21, డిసెంబర్ 2022, బుధవారం

కుమరేశన్ మామ మనల్ని కాలచక్రంలో

 జనవరి 8 1994, మధ్యాహ్నం 2:58


కుమరేశన్ మామ మనల్ని కాలచక్రంలో ఆరోజుకు తీసుకునివెళ్తున్నాడు.


“జనవరి 7 ఏకాదశి కావడంతో పరమాచార్య స్వామివారు పూర్ణ ఉపవాసం ఉన్నారు. కాని, మేము బలవంతం చేసి కొద్దిగా గంజి ఇచ్చాము. అప్పటికే కొద్ది కాలంగా మహాస్వామివారి ఆరోగ్యం క్షీణించడంతో అ రాత్రంతా స్వామివారికి డ్రిప్స్ ఇచ్చారు. స్వామి వారు డ్రిప్స్ పై ఉండడంతో రాత్రంతా వారి చెయ్యి పట్టుకునే ఉన్నాను. డాక్టర్ శ్రీధర్ మరియు భాస్కర్ కూడా అక్కడే ఉన్నారు.


మరుసటిరోజు ద్వాదశి, అనుషం(స్వామివారి జన్మ నక్షత్రం). ఉదయం మూడు గంటలకు లేచారు స్వామివారు. ఎన్నడూ లేని విధంగా బలంగా, పెద్ద స్వరంతో ఉన్నారు. అందరినీ పేరుపేరునా గుర్తిస్తున్నారు. ఆకలిగా ఉందని చెప్పడంతో కొద్దిగా గంజి ఇచ్చాము. మహాస్వామివారికి నమస్కరించడానికి జయేంద్ర స్వామి, బెంగళూరు హరి వచ్చారు. పూజ పూర్తయ్యిందా అని జయేంద్ర స్వామిని అడిగారు స్వామివారు. 


చెయ్యడానికి వెళ్తున్నానని బదులిచ్చారు జయేంద్ర స్వామివారు. పూజ చేస్తూ ఉండమని, ఆపవద్దని ఆదేశించారు. బెంగళూరు హరి వెండి పాదుకలను, పరమాచార్య స్వామివారి పూర్వాశ్రమ తల్లితండ్రుల చిత్రపటాన్ని తెచ్చాడు. శ్రీ చంద్ర పాదుకలను స్వామివారి పాదాలకు ఉంచి, పటాన్ని స్వామివారికి ఇచ్చాడు. కాని స్వామివారు దాన్ని గుర్తించలేదు. అప్పుడు నేను చదువ కళ్ళజోడుని తీసి మామూలు కళ్ళజోడు పెట్టుకోవడానికి సహాయం చేశాను. స్వామివారు చిత్రపటాన్ని చూసు దగ్గరగా పెట్టుకున్నారు.


తరువాత పాదుకల గురించి అడుగగా, స్వామివారి పాదాలకే ఉన్నాయని చెప్పాను. అప్పటిదాకా వదులుగా ఉన్న స్వామివారు పాదాలు, పాదుకలు కాళ్ళకు ఉన్నాయని తెలియగానే పాదాలను బిగించారు. ఎంత గట్టిగా బిగించారు అంటే, స్వామివారే వదిలేదాకా మేమెవ్వరమూ తీయడానికి కాలేదు.


బెంగళూరు హరి వెళ్ళవలసి ఉండడంతో పాదుకలను వదిలారు. పాదుకలను, చిత్రపటాన్ని హరికి ఇచ్చారు. తరువాత వీటిని ఎచ్చంగుడిలో(పరమాచార్య స్వామివారి తల్లిగారైన మహాలక్ష్మమ్మ గారి గ్రామం) ఉంచారు.


జయేంద్ర స్వామి పూజ పూర్తిచేసి పరమాచార్య స్వామి వద్దకు వచ్చారు. శంకర విజయేంద్ర స్వామితో కలిసి చెన్నైలో హిందూ మిషన్ సమావేశానికి వెళ్ళాల్సి ఉంది. స్వామివారు ఆరోగ్యంగా ఉండడంతో, సెలవు తీసుకుని ఇద్దరో వెళ్ళిపోయారు.


తరువాత మేము స్వామివారికి స్నానం చేయించి, భక్తుల దర్శనానికి వీలుగా ఈజీ చయిర్ లో కూర్చోబెట్టాము. ఆరోజు అనుషం కావడంతో, ప్రదోషం మామ, వారి భార్య, మెచేరి పట్టు శాస్త్రి వచ్చారు అనుషం ప్రసాదంతో. మహాస్వామి వారే తీర్థాన్ని తలపై చల్లుకుని, రక్షను నుదుటిపై ఉంచుకున్నారు. పట్టు శాస్త్రిని శంకర జయంతి ఏర్పాట్లు, మరికొన్ని విషయాలను అడిగి, వాళ్ళను ఆశీర్వదించి పంపారు. వారు సంతోషంతో మఠం నుండి వెళ్ళిపోయారు.


ఆరోజు ద్వాదశి కావడంతో స్వామివారు మంచిగా ఆహారం స్వీకరించారు. నేను, శ్రీ కంఠన్ తయారుచేసిన వంటకాల్ని(పాయసం, బాదాం హల్వా, పచ్చి అరటి ఇడ్లి) ఒక్కొక్కటి అడిగి మరీ స్వీకరించారు. భిక్ష ముగించగానే, లఘుశంకకు వెళ్ళాలని చెప్పారు. మేము స్వామివారిని మోసుకునివెళ్ళడానికి సిద్ధమయ్యాము. వైతా మామ, అరక్కోణం బాలు స్వామివారి కాళ్ళు పట్టుకోగా, బాలు జబ్బ పట్టుకున్నారు. స్వామివారిని కూర్చోపెట్టబోతుండగా స్వామివారు కాలు విదిలించడంతో, ముగ్గురూ కింద పడిపోయారు.


అప్పుడే స్వామివారి ఆత్మ దేహం నుండి విడివడింది. డాక్టర్ భాస్కర్ స్వామివారిని పడుకోబెట్టమన్నారు. ఇతర వైద్యులు వచ్చి, స్వామివారిని పరీక్షించి, పరమాచార్య స్వామివారు సిద్ధి పొందినట్టు ధ్రువీకరించారు.

మేము తట్టుకోలేకపోయాము. కాని మమ్మల్ని ఏడవద్దని అందరూ వారించారు ఎందుకంటే స్వామివారు పరమేశ్వరులు కాబట్టి.


వార్త తెలిసిన వెంటనే జయేంద్ర స్వామి, విజయేంద్ర స్వామి వచ్చారు. జయేంద్ర స్వామి అస్సలు తట్టుకోలేకపోయారు. మహాస్వామి వారి పాదాలపై పడి ఏడ్చారు. వారిని సముదాయించడం ఎవరివల్లా కాలేదు. అందుకే దాదాపు అరగంట పాటు వారిని అలాగే స్వామి వారి వద్దనే వదిలేసాము. తరువాత విజయేంద్ర స్వామి వచ్చి వారిని స్థిమితపరచి వారి గదిలోనికి తీసుకునివెళ్ళారు.


పట్టు శాస్త్రి చెన్నై చేరుకోగానే, ఈ విషయాన్ని ఒక ఆటో డ్రైవరు తెలిపాడు. అప్పుడే స్వామివారిని దర్శించి ఉండడంతో వెంటనే ఆగ్రహోదగ్ధుడై అతణ్ణి కొట్టారు. కాని ఇంటికి వెళ్ళగానే, నిజం తెలిసింది. వెంటనే కుటుంబంతో సహా కాంచీపురానికి ప్రయాణమయ్యారు.


పరమాచార్య స్వామివారి చివరి దర్శనం కోసం ప్రజలు ఉప్పెనలా కాంచీపురానికి వచ్చారు. జాతి, కుల, మతాలకు అతీతంగా విచ్చేశారు.

శ్రీవారు పరమేశ్వరుడే అనడానికి నిదర్శనాలు అవసరం లేదు. ప్రదోషం, ద్వాదశి, అనుషం, కృష్ణపక్షం, ఉత్తరాయణ పుణ్యకాలంలో చివరి సంస్కారాలు జరిగాయి”


--- కుమరేశన్ మామ తమిళ ఇంటర్వ్యూ నుండి


https://youtu.be/Fn8sEIlsVo0


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: