3, సెప్టెంబర్ 2020, గురువారం

శివామృతలహరి శతకం

 శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;

మ||

తలలూపన్ ధరణీజముల్ సుమలతల్ తామ్రాచ్చపుష్పద్వుతిన్
లలినీరాజనమెత్తి నర్తనము సల్పన్ ; తుమ్మెదల్ పాడ, చి
ల్కలు వల్లింపగ వేదపాఠములు చక్కన్;బాల భానుండుభా
సిలె లింగాకృతి పూర్వ దిక్తటమునన్ శ్రీ సిద్ధలింగేశ్వరా !

భావం ;( నాకు అర్ధమైన రీతిలో)
ప్రకృతి అంతటి లోనూ శివుడు ఉన్నాడు.భక్తితో చూసేవారికి ప్రతి దాన్లోనూ  శివుడే దర్శనమిస్తాడు.
అది తెలపడానికి సూర్యోదయ కాలాన్ని లింగోద్భవం లాగా ఈ పద్యంలో వర్ణించారు.
చెట్లు గాలికి ఊగుతుంటే అవి సంతోషంగా తలలూపుతున్నట్లు కనిపిస్తున్నాయట,
పుష్ప కాంతులతో విలసిల్లుతున్న పూల మొక్కలు ప్రేమతో నీరాజనం అర్పిస్తున్నట్లుగా నాట్యం చేస్తున్నాయట,
పూల మకరందాన్ని గ్రోలడానికి వచ్చిన తుమ్మెదలు ఝంకార నాదం  చేస్తూ పాడుతున్నట్లు అనిపిస్తోంది.
చిలకల పలుకులు చక్కగా వేదాలు
వల్లిస్తున్నట్లుందట.అటువంటి ఉషస్సమయంలో తూర్పు దిక్కున  ఉదయిస్తున్న బాల భానుడు లింగాకృతిలో దర్శనమి స్తున్న శివుడిలా గోచరిస్తున్నాడు.
అని నాన్న గారి భావన.

1 కామెంట్‌:

Ravi Bhushan Sarma Konduru చెప్పారు...

మాకు లింగొద్భవ కాలం లో పరమ శివుని కనులకు కట్టినట్టు సాక్షాత్కారము చేసారు మీ తండ్రి గారు ఈ పద్యము ద్వారా.