*అష్టమ స్కంధము - ఇరువది ఒకటవ అధ్యాయము*
*శ్రీమహావిష్ణువు బలిని పాశములచే బంధించుట*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*21.18 (పదునెనిమిదవ శ్లోకము)*
*హన్యమానాన్ స్వకాన్ దృష్ట్వా పురుషానుచరైర్బలిః|*
*వారయామాస సంరబ్ధాన్ కావ్యశాపమనుస్మరన్॥7112॥*
విష్ణుభగవానుని పార్షదులు తన సైనికులను వధించుచుండుటను బలిచక్రవర్తి చూచెను. అప్పుడు అతడు శుక్రాచార్యుని శాపమును స్మరించి, వెంటనే అతడు యుద్ధోన్ముఖులైన తన సైనికులను వారించెను.
*21.19 (పందొమ్మిదవ శ్లోకము)*
*హే విప్రచిత్తే హే రాహో హే నేమే శ్రూయతాం వచః|*
*మా యుధ్యత నివర్తధ్వం న నః కాలోఽయమర్థకృత్॥7113॥*
విప్రచిత్తి, రాహువు, నేమి మున్నగు దైత్యులను సంబోధించుచు అతడు ఇట్లు పలికెను - "సోదరులారా! నామాట వినుడు. యుద్ధము చేయవలదు. మరలిరండు. మన ప్రయత్నములకు ఇది అనుకూల సమయము గాదు.
*21.20 (ఇరువదియవ శ్లోకము)*
*యః ప్రభుః సర్వభూతానాం సుఖదుఃఖోపపత్తయే|*
*తం నాతివర్తితుం దైత్యాః పౌరుషైరీశ్వరః పుమాన్॥7114॥*
దైత్యయోధులారా! సకల ప్రాణుల సుఖదుంఖములను నిర్ణయించునది కాలమే. మానవులు తమ ప్రయత్నములచే కాలపురుషుని అతిక్రమించలేరు.
*21.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*
*యో నో భవాయ ప్రాగాసీదభవాయ దివౌకసామ్|*
*స ఏవ భగవానద్య వర్తతే తద్విపర్యయమ్॥7115॥*
కాలపురుషుడు ఇంతకుముందు మన ఉన్నతికి, దేవతల పతనమునకు కారణమైయుండెను. అతడే ఇప్పుడు వారి అనుకూల్యమునకు, మన ప్రతికూలమునకును, హేతువు అగుచున్నాడు.
*21.22 (ఇరువది రెండవ శ్లోకము)*
*బలేన సచివైర్బుద్ధ్యా దుర్గైర్మంత్రౌషధాదిభిః|*
*సామాదిభిరుపాయైశ్చ కాలం నాత్యేతి వై జనః॥7116॥*
సైన్యము, సచివులు, తెలివితేటలు, దుర్గములు, మంత్రములు, ఔషధులు, సామదానాది ఉపాయములు మొదలగు ఏ సాధనముల ద్వారాను మానవుడు కాలముపై విజయమును సాధింపజాలడు.
*21.23 (ఇరువది మూడవ శ్లోకము)*
*భవద్భిర్నిర్జితా హ్యేతే బహుశోఽనుచరా హరేః|*
*దైవేనర్ద్ధైస్త ఏవాద్య యుధి జిత్వా నదంతి నః॥7117॥*
దైవము మీకు అనుకూలముగా ఉన్నప్పుడు మీరు దేవతల అనుచరులను పెక్కు పర్యాయములు జయించితిరి. కాని, వారే ఇప్పుడు యుద్ధములో కాలము కలసిరాని మనలను ఓడించి, సింహనాదములను చేయుచున్నారు.
*21.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*
*ఏతాన్ వయం విజేష్యామో యది దైవం ప్రసీదతి|*
*తస్మాత్కాలం ప్రతీక్షధ్వం యో నోఽర్థత్వాయ కల్పతే॥7118॥*
దైవము మనకు అనుకూలమైనచో, మనమే వీరిని జయింపగలము. కావున మన కార్యము సఫలమగుటకు అనుకూలమైన సమయము కొరకు నిరీక్షింపుడు".
*శ్రీశుక ఉవాచ*
*21.25 (ఇరువది ఐదవ శ్లోకము)*
*పత్యుర్నిగదితం శ్రుత్వా దైత్యదానవయూథపాః|*
*రసాం నిర్వివిశూ రాజన్ విష్ణుపార్షదతాడితాః॥7119॥*
*శ్రీశుకుడు వచించెను* శ్రీహరి పార్షదులచే జయింపబడి దైత్య, దానవ సేనాపతులు తమ ప్రభువైన బలిచక్రవర్తి ఆదేశములను విని యుద్ధమును మాని రసాతలమునకు వెళ్ళిపోయిరి.
*21.26 (ఇరువది ఆరవ శ్లోకము)*
*అథ తార్క్ష్యసుతో జ్ఞాత్వా విరాట్ ప్రభుచికీర్షితమ్|*
*బబంధ వారుణైః పాశైర్బలిం సౌత్యేఽహని క్రతౌ॥7120॥*
దైత్యులు వెళ్ళిపోయిన పిదప శ్రీహరి అభిప్రాయము గమనించి, సుత్యాహస్సు (సోమరసమును) దంచురోజున పక్షిరాజైన గరుత్ముంతుడు బలిచక్రర్తిని వరుణపాశములచే బంధించెను.
*బమ్మెర పోతనామాత్యుల వారి పద్యము*
*ఆటవెలది*
నొడివినంత పట్టు నుసలక యిచ్చుచో
నేల కట్టు విష్ణుఁ డేటి మాట?
గట్టెనేనిఁ దాన కరుణించి విడుచును
విడువకుండ నిమ్ము విమలచరిత! "
*తాత్పర్యము*
నిర్మల ప్రవర్తన గల శుక్రాచార్యా! అదేం మాట, అన్నమాట ప్రకారం ఆలస్యం చేయకుండా దానం ఇస్తే విష్ణువు ఎందుకు బంధిస్తాడు. ఒకవేళ బంధించాడే అనుకో అతడే దయతో విడిచి పెడతాడు. విడిచి పెట్టకపోతే పోనీ ఇబ్బందేం ఉంది?”
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ఇరువది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి