7, మార్చి 2024, గురువారం

ప్రకాశం పంతులు గారు

 సార్..ఎవరో ముసలాయన ఏసీ వెయిటింగ్ రూంలో పడక్కుర్చీలో నిద్ర పోతున్నారు..టికెట్ లేదు..బయటికి వెళ్లమంటే వెళ్ళట్లేదు " స్టేషన్లో వెయిటింగ్ రూములను పర్యవేక్షించే మహిళ స్టేషన్ మాస్టర్ కి కంప్లైంట్ చేసింది 


అది రాజమండ్రి స్టేషన్ 

సమయం తెల్లవారి ఐదు గంటలు 


'సరే నేను వస్తా పద 'అని స్టేషన్ మాస్టర్ ఆమెతో కలిసి వెయిటింగ్ రూంకి వెళ్ళాడు 


అక్కడ మాసిపోయిన బట్టలతో ఓ ముసలాయన పడక్కుర్చీలో కునికిపాట్లు పడుతున్నాడు 


ఆ ముసలాయన్ని చూసి స్టేషన్ మాస్టర్ షాక్ అయ్యాడు 


ఆ ముసలాయన ఎవరో కాదు

 *ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు*


ప్రకాశం గారు చనిపోవడానికి ఏడాది ముందు జరిగింది ఈ సంఘటన 


వెంటనే స్టేషన్ మాస్టర్ టంగుటూరి ప్రకాశం పంతులు గారికి నమస్కరించి " అయ్యా మీరా ? నేను రాజేశ్వరరావు గారి అబ్బాయిని మీ శిష్యుడిని " అని నమస్కారం చేశాడట 


ప్రకాశం గారు కళ్ళు తెరిచి " ఏరా.. భోంచేశావా ?" అని అడిగాడట 


పంతులు గారి ప్రశ్న స్టేషన్ మాస్టర్ కి అర్థం కాలేదు 


'తెల్లారి ఐదు గంటలకు ఎవరైనా కాఫీ తాగావా ? అంటారు లేకపోతే టిఫిన్ తిన్నావా ? అని అడుగుతారు..మరి పంతులు గారేంటి భోంచేశావా ? అని అడుగుతున్నారు..బహుశా వయసు మీద పడటంతో ఏం అడగాలో తెలీక ఇలా అడిగారేమో


 అనుకుని పంతులు గారితో ,


"అయ్యా ఇప్పుడు సమయం తెల్లారి ఐదు గంటలు..మీరు కాఫీ తాగావా అని అడగబోయి భోంచేశావా ? అని అడిగినట్టున్నారు "అని అన్నాడు


దాంతో పంతులు గారు ,


"ఏరా మీ నాన్న రాజేశ్వరరావు నీకు నేర్పించిన సంస్కారం ఇదేనా ? నేను నిన్నేమ్ అడిగాను..భోంచేశావా ? అనడిగా..దానికి నువ్వేం చెప్పాలి..నేను భోంచేశా.. మీరూ చేసారా ? "అని కదా అడగాల్సింది 


స్టేషన్ మాస్టర్ కి విషయం అర్థమైంది 


పంతులు గారు ఆకలి బాధతో ఉన్నారని అర్థమైంది 


వెంటనే ఆయనకు కావాల్సిన పదార్దాలను వండటానికి ఇళ్ల దగ్గర మనుషులకు పురమాయించారు 


ఈలోపు ప్రకాశం పంతులు గారు రాజమండ్రి స్టేషన్లో ఉన్నారని తెలిసి జనాలు పోటెత్తారు 


"ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి పంతులు గారు ?" అని ఒక పెద్దమనిషి పంతులు గారిని అడిగారు 


"విజయవాడ వెళ్తా.."అన్నారు పంతులు గారు 


పంతులు గారి దగ్గర డబ్బులు లేవని తెలిసి అక్కడికక్కడే జనం తలా రెండు రూపాయలు..ఐదు రూపాయలు వేసుకుని మొత్తం 72 రూపాయలు పోగు చేసి పంతులు గారి జేబులో పెట్టి విజయవాడ రైలు ఎక్కించారు 


రైలు బయలుదేరుతుందనగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి పంతులు గారి కాళ్ళమీద పడి,

 " పంతులు గారూ.. మీరు రాజమండ్రి స్టేషన్లో ఉన్నారని తెలిసి పది మైళ్ళ దూరం పరిగెత్తుకుంటూ వచ్చానయ్యా..భార్య కాన్సర్ తో బాధ పడుతుందయ్యా ..అంటూ పెద్దగా ఏడవటం మొదలెట్టాడు 


పంతులు గారు వాడ్ని లేపి " ఏరా మనుషులన్నాక కష్టాలు రాకుండా ఉంటాయా ? ఇదిగో ప్రస్తుతానికి ఈ 72 రూపాయలు ఉంచు..అని జేబులో ఉన్న 72 రూపాయలు వాడి చేతిలో పెట్టాడు 


ఇదంతా చూసిన ఓ పెద్దమనిషి " అయ్యా పంతులు గారు..మీ జేబులో ఉన్న మొత్తం వాడి చేతిలో పెట్టారు..మీకంటూ కనీసం ఓ పది రూపాయలన్నా ఉంచుకోవాలి కదండీ..సరే..ఎలాగోలా విజయవాడ చేరతారు..మళ్లీ అక్కడ ఎవరో ఒకళ్ళు మీకు అన్నం పెట్టాలి..ఇంకొందరు పూనుకుని మిమ్మల్ని రైలెక్కించాలి..ఎంతో గొప్పగా బతికిన మీకు ఈ ఖర్మ ఏంటి పంతులు గారూ " అంటూ భోరున ఏడిస్తే ,


పంతులు గారు ఆయన భుజం మీద చెయ్యేసి ' ఏరా నాకేమన్నా అయితే చూసుకోవడానికి ఇంతమంది ఉన్నారు.. పాపం వీడికెవరు ఉన్నార్రా ?" అని కళ్లనీళ్ల పర్యంతం అయ్యారట 


ఆ రోజుల్లో తమకోసం కాకుండా జనం కోసం నాయకులు బతికేవాళ్ళు 


ముఖ్యమంత్రి పదవి చేసినప్పటికీ తనకంటూ ఏమీ మిగుల్చుకోలేకపోయారు పంతులు గారు 


మరి ఇప్పుడు ?

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: