5, జనవరి 2023, గురువారం

గొప్ప_సావు

 *గొప్ప_సావు

                  ➖➖➖✍️


"ఏమైంది…?" వెళుతున్న కారు వేగం తగ్గడంతో... అడిగాడు మాధవ, డ్రైవర్ని.


"ముందు ఏదో ఊరేగింపు లాగా వుంది సర్. వెళ్ళే బండ్లను ఆపేస్తున్నారు" డ్రైవర్ తలని బయటపెట్టి చూసి చెప్పాడు.


"అది వెళ్ళే దాకా మనం వెళ్ళలేమా? 

ఇంకో దారి ఏదైనా వుంటే అటుగా వెళ్ళు".


"ఇక్కడ వేరే పక్క దారి లేదండి. సగం దాకా వచ్చేశాం ఈ రోడ్డులో" బండి పక్కకు ఆపుతూ చెప్పాడు డ్రైవర్.


"కనుక్కో… ఏంటో " చేతిలోకి ప్రక్కన ఉన్న మాగజైన్ తీసుకుంటూ చెప్పాడు మాధవ.


కారు దిగి వెళ్లి ట్రాఫిక్ పోలీస్ తో మాట్లాడి వచ్చి చెప్పాడు డ్రైవర్ "మొన్న బోర్డర్ లో చనిపోయిన సైనికుడి బాడీ అంట సర్. ఇవ్వాళ వచ్చిందిట అక్కడి నుండి. ముందు వున్న పోలీస్ పరేడ్ గ్రౌండ్ కి తీసుకెళ్తున్నారు ట."  మళ్ళీ డ్రైవరే చెప్పాడు "పాకిస్థాన్ సరిహద్దుల్లో టెర్రరిస్ట్ లతో జరిగిన పోరాటంలో ఇద్దర్ని చంపి మరొకడిని సజీవంగా పట్టుకునేందుకు చేస్తుండగా వాడు పేల్చుకొడంతో ఈన చనిపోయాడట సర్! "


"ఆ బాడీ అక్కడకు చేరేదాకా మనం ఏం చేయలేమా! ఇట్లా రోడ్ మీద వుండిపోవాల్సిందేనా?" మాధవ మాటలు మనసులో అసహనాన్ని నింపుకున్నాయి!


"కొంచెం ముందుకెళ్లాక డబుల్ రోడ్ వస్తది. అక్కడ వచ్చే పోయే ట్రాఫిక్ ను పక్క రోడ్ నుండి పంపిస్తున్నారట సర్, పోలీస్ చెప్పాడు" చెప్పాడు డ్రైవర్.


బయటకి చూసిన మాధవ ఆశ్చర్యపోయాడు, ఊరేగింపు లో కలవడానికి వెళుతున్న జనాన్ని చూసి. నేల ఈనినట్లు జనం వచ్చి కలుస్తున్నారు. వాళ్లు నినాదాలు వ్రాసివున్న ప్లాకార్డ్స్  చేతులతో పైకి ఎత్తి పట్టుకొని నినాదాలు చేస్తూ నడుస్తున్నారు. కొన్ని స్కూల్ పిల్లల బస్సులు కూడా వస్తున్నాయి ఊరేగింపు లోకి. ఇప్పుడు బండిని వెనక్కి త్రిప్పించుకొని కూడా వెళ్ళలేడు. ఇంతలో వాళ్ళ కారు ప్రక్కనే వచ్చి ఆగింది ఒక జీపు. ఆ జీపు కు ఒక ఫ్లెక్సీ కట్టబడి వుంది. దాని మీద "కెప్టెన్ శంకర్ స్వామి జిందాబాద్", " కెప్టెన్ శంకర్ స్వామి అమర్ రహే" అని వ్రాసి వున్నాయి.

అది చదివిన మాధవ ఆలోచనలో పడ్డాడు. ఆ పేరు తనకు పరిచయ మైనదే, గుర్తు తెచ్చుకోవడానికి ప్రయతించ సాగాడు. ఇంతలో మరొక ఆటో వెనక భాగాన ఆ అమర సైనికుడి ఫోటో వున్న ఫ్లెక్సీ తగిలించుకుని ముందుకు వచ్చింది. ఆ ఫోటోలో వున్న వ్యక్తిని చూసిన మాధవ అతనిలో తెలిసిన వాళ్ళ పోలికలు కనపడగా, గుర్తు తెచ్చుకోవడానికి ప్రయతించ సాగాడు. తన స్మార్ట్ ఫోన్ లో  గూగుల్ న్యూస్ చూసాడు. అందులో శంకర్ స్వామి జీవిత విశేషాలు, కొన్ని ఫోటోలు కనిపించాయి. 


ప్రక్కన ఆగిన జీపు ముందుకు కదులుతూ వుండగా వచ్చిన నినాదాలు "శంకర్ స్వామి అమర్ రహే" , మాధవ ఆలోచనలను తన ఉన్నత పాఠశాల రోజులకు మళ్ళించినయ్.

*******************


అవి తను పదో తరగతి చదువుతున్న రోజులు.

"నువ్వు పెద్ద అయ్యాక ఏం అవ్వాలను కుంటున్నావురా రంగా?" అడిగాడు సోషల్ మాష్టారు రంగారావు ను.


"నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కుంటున్నాను సార్."


" ఎందుకురా?"


" పోలీస్ అంటే అందరికీ భయం సార్. అందుకని!"


" నువ్వు రా శరత్?"


"లాయర్ అవుతాను సర్."


అలా తరగతిలో పిల్లలందరినీ అడుగుతున్న మాష్టారు శంకర్ స్వామి నీ అడిగాడు " నువు చెప్పరా శంకర్".


"గొప్పగా సావాలనుకుంటున్నాను సర్" శంకర్ స్వామి సమాధానంతో క్లాస్ అంతా నిశ్శబ్ధం అయ్యింది ఒక్కసారి.

సోషల్ మాష్టారు ఉలిక్కిపడ్డాడు శంకర్ సమాధానాన్ని విని.


తేరుకొని, "ఏంటిరా అట్లా అన్నావ్?" అడిగాడు శంకర్ స్వామిని.


"అవును సార్ గొప్పగా సావాలి సర్!" శంకర్ మళ్ళీ అదే మాట!


ఆశ్చర్యపోయిన మాష్టారు, " నువ్వు ఇక్కడకి రారా" పిలిచాడు శంకర్ ని తన దగ్గరకి. శంకర్ వచ్చాడు మాష్టారు దగ్గరకి.


"గొప్పగా చావడం ఏంటిరా? ఎవరు చెప్పారు నీకు ఈ మాట?" అడిగాడు మాష్టారు ఆశ్చర్యంగా!


"మా యమ్మ సర్. కష్ట పడిన వాళ్లందరూ గొప్పవాళ్ళుగా బతకచ్చుట, కానీ గొప్పగా సావడం గొప్ప విషయం అంట సర్".


"అంటే?" రెట్టించి అడిగాడు మాష్టారు.


"మన బతుకు మనం బతుకుతా సస్తే గొప్ప కాదంట! మన వాళ్ళ కోసం సస్తే అది గొప్ప సావంట! అందు కోసం నేను ఆర్మీ లోకి ఎలతాను సర్" శంకర్ కంఠం ఎంత స్థిరంగా పలికిందంటే, అతను తన తల్లి మాటలను నూరు శాతం విశ్వశిస్తున్న అంతగా.


ఆ రోజు శంకర్ స్వామిలో ఒక క్రొత్త వ్యక్తి కనపడ్డాడు క్లాస్ మొత్తానికి! అప్పటి దాకా ఏ ప్రత్యేకతా లేని ఒక మామూలు విద్యార్థిలో దాగి వున్న ఆశయ విస్ఫోటనం జరిగింది ఆ రోజు తరగతి గదిలో!   అది అందరినీ అతని వైపు ఆకర్షించింది, అందులో మాధవ కూడా ఒకడు.


మాధవ, ఇంకా ఒక నలుగురు స్నేహితులూ కలిసి సైకిళ్ల మీద స్కూలు కు వెళ్ళేవాళ్ళు. శంకర్ స్కూల్ కి నడిచివెళ్లే వాళ్ళల్లో ఒకడు. ఆర్థిక పరమైన తారతమ్యం వలన ఒకే తరగతి చదివే వాళ్ళు అయినప్పటికీ వేరు వేరు స్నేహితుల గుంపుగా సాగేవారు విద్యార్థులు. శంకర్, స్కూల్ అయిన తర్వాత తండ్రి నడిపే ఇస్త్రీ దుకాణం లో తండ్రికి రెండు మూడు గంటలు సాయపడేవాడు. అందువల్ల బయట స్నేహాలు అలవాటు కాలేదు.


టెన్త్ లెక్కల పరీక్షలప్పుడు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది మాధవకు – తనకు ముందు వరుసలో శంకర్ తల వంచుకొని పరీక్ష వ్రాస్తున్నాడు. ప్రశ్నాపత్రం చాలా కష్టంగా వుంది. తనకు తెలిసిన లెక్కలు రెండే వున్నాయి, వాటివల్ల పాస్ మార్కులు రావు. ఇంతలో శంకర్ వ్రాసిన ఆన్సర్ పేపరు ఒకటి జారివచ్చి మాధవ కాళ్ళ దగ్గర పడింది. శంకర్, మాధవ ఇద్దరూ గమనించలేదు. తర్వాత అటుగా వచ్చిన ఇన్విజిలేటర్ దాన్ని తీసి మాధవకి ఇచ్చి - పేపర్లు జాగ్రత్తగా పెట్టుకో - మని సలహా ఇచ్చాడు! అది తన పేపర్ కాదని తెలుసుకున్న మాధవ పేపర్ని తరచి చూసాడు. తనకు తెలియని ఇరవై మార్కుల లెక్క ఒకటి చేయబడి వుంది అందులో. తన అదృష్టాన్ని తానే నమ్మలేక పోయాడు. అంది వచ్చిన అవకాశాన్ని వదులు కోక దాన్ని పూర్తిగా కాపీ చేసి, ఇన్విజిలేటర్ చూడనప్పుడు శంకర్ ను పిలిచి "కింద పడి వుంది " అంటూ ఇచ్చాడు. శంకర్ పేపర్ నుండి కాపీ చేసిన దానివల్ల తను టెన్త్ క్లాసు లెక్కల పరీక్ష గట్టెక్కేసాడు. 


తర్వాత కాల ప్రవాహంలో తను ఇంటర్, ఇంజనీరింగ్    వేరే ఊర్లో చదవడం జరిగింది. ఊరు శివార్లలో తండ్రి తన చిన్నప్పుడు కొన్న అయిదు ఏకరాల వ్యవసాయ భూమి, పట్టణం విస్తరణ దాహానికి లోనయ్యింది! దాని విలువకు ముందుగా కాళ్ళు, తర్వాత రెక్కలు వచ్చేసరికి,   తను చదివిన సివిల్ ఇంజనీరింగ్ ను ఉపయోగించి ఆ భూమిలో విల్లాలు కట్టి తనో పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి అయ్యాడు. పెళ్లి, ఇద్దరు పిల్లలు, బంగళా, ఖరీదైన కారు ఇవన్నీ ఏర్పడిన జీవితం తనది.


శంకర్, ఆర్థిక పరిస్థితులు సహకరించక ఇంటర్మీడియేట్ తర్వాత 18 సంవత్సరాల వయసు నిండుతోనే మిలిటరీ లో చేరాడు. ఆర్మీ లో వుంటూ టెక్నికల్ కోర్సు లు పూర్తి చెయ్యడం, అంకిత భావంతో విధులు నిర్వర్తించడం తో కెప్టెన్ స్థాయికి చేరుకున్నాడు. 


ఈ విషయం తనకి అయిదేళ్ల క్రితం జరిగిన పూర్వ విద్యార్థుల కలయిక సందర్భంగా తెలిసింది. చాలా ఏళ్ళ తర్వాత చూడడం, శంకర్ దేహ ధారుఢ్యం, గంభీరత చూసి ఆశ్చర్యపోని మిత్రులు లేరు. ఆ సందర్భంలో శంకర్ ఎవర్తోనో -పురోహితులకు, దేశహితులకు అంటే మా డిఫెన్స్ వాళ్ళకి పెళ్లిళ్లు అంత తేలికగా అవవు! - అంటుండగా విని అతనికి ఇంకా పెళ్లి కాలేదని తెలిసింది.

****************


స్కూలు రోజుల నుండి మాధవ ఆలోచనలు వర్తమానం లోకి వచ్చాయి.

తాను కట్టేవి ఖరీదైన బట్టలు, వాటి విలువ డబ్బుతోనే చూస్తారు, డబ్బున్న ప్రతివారు కొని వేసుకొనగలరు.

శంకర్ స్వామి వేసే యూనిఫాం ఖరీదైనది కాకపోయినా, హోదాని ఇచ్చేది. అది వేసుకోవాలి అంటే అర్హత వుండాలి.

నా బట్టలు నా శరీరానికి సుఖాన్ని ఇస్తున్నాయి. శంకర్ స్వామి దుస్తులు వ్యక్తికి గౌరవాన్ని ఇస్తున్నాయి.

జాతీయ పతాకం కప్పబడిన ఆ శరీరం అర్హత ఏంటి? ఇంత సంపద వున్న నాకు ఆ అర్హత ఎందుకు లేదు? 

స్వామి దేశం కోసం శ్రమించాడు, నేను నా కోసం నా కుటుంబం కోసం శ్రమించాను.

నాది స్వార్థం. తనది త్యాగం!

నాకేమైనా అయితే నా కుటుంబానికి మాత్రమే నష్టం. తను లేని లోటు దేశానికి నష్టం.

తనకు చావు, వయసు అయిపోయో, అనారోగ్యం తోనో రావచ్చు. స్వామికి ఒక బాధ్యతా నిర్వహణలో వచ్చింది!


నా చావు వల్ల ఎవ్వరికీ ఒరిగేది ఏమీ లేదు. కానీ అతనిది ఓ కర్తవ్య నిర్వహణ ప్రయోజనం కలిగినది!


నాకు కలిగేది చావు మాత్రమే, అతని వచ్చినది మరణం!  - అంటే అది వాళ్ళ అమ్మ చెప్పిన  "గొప్ప సావు"  నా? 


ప్రభుత్వ లాంఛనాల తో సాగుతున్న శంకర్ స్వామి పార్థివ దేహాన్ని ఉంచిన వాహనం దగ్గరకి మాధవ కారు వచ్చింది. శంకర్ శరీరం మీద జాతీయ జండా కప్పబడి ఉంది. ఆ వాహనం అంతా పూలతో అలంకరించ బడింది. దానికి ముందు నడుస్తున్న పోలీస్ బ్యాండ్ వాళ్ళు వాయిస్తున్న పాట - జర యాద్ కరో ఖుర్బానీ!  - వినవచ్చింది. 


పోలీస్ బ్యాండ్ కి ముందు కొంత మంది కాలేజ్ యువతి యువకులు మార్చ్ పాస్ట్ చేస్తున్నట్లుగా నడుస్తున్నారు అతని ఫోటో పోస్టర్లను ఎత్తి పట్టుకొని.


ఒకే తరగతి గదిలో చదువుకున్న మేమిద్దరం ఒకే చోట ప్రక్క ప్రక్కనే ఒకరు నిర్జీవంగా, ఒకరు జీవించి.  అతను దేశం అంతర్గత భూభాగంలో నాలాంటి ఎంతో మంది రక్షణ కోసం శ్రమిస్తూ మృత్యువును కౌగిలించుకున్నాడు. ఆ శంకరుడు గరళాన్ని తీసుకున్నాడు, ఈ శంకరుడు బుల్లెట్లు తీసుకున్నాడు మామీదకు రాకుండా! దేశ ప్రజలకు రక్షణ కలిగించే ప్రతి సైనికుడు ఒక శంకరుడే! చిన్ననాడే గొప్ప మరణం కోసం ఎంతగా ప్రేరితుడు అయ్యాడు శంకర్ స్వామి!?


మాధవ మనసు వ్యక్తం చెయ్యలేని వ్యాకులతతో బరువెక్కింది. అతని కళ్ళు తడి బారినయ్. గద్గద స్వరంతో "కారు అపు.." అన్నాడు డ్రైవర్ తో. 

ఆపిన కారులో నుండి దిగి, "నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను తర్వాత వస్తాను" అని చెప్పి, రోడ్డు మధ్యన వున్న విభాగినిని దాటి వెళ్లి శంకర్ స్వామి పార్థివ శరీరాన్ని మోస్తున్న వాహనం ప్రక్కనే నడుస్తూ, దానికి తగిలించి వున్న శంకర్ ఫోటో ప్లాకార్డ్ చేతపట్టుకొని 

"శంకర్ స్వామీ… అమర్ రహే " అన్న నినాదంతో గొంతు కలుపుతూ నడుస్తుంటే, మాధవ మనసు తేలిక పడ సాగింది.✍️


#నా స్పందన: 

కొన్ని కథలు సరదాగా నవ్విస్తాయ్!

మరికొన్ని కథలు ప్రశాంతతను కలిగిస్తాయ్!

ఇంకొన్ని కథలు ...

మనకి కన్నీరు తెప్పించి పశ్చాత్తాపం కలిగిస్తాయ్!


జీవిత పరమార్థాన్ని తెలియజేస్తుందీ కథ ... 


సారీ, కాదుకాదు, కథ కాని సంఘటన!


"మా ఇద్దరి మధ్యా ఉన్న తేడాకి  ... 

ఖచ్చితంగా కారకులు మా తల్లులే!

మా మా కుటుంబ సభ్యులే!" అని ...

మాధవ అనుకుని ఉండాలి, మనసులో!


ఓ తల్లీ ... నీకు శతకోటి వందనాలు!🙏

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

కామెంట్‌లు లేవు: