పూర్వ/ఉత్తరాషాఢ నక్షత్రముతో కూడిన పూర్ణిమ వచ్చే మాసం ఆషాఢము. ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖ మాసములు ఆధ్యాత్మికంగా గొప్పవని శాస్త్రములందు చెప్పబడింది.
ఆషాఢమాసం శూన్యమాసంగా పెళ్ళిళ్ళు మొదలైన వాటికి పనికిరాకపోయినప్పటికీ ఆధ్యాత్మిక సాధనకు చాలా ముఖ్యమైనది. జగమంతా వ్యాపించిన జగన్నాథుడే స్వయంగా పురుషోత్తముడిగా సుభద్రా, బలభద్రా సమేత సుదర్శన స్వాములతో కలసి ప్రజల వద్దకు వచ్చి జాతర చేసుకునే జగన్నాథ రథయాత్ర కూడా ఈ మాస విశేషములలో ప్రధానమైనది.
ఆధ్యాత్మికతావు ఏ మాత్రం పురోగతి ఉండాలన్నా అవసరమైన గురువులను పూజించుకునే గురుపూర్ణిమ, చాతుర్మాస్యవ్రత ప్రారంభం, కర్కాటక సంక్రమణం ఇలా ఎన్నో ముఖ్యమైన వాటిని కలబోసుకొని ఉన్నది ఈ మాసం.
శరన్నవరాత్రులు, వసంతనవరాత్రుల వలె ఆషాఢ నవరాత్రులు కూడా దేవీ పూజకు ప్రధానమైనవి. ఈ నవరాత్రులలో అమ్మవారి క్రియాశక్తిరూపమైన వారాహీదేవిని పూజించడం సంప్రదాయం. దానాలలో ఈ నెలలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
ఈమాస ప్రారంభం నుండి రైతులకు ఆశాజనకంగా తొలకరి వర్షాలు ప్రారంభమవుతాయి. కనుకనే ‘ఆషాఢస్య ప్రథమ దివసే” అని కాళిదాసు మేఘసందేశాన్ని ఆషాఢమాసంలో వచ్చే మేఘంతోనే ప్రారంభించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి