*🌿రావి, వేప, మారేడు, జమ్మి, ఉసిరి, మేడి, మఱ్ఱి*
*దేవతా వృక్షాల్లో రావి(అశ్వత్థం)ఒకటి*. అశ్వత్థం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. రావి చెట్టును పిప్పల వృక్షమని అశ్వత్థవృక్షం అని, బోధివృక్షం అని కూడా అంటారు.
రావి చెట్టులో త్రిమూర్తులు ఉన్నారని చెప్పే శ్లోకం ఇది.
*శ్లోకం*
మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణ
అగ్రత: శివ రూపాయ, వృక్ష రాజాయతే నమః!
ఈ వృక్షం మూలం వద్ద బ్రహ్మ, మధ్యలో విష్ణువు, అగ్రంలో శివుడు ఉన్నారని దీని అర్థం.
రావి చెట్టును అశ్వత్థ నారాయణుడుగా భావించి పూజిస్తారు.
రావిచెట్టును విష్ణు స్వరూపంగా భావించి
స్త్రీలు సంతానం కోసం ప్రదక్షిణలు పూజలు చేస్తారు.
బుద్ధునికి ఈ చెట్టు క్రిందే జ్ఞానోదయం అయిందని చెబుతారు. అందువల్ల బౌద్ధులు దీనిని *బోధి వృక్షమని*
అంటారు.
.....................................
*వేప చెట్టు*
*వేపచెట్టు లక్ష్మీ దేవి స్వరూపమని చెబుతారు*. అందువల్ల నే విష్ణు రూపమైన రావి చెట్టుకు, లక్ష్మీ రూపమైన వేప చెట్టును ఒకే చోట పాతి వాటికి వివాహం చేస్తారు.
చాలా చోట్ల రావి చెట్లు, వేప చెట్లు కలిపి ఉంటాయి.
వేపాకు, వేపపూత, వేప చెట్టు మీదుగా ప్రసరించే గాలి ప్రతిది మనిషి ఆరోగ్యంగా వుండడానికి ఉపయోగ పడతాయి.
వేప సర్వరోగ నివారిణి. వేపలో ఉన్నన్ని ఔషధ గుణాలు వేరే చెట్టులో లేవంటే అతిశయోక్తి కాదేమో.
.........................................
*మారేడు వృక్షం*
*మారేడు ఆకులను సంస్కృతంలో బిల్వ పత్రాలంటారు*. మారేడు శివునికి ప్రీతికరం. మూడు పత్రాల బిల్వ దళం శివుని మూడు కనులకు ప్రతీక అని భావిస్తారు.
మారేడు దళాన్ని సోమవారము, మంగళ వారము, ఆరుద్రానక్షత్రము, సంధ్యాసమయము, రాత్రి వేళలందు, శివరాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండుగల సమయాన కోయకూడదు అని అంటారు.
మారేడుదళము గాలిని, నీటిని దోషరహితము చేస్తుంది.
బిల్వ పత్రాలను కోసేటప్పుడు కూడా ఒక శ్లోకం చదివి నమస్కరించి కోయాలంటారు.
*ఆ శ్లోకం*
అమృతోద్భవ శీవృక్ష మహాదేవ ప్రియ: సదా
గృహ్ణామి తవ పత్రాణి శివపూజార్థమాదరాత్!
*మారేడు అమృతం నుంచి ఉద్భవించిందని, శ్రీ వృక్ష మని పేరు*.
జైనులకు కూడా మారేడు పవిత్ర వృక్షం. వారి గురువుల్లో ఒకరైన *23వ తీర్థంకరుడు భగవాన్ పరస్‌నాథ్‌జీ మారేడు వృక్షం కిందే నిర్వాణం (జ్ఞానోదయం పొందారని) భావిస్తారు*.
మారేడులో ఔషధ గుణాలు అధికం. కడుపులో మంటకు కారణమయ్యే ఎసిడిటీ వంటి సమస్యలకు, కొన్ని ఉదర సంబంధ వ్యాధులకు మారేడు చూర్ణం, మారేడు ఆకుల కషాయం పనికొస్తుంది.
.....................................
*జమ్మి వృక్షం*
*జమ్మి చెట్టు దేవతా వృక్షాల్లో ఒకటి*. సంస్కృతంలో దీనిని శమీ వృక్షంగా పేర్కొంటారు. జమ్మి చెట్టును తాకడం పుణ్యప్రదమని చెబుతారు. జమ్మి చెట్టు గొప్పతనాన్ని వివరించే ఒక శ్లోకం ఇది.
అజ్ఞాతవాసంలో పాండవులు తమ
ఆయుధాలను ఈ వృక్షం పైనే ఉంచారు.
*శమి శమయతే పాపం, శమి శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియ దర్శిని!*
అగ్ని దేవుడు ఒక పర్యాయం భృగు మమర్షి కోపం నుంచి తప్పించుకోవడానికి ఈ చెట్టులోదాగి ఉన్నాడని కథ.
....................................
*ఉసిరి చెట్టు*
*ఉసిరిని శ్రీమహా విష్ణువు రూపంగా భావిస్తారు*. కార్తీక మాసంలో ఈ చెట్టు ను శ్రీమహా విష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తుంటారు. ఉసిరి కాయల మీద వత్తులు పెట్టి వెలిగిస్తారు. ఈ చెట్టు క్రింద భోజనాలు చేస్తారు.
ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదం లో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం.
.............................................
*మేడి చెట్టు*
*మేడి చెట్టు క్రింద దత్తాత్రేయుల వారు (త్రిమూర్త్యాత్మకుడు) కూర్చుని ఉంటారు*. ఇది కూడా దేవతా వృక్షమే.
(మేడి పండును అంజూర ఫలం, అత్తిపండు, ఫిగ్, సీమ మేడిపండు అని కూడా పిలుస్తారు).
......................................
*మఱ్ఱి చెట్టు*
మఱ్ఱి చెట్టును సంస్కృతంలో వటవృక్షం అని అంటారు. దీనినే *న్యగ్రోధ వృక్షము* అని కూడా పిలుస్తారు. న్యగ్రోధ వృక్షమంటే కిందకు పెరిగే చెట్టు (మర్రి చెట్టు ఊడలు కిందికి పెరుగుతాయి) అని అర్థం.
*మఱ్ఱి చెట్టును కూడా త్రిమూర్త్యాత్మక స్వరూపంగా భావిస్తారు*. ఈ చెట్టు సంతాన సాఫల్యతకు చిహ్నంగా భావిస్తారు.
సర్వ లోకాలకూ గురువుగా భావించే జ్ఞాన స్వరూపుడైన మేధా దక్షిణామూర్తి మర్రి వృక్ష ఛాయలోనే ఉంటాడు.
ప్రళయ కాలమందు యావత్ జగత్తు జలమయము అయినపుడు శ్రీమహావిష్ణువు బాలుని రూపంలో వటపత్రముపై మార్కండేయ మహామునికి దర్శనము ఇచ్చాడని భాగవతం చెబుతోంది.
🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి