15, మార్చి 2021, సోమవారం

మన మహర్షులు- 50 నారద మహర్షి

 మన మహర్షులు- 50


నారద మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


ప్రళయం తర్వాత కాలంలో పునఃసృష్టి ప్రారంభమైనప్పుడు నారాయణుడి నాభి నుంచి బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ మరీచి, అత్రి మొదలైన ఎనిమిది మంది ప్రజపతులను సృష్టించాడు. వీరిలో నారదుడు కూడా ఒకరు.


ఎన్నో పురాణాలలో నారదుని పాత్ర కనుపిస్తుంది. అందులో ముఖ్యమైనవి -


రామాయణం, బాలకాండలో నారదుడు వాల్మీకికి ఉత్తమ పురుషుడైన శ్రీరాముని గురించి చెప్పి రామాయణం వ్రాయమనీ, అది ఆచంద్రార్కం నిలిచి ఉంటుందనీ ఆనతిస్తాడు. అలా చెప్పిన భాగమే సంక్షిప్త రామాయణంగా చెప్పబడుతుంది.


మహాభాగవతం మొదటి స్కంధంలో వారదుడు తన గాథను స్వయంగా వేద వ్యాసునికి తెలిపాడు. 


తాను పూర్వ జన్మ పుణ్య కారణంగా హరికథా గానం చేస్తూ ముల్లోకాలలో సంచరింప గలుగుతున్నానని చెప్పాడు.


ఇలా తన కథ చెప్పి హరికథా గానంతో నిండి వున్న భాగవతాన్ని రచించమని నారదుడు వేద వ్యాసునికి ఉపదేశించాడు


మహా భారతం సభాపర్వంలో నారదుని గురించి ఇలా చెప్పబడింది - ఇతడు వేదోపనిషత్తులను, పురాణాలను బాగా తెలిసినవాడు. దేవతలచే పూజితుడు. కల్పాతీత విశేషాలనెఱిగినవాడు. న్యాయ ధర్మ తత్వజ్ఞుడు. శిక్షా కల్ప వ్యాకరణాలు తెలిసినవారిలో శ్రేష్టుడు. పరస్పర విరుద్ధములైన వివిధ విధి వాక్యాలను సమన్వయపరచగల నీతిజ్ఞుడు. గొప్ప వక్త, మేధావి. జ్ఞాని, కవి, మంచి చెడులను వేరు వేరుగా గుర్తించుటలో నిపుణుడు. ప్రమాణముల ద్వారా వస్తు తత్వమును నిర్ణయించుటలో శక్తిశాలి. న్యాయవాక్యముల గుణదోషముల నెఱిగినవాడు. బృహస్పతి వంటి విద్వాంసుల సందేహములు కూడా తీర్చగల ప్రతిభాశాలి. ధర్మార్ధకామమోక్షముల యధార్ధ తత్వమునెరిగినవాడు. సమస్త బ్రహ్మాండములయందును, ముల్లోకములయందును జరుగు సంఘటనలను తన యోగబలముచే దర్శింపగలడు. సాంఖ్యయోగ విభాగములు తెలిసినవాడు. దేవ దానవులకు వైరాగ్యమును ఉపదేశించుటలో చతురుడు. సంధి విగ్రహ తత్వములు తెలిసినవాడు. కర్వ్య, అకర్తవ్య విభాగము చేయగల దక్షుడు. రాజనీతికి సంబంధించిన ఆరు గుణములలో కుశలుడు. సకల శాస్త్ర ప్రవీణుడు. యుద్ధ విద్యా నిపుణుడు. సంగీత విశారదుడు. భగవద్భక్తుడు. విద్యాగుణనిధి. సదాచారములకు ఆధారమైనవాడు. లోక హితకారి. సర్వత్ర సంచరింపగలవాడు.


నారదుడు త్రిలోక సంచారి. మూడు లోకాల్లోను సంచరిస్తూ ఆయన భక్తి మార్గాన్ని ప్రచారం చేస్తుంటారు. ఎంతోమంది సాత్వికులకు అయన మోక్షమార్గాన్ని చూపించాడు. ధర్మానికి అధర్మానికి జరిగే పోరాటంలో ఆయన తనదైన పాత్ర పోషిస్తుంటాడు. 


 మానవజాతి నిరంతర అభివృద్ధిని సాధించడానికి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చి, వారిని సన్మార్గంలో నడిపించేవాడే నారదుడు. అంతేకాదు, నారదుడు ఒక గొప్ప సంగీతకారుడు.


రామాయణ రచనలో మనకు నారదుడి పాత్ర కనిపిస్తుంది.


 వాల్మీకి ఆశ్రమానికి వచ్చిన నారదుడితో “ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఋజువర్తనలో సాగిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా?”  అంటూ ప్రశ్నించాడు వాల్మీకి. 


అప్పుడు అయోధ్య రాజైన శ్రీరామచంద్రుడు గురించి మొదట వాల్మీకికి తెలిపింది నారదుడే. వాల్మీకి మహర్షి రామకథను విని పులకించి పోయాడు. నారదుడి తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి రామకథను శ్లోక రూపంలో రచించమని కోరాడు.


ఒకసారి మహర్షి వేదవ్యాసుడు వేదాలను ఋగ్, యజుర్, సామ, అధర్వణమని నాలుగు భాగాలుగా విభజించాడు. సామాన్యులకు వేదాలు మరింత సులభంగా అర్ధం కావాలనే తలంపుతో పురాణాలను రచించాడు. మహాభారతాన్ని రాశాడు. మానవాళి శ్రేయస్సుకై ఇన్ని రచించినప్పటికీ ఆయనకు తృప్తి కలుగలేదు. 


ఒకరోజు సరస్వతీ నది ఒడ్డున కూర్చుని ఆలోచనలో నిమగ్నుడై ఉండగా నారదుడు వచ్చి ఆయన్ను పలకరించాడు. భక్తి మహత్యాన్ని తెలిపే నారాయణుడి లీలలను తెలిపే భాగవతాన్ని రాయమని కోరాడు. ఈ రచనతో కలి యుగంలో ప్రజలకు దైవభక్తి, సత్సాంగత్యం కలుగుతాయని నారదుడు తెలిపాడు.


ఇలా మానవాళికి మార్గం చూపే రామాయణం, మహాభారతం, భాగవతాలను గ్రంధస్థం చేయడంలో, వాటి ప్రచారంలో నారదుడి పాత్ర చాలానే ఉంది.


అలాగే వాల్మీకి, ధ్రువుడు, చిత్రకేతు, ప్రహ్లాదుడు  సావిత్రి వంటి వారికి భక్తి మార్గాన్ని ఉపదేశించినది కూడా నారద మహర్షియే.


 శ్రీ కృష్ణుడి కథల్లోనూ నారదుడు మనకు దర్శనమిస్తాడు. 

ఇటు ధర్మరాజుకి రాజధర్మం, ప్రజలకోసం రాజు నిర్వహించాల్సిన కార్యాలను గురించి  కూడా నారదుడు వివరిస్తాడు.పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు వారికి ఉపయుక్తమైన కథలు, ధర్మాలు చెప్పమని మార్కండేయ మహర్షిని వారివద్దకు పంపిస్తారు.


 ఇంకా వేదాలు, ఉపనిషత్తులలో కూడా నారదుని ప్రస్తావన మనకు కనిపిస్తాయి. ఖగోళ, సంగీత శాస్త్రాలలో సైతం ఆయన నిష్ణాతుడు.


నారదుడు రచించిన స్మృతిని  నారద స్మృతి’ అంటారు.  నారదుని “నారద శిక్ష” అనే గ్రంథం వ్యాకరణ సిద్ధాంతాలను వివరిస్తుంది. నారద భక్తి సూత్రాలు అనే గొప్ప గ్రంథాన్ని ఆయన రచించారు. ఇందులో భక్తి మార్గము, దాని విశిష్టత, దానిని అనుసరించడం ఎలా అన్న విషయాలపై 84 అధ్యాయాలలో వివరించారు. అలాగే బృహన్నారదీయమ్’, `లఘునారదమ్’ అనే గ్రంధాలలో ఆస్తిపంపకాలు మొదలైన ధర్మాలన్నీ వివరించారు. అవి నేటికీ ఉపయోగపడుతున్నాయి.

నారదుడు రచించిన శిల్పశాస్త్రం కూడా ఉంది.  


ఈ విధంగా మానవాళి శ్రేయస్సుకై ధర్మ రక్షణ కోసం నారద మహర్షి తనదైన పాత్ర పోషించారు.


నారద జయంతి –  ప్రపంచ పాత్రికేయుల దినోత్సవం

వైశాఖ బహుళ విదియ మహర్షి నారదుని జన్మ తిధి. మొదటి ఆదర్శ పాత్రికేయుడయిన నారదుని జయంతిని ప్రపంచం యావత్తు పాత్రికేయ దినోత్సవంగా జరుపుకుంటున్నది. ఆ రోజున పాత్రికేయ వృత్తికి న్యాయం చేకూర్చే కొంతమంది పాత్రికేయులకు సన్మాన సత్కారాలు జరుగుతాయి.


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

కామెంట్‌లు లేవు: