*శ్రీమదాంధ్ర భాగవతం - 26*
*బ్రహ్మోత్పత్తి–స్వాయంభువ మనువు*
విదురుడు కురుసభలో ఉండగా ఒకానొక సందర్భంలో ఆయన అవమానించ బడ్డాడు. విదురుడు అక్కడ నుండి బయలుదేరి ఉద్ధవుడి దగ్గరకు వెళ్ళి ఉద్ధవుడిని ‘కృష్ణ భగవానుడు ఎక్కడ ఉన్నాడు?’ అని అడిగాడు. ఉద్ధవుడు “కృష్ణ భగవానుడు నిర్యాణం చెందాడు. యాదవులు అందరూ వెళ్ళిపోయారు’ అని చెప్పాడు. ఈ సందర్భములో పరీక్షిత్తు ‘ఉద్ధవుడు కూడా యాదవుడే కదా – అతను ఎందుకు ఉండిపోయాడు?’ అని శుకుని అడిగాడు. కృష్ణుడికి ఏ జ్ఞానం ఉన్నదో అదే ఉద్ధవుడికి ఉన్నది. కృష్ణుడు తన తరువాత లోకమునకు జ్ఞానం చెప్పడం కోసం ఉద్ధవుడిని భూమిమీద ఉంచేశాడు. ఉద్ధవుడు శ్రీమన్నారాయణుని ఆదేశమును అనుసరించి బదరికాశ్రమమునకు వెళ్ళిపోతున్న ఉద్ధవుడిని విదురుడు కలుసుకుని ‘నీవు శ్రీమన్నారాయణుడి దగ్గర తెలుసుకున్న భాగవత జ్ఞానమును నాకు చెప్పవలసింది’ అని అడిగాడు. ఉద్ధవుడు ‘అది నాదగ్గరే కాదు. జ్ఞానమును మైత్రేయునికి కూడా చెప్పాడు. మైత్రేయుడు హరిద్వార్ లో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి వినవలసింది’ అని సలహా చెప్పాడు. విదురుడు గంగ భూమి మీద పడిన చోటయిన హరిద్వార్ వెళ్ళి, భాగవత జ్ఞానమును విన్నాడు. శ్రీమహావిష్ణువు నాభికమలములో నుండి చతుర్ముఖ బ్రహ్మ గారు పుట్టారు అప్పటికి సృష్టి లేదు. లోకములన్నీ నీటితో నిండి పోయి ఉన్నాయి. నీటితో నిండిపోయి వున్న లోకములందు తాను ఏమి సృష్టి చేయాలో ఆయనకేమీ అర్థం కాలేదు. ‘నేనన్న వాడని ఒకడిని వచ్చాను కదా – నన్ను కన్నవాడు ఒకడు ఉండాలి కదా!’ అని చుట్టూ చూశాడు. చుట్టూ నీళ్ళు తప్ప ఏమీ లేవు కంగారుపడ్డాడు.
ఏమిటి సృష్టి చేస్తాను? ఎలా సృష్టి చేస్తాను? అని ఆలోచిస్తున్నాడు. ఆయనకు పైనుంచి ‘తపతప’ అనే ఒక మాట వినపడింది. ఆయన తపించాడు. ధ్యానమగ్నుడై ఈమాట ఎవరి నుండి వెలువడిందో ఆయన దర్శనము అపేక్షించాడు. అలా తపించగా తపించగా శ్రీమన్నారాయణ దర్శనం అయింది. ఆయన ‘నీవు ఇలా సృష్టి చెయ్యి’ అని బ్రహ్మగారికి వేదములను ఇచ్చి ఆదేశం ఇచ్చాడు. చతుర్ముఖ బ్రహ్మ సృష్టి చేయడం ప్రారంభం చేశాడు.
ఆయన అలా సృష్టి చేయడం ప్రారంభం చేయడంలో ఒక గమ్మత్తయిన ప్రక్రియ జరిగింది. బ్రహ్మము నుండి సృష్టి వెలువడింది. ఆయన మొట్టమొదట సనక, సనందన, సనత్కుమారులను సృష్టించాడు. ఆ నలుగురుని సృష్టించి మీరు సృష్టిని వృద్ధి చేయండి. బిడ్డలను కనండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు ‘మేము ప్రవృత్తి మార్గములో వెళ్ళము. ఆ మార్గము మాకు అక్కరలేదు. మేము సృష్టి చేయము. మేము శ్రీహరి పాదములు చేరిపోతాము’ అన్నారు. వారు ఎప్పుడూ అయిదేళ్ళ వయసులో, చిన్నపిల్లల్లా బట్టలు విప్పుకుని, ఎప్పుడూ ధ్యానం చేస్తూ శ్రీహరి వైపు వెళ్ళిపోయారు. బ్రహ్మగారికి కోపం వచ్చింది. కోపంతో తన భ్రుకుటి ముడి వేశాడు. అందులోంచి నీలలోహితుడనే పేరుగల రుద్రుడు పుట్టాడు. వాడు కింద పడి ఏడవడం మొదలు పెట్టాడు. బ్రహ్మగారు వానిని ఏడవకు అన్నారు. ఆ రుద్రుడు ‘నేను ఎక్కడ ఉండాలి? ఏమి చేయాలి?’ అని అడిగాడు.
ఇక్కడ ఒక విషయము గమనించాలి. అక్కడ అప్పుడు సృష్టి, సంకల్పం నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం ఉన్న సృష్టి మిధున సృష్టి అనగా స్త్రీ పురుష మైధునం చేతనే సృష్టి జరుగుతూ ఉంది. అప్పుడు జరిగిన సృష్టి కేవలము ఈశ్వర సంకల్పము చేత మాత్రమే జరిగిన సృష్టి.
చతుర్ముఖ బ్రహ్మగారు ‘నువ్వు పుడుతూనే వచ్చావు కాబట్టి నిన్ను రుద్రుడంటారు అని చెప్పి రుద్రుడికి ఎనిమిది రూపములను, ఎనమండుగురు భార్యలను ఇచ్చి నీవు అలా ఉండి సృష్టి చెయ్యి’ అని చెప్పారు. ఆయన కొన్ని గణములను సృష్టించాడు. ఆ గణములు అక్కడ వున్న వాళ్ళను తినివేయడం మొదలుపెట్టాయి. బ్రహ్మగారు రుద్రుడిని పిలిచి ‘ఇక నీవేమీ సృష్టి చేయవద్దు. కేవలం తపస్సు చేసుకుంటూ ఉండవలసింది’ అని చెపితే ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు.
మళ్ళీ బ్రహ్మగారు ఆలోచిస్తూ కూర్చున్నారు. అలా ఆలోచిస్తుంటే ఆయన శరీరభాగముల నుండి రకరకముల మహర్షులు బయటకు వచ్చారు. బ్రహ్మగారి ఒడిలోంచి నారదమహర్షి బయటకు వచ్చారు. వీపు నుంచి ‘అధర్మము’ వచ్చింది. అధర్మములోంచి ‘మృత్యువు’ వచ్చింది. ముందుభాగం నుంచి ‘ధర్మం’ వచ్చింది. బ్రహ్మగారు ‘ఇలా నేను సంకల్ప వికల్పములు చేస్తే ఎంత సృష్టి చేస్తాను’ అనుకున్నారు. ఒక్కొక్కసారి సృష్టి చేసే వారియందు కూడా మోహము కలుగుతుంది. బ్రహ్మ ఒక స్త్రీని సృష్టించాడు. సృష్టించి ఆ స్త్రీ యందు మోహమును పొందాడు. ఋషులు ‘మీరు సృష్టించిన స్త్రీ యందు మీకు మోహమేమిటి' అని ప్రశ్నించారు. ఆయన ‘ఇది సృష్టికి ఉండే లక్షణము. ఏ శరీరముతో అలా మోహమును పొందానో ఆ శరీరమును వదిలిపెట్టేస్తున్నాను’ అని శరీరమును వదిలిపెట్టేశాడు. ఆ శరీరము పొగమంచు అయింది. మనకు రోజూ కళ్ళకు అడ్డముగా వచ్చే పొగమంచు అదే!
బ్రహ్మగారు మైథున సృష్టి చెయ్యాలని అనుకొని తన శరీరములో నుంచి రెండింటిని సృష్టించాడు. ఒకటి స్త్రీ, ఇంకొకటి పురుషుడు. అలా సృష్టించి ‘వీళ్ళయందు వ్యామోహమును ఏర్పాటు చేస్తాను. ధర్మబద్ధమైన ప్రజా సృష్టి జరుగుతుంది’ అన్నారు. మొట్టమొదట సృష్టించిన వాళ్ళలో మొట్టమొదట పుట్టిన వాడు స్వాయంభువ మనువు ఆయన భార్య పేరు శతరూప.
బ్రహ్మగారు ‘కొడుకు తండ్రిని సంతోషపెట్టాలి. నీవు సృష్టి చెయ్యి’ అన్నారు. అనగా స్వాయంభువ మనువు అయిదుగురు బిడ్డలను కని వచ్చి తండ్రికి తాను అయిదుగురు బిడ్డలను కన్నట్లు చెప్పాడు. వాళ్ళు ఎవరు అని అడిగారు బ్రహ్మగారు. ఆయన తన బిడ్డల పేర్లు చెప్పాడు. ఒకాయన పేరు ప్రియవ్రతుడు, రెండవకుమారుని పేరు ఉత్తానపాదుడు. ఒక కుమార్తె పేరు అకూతి. మరొక కుమార్తె పేరు ప్రసూతి. మూడవకుమార్తె పేరు దేవహూతి.
ఇప్పుడు ఏమి చెయ్యను?” అని తండ్రిని అడిగాడు. బ్రహ్మగారు ‘శ్రీహరిని సంకీర్తన చేస్తూ, యజ్ఞయాగాది క్రతువులను చేస్తూ సమస్తప్రాణులను రక్షిస్తూ పరిపాలన చేయవలసినది అని చెప్పాడు. ఆయన ‘నాన్నగారూ అలా పరిపాలించడానికి భూమి ఎక్కడ ఉన్నది? అని అడిగాడు. మీరు సృష్టి తామర తంపరగా ఎలా పెంచాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఈ భూమి ప్రళయం వల్ల వచ్చిన సముద్ర జలముల లో పడిపోయి రసాతలానికి వెళ్ళిపోయింది. పాతాళ లోకంలో ఉన్న ఆ భూమిని పైకి తీసుకుని వస్తే ప్రాణులు భూమి మీదకు చేరుతాయి. ఇంకా సృష్టి జరిగి ఇంకా ప్రాణులు వచ్చి దీనిని పరిపాలించడానికి ఆనుకూల్యం ఏర్పడుతుంది. ఆ భూగోళమును పైకెత్తండి’ అన్నాడు. బ్రహ్మగారు ఆ భూమిని ఎలా పైకెత్తడం! అని ఆలోచించాడు. ఆయన సంకల్పం చేయగానే వెనుక నుండి చేయిస్తున్న వాడు ఒకాయన ఇన్నిగా వస్తున్న వాడు ఆయన బ్రహ్మగారి ముక్కులోంచి ఊడి క్రిందపడ్డాడు. నాసికా రంధ్రం నుంచి చిన్న వరాహమూర్తి ఒకటి క్రింద పడింది.
ఆ వరాహము దంష్ట్రలతో పెద్ద కొండంత అయిపోవడం మొదలుపెట్టింది. అది అడుగులు తీసి అడుగులు వేయడం మొదలు పెట్టింది. అక్కడ వున్న ఋషులు అందరూ దానికేసి ఆశ్చర్యముగా చూస్తున్నారు. వాళ్లకి అర్థం అయింది. స్వామి సంకల్పమును అనుసరించి భూగోళమును పైకి ఎత్తడానికి ఎవరు మొట్టమొదటి నుండి చివరి వరకు ఉంటున్నటువంటి ఈశ్వరుడు వచ్చాడు అనుకున్నారు. అనగా మొదటి అవతారం వచ్చినది.
ఇది యజ్ఞవరాముగా వచ్చి అడుగులు తీసి అడుగులు వేస్తూ సముద్రంలోకి దూకింది. అది భూమికోసం మూపుపెట్టి వెతుకుతోంది. అలా వెతకడములో దాని ముఖం నిండా నీళ్ళు అంటుకు పోయాయి. అది తన ముఖమును పైకి తెచ్చి విదిలించింది. ఋషులందరూ ఋగ్యజుస్సామ వేదములతో స్తోత్రం చేస్తూ, ఆ నీళ్ళు మీద పడేటట్లు నిలబడ్డారు. ఈ కంటికి గోచరమవని వాడు రక్షించడం కోసమని ఒక విచిత్రమయిన మూర్తిగా వచ్చి నీటితో తడిసిన దేములో ఉన్న నీటిని చిమ్ముతున్నాడు. దీనిని విన్నప్పుడు విదురుడు ఒక విచిత్రమైన ప్రశ్న వేశాడు. దానికి జవాబుగా ‘యజ్ఞవరాహం వచ్చినపుడు ఆయన ఎంత గొప్ప మూర్తియో అంత గొప్ప రాక్షసుడు ఒకడు నీళ్ళలోంచి వచ్చాడు. వచ్చి యజ్ఞవరాహమూర్తి మీద కలియబడ్డాడు. అక్కడ వున్న వాళ్ళందరూ యజ్ఞవరాహమూర్తిని స్తోత్రం చేస్తున్నారు. ఆయన ఆ రాక్షసుడిని చంపి అవతల పారేశాడు’ అని చెప్పాడు .
‘ఆ వచ్చిన వాడెవడు? ఎందుకు వచ్చాడు? అందరూ నమస్కరిస్తుంటే వాడొక్కడు యుద్ధం చేయడం ఏమిటి? అందుకు సంబంధించిన కథను చెప్పవలసినది’ అని పరీక్షిత్తు అడిగితే శుకుడు చెప్పడం ప్రారంభించాడు.
ఇంకావుంది.
సాంఖ్యాయనాచంట.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి