*శ్రీ లలితా నామ వైభవం-6*
‘శ్రీమాతా’ – అంటే మంగళప్రదురాలైన అమ్మా! అని అర్థము. గుర్తు పట్టవలసిన విషయము లోకములో ఉన్న ఏకైక సంథానమయిన అమ్మ అన్నమాటకు పరిచయము లేదు. కడుపులో ఉండగా నాభీగొట్టముతో ప్రారంభమైన అనుబంధము బయటికి వచ్చాక తెగిపోతుంది. హృదయసంబంధము అలాగే ఉంటుంది. అమ్మ అంటే పోషణ – రక్షణ – మంగళము. అమ్మలేకపోతే సృష్టి ఆగిపోతుంది. అమ్మవారి సృష్టిశక్తి, మాతృత్వము ఒక పురుష వీర్యమును స్త్రీ శరీరము పుచ్చుకునేట్టుగా నిర్మాణము చేయడములో ఉన్నది. ఆ తల్లి అనుగ్రహముతో పిల్లవాడు పూర్తిగా తయారు అయ్యేవరకు పెరగాలి. లోపల పిల్లవాడు నొక్కుడు పడకుండా, తల్లి శరీరము పిగిలిపోకుండా, మళ్ళీ పిల్లవాడు బయటికి వచ్చాక సంకుచితమవ్వాలి. ఇంతమంది జన్మించడానికి స్త్రీ ఉపాధుల యందు అంత మార్పుతో నిర్మాణము చేసి, లోపల పసిగుడ్డును కాపాడి జాగ్రత్త చేసింది శ్రీమాత. కడుపులో నుంచి బిడ్డ బయటకు రాగానే అమ్మ స్తన్యములో కోలోస్ట్రం అనే పసుపు పచ్చని ముద్ద ఒకటి ఊరుతుంది. ఏమీ తెలియని వాడిని జగన్మాత ఆవహించి ‘ నీ పోషణకోసము, రక్షణకోసము మీ అమ్మ స్తన్యములయందు నేను ప్రకాశిస్తున్నాను’ అని చెపుతుంది. అమ్మ స్తన్యములలో ఊరిన ఆ పదార్థమును పిల్లవాడు చప్పరిస్తే లోపలున్న ఊపిరితిత్తులు, జీర్ణాశయము అన్నీ పనిచేస్తాయి. కడుపులో ఉండగా నల్లటి మలము గడ్డలుగా పెరుగుతుంది. దానిని బయటికి పంపడము ఎవరికీ సాధ్యముకాదు. కోలోస్ట్రం మ్రింగగానే నల్లటి మలము బయటికి వెళ్ళిపోతుంది. మలినములు అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అమ్మ కడుపులో, పక్కలో దూరి పడుకోవడములో పిల్లవాడు ఎంతో భద్రత అనుభవిస్తాడు. ఆ అమ్మతనము అంతా హృదయము పరవశించిపోయే శ్రీమాతాతత్త్వము. అమ్మవారి వంకచూసి ‘శ్రీమాతా’ అని పిలవడానికి భయపడనవసరము లేదు. ఉపాసన చేయడానికి నియమ నిబంధనలు లేవు. అమ్మగా అమ్మవారిని చూడాలి. అమ్మని ఒక మొగవాడిగా చూస్తే దోషము. ఏ అమ్మా క్షమించదు. కొడుకుగా నిలబడి నమస్కారము చేస్తే ఆదుకోవడానికి అమ్మ ఎప్పుడూ సిద్ధముగా ఉంటుంది. ఆవిడ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త గర్భాలయము ఇచ్చింది, పాలు పట్టింది, (స్వల్పకాలికలయము) నిద్రపుచ్చింది. ముగ్గురూ అమ్మలో ఉన్నారు కనక మొదటి దైవము అమ్మ. భగవంతుడు ఒక్కడే అయినా కర్తవ్యనిష్ఠ కలిగినప్పుడు బ్రహ్మగా, విష్ణువుగా, రుద్రునిగా మూడురూపములతో ప్రకాశిస్తాడు. శ్రీమాత ఈ ముగ్గురూ మూడురకములైన కార్యములను నిర్వహించడానికి మూడురకములైన శక్తులను ఇచ్చింది. ఉపనిషత్తు – ‘యతోవా ఇమాని భూతాని జాయన్తి’ అంటుంది. దేనినుండి సమస్తము ఉత్పన్నము అయినదో – ‘దేనినుండి’ అన్నమాట ఏది ఉన్నదో అదే అమ్మవారు. దేనినుండి సమస్తము పుట్టాయో అన్న ఉపనిషత్ వాక్యము మారిస్తే అదే శ్రీమాత. అన్ని ప్రాణులను సృజించుట వెనక అమ్మదయ ఉన్నది. శ్రీమాత ఎవరు? అన్న విషయము జాగ్రత్తగా అవలోకనము చేస్తే ‘శ్’ ‘ర్’ ‘ఈ’ అన్న మూడు అక్షరములు కలిస్తే ‘శ్రీ’ అవుతుంది. ఆ మూడూ సత్త్వ, రజ, తమో గుణములను చూపిస్తాయి. లోకమంతా వీటిలోనే ఉన్నది. ఇవి బయటికి రాకుండా కలసిపోయి అవ్యక్తమైపోయి ఒక దానిలోకి వెళ్ళి ఉండిపోతే ‘శ్’ ‘ర్’ ‘ఈ’ కలసి శ్రీ – కలసిపోయి మాత – ఆవిడలోకి వెళ్ళిపోతాయి. సృష్టికి ముందర ఆవిడ ఒక్కత్తే ఉన్నది. ఆమెను పూర్వజా అంటారు. ఆవిడలో ఉన్న మూడుగుణములు ఆవిడలోనుంచే పైకి వచ్చాయి. ఈ మూడుగుణములు తీసి శుద్ధసత్త్వము ఆమెయే ఇవ్వాలి. అమ్మా! ఈ గుణముల వలన లోపలనుండి కలిగే కామ, క్రోధ, మద, మోహ, మాత్సర్యములన్న శత్రువులు అని గుర్తించి ఆవి ఉండటము వలన బాధ, కష్టము కలుగుతున్నాయి అమ్మా! అని నిజాయితీగా అంటే చాలు అమ్మవారు ఆ మూడూ ఉపసంహారము చేసి బాధలను తీర్చేస్తుంది. భాస్కరరాయలవారు అంటారు -- ‘లోకములో ఒక తల్లికీ తండ్రికీ జన్మించిన బిడ్డడు అమ్మా! అనే పిలుస్తాడు. బిడ్డడిని విడచి ఉండమంటే ఏ తల్లీ అంగీకరించదు. నేను వేరొకజన్మ లేకుండా చేసుకోవడానికి తురీయాశ్రమమునకు వెళ్ళిపోతాను అంటే అంగీకరించదు. శ్రీమాతా అని పిలిస్తే వేరొకజన్మలో అమ్మా! అని ఎవరినీ పిలవనవసరము లేని స్థితిలో మోక్షము ఇస్తుంది. శివజ్ఞానము ఇస్తుంది. ఆ జ్ఞానము కలగగానే పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్యస్థితి పొందడము జరుగుతుంది.
*శ్రీ మాత్రే నమః*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి