7, జులై 2022, గురువారం

ఆధ్యాత్మికం..ఆత్మ విద్య

 ఆధ్యాత్మికం..ఆత్మ విద్య.. ఎవరికి కావాలి? (అంతర్మధనం)

...............................

ప్రవాహంలో కొట్టుకు పోతున్న వాడికి గడ్డిపోచ ఆధారంగా దొరికినా గట్టెక్కుతాడు. అదే ఆధ్యాత్మిక విద్య. ఆ ఆరాటం పోరాటమైతే నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం జరిగి ఆత్మ వైపు మళ్ళితే అది ఆత్మ విద్య. ఆత్మ పరమ లక్ష్యం పరమాత్మను సాధించు కోవడమే.


ఆచార్య వాణి..

....................

ఆచార్యుల అనుగ్రహం లేకుంటే ఏదీ అర్థం కాదు, ఏదీ సాధించ లేము. ఆచార్యుల అనుగ్రహంతో గ్రహించిన రెండు విషయాలు అవలోకిద్దాం.  త్రిమతాచార్యులు చెప్పిన విషయాలు లౌకికులు అర్థం చేసుకున్నా ఇట్టే మరచిపోతారు. సాధకులు అనుభవించి తెలుసు కుంటారు. తపస్సే ఏ సాధనకైనా మూలం. తపస్సు యోగమై ఆహార శుద్ధి కలుగుతుంది. అప్పుడు రాగం.. విరాగమై.. శరీరానికి, ఆత్మకు అనుసంధానమైన పరమాత్మ..అంటే ఈశ్వర ప్రాప్తి కలుగుతుంది.


అహం బ్రహ్మాస్మి..

..... ..............

ఇది శంకర భగవత్ పాదుల ఉవాచ. నిజానికి ఇది ఉపనిషత్ వాక్యమే. నేను - నువ్వు ఒకటే అంటే..ఆత్మే పరమాత్మ అన్నమాట. అయితే ఇది తపస్సు ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. అంతే కానీ నేనూ, నువ్వు ఒకటే అని తేలిగ్గా అనేసుకుంటే అహంకారమే మిగులుతుంది. శంకరాచార్యుల భాష్యానికి  విపరీత అర్థం తీసుకో కూడదు. శంకరాచార్యుల వారి అద్వైతం..ఆ రెండూ ఒకటే అంటుంది. ఆ రెండూ..ఆత్మ, పరమాత్మ. సాధనతో ఆత్మను తెలుసుకుంటే అది యోగమై పరమాత్మతో అనుసంధానమై ఆ రెండు ఒకటై పోతాయి. అంటే మిగిలేది ఒక్కటే.  శ్రీ రామానుజుల వారు రెండు కాదు..మూడు అన్నారు. అవి..శరీరం, ఆత్మ, పరమాత్మ. శరీరం లేదా ప్రకృతి..అంటే పాంచ భౌతిక దేహం చిత్ అన్నమాట. ఆత్మ శాశ్వతం. శరీరం పతనమైతే వేరే ఉపాధి తీసుకుంటుంది. శరీరం, ఆత్మకు ఆధారమైనది పరమాత్మ. ఆ విధంగా పరమాత్మను తెలుసుకోవాలి. ఆత్మకు సాక్షీభూతం పరమాత్మ. ఇదే.. విశిష్ట అద్వైతం. ఇక..మూడవది ద్వైతం. ఆత్మ వేరు..పరమాత్మ వేరు అంటారు     మధ్వాచార్యుల వారు. ఏది ఏమైనా త్రిమతాచార్యుల వారి తత్మం ఒక్కటే. ఆ ఈశ్వర ప్రాప్తే జీవుడి చరమ లక్ష్యం కావాలి. నశించి పోయే శరీరమే నేను అనుకోకుండా.. ఎప్పటికీ నశించని ఆత్మ స్వరూపులై.. ఈశ్వర ప్రాప్తి పొందాలి. ఆచార్యుల వాణి మనకు అలాంటి స్థితి కలిగించు గాక. స్వస్తి.// ఆదూరి వేంకటేశ్వర రావు.🙏


కామెంట్‌లు లేవు: