలేను. ఇక్కడ, ఈ స్థలంలో పరమాచార్య స్వామి పరిపూర్ణ సాన్నిధ్యం ఉంటుంది. స్వామివారు ఉన్న చోటునుండి మూడువందల అడుగుల లోపల ఏ గ్రహమూ మాట్లాడాదు; ఏ దేవతా బదులివ్వదు. మీరు నేను బస చేస్తున్న చోటుకు రండి; మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తాను” అని చెప్పారు.


ఒక్క దర్శనంతోనే ఆ జ్యోతిష్కుడు స్వామివారిని అర్థం చేసుకున్నాడు.


**********************************************************


ఒక భక్తుడు కాశీ క్షేత్రంలో రుద్రైకాదశి జప హోమం చేసి, అక్కడి నుండి గంగాజలం తీసుకునివచ్చి పరమాచార్య స్వామివారికి సమర్పించాడు.


“నీవు రుద్రైకాదశి కోసం ఎక్కడి నుండి గంగాజలాన్ని సేకరించావు?” అని అడిగారు స్వామివారు.


“వైదికులు ఆ జలాన్ని కాశీలోని కేదార్ ఘాట్ గంగా నుండి తీసుకునివచ్చారు”.


“కాశీ పరమేశ్వరుని సొంతం. గంగ నీరు, గంగ మన్ను వంటివి అక్కడినుండి తీసుకునిరాకూడదు. నువ్వు అక్కడినుండి తెచ్చిన తీర్థాన్ని ఏదైనా బిల్వ చెట్టు మొదట్లో వెయ్యి” అని ఆదేశించారు స్వామివారు.


“గంగ ఎక్కడైతే శుద్ధ గంగగా ఉంటుందో అక్కడి నుండి గంగాజలాన్ని తీసుకునిరావాలి. యమునా నది తనలో కలవడానికి ముందు ఉన్నదే శుద్ధ గంగ” అని చెప్పారు స్వామివారు.


********************************************


పరమాచార్య స్వామివారు విడిదిచేసిన ఆ పల్లెటూరిలో కొన్ని గుడిసెలు వున్నాయి. సాయంత్రం పూట ఆ పిల్లలందరూ ఎందరో ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా, ఎంతో అల్లరితో ఒకర్నొకరు కొట్టుకుంటూ, పెద్దగా అరుస్తూ ఆడుకుంటున్నారు. (అటువంటి సందర్భంలో తాము కూడా ఆ పిల్లలతో పాటు చేరిపోయి ఆడుకోవాలన్న భావం స్వామివారి కళ్ళల్లో కనిపిస్తుంది)


అలా ఆ పిల్లల ఆటలను, అల్లరిని చూస్తున్న స్వామివారి దగ్గరికి ఒకామె గిన్నె నిండుగా పాలకోవా తీసుకునివచ్చి, స్వామివారి ముందర ఉంచి, పంచాంగ నమస్కారం చేసింది.


“ఏమిటిది? పాలను మరిగించి తీసుకునివచ్చావా?” అని అడిగారు.


“అవును”


“తియ్యగా ఉంటుందా?”


“అవును ఉంటుంది”


“వాసన?”


ఆమె బదులు చెప్పేలోగానే, స్వామివారే బదులిచ్చారు. “అవును, అది ముక్కుపుటాలను చీల్చుకుని వెళ్తోంది”


“నేను చాలా మడితో తయారుచేశాను. పుల్లగా అవ్వదు. నాలుగు రోజుల దాకా పాడవ్వడు. రోజూ, స్వామివారు కొంచం, కొంచంగా . . .”


స్వామివారు ఆమె మాటలను ఏమాత్రం వింటునట్టులేదు. కానీ ఎంతో కుతూహలంతో, “నువ్వు ఏమి చేస్తావంటే, అక్కడ ఆడుకుంటున్న పిల్లల దగ్గరకు ఈ గిన్నె తీసుకునివెళ్లి, అంతా వారికి పంచి ఖాళీ గిన్నెను తీసుకునిరా, సరేనా? నాకోసం ఇంకోసారి తయారుచేసుకుని తీసుకునిరా . . .”


క్షీర సాగర శయనుడు మొహిని దేవి రూపంలో అమృతాన్ని పంచినట్టు, ఆమె ఆ పాలకోవాను పరిపూర్ణ తృప్తితో పిల్లలకు ఇచ్చింది. అ పిల్లలు ఆ పాలకోవా తినదన్ చూసి స్వామివారు ఆనందించారు.


*******************************


పరమాచార్య స్వామివారి ఆగమనాన్ని ప్రతి చిన్న ప్రాణి కూడా ఆనందించింది. శివాస్థానంలో ఎవరూ స్వామివారి గదిలోకి వెళ్ళేవారు కాదు. తమ పనులను స్వామివారే స్వయంగా చేసుకునేవారు.


సేవకులు స్వామివారి గది బయట చిన్న చెక్క పాత్రల్లో నీరు ఉంచేవారు. కాళ్ళు, చేతులు కడుక్కోవడానికి మరియు అనుష్టానానికి వాటికవే ప్రత్యేకంగా ఉంచేవారు. ఎండాకాలంలో ఎలుకలు, ఉడుతలు మరియు పక్షులు నీతి కోసం అంతా తిరిగి తిరిగి వెతికేవి.


శిష్యులు, భక్తులు ఎవ్వరూ కూడా స్వామివారి గదిలోకి వెళ్లలేకపోయినా, ఈ జంతువులకి అలాంటి అడ్డంకి ఏం లేదు. పూర్తి స్వాతంత్ర్యంతో లోపలకు వెళ్ళి, ఆ చక్క పాత్రలపైకి ఎక్కి, లోపలకు తొంగిచూసి, దాహం తీరేదాకా నీరు త్రాగి పారిపోయేవి.


అవి వచ్చి నీరుతాగి వెళ్లిపోవడాన్ని గమనిస్తూ ఆనందించేవారు స్వామివారు. మనకు అవి ఎలుక, ఉడుత, పిచ్చుక లాగా కనిపిస్తాయి, కానీ స్వామివారికి అవి గణపతి, రామపిరన్, నారాయణుడుగా కనిపిస్తాయేమో.


--- శ్రీమఠం బాలు, కాంచీపురం. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: