18, డిసెంబర్ 2021, శనివారం

 పదాల పరమార్థాలు పెరుమాళ్లకెరుక...

 

     ‘‘మీ అక్షరాలు ముత్యాలు మాస్టారూ’’ అన్నాడో శిష్యుడు గురువుగారిని కాకాపట్టడానికి. ‘‘నా నీళ్లు ముత్యాలా? ఇదెక్కడి దిక్కుమాలిన పోలికరా శుంఠ...!’’ అంటూ వెంటనే వాతపెట్టారు ఆ మాస్టారు. చేతిరాత గురించి చెబుతుంటే గురువుగారు నీళ్లంటున్నారేంటని కుర్రాడు తెల్లముఖమేశాడు. మాస్టారి మాటల్లోని మర్మమేంటో పాపం అతనికి ‘అర్థం’ కాలేదు. 

‘అక్షరం’ అంటే సాధారణంగా అకారాది వరుసలోని వర్ణమే అనుకుంటాం. నిజానికి ‘పరబ్రహ్మ, ఆకాశం, కాలమానం, ఓంకారం, నీరు, ప్రకృతి, తపస్సు, యజ్ఞం’... ఇన్ని అర్థాలు ఉన్నాయి ఆ పదానికి. క్షరం (నాశనం) లేనిది ఏదైనా అక్షరమే. ఆ విషయాన్ని మరచిపోయి దాన్ని వర్ణానికి పరిమితం చేసేశాం. 

      పలుకుబడి, అవసరం, ప్రాధాన్యాలను బట్టి కొన్ని పదాల వాడుక ఎక్కువగా ఉంటుంది. ప్రజల అవగాహన, పదప్రయోగ అవసరం, భావ స్పష్టత, ప్రాచుర్యాన్ని బట్టి ఆ పదాల వినిమయం జరుగుతుంటుంది. వినియోగించకపోతే ఎంత గొప్ప వస్తువైనా మూలన పడిపోతుంది. పదాల పరిస్థితీ అంతే. ఏదో సందర్భంలో, ఏదో అవసరార్థం ఏర్పడ్డ పదం... దాని అవసరం తీరిపోయాక మరుగున పడుతుంది. అలాంటి స్థితిలో ఆ స్థానాన్ని మరొక అర్థం ఆక్రమిస్తుంది. అలా ఆక్రమించిన భావాలు కొన్ని సందర్భాల్లో స్థిరపడిపోతాయి. అలా స్థిరపడటాన్ని భాషలో ‘నిపాత’లు అంటారు. నిపతించడం అంటే పాతిపెట్టడం, స్థిరపరచడం. అంటే ఓ పదానికి వాడుకలో ఉన్న అర్థంతోపాటు ఇతర అర్థాలు ఇంకెన్ని ఉన్నా, వినియోగంలో లేకపోవడంతో మరుగున పడిపోతాయన్న మాట. ‘అక్షరం’ విషయంలోనూ అదే జరిగింది. అన్నట్టు, తెలుగులో ఇలాంటి పదాలు చాలా ఉన్నాయి. వాటిలో చాలా వరకూ సంస్కృతం నుంచి వచ్చినవే. 

      భద్రాచలం, పట్టిసాచలం, శేషాచలం... లాంటి పదాల్లో అచలమంటే ఏంటి? పర్వతం. అదొక్కటేనా దానికి అర్థం? దానికి ఇంకా ‘లోకం, వస్త్రపుటంచు, మేకు’ తదితర అర్థాలున్నాయి. అలాగే, చలనరహిత స్థితిలో ఉన్నది ఏదైనా అచలమే అవుతుంది. సరే, ‘ఉదధి’ దగ్గరికి వద్దాం. ‘మేఘం’ పర్యాయపదాల జాబితాలో ఇది ఉంటుందా? అబ్బే... ఎందుకుంటుందండీ, ‘ఉదధి’ అంటే సముద్రం కదా అంటారా! అదే పొరపాటు. కడలితో పాటు మేఘమూ ఉదధే. ఎందుకంటే... ఉదకాన్ని ధరించేది ఉదధి. మరి మేఘానికీ ఆ మురిపెం ఉంది కదా! 

భలే శిరోజాలు

‘మీ శిరోజాల సంరక్షణకు మా కొబ్బరి తైలాన్నే వాడండి’ అంటూ గతంలో ప్రకటనలు హోరెత్తేవి గుర్తుందా? వాటిని చూసిన పెద్దలు కొందరు... ‘వీళ్లేంటి పేలు పెంచుకోమని చెబుతున్నార’ని ముక్కున వేలేసుకునేవారట! విషయం ఏంటంటే... ‘శిరస్సులో పుట్టింది’ శిరోజం. అంటే, జట్టుతోపాటు పేను, చుండ్రు లాంటివి కూడా శిరోజాలే. కానీ, వ్యవహారంలో జుట్టు అనే అర్థమే స్థిరపడిపోయింది. ‘తైలం’ కూడా అంతే. తిలలు అంటే నువ్వులు. వీటి నుంచి తీసిన పదార్థమే ‘తైలం’. ‘నువ్వుల నూనె’ అని మాత్రమే దీనికి అర్థం. కానీ వేరుశనగ, ఆముదం, కొబ్బరి, ఆవ, అవిశ, విప్ప... తదితరాల నుంచి తీసే నూనెలనూ తైలాల కిందే జమకడుతున్నాం. మొత్తంగా తైలాన్ని నూనెకు పర్యాయపదం చేశాం. 

      ఉమ్మెత్త, సంపెంగ, నల్లచందనం, మోదుగ, బంగారం- వీటన్నింటి మధ్య ఓ సంబంధం ఉంది గుర్తుపట్టారా? ఏంటంటే... ‘కనకం’! ఈ పదానికి పైవన్నీ అర్థాలే. కానీ, మనం ఒక్క బంగారాన్నే వాడుతున్నాం. ‘రావణ కాష్ఠం’ అని మనకో జాతీయం ఉంది. ఆ లంకాధీశుడి చితి ఎప్పటికీ మండుతూనే ఉంటుందన్న నమ్మకంలోంచి ఇది పుట్టింది. అదలా ఉంచితే, అసలు ఈ కాష్ఠమంటే ఏంటి? కర్ర. దాంతో పాటు ‘పద్దెనిమిది రెప్పపాట్ల కాలం’ అని కూడా బ్రౌణ్య నిఘంటువు చెబుతోంది. కానీ, ఈ పదం ‘చితి’ అన్న అర్థంలోనే వాడుకలో ఉంది. పార్థివదేహాన్ని కట్టెలతోనే దహనం చేస్తారు కాబట్టీ, అదీకాక అశరీర సంస్కారాలన్నింటికి ఉపయోగించేవి కర్రలే కాబట్టి ఈ అర్థమొక్కటే జనం నోళ్లలో నానుతోంది. 

అదే పక్షి... అదే గాలి

ఖగమంటే పక్షి మాత్రమేనా? గ్రహం, బాణం, గాలి... ఇవేవీ ఖగాలు కావా? అవీ అవుతాయి. ఎందుకంటే... పద వ్యుత్పత్తి ప్రకారం ఆకాశంలో సంచారం చేసేది ఏదైనా ఖగమే. కానీ ఏం లాభం? మనం ‘పక్షి’తోనే సరిపెట్టుకుంటున్నాం. మరి ‘గోత్రం’ సంగతేంటి? వంశం పేరు, పేరు, గొడుగు, అడవి, బలం, వరిచేను కోసిన పొలం అనే అర్థాలున్నాయి. అయితే, అవి నిఘంటువులకే పరిమితమయ్యాయి. వాడుకలో మాత్రం గోత్రమంటే వంశం చిరునామానే! 

      తిరుమల వెంకన్న బంగారు చీరలు కట్టుకునేవాడట! నమ్మకపోతే అన్నమయ్యను అడగండి... ‘పసిడిచీరవాడు...’ అంటూ తన్మయత్వంతో పాడేస్తాడు. వాస్తవానికి ‘చీర’ అంటే వస్త్రం. పురుషులు ధరించేదైనా, స్త్రీలు ధరించేదైనా సరే. కానీ, ఇప్పుడది స్త్రీలకే సొంతమైంది. పాపం... ‘జలజం, పంకజం’ కూడా ఇలాంటివే. ‘జలమందు, బురదయుందు పుట్టేవి’ ఏవైనా జలజాలు, పంకజాలే! చేప, నత్తగుల్ల, జలగ, ముత్యం, పద్మం, కలువ లాంటివేవైనా కావచ్చు. అయితే, అదేం విచిత్రమో కానీ పై రెండు పదాలకీ ‘తామర/ పద్మం’ అనే అర్థాన్నే స్థిరం చేశారు. 

      పళ్లని ఆహారంగా స్వీకరించడమే ‘ఫలహారం’ కదా. పళ్లు కాకుండా ఇతర ఉపాహారాలు (అల్పాహారం) తీసుకున్నా ‘ఫలహారం చేశాం’ అంటున్నామెందుకు? అదే మరి నిపతించడమంటే! ఇక ‘శిల్పం’ అంటే ‘శిలతో తయారైంది’ అని అర్థం. అంటే ఒక ఆకృతి, లేదా బొమ్మ అని భావం. కాలక్రమేణా ఏ పదార్థంతో తయారు చేసిన బొమ్మలనైనా శిల్పాలు అనడం ఆనవాయితీ అయింది. మొత్తమ్మీద శిల్పం అంటే ‘బొమ్మ’ అనే అర్థం ఖాయమైంది. 

ఆదర్శాలూ... అవరోధాలూ...

కాలప్రవాహంలో కొన్ని పదాలకు ఏమాత్రం చుట్టరికం లేని అర్థాలు స్థిరపడిపోతాయి. ఆ పదం అసలు అర్థానికీ, వ్యవహారంలో ఉన్న అర్థానికి నక్కకూ నాకలోకానికి ఉన్నంత తేడా ఉన్నా మనం పట్టించుకోం. ఇలాంటి వాటికి ‘వివక్ష’ చక్కటి ఉదాహరణ. ‘వేరు చేసి చూడటం’ అనే అర్థంలో స్థిరపడింది కానీ, నిజానికి వివక్ష అంటే ‘మాట్లాడాలి అనే కోరిక’. ‘వక్తం ఇచ్ఛా వివక్షా’... ఇది వ్యుత్పత్తి. దీనికి, ‘మా మీద వివక్ష ప్రదర్శిస్తున్నారు’ అనే మన సాధారణ ప్రయోగానికి ఏమన్నా సంబంధముందా? చెప్పుకుంటూ వెళ్తే భాషలోని చిత్రాలు అన్నా ఇన్నా!! 

      ‘లక్ష్యసాధనలో అవరోధాలను అధిగమించడానికి పట్టుదల ముఖ్యం’ అంటూ పాఠాలు చెప్పేస్తాం కదా. దేనికి పట్టుదల కావాలి? అంతఃపురంలో అడుగుపెట్టడానికా? నిజానికి అవరోధ మంటే ‘అంతఃపురం’. ‘రాణివాసపు స్త్రీలు ఉన్నందున ఇతరుల ప్రవేశాన్ని నిషేధించిన ప్రదేశం’ అని అసలు అర్థం. కానీ, ఇది మనకు ‘అడ్డంకి’గానే తెలుసు! అలాగే, ‘ఆకాంక్ష’ను ‘కోరిక’ అనే అర్థంలో స్థిరపరిచేశారు. కానీ క్రియను బట్టి కర్త, కర్మలను తెలుసుకోవడం, విశేష్యాన్ని బట్టి విశేషణాన్ని తెలుసుకోవాలనే కోరిక కలిగి ఉండటం మాత్రమే ‘ఆకాంక్ష’ అవుతుంది. వ్యాకరణం చదివిన వారికి ఇది తెలిసిందే. 

      మనకు తెలిసినంత వరకూ ఆదర్శానికీ, అద్దానికీ ఏమైనా సంబంధం ఉందా? లేదు. నిజానికైతే ఉంది. ‘నీడ కనబడేందుకు ఉపయోగపడేది’ (అద్దం) అని ‘ఆదర్శం’ అసలు అర్థం. కానీ, ‘అనుసరించదగినది’ అనే అర్థంలోనే వ్యవహారంలోకి వచ్చేసింది. ఇక ‘ఆహుతి’ అంటే దేవతా ప్రీత్యర్థం అగ్నిహోత్రంలో హవిస్సును వేయడం. అలా వేసి సాదరంగా ఆహ్వానిస్తే దేవతలు వస్తారని నమ్మకం. అలా వచ్చేవారే ‘ఆహూతులు’! ఈ అర్థం పక్కకెళ్లి, ఏ సందర్భంలోనైనా ‘పిలిస్తే వచ్చేవారు’ అందరూ ఆహూతులవుతున్నారు ఇప్పుడు! దట్టమైన, భయంకరమైన అడవిని ‘కికారణ్యం’ అనడం రివాజు. ఈ పదం పంజాబీ భాషలోంచి వచ్చింది. ‘కికార్‌’ అంటే ‘నల్లతుమ్మ’ అని ఆ భాషలో అర్థం. ఆ చెట్లు అధికంగా ఉండే అరణ్యమే ‘కికారణ్యం’. అంటే నల్లతుమ్మ చెట్లున్న అడవి. ఈ విషయం తెలిసో తెలియకో మనం కాకులు దూరని కారడవులన్నింటినీ ‘కికారణ్యాలు’ అనేస్తున్నాం. 

      ఇలా పదం వేరు, పరమార్థం వేరైన పదాలు ఎన్నో కనిపిస్తాయి. కానీ, ‘పదుగురాడు మాట పాటియై ధరచెల్లు’ కాబట్టి వాడుకలో ఉన్న అర్థాలతోనే సర్దుకుపోవాలి. అయితే... మాటకట్లు తయారు చేసేవారు, చిత్ర రచనలు చేసేవారికి మాత్రం ఇలాంటి పదాలు బాగా ఉపయోగపడతాయి. ఆ సంగతి అలా ఉంచితే... మనం యథాలాపంగా వాడేసే పదాల వెనుక ఎంతటి కథ ఉందో తెలుసుకోవడం మాత్రం ఆసక్తికరం. భాషను పూర్తిగా ‘అర్థం’ చేసుకోవడానికి ఆ ప్రయత్నం అవసరం కూడా.

(అయ్యగారి శ్రీనివాసరావు -

 విజయనగరం)

కామెంట్‌లు లేవు: