భోజనం చేయుటకు ఉపయోగపడే ఆకులు - వాటిలోని ఔషధ గుణాలు -
కొంతకాలం క్రితం ఒక గ్రామము నందలి బాలురు తీవ్రమైన అతిసార వ్యాధితో బాధపడుతున్నారు. వారికి ఎంత మంచి చికిత్స అందించినను వ్యాధి తీవ్రత తగ్గటం లేదు . వారిని పరిశీలించుటకు వచ్చిన శాస్త్రవేత్తలు వారు ఆహారం తీసికొనుటకు ఉపయోగించుచున్న అల్యూమినియం పాత్రలను ప్రయోగశాలకు పంపినప్పుడు వారి రోగానికి కారణం వారు భుజించు ఆహారం కాదు వారు ఆహారాన్ని వండటానికి ఉపయోగించుచున్న అల్యూమినియం పాత్రలే కారణం అని నిర్దారణకు వచ్చారు. ఈ అల్యూమినియం పాత్ర యందు వండబడిన ఆహారం విషపూరితం అగును. అది శరీరం పైన ఒక్కసారిగా తన ప్రభావాన్ని చూపించదు. కొంచం కొంచంగా మనిషి యొక్క ఆరోగ్యాన్ని దెబ్బ తీయును .
అల్యూమినియం పాత్ర యందు ఆహారాన్ని ఉడికించడం మూలాన ఆహారం నందలి ఆమ్లములు , అల్యూమినియం లోహము పైన ప్రభావం చూపి అనేక విషసంభంధ రోగాలకు ప్రధానకారణం అగును. ముఖ్యంగా చర్మ సంబంధ , నరాల సంబంధ సమస్యలు అధికంగా వచ్చును. శరీరం నందు కేన్సర్ కూడ వృద్ధిచెందును.
పైన చెప్పినటువంటి సమస్యలు రాకుండా ఉండుటకు ముందుగా మనం ఆహారాన్ని వండే వంట పాత్రలను మార్చవలెను. అదేవిధముగా మనం ఆహారాన్ని భుజించుటకు విస్తరాకులు వాడటం ఎంతో మంచిది . ఇప్పుడు మీకు ఎటువంటి ఆకులతో చేసిన విస్తరాకులలో తింటే ఎటువంటి ఫలితాలు వస్తాయో వివరిస్తాను.
* అరటి ఆకు -
ఇందు భుజించటం మిక్కిలి శ్రేష్టం. కఫవాతములను హరించును . బలమును , ఆరోగ్యమును పెంచును. శరీరకాంతిని , సంభోగ శక్తిని పెంచును. ఆకలిని , దంతకాంతిని కలిగించును. పైత్యశాంతిని కలుగచేయును . శ్లేష్మ సంబంధ దోషాలు పోవును . శరీరం నొప్పులు తగ్గించును . ఉదరము నందలి పుండ్లు అనగా పెప్టిక్ అల్సర్ ను నయం చేయును .
* మోదుగ విస్తరి -
ఇందులో భుజించుటచే గుల్మరోగం , మహోదరం , క్రిమిరోగం , రక్తసంబంధ రోగాలు , పిత్తరోగములు నశించును. బుద్దిని పెంచును.
* మర్రి ఆకు విస్తరి -
దీని యందు భుజించిన క్రిమి రోగ నివారణ , జఠరాగ్ని వృద్ది , కుష్ఠు వ్యాధి నివారణ అగును. నేత్రదోష నివారణ అగును. వీర్యవృద్ధి కలుగును.
* పనస -
దీని విస్తరి యందు భుజించిన అగ్నివృద్ధి , పిత్తహర గుణములు ఉండును.
* రావి -
ఇది పిత్తశ్లేష్మ నివారణ , అగ్నివృద్ది కలిగించును. వీర్యవృద్ధి కలుగచేయును . విద్యార్జనకు మనసు కలుగచేయును .
* వక్క వట్ట -
ఇది అగ్నివృద్ధిని కలుగచేయును . వాత,పిత్త రోగాలని హరించును .
పైన చెప్పిన ఆకులలో భోజనం చేయడం వలన ఆయా ఆకులలో ఉండు ఔషధ గుణాలు అన్నియు మన శరీరం నందు చేరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చును.
కాళహస్తి వేంకటేశ్వరరావు
9885030034
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి