20, జూన్ 2021, ఆదివారం

పేదరికం ప్రతిభకు అడ్డురాదు

 *🙏పేదరికం ప్రతిభకు అడ్డురాదు:శివన్🙏*


*అన్ని సదుపాయాలు ఉన్నా తమ పిల్లలు సరిగా రాణించడం లేదని చాలా మంది తలిదండ్రులు బాధపడుతుంటారు.ఏ సదుపాయాలు లేక దుర్భర పేదరికంలో మగ్గుతున్న కుటుంబంలో జన్మించి పాఠశాల స్థాయిలో  మామిడికాయలు,కళాశాల స్థాయిలో కూరగాయలు అమ్మి చదువుకొన్న ప్రతిభాశాలి, మట్టిలో మాణిక్యం "ఇస్రో ఛైర్మన్ శివన్".కాలికి చెప్పులు లేవు.ఇంజనీరింగ్ వరకూ పంచెతోనే వస్త్రధారణ.ఆంగ్లం రాదు. అయినా ఆ మేథావి పట్టువదలక ఉన్నతస్థాయికి చేరాడు."శివన్" జీవితచరిత్ర నేటి తరం విద్యార్థులకు,యువతకు మార్గదర్శకం.*

  

   *భారత దేశం గర్వించదగ్గ వ్యక్తుల్లో ఇస్రో చైర్మన్ శివన్ ఒకరు. 1982 నుండి శివన్ ఇస్రోకి తన ఎనలేని సేవలని అందిస్తున్నారు. శివన్ బాల్యం గురించి చాలామందికి తెలియదు. కటిక పేదరికంలో పుట్టిన శివన్ ఇండియా లోని ప్రతిష్టాత్మకమైనటువంటి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో కి చైర్మన్ గా ఎలా  ఎదిగారో చూద్దాం.శివన్ పూర్తిపేరు కైలాసవదివు శివన్. 1957 ఏప్రిల్ 14 న తమిళ నాడు లోని కన్యాకుమారి డిస్ట్రిక్ లోని  మేళా సారకల్విలై అనే గ్రామం లో వ్యవసాయ కుటుంబానికి చెందినటువంటి. కైలాస వడివు మరియు చెల్లమ్ దంపతులకు శివన్ జన్మించాడు. శివన్ పదవ తరగతి వరకు పక్క గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో తమిళ్ మీడియం లో చదివాడు. తన కుటుంబం నుండి బడికి వెళ్లినవారిలో శివన్ మొదటివాడు. శివన్ తండ్రి ఊరూరా తిరిగి మామిడికాయలు అమ్మేవాడు. శివన్ కి ఇద్దరు చెల్లెల్లు, ఒక సోదరుడు ఉండేవారు. కొన్నికొన్ని సార్లు బడి మానేసి తన తండ్రి తో మామిడి కాయలు అమ్మడానికి వెళ్లాల్సి వచ్చేది. ఆ క్రమంలో తనతో పాటు తన పుస్తకాల సంచిని కూడా తీసుకొని వెళ్ళేవాడు.*


 *పదవ తరగతి పూర్తయ్యాక శివన్ తండ్రి చదువు మాన్పించి తనతో పాటు పనికి తీసుకొని వెళ్లాలనుకున్నాడు. శివన్ కి మాత్రం పైచదువులు చదవాలని ఉండేది. ఆ విషయాన్ని తన తండ్రితో చెప్పడానికి భయపడి తన మేన మామ'షణ్ముగ వేల్' కి చెపుతాడు. మొత్తానికి శివన్ మేనమామ  తండ్రిని ఒప్పిస్తాడు. కానీ చదువుకి డబ్బు ఖర్చవుతుంది. అప్పటికే ఆరుగురు ఉంటున్న ఆ కుటుంబం కేవలం శివన్ తండ్రి పైనే ఆధారపడి ఉంది. తనకి వచ్చే కొద్ది పాటి డబ్బు ని శివన్ చదువుకి ఖర్చుచేస్తే ఆ కుటుంబం మొత్తం పస్తులువుండాల్సిన పరిస్థితి. ఇదంతా అర్థం చేసుకున్న శివన్ తన తండ్రికి వారసత్వంగా వచ్చిన కొద్దిపాటి పొలంలో తన తండ్రి సహాయంతో కూరగాయలు పండించడం స్టార్ట్ చేసాడు.*


 *కాలేజ్ కి వెళ్లేముందు ఆ కూరగాయలను కోసుకుని సంచిలో వేసుకొని కాలేజ్ కి వెళ్లి సాయంత్రం కాలేజ్ అయిపోగానే ఆ కూరగాయలు అమ్మి వచ్చిన డబ్బుని తన తండ్రికి ఇచ్చేవాడు. అలా తన చదువుకి కావాల్సిన డబ్బును తానే స్వయంగా సమకూర్చుకున్నాడు. 1980 లో మద్రాస్ ఇస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. శివన్ ఇంజినీరింగ్ చదివేటప్పుడు తన తండ్రి తనకిఉన్న పొలంలో సగం శివన్ చదువుకి అయ్యే ఖర్చులకోసం  అమ్మేశాడు. ఆటైంలో శివన్ కేవలం లుంగి చొక్కాతో "కాళ్ళకి చెప్పులు" కూడా లేకుండా ఇంజనీరింగ్ కాలేజ్ కి వెళ్ళేవాడు. తన తోటి విద్యార్థులు శివన్ అవతారం చూసి హేళన చేసేవారు. కాని శివన్ మాత్రం తనని హేళన చేసినాకూడా అవేమి పట్టించుకోకుండా అందరితో మంచిగ ఉండేవాడు.*


 *కొంత మంది ప్రొఫెసర్లు శివన్ ఆర్దిక పరిస్థితిని అర్థం చేసుకొని కొన్ని పాత పుస్తకాలని శివన్ కి చదువుకోడానికి ఇచ్చేవారు. శివన్ చిన్నప్పటి నుండి తమిళ్ మీడియం కావడంతో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో కొన్ని కొన్ని ఇంగ్లీష్ పదాలు అర్థం కాకపోయేవి. తన స్నేహితుల దగ్గర వుండే ఇంగ్లీష్ డిక్ట్షనరి ని తీసుకొని తన నోట్స్ లో తనకి అర్థం కాని ఆంగ్ల పదాలకి తమిళ్లో అర్థం రాసుకొని  తనే స్వయంగా ఒక డిక్ట్షనరి ని తయారుచేసుకున్నాడు. శివన్ చదువులో మాత్రం ఎప్పుడూ ముందుండేవాడు. తరువాత 1982 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎయిరోనాటిక్స్ ఇంజెనీరింగ్ పూర్తి చేశాడు. మాస్టర్స్ చేసే టైం లోనే మొదటిసారిగా శివన్ పాంట్ వేసుకున్నాడు. మాస్టర్స్ పూర్తి అయిన అదే సంవత్సరంలో ఇస్రో లో జూనియర్ ఇంజినీర్ గా జాయిన్ అయ్యాడు.*


  *పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికిల్ PSLV ప్రాజెక్టు లో శివన్ ముఖ్యపాత్ర పోషించాడు. శివన్ క్రయోజెనిక్ ఇంజెన్స్ ని 6డి ట్రాజెక్టరీ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ని తయారుచేశాడు. 2011 లో GSLV మరియు రీ యూజబుల్ లాంచ్ వెహికిల్ ప్రాజెక్టులలో తన ప్రతిభ చూపించాడు. 2015 ఫిబ్రవరి లో శివన్ అతని టీం 104 సాటిలైట్స్ ని ఒకే సారి PSLV-C37 లాంచింగ్ వెహికిల్ లో స్పేస్ లోకి పంపి రికార్డ్ సృష్టించారు. 1982 నుండి శివన్ ఇస్రో నిర్వహించిన అన్ని రాకెట్ ప్రోగ్రామ్స్ లో తన వంతు సహాయాన్ని అందించాడు. తరువాత ఇస్రో కి సంబందించిన లిక్విడ్ ప్రోపల్షన్ సిస్టమ్ సెంటర్ కి 2014 జులై 2 లో డైరెక్టర్ గా అపాయింట్ అయ్యాడు. 2015 జూన్ 1న విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్ కి డైరెక్టర్ అయ్యాడు*.


    *2018 జనవరి లో శివన్ ని ఇస్రో కి చీఫ్ గా నియమించారు. అతని పర్యవేక్షణ లోనే ఇండియా చంద్రుడిపైకి పంపించే రెండవ మిషన్ అయినటువంటి చంద్రయాన్ 2 ని తయారుచేశారు.*

   *చంద్రయాన్ 2 కి మొత్తం 970 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. దురదృష్టవశాత్తు ఆ మిషన్ చివరి క్షణాల్లో చంద్రుడి పైన ల్యాండ్ అయ్యేముందు గ్రౌండ్ స్టేషన్స్ తో సిగ్నల్స్ కట్ అయింది. ఆ మిషన్ ఫెయిల్ కావడంతో శివన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ ని కలిసినప్పుడు దుఃఖాన్ని ఆపుకోలేక కంట తడిపెట్టాడు. దానికి నరేంద్ర మోది శివన్ ని ఓదార్చారు. ఇంత వరకు ఏ ఇస్రో ఛెైర్మన్ కూడా మిషన్ ఫెయిల్ అయ్యిందని కంఠతడిపెట్టలేదు.*

  *డబ్బువిలువ తెలిసిన శివన్ ప్రధాని నరేంద్ర మోదీని చంద్రయాన్ 2 మిషన్ ఫెయిల్ అయినందుకు తనని క్షమించమని అడిగాడు.ఓ శాస్త్రవేత్త ప్రయోగ విఫలానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధానిని క్షమాపణ కోరుట దేశ చరిత్రలోనే మొదటిసారి*


     *చివరిగా ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి ఎదిగిన శివన్ ఒక ఆదర్శవంతమైన వ్యక్తి. రాబోయే రోజుల్లో ఇస్రో చైర్మన్ శివన్ చేసే ప్రయోగాల్లో ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుందాం.........మన ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇలాంటి శివన్ లు ఎంతో మంది ఉండే ఉంటారు.ఇలాంటి స్ఫూర్తి దాయకమైన వ్యక్తుల జీవితాలను విద్యార్థుల కు తెలియచేయటం ద్వారా  అత్యున్నత శిఖరాలను అందుకునేందుకు నిబద్ధతతో కూడిన అకుంఠిత శ్రమ,కార్యదీక్ష, పట్టుదల వంటి లక్షణాలను అలవరచుకునే విధంగా నవతరాన్ని నిర్మిద్దాం.దేశప్రగతికి బాటలు వేయడంలో మనవంతుగా ముందుకు సాగుదాం.🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: