భాసుర రత్న పీఠికయు ,
భవ్య తుషారపు మజ్జనంబుయున్ ,
భూషిత దివ్య వస్త్రములు ,
భూరి విభాసిత రత్నభూషలున్ ,
వాసిత చందనాగరులు ,
వాసన కస్తురి లేపనంబు , సద్
వాసన జాజి బిల్వములు ,
వ్యాపకగంధపుధూప దీపముల్ ,
భాసిత శంకరా ! మదిని
భక్తి సమర్పణసేతు నిచ్చలున్
కాంచన రత్న పాత్రముల
కమ్మని యాజ్యపు పాయసంబులున్ ,
పంచవిధంబులైన పలు
భక్ష్య పయో దధి వంటకంబులున్ ,
సంచయపాత్రపూరిత ర
సాయన పానకంబులున్ ,
సంచిత స్వాదు శాకములు ,
స త్ఫలయుక్త , సుగంధ వీడ్యమున్ ,
నంచిత భావమందు , భవ
దర్పణ సేతును మానసంబునన్
చక్కని చామరద్వయము ,
చల్లని ఛత్రము , వర్ణ వీవెనల్ ,
మిక్కిలి స్వచ్ఛదర్పణము ,
మేలగు వీణ మృదంగ వాద్యముల్ ,
చక్కని నృత్యముల్ , మిగుల
శ్రావ్యపు గానవిశేషముల్ , స్తుతుల్ ,
మక్కువతోడ సాంగముగ
మానసమందున వందనంబులన్ ,
పెక్కగు పూజ లర్పితము
ప్రేమగ జేయుచు నుంటి భక్తితో ,
దిక్కువు నీవె వేడెదను ,
తీరుగ చేకొను నాదు పూజలన్ .
సత్యమ నీవె యాత్మ , మతి
శాంభవి , నీ ప్రమథాళి ప్రాణముల్ ,
నిత్యముగాని కాయమిది
గేహము , లౌకిక కర్మలెల్ల నీ
నిత్యపుపూజ , నిద్దురయె
నిత్యసమాధి , పద ద్వయంబులన్
నిత్యమొనర్చు చాలనము
నీకు ప్రదక్షిణ , నాదు వాక్కులే
నిత్యపుస్తోత్రముల్ , ననయ
మెయ్యెవి కర్మము లాచరింతునో :
సత్యశరీర ! యో యభవ !
నిన్నిల గొల్చుటయే సదాశివా !
కరచరణంబులన్ , నయన
కర్ణ యుగంబుల , కర్మ , వాక్కులన్ ,
నిరతము మానసంబునను
నిత్యమొనర్చెడి కామ్యకంబులన్ ,
సరియును , కాని , చర్యలను ,
స్వాంతము నందు క్షమించియున్ ,
కరుణను జూపి నన్నెపుడు
కావుము జాలిని ! పార్వతీ పతీ !
గోపాలుని మధుసూదన రావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి