24, మార్చి 2024, ఆదివారం

సంతోషం

 ఎక్కడ నుండి వస్తుంది సంతోషం ? నిత్యరోదితులం అయిపోయాం కదా ! మనకు లేదని కాదు ఏడుపు ; ఎదుటోడికి ఉందని కదా మన ఏడుపు ఇప్పుడు . చాగంటి వారు చెపుతుంటారు . 

నా దగ్గర కోటి రూపాయలు లేవని ఏడుస్తుంటే ఆ కోటి ఇస్తే ఏడుపు పోతుంది . 

ఎదుటోడి దగ్గర ఉన్న కోటి రూపాయలు పోవాలని కదా ఇప్పుడు ఏడుపు . దీనికి అంతం ఎక్కడ ? 


ఓ యాభై అరవై ఏళ్ళ కింద ఉన్నదానితో హాయిగా బతికేవాళ్ళం . 

మిద్దె ఇళ్ళల్లో , మూడు గదుల ఇరుకిళ్ళల్లో , 

ఓ రెండు దాపుడు బట్టలు , 

ఓ మూడో నాలుగో రోజువారీ బట్టలతో రాజాల్లాగా బతికే వాళ్ళం . 

ఇప్పుడు బీరువాలు బీరువాలు పట్టకుండా బట్టలు ఉన్నా తృప్తి ఎక్కడ ? 


నా చిన్నప్పుడు మా స్కూలు నరసరావుపేట సీతారామస్వామి దేవాలయంలో ఉండేది . 

అక్కడ గోడ మీద వ్రాసి ఉండేది . దొరికిన దాని యందు తృప్తి కలవాడు భాగ్యవంతుడు . జనం కూడా హాయిగా , హాయిహాయిగా ఎప్పుడూ నవ్వుతూ , సంతోషంగా ఉండేవాళ్ళు . 


రోజులు మారాయి . Beg , borrow , steal రోజులు వచ్చాయి .

 Earn and enjoy రోజులు పోయాయి . ప్రపంచాన్నంతా మోసం చేస్తున్నాం . స్నేహితుల్ని మోసం చేస్తున్నాం . బంధువులను మోసం చేస్తున్నాం . చివరకు అన్నాతమ్ముళ్ళని , అక్కాచెల్లెళ్ళని , తల్లీతండ్రులను కూడా మోసం చేస్తున్నాం . సంతోషం రమ్మంటే ఎక్కడ నుండి వస్తుంది . 


ముందు మనం పరుగెత్తటం మానుకోవాలి . నడవటం నేర్చుకోవాలి . కూర్చోటం అలవాటు చేసుకోవాలి . కోరికలనే గుర్రాలకు కళ్ళెం వేయాలి . మనకేం కావాలో తేల్చుకోవాలి . భౌతిక , ఐహిక అనవసర వాంఛల్లోనుంచి విముక్తులం కావాలి . అప్పుడు ఎందుకు రాదు సంతోషం . తప్పక వస్తుంది . 


ఆబ ప్రపంచం నుండి సంతృప్తి భావనలోకి రావాలి . ఎదుటోడిని చూసి ఏడవటం మానుకోవాలి . లేనిదాని కోసం కష్టపడి సంపాదించు కోవటం మొదలు పెట్టాలి . 

తప్పుడు మార్గాలను శోధించటం ఆపాలి . అప్పుడు మన భారతం కూడా సంతోష భారతం అవుతుంది .

🌹👏🏽🌷

కామెంట్‌లు లేవు: