🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉
*ॐ* *ఓం నమః శివాయ* *ॐ*
రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు:
భారతీయ సంప్రదాయములో రాఖి పౌర్ణమి విశిష్టమైన స్థానం కలిగివుంది. ఈ పండుగను రక్షాబంధనం (రాఖీ) పండుగ గానూ, జంద్యాల పూర్ణిమ, వైఖానస మహర్షి జయంతి గాను, హయగ్రీవ జయంతి గాను , వరుణ పూజల రూపంలో ఈ పూర్ణిమను ఉత్సవంగా అందరూ జరుపుకుంటుంటారు. అందం, బంధం కలగలసిన పండుగ రాఖీ పౌర్ణమి. ఈ పండుగకు పురా ణాల ప్రకారం ఎన్నో అర్థాలున్నా, అన్నా చెల్లెళ్ల బాంధవ్యానికి, బాధ్యతకు ప్రతీకగానే దీనికి ఎక్కువ గుర్తింపు ఉంది. రాఖి పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, శ్రా వణ పౌర్ణమి, రక్షికా పూర్ణిమ...ఇలా పలు రూపాల్లో ఈ పండుగను జరుపుకోవడం విశేషం. అన్నదమ్ములు నూతన యజ్ఞో పవీతాన్ని ధరిస్తే అక్కాచెల్లెళ్లు వారికి హారతి ఇచ్చి కుంకుమ దిద్ది, తీపిని తినిపిస్తారు. నిండు చంద్రుని పూర్ణిమ శోభల ను పుడమి స్వీకరించే రోజు. రసమయమైన చంద్రకళలు షోడశం గా పూర్ణంగా అందే ఈ దినం ధ్యా నానికి ఆరాధనకీ అనుకూలమైన యోగకాలంపూర్ణిమ నిండు చంద్రుని శోభలను పుడమి స్వీకరించే రోజు. రసమయమైన చంద్రకళలు షోడశంగా, పూర్ణంగా అందే ఈ దినం ధ్యానానికి ఆరాధనకీ అనుకూలమైన యోగకాలం.
దేవతలు అంతా కలిసి తమలో ఎవరు గొప్పవారని పరీక్షలు జరిపి, ఆ పరీక్షలో అందరికన్న శ్రీమహావిష్ణువే గొప్పవాడని నిర్ణయించారట! బ్రహ్మకి కోపం వచ్చి ‘విష్ణుమూర్తి శిరస్సు తెగిపడుగాక’ అని శాపమిచ్చాడట. అలా శిరస్సు కోల్పోయిన విష్ణుమూర్తి దేవతలు చేసిన ఒక యజ్ఞానికి గుర్రపు తలతో వచ్చాడట. తర్వాత ఆయన ధర్మారణ్యానికి వెళ్లి ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు ఈశ్వరుడు వచ్చి పూర్వపు శిరస్సును ప్రసాదించాడట. ఇది స్కందపురాణ గాథ. పురాణాల్లో ఎలా వున్నా జ్ఞానదాతగా, గురువుగా, పౌర్ణమినాడు పూజలందుకునే దేవుడాయన.
శ్రీ మహావిష్ణువు విజయగాధా పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది. ఇలా శ్రావణ పూర్ణిమను ఎన్నెన్నో రకాలుగా పండుగగా, ఉత్సవంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది. మరి
అది లక్ష్మీమయమైన మాసంలో వచ్చినది కనుక సంపదలు ఇచ్చే శక్తి ఉంది. దానితో పాటు సర్వ విద్యా స్వరూపుడైన భగవంతుని విద్యాప్రదమైన అవతారం హయగ్రీవ అనే అవతారం జరిగింది ఈ శ్రావణ పూర్ణిమ రోజే. అందుకే ఈ రోజుకి అంత ప్రాధాన్యం. మనిషికి ప్రధానమైనది జ్ఞానం, జ్ఞానానికి ఆధారం శాస్త్రాలు, శాస్త్రాలకు మూలం వేదం. ఆవేదాన్ని లోకానికి అందించిన అవతారం హయగ్రీవ అవతారం. విద్య చదువుకున్న వారికందరికి కంకణం కడుతారు, వారు రక్షకులు అవుతారు అని. జ్ఞానికి రక్షగా ఉంటారని. ఆ జ్ఞానం చెప్పే భగవంతునికి చెందిన వాటంతటికి రక్ష. ఆ కంకణ ధారణ అనేదే రక్షబంధనం అయ్యింది. వేదం చదువుకునే వారందరూ శ్రావణ పూర్ణిమ నాడు ఆరంభంచేసి నాలుగు నెలలు వేదాధ్యయనం చేస్తారు. ఆతరువాత వేద అంగములైన శిక్షా, వ్యాకరణం, నిరుక్తం, కల్పకం, చందస్సు మరియూ జ్యోతిష్యం అనే షడంగములను అధ్యయనం చేస్తారు. విద్యారక్షకుడైన భగవంతుడిని ఉపాసన చేసుకొని మొదలు పెడుతారు. వేదాన్ని కొత్తగా నేర్చే వారే కాక, వేదాన్ని నేర్చినవారు తిరిగి ఇదే రోజునుండి మరచిపోకుండా నవీకరణం చేసుకుంటూ అధ్యయణం మొదలు పెడుతారు. హయగ్రీవుడిగా అవతరించి లోకాన్ని ఉద్దరించిన రోజు.
మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా దుష్ట, ప్రేత, పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన వివరించాడు. పూర్వకాలంలో దేవతలకు, రాక్షసులకు విపరీతంగా యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది. ఈ రక్షాబంధనం సందర్భంలో చదివే శ్లోకం.
'యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః,
తేనత్వామభిబధ్నామి రక్షే మా చల మా చల'
దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియచెప్పే భావం ఇమిడి ఉంది. బలిచక్రవర్తి రక్షకోరిన సోదరిని రక్షిస్తూ ఎలాంటి ఆటంకాలెదురైనా తడబడక ధైర్యంతో ఎదురొడ్డి నిలిచినవాడు. అటువంటి మహావీరునితో తన అన్నని పోలుస్తూ తనకి రక్షణ నివ్వమని కోరుతుంది. ఈ రాఖీ కట్టిన సోదరికి తగిన బహుమానం ఇస్తూ ఆశీర్వధిస్తాడు అన్న. రాఖీ పౌర్ణమి, శ్రావణ పున్నమిరోజును యిలా ఎన్నోరకాలుగా దేశమంతా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. దేవతారాధనలు, ప్రకృతి దేవతారాధనలు, ఆత్మీయతానురాగబంధాలు... సకల పూజారాధనలు అందుకునే రోజు ఈ శ్రావణ పౌర్ణమి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి