3, సెప్టెంబర్ 2020, గురువారం

రామాయణమ్..50


..
అమ్మా! నా తండ్రి మాటలు యుక్తమా లేక అయుక్తమా అని నేను విచారణ చేయను ,
.
ఆయన కోరిక ప్రకారము పదునాలుగేండ్లు వనవాసమునకు ఈ క్షణమే బయలు దేరగలను..
.
ఒక్కవిషయము మాత్రము నా హృదయమును దహించి వేయుచున్నదమ్మా! నా తండ్రిగారే నాకు స్వయముగా చెప్పకున్నారేమి?
.
 అయినా రాజ్యాభిషేకమునకు భరతుడికి అభిలాష ఉన్నదని నాకు తెలియదు .తెలిసియున్న ఎడల నా సర్వస్వము అతనికి ధారపోసి యుండెడి వాడను.
.
రాముడి ఈ పలుకులు దశరధమహారాజు యొక్క గాయమయిన హృదయాన్ని కెలికినట్లుగా ఉన్నాయి. ముదుసలి మహారాజు తట్టుకోలేక పోతున్నాడు.ఆయన కళ్ళనుండి ధారాపాతంగా కన్నీరు కారుతున్నది వంచిన తల ఎత్తలేక ,సూటిగా రాముని చూడలేక సతమతమవుతూ యమయాతన అనుభవిస్తున్నాడు.
.
ఇటు కైక సంతోషము పట్టనలవిగాకుండా ఉన్నది ! రామా ! నేను చెపితే రాజు చెప్పినట్లేగదా ! ఎవరు చెప్పారన్నదిఅంత ప్రధానముకాదు ! ఇది రాజుగారి అభిమతము.
.
ఇంక నీవు ఆలస్యము చేయక వెంటనే బయలుదేరవలెను అని అంటూ తొందరపెట్టసాగింది.నీవు ఈ పట్టణము విడిచి వెళ్ళనంతవరకు నీ తండ్రి స్నానము, భోజనము చేయరు!
.
ఈ మాటలు వింటున్న దశరధుడు దీర్ఘముగా నిట్టూర్చి ఛీ ! ఎంత కష్టము వచ్చినది అని తనలో తనే అనుకుంటూ కూర్చున్న మంచముమీద కూర్చున్నట్లే ఒరిగిపోయాడు ,స్పృహతప్పిపోయాడు.
.
రాముడు తండ్రిని లేవదీసి మరల కూర్చుండపెట్టబోయాడు ,కానీ  మరలమరల కొరడాతో గుర్రాన్ని కొట్టినట్లుగా కైక ప్రేరేపించటం మొదలు పెట్టింది ! ఆవిడ తొందరను గమనించిన రాముడు...
.
అమ్మా ! నాకు ధనము ప్రధానము కాదు ,ఋషులవలే నాకు కూడా ధర్మమే ప్రధానము తల్లీ ! నీవింతగా నన్ను తొందర పెట్టవలసిన పనిలేదమ్మా ! నా తండ్రికొరకు ఇప్పటికిప్పుడు నా ప్రాణములనయినా ధారపోయగలనమ్మా ! అని అన్నాడు.
.
తండ్రి ఆజ్ఞను పాటించుటకు మించి ధర్మాచరణము లేదమ్మా నాకు!..
.
నా జీవితములో అర్ధమునకు,సంపదలకు ప్రధానములేదమ్మా! ధర్మమే ! నా జీవన హేతువు !
.
అమ్మా ! నీకు నా మీద అధికారమున్నదమ్మా ! భరతునికి రాజ్యమిమ్మని నీవే నాతో చెప్పవచ్చుగదమ్మా! తండ్రిగారి ద్వారా ఎందులకు? నీకు నా గుణములమీద ఇప్పటికీ నమ్మకములేదని తెలుస్తున్నదమ్మా!
.
అమ్మా! మాఅమ్మ కౌసల్యకు,సీతకు చెప్పి తక్షణమే పయనమైపోగలవాడను అని పలికి తండ్రికి,పినతల్లికి నమస్కరించి అచటనుండి నిష్క్రమించాడా ధర్మస్వరూపుడు!
జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....
ధర్మధ్వజం
హిందు చైతన్య వేదిక
*****************

కామెంట్‌లు లేవు: