3, సెప్టెంబర్ 2020, గురువారం

వాట్సప్పులో పరిభ్రమించ


ఒక వ్యక్తి తన మిత్రుణ్ణి కలవడానికి వాళ్ళింటికి ఉదయం 10 గంటల సమయంలో వచ్చాడు. అంతా పిచ్చాపాటి మాట్లాడిన తర్వాత అటు యిటు ఆడుతూ తిరుగుతున్న అతని 10 సంవత్సరం వయస్సు గల కొడుకుని చూసాడు. 


ఏంట్రా అబ్బాయి పాఠశాలకు వెళ్ళకుండా యింట్లోనే ఆట్లాడుకుంటున్నాడు ఏంటి, ఏదైనా అనారోగ్యం పాలయ్యాడా అని ప్రశ్నించాడు. 


అతని మిత్రుని ముఖ కవళికలు చెప్పనలవికాదు. ఏం చెప్పనురా, వాడు స్కూలుకు వెళ్ళడం అంటే అంత యిష్టం. ఆర్నెలల ముందువరకు తనే ముస్తాబయి వెళ్ళిపోయేవాడు. చదువులో కూడా మొదటి రేంకే. కాని యేంజెయ్యను. ఆర్నెలల క్రితం ఒకరోజు ఎప్పటిలాగే ప్రొద్దునే స్కూలుకు వెళ్ళాడు. సాయంత్రం వరకు స్కూలులోనే వున్నాడంట. తిరిగి యింటికి బయలుదేరి వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఒక గారడివాడు గారడివిద్య చూపిస్తుంటే అక్కడ వున్న జనాన్ని చూసి తనూ ఉవ్విళ్లూరై అలా వుండి పోయాడు. చీకటయింది. యింటి దారి మరచిపోయాడు. అంతే, ఒక రెండు రోజులు జాడనే లేదు. యిలా అకస్మాత్తుగా తప్పిపోయాడు.


మేము అన్ని ప్రయత్నాలు చేసాము, చివరకు రక్షక నిలయంలో కూడా కంప్లయింటు యిచ్చాము. కాని యేమీ ఫలితం కనబడలేదు. 


చివరకు నీలాంటి మరో మిత్రుడు ఒక సలహా యిచ్చాడు, బాబు ఈ రోజుల్లో వాట్సప్పు అందరూ వాడుతున్నారు, ఈ తప్పిపోయిన విషయం వాట్సప్పులో అందరికి తెలిపావంటే వాడి ఆచూకి యిట్టే తెలియగలదు అని. నేనూ అలాగే యిచ్చాను. నిజంగా యీ వాట్సప్పు యెలా పనిచేస్తుందంటే, ఆ తప్పిపోయిన విషయం అందరికి బట్వాడ చేసిన 5 గంటలలోపే ఒక వ్యక్తి ఫోన్ చేసాడు సార్ మీ అబ్బాయి ఫలానా రోడ్డులో ఏడుస్తూ తిరుగుతున్నాడని. వెంటనే మేము వెళ్ళి వాణ్ఢి యింటికి తీసుకొని వచ్చాము. ఆ మరుసటిరోజు వాడికి అన్ని నచ్చజెప్పి స్కూలులో వదిలేసి వచ్చాను. అలాగే ప్రతిరోజూ యిప్పటిదాకా వదిలేసి వస్తున్నాను. రోజూ నేను యింటికి వచ్చిన అరగంటకే యెవరో ఒకరు తలుపు తట్టి యిదిగో సార్ మీ అబ్బాయి, తప్పిపోయాడన్న ప్రకటన యిచ్చారు కదా, స్కూలు దగ్గర కనబడ్డాడు అని చెప్పి వదిలేసి వెళ్తున్నారు. ప్రతిరోజూ యిదే గొడవ, యేంజెయ్యను. ఎందుకురా వాట్సప్పులో యిచ్చానన్న భాధ పడని రోజు లేదు.

కామెంట్‌లు లేవు: