*అకాలమరణం... ఓ సమీక్ష*
ఒక రోజు కైలాసంలో పార్వతీదేవి ఈశ్వరునితో నాధా, చావు అనునది ఏమి, దాని స్వరూపము ఏమిటి అని అడిగారు.
అప్పుడు పరమశివుడు, దేవి, ఆత్మ నిత్యము, శాశ్వతము. దేహము అశాశ్వతము. దేహము ముసలితనము చేత రోగముల చేత కృంగి కృశించి పోతుంది. దేహము వాసయోగ్యము కానప్పుడు జీవాత్మ ఆ దేహమును వదిలి పోతుంది. అదే మరణము. జీవాత్మ కృశించి వడలిన దేహమును వదిలి తిరిగి వేరొక శరీరమును ధరించి శిశువుగా జన్మించడమే పుట్టుక. కనుక జీవుడు ఈ జననమరణ చక్రములో నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటాడు అని పరమేశ్వరుడు చెప్పారు.
పార్వతీ దేవి, నాధా, బాలుడు చిన్నతనంలో చనిపోతే వృద్ధుడు చాలా కాలము బ్రతకడానికి కారణం ఏమిటి అని అడిగారు పార్వతి మాత..
ఆ ప్రశ్నకు పరమేశ్వరుడు, దేవీ, ఈ కాలము శరీరమును కృశింప చేస్తుంది కాని చంపదు. మానవులు పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితంగా జీవితం పొడిగించబడడం, తగ్గించబడడం జరుగుతూ ఉంటుంది. పొడిగిస్తే చాలా కాలం బ్రతుకుతాడు. తగ్గిస్తే మరణం సంభవిస్తుంది అని చెప్పారు ఈశ్వరుడు.
పార్వతీదేవి, పరమేశ్వరా మనిషికి ఆయుష్షు ఎందువలన పెరుగుతుంది ఎందువలన తగ్గుతుందిఅని అడిగారు.
పరమేశ్వరుడు, పార్వతీ మానవుడు ప్రశాంతముగా బ్రతికితే ఆయువు పెరుగుతుంది. అశాంతిగా జీవిస్తే ఆయువు క్షీణిస్తుంది. మానవుడు క్షమించడం నేర్చుకోవాలి. శుచిగా ఉండాలి. అందరి మీద దయ కలిగి ఉండాలి. గురువుల ఎడ భక్తి కలిగి ఉండాలి. వీటన్నింటిని వల్లా మానవుడి ఆయువు వృద్ధి పొందుతుంది.
అధికమైన కోపము కలిగి ఉండడం, అబద్ధాలు చెప్పడం, ఇతరుల ఎడల క్రూరంగా ప్రవర్తించడం, అపరిశుభ్రంగా ఉండడం, గురువులను ద్వేషించడం వీటి వలన ఆయువు క్షీణిస్తుంది.
పార్వతీ తపస్సు చేతనూ, బ్రహ్మచర్యము చేతనూ, మితాహారం చేతనూ, రోగం వచ్చినప్పుడు తగిన ఔషధములు సేవించడం చేతనూ ఆయుర్ధాయము పెరుగుతుంది. పైన చెప్పిన కర్మలు అతడు తన పూర్వజన్మ సుకృతంగా చేస్తాడు. ముందు జన్మలో పుణ్యం చేసుకున్న వాళ్ళు స్వర్గానికి పోయి అక్కడ సుఖములు అనుభవించి తిరిగి భూలోకములో జన్మిస్తారు. వారికి ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది. వారు అకాల మరణం చెందరు. ముందు జన్మలో పాపము చేసుకున్న వాళ్ళు నరకానికి పోయి కష్టములు అనుభవించి భూలోకములో తిరిగి జన్మిస్తాడు. అతడు అల్పాయుష్కుడౌతాడు. అందువలన అకాలమరణం సంభవిస్తుంది అని పరమేశ్వరుడు చెప్పారు.
🔱*ఓం నమః శివాయ*🔱
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి