8, జులై 2023, శనివారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 110*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 110*


మలయకేతు వద్దనుంచి కబురురాగానే చాలా సంతోషించాడు రాక్షసామాత్యుడు. ఇటీవలకాలంలో ఎడముఖం పెడముఖంగా ఉంటున్న రాజే స్వయంగా కబురుపెట్టేసరికి రాక్షసుడు ఆ ఉత్సాహంలో మంచి దుస్తులు ధరించి ముస్తాబయ్యాడు. అయితే ధరించడానికి ఆభరణాలు లేకపోవడంతో ప్రతీహారి బలవంతం మీద అంతకు ముందు వర్తకుల వద్దనుంచి తాను కొన్న ఆభరణాలను - అవి పర్వతకునివని తెలియనందున - ధరించి మలయకేతు సుముఖానికి బయలుదేరాడు. 


రాక్షసుడు శిబిరంలో అడుగుపెడుతూనే, 'అత్తవారింటికి వెళ్తున్నానని' చెప్పి బయలుదేరిన సిద్ధార్థకుడిని అక్కడ చూసి ఆశ్చర్యంతో "నీవింకా వెళ్లలేదా ?" అని ప్రశ్నించాడు. 


సిద్ధార్థకుడు బెదురుచూపులు చూస్తూ "వెళ్లేలోగానే వీళ్ళకి దొరికిపోయాను" అని చెప్పాడు. 


ఆ ప్రశ్న-జవాబు విని మలయకేతు, బాగురాయణుడు మొహాలు చూసుకున్నారు. అంతలో మలయకేతు దృష్టి రాక్షసుడు ధరించిన ఆభరణాల మీద పడింది. అవి మరణించిన తన తండ్రి ఆభరణాలని గుర్తించగానే ఆవేశంతో అతని మొహం జేవరించింది. 


రాక్షసుడు ఆ మార్పులను గమనించకుండా "కుమారా ! నా భృత్యుడు అమాయకుడు. అతడిని వదిలిపెట్టు" అని చెప్పాడు 'అతడు అత్తవారింటికి వెళ్తున్నాడన్న' భావనతో. 


"అతడు అమాయకుడని అంటున్నారంటే, మీరు నేరస్థులని అంగీకరిస్తున్నారా ?" అని ప్రశ్నించాడు మలయకేతు తీవ్రస్వరంతో. 


రాక్షసుడు ఉలిక్కిపడి "నేను... నేరస్తుడినా ...?" అన్నాడు తడబాటుతో. 


"కాదా ? అలా అయితే ఈ లేఖని చదివి ఆ మాట చెప్పండి" అంటూ లేఖను రాక్షసుని మీదకు విసిరాడు మలయకేతు. 


రాక్షసుడు నివ్వరబోయి ఆ లేఖని పరిశీలిస్తుంటే, సిద్ధార్థకుడు బెదురుచూపులు చూస్తూ "ప్రభువుల వారికి భయపడి నిజం చెప్పక తప్పలేదు. ఆ లేఖలోని ప్రతిమాటకీ వివరంగా వీళ్ళకి చెప్పాను..." అంటూ తాను అంతకుముందు వాళ్లకు వివరించిన విధంగానే రాక్షసునికి కూడా ప్రతి పదార్థాన్ని వివరించి చెప్పేశాడు. 


అదంతా విన్న రాక్షసుడు దిగ్భ్రాంతుడవుతూ "ఇదంతా ఏదో కుట్ర...." అన్నాడు. 


"అవును కుట్రే.... ఈ లేఖ రాసిన దస్తూరి మీ మిత్రుడు శకటదాసుది... లేఖపై మీ నామాక్షర అంగుళీకయకం ముద్ర ఉన్నది. ఒకనాడు మీకు మేము కానుకగా పంపిన ఆభరణాలు ఇప్పుడు యీ లేఖతో పాటు చంద్రగుప్తునికి బహుమానంగా పంపబడుతున్నాయి. మీ మిత్రుడు శకటదాసు ఇంతకు పూర్వమే కుసుమపురంవైపు మారువేషంలో పలాయనం చిత్తగించాడని, మీరొచ్చే ముందే మా చారులు వార్త తెచ్చారు... అయినా ఇదంతా కుట్రే... మీరు నిరపరాదులే... కానీ... మీరు ధరించిన ఆభరణాలు మా తండ్రి పర్వతకుల వారివి.... విషకన్య ప్రయోగం జరిగినరాత్రి వారు ఆ ఆభరణాలే ధరించారు. అవి ఇప్పుడు మీ ఒంటిమిదికి, ఎలా వచ్చాయో చెప్పగలరా రాక్షసా....?" అని ప్రశ్నించాడు మలయకేతు తీవ్రస్వరంతో. 


తాను ధరించిన ఆభరణాలు పర్వతకుడివని వినగానే... రాక్షసునికి మతిపోయినట్లయింది. ఏం మాట్లాడాలో పాలపోక వెర్రిచూపులు చూస్తూ "ఇందులో .... చాణక్యుని కుతంత్రమేదో కనిపిస్తోంది...." అన్నాడు హీనస్వరంతో. 


"చాణక్యుడా ! మాటి మాటికీ అతని పేరు అడ్డుపెట్టుకోవడం మీకు అలవాటైపోయిందా ? విషపూరిత ఫలాలతో సర్వార్ధసిద్ధి చావుకి కారణం మీరు కాదా ? జీవసిద్ధి చేత విషకన్యను సృష్టింపజేసినది మీరు కాదా? దేనికోసం... మగధ మహామాత్య పదవికోసమేనా ....?" అని గర్జించాడు మలయకేతు.


రాక్షసుడు ఖిన్నుడవుతూ "అబద్దం .... కుమారా .... ఇదంతా కుట్ర. ఆ చాణక్యుని దుస్తంత్రం. నాకొక అవకాశం ఇస్తే యీ కుట్రలను నిరూపిస్తా...." అన్నాడు ఆవేదనగా. 


"ఇంకొక్క అవకాశమివ్వాలా ? ఎందుకూ... నా తలగొట్టి చంద్రగుప్తునికి నువ్వు సమర్పించుకోవడానికా...?" 


"కుమారా ....!" 


"చీఛీ... నన్నలాపిలిచి ఆ మాటను అపవిత్రం చెయ్యకు... నా తండ్రికి పూర్వస్నేహితుడివని తండ్రిలాంటివాడివని చేరదీసి ఆదరించాను. కానీ ఒక పథకం ప్రకారం ఆ చంద్రగుప్తుని తొత్తుగా నా పంచన చేరావని ఊహించలేదు... నీ మొహం చూడాలంటే అసహ్యం వేస్తోంది. ఫో.... శ్రోత్రియ బ్రాహ్మణుడివనీ, నా తండ్రికి మిత్రుడవని దయతలచి నిన్ను ప్రాణాలతో వదిలిపెడుతున్నాను. ఫో... నిన్నూ, నీ చంద్రగుప్తుడినీ కదనరంగంలోనే ఎదుర్కొని నా కరవాలంతోటే బదులు చెప్తాను. ఫో...." అని గర్దించాడు మలయకేతు ఆగ్రహావేశంతో. 


అనూహ్యమైన అవమాన క్లేశంతో, నిరాశ నిస్సృహలతో జీవచ్ఛవంలా బయటికి నడిచాడు రాక్షసుడు. అతడి వెనుకనే జారుకున్నాడు సిద్ధార్థకుడు. 


మలయకేతు వొళ్ళు తెలియని ఆవేశంతో తన సేనాధిపతి రాజశేఖరుని పిలిచి "కులూత, మలయా, కాశ్మీర రాజ్యాధీశులు మా రాజ్యాన్ని ఆశించారు. ఆ ముగ్గురినీ వారి శిబిరాలలోనే తలలు నరికి సంహరించండి. సింధు, పారిశీక రాజులు మా గజబలాన్ని ఆశించారు వాళ్ళని మన ఏనుగుల చేత తొక్కించి చంపించండి" అని ఆజ్ఞాపించాడు.


రాజశేఖర సేనాని తన రాజాజ్ఞని రహస్యంగా అమలుపరిచాడు. అనంతరం ఆయా సైన్యాధిపతులకు విషయం తెలిసి మలయకేతు సైన్యాల మీద దాడి చేశారు. ఆ దాడిలో రాజశేఖర సేనానితో పాటు మలయకేతు సైన్యం చాలా భాగం నశించింది. అదే సమయంలో మగధ సైన్యం భద్రభట, డింగరాత్త, బలగుప్తాది సేనాధిపతుల సారథ్యంలో వారి మీద దాడి చేసింది. కులూత, మలయా, కాశ్మీర, సింధు, పారిశీక రాజన్యులను మలయకేతు చంపించడం చేత ఆయా రాజ్యాలసేనాధిపతులు చంద్రగుప్తుని సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ సంధి చేసుకున్నారు. 


"జయహో.... చంద్రగుప్త సార్వభౌములకూ... జయహో... జయహో...." 


విజయోత్సవ నినాదాలు తన శిబిరానికి సమీపంలో ప్రతిధ్వనిస్తుంటే వింటున్న మలయకేతు విస్తుబోయాడు. ఆ నినాదాలు ఎవరు చేస్తున్నారో, బయట ఏం జరుగుతున్నదో కూడా అతని ఊహకి అందడం లేదు. 


"బాగురాయణా.... బాగురాయణా... వినయా.... వినయా..." అంటూ వాళ్లకోసం బిగ్గరగా కేకలు పెట్టాడు మలయకేతు. మరుక్షణం గంభీరంగా శిబిరంలోకి ప్రవేశించాడు బాగురాయణుడు. అతడి వెనక మగధ సైనికులు.


"మలయకేతుల వారు మన్నించాలి.... తమరిని ఖైదు చెయ్యమని ఆజ్ఞ..." చెప్పాడు బాగురాయణుడు భావరహితంగా. 


మలయకేతు అదిరిపోతూ "ఆజ్ఞా... ? ఎవరి ఆజ్ఞ..." అడిగాడు విస్మయంగా. 


మరుక్షణం మరోవైపునుంచి వినయుడు శిబిరంలోకి అడుగుపెడుతూ "మా గురుదేవులు ఆర్య చాణక్యుల వారి ఆజ్ఞ...." చెప్పాడు గంభీరంగా. 


అంతే, చాణక్యుడి పేరు వింటూనే భయంతో కుప్పకూలిపోయాడు మలయకేతు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

కామెంట్‌లు లేవు: