3, సెప్టెంబర్ 2020, గురువారం

*ధార్మికగీత - 9*


                                                       
               *శ్లో:- వర మేకో గుణీ పుత్రః* !
                      *న చ మూర్ఖ శతాన్యపి* ౹
                      *ఏకః చంద్ర స్తమో హన్తి* ౹
                      *న చ తారా గణో౽పి చ* ౹౹
                                         *****
*భా:- విద్య, వినయము, విధేయత, వివేకము, విచక్షణ, సంస్కారము, పితృభక్తి, మాతృప్రేమ, గురుశుశ్రూష, వృద్ధసేవ, బంధుప్రీతి ఇత్యాది గుణగణాలు కలిగిన "ఒకే ఒక్క కొడుకు"న్నా చాలు. మానవ జన్మ ధన్యమవుతుంది. ఆ పుత్రుడే పున్నామ నరకం నుండి కాపాడేది. మూర్ఖులు, నీచులు, సంస్కారహీనులై, బ్రతికుండగానే నరకాన్ని చూపించే కుమారులు వందమంది ఉంటే మాత్రం ప్రయోజన మేముంది? నేటి సమాజంలో అలాంటి ప్రబుద్ధులకు కొదవలేదు. వారి కారణంగానే వృద్ధాశ్రమాలు వెల్లి విరుస్తున్నాయి. చక్కనివాడు, చల్లనివాడు, ఆబాలగోపాలాన్ని తన వెన్నెలతో మురిపించి, మరపించేవాడు అయిన "చంద్రుడు" ఒక్కడే చీకట్లను పారద్రోలి కాంతులను వె దజల్లుతూ పరవశింపజేస్తున్నాడు. ఆకాశంలో కోట్లాది నక్షత్రాలు ఉన్నా, అంధకారాన్ని రూపుమాపలేక, వెలవెల పోవడం మనమెరిగిందే కదా! "పుత్రాత్ ఇచ్ఛేత్ పరాజయమ్" -ప్రతి తండ్రి తన కంటె మిన్నగా రూపుదిద్దుకున్న గొప్పవాడైన కొడుకు చేతిలో ఓడిపోవాలని ముచ్చట పడిపోతాడట! పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! అంటే ఇదే మరి. అది తండ్రి నైజం కాబోలు. బిడ్డలను ప్రయోజకులుగా తీర్చిదిద్దడం తల్లిదండ్రులుగా మన విధి యని సారాంశము*.
                                  *****       
                   *సమర్పణ : పీసపాటి* 
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: