*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*478వ నామ మంత్రము* 28.10.2021
*ఓం ఖట్వాంగాది ప్రహరణాయై నమః*
ఖట్వాంగము మొదలైన ఆయుధాలు ధరించి విశుద్ధిచక్రనిలయ అధిష్ఠాన దేవతయైన డాకినీ స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *ఖట్వాంగాది ప్రహరణా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం ఖట్వాంగాది ప్రహరణాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులకు ఆ తల్లి వారి సాధనాపటిమను పెంపొందింపజేసి, సాధనయందు ఆత్మానందానుభూతిని అనుగ్రహించును.
*విశుద్ధిచక్రనిలయా* యను లలితా సహస్ర నామావళి యందలి నాలుగువందల డెబ్బదియైదవ (475వ) నామ మంత్రము నుండి నాలుగువందల ఎనుబది నాలుగవ (484వ) నామ మంత్రమువరకూ, విశుద్ధిచక్రము (పదహారు దళాల పద్మము) అధిష్ఠానదేవత యొక్క వర్ణము (శరీరవర్ణము), త్రిలోచనములు, ఆయుధములు, శిరస్సులు, పాయసాన్నము నందు ఇష్టము, చర్మధాతువునందుండునదనియు, పశులోకమునకు భయంకరియైన డాకినీశ్వరి యని చెప్పబడినది. అనగా డాకినీ ఈశ్వరిస్వరూపిణియైన పరమేశ్వరి యొక్క వివరములు చెప్పబడినవి.
ఈ నామ మంత్రములో డాకినీ ఈశ్వరియొక్క ఆయుధములైన ఖట్వాంగము అనగా మంచంకోడు. ఇంకా చెప్పాలంటే ఖట్వాంగము అనగా కర్రపై బోర్లించబడిన మానవ కపాలము (పుర్రె). ఖట్వాంగాది అనగా ఖట్వాంగము, ఖడ్గము, త్రిశూలము, మహాచర్మము అను నాలుగు ఆయుధములను, నాలుగుచేతులందు ధరించియున్నదని అర్థము. అమ్మవారు సకలదేవతా స్వరూపిణి. మానవ శరీరమందు గల షట్చక్రములు మరియు సహస్రారముల (సప్తమ చక్రమునకు) అధిష్ఠానదేవతలు అయిన డాకినీ, రాకినీ, లాకినీ, కాకినీ, సాకినీ, హాకినీ, యాకినీ స్వరూపములలో విలసిల్లుచున్నది.
పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం ఖట్వాంగాది ప్రహరణాయై నమః* అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి