26, ఏప్రిల్ 2024, శుక్రవారం

దేవుడు ప్రత్యక్షమై

 ఉన్నట్టుండి దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే.. చాలామంది చప్పున అడిగేది ధనం లేదా హోదా. నిజానికి మనందరికీ కావలసింది ఆరోగ్యం. అంతకంటే ముఖ్యంగా అవసరమైంది మనశ్శాంతి. కానీ అది కొనుక్కుంటే లభ్యమయ్యేది కాదు. మరెక్కడ దొరుకుతుంది.. ఎలా దక్కించుకోవాలి..


ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెదికిందట ఓ అమ్మ. అనేక సందర్భాల్లో మన తీరు అలాగే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ ప్రపంచంలో అతి అరుదైందీ, అమూల్యమైందీ, అందరికీ అత్యంత అవసరమైందీ మనశ్శాంతి. అయితే ఆ మనశ్శాంతిని ఎలా పొందాలనే వెతుకులాట ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుంది. ధనంతో ఈ ధరణిలో దేన్నైనా సాధించవచ్చునన్న మాట మనశ్శాంతి విషయంలో చెల్లదు. అవసరమైన వన్నీ అమరినప్పుడూ, కోరిన కోర్కెలన్నీ తీరినప్పుడూ ప్రశాంతంగా ఉండొచ్చు అనుకోవడం సహజం. కానీ ఆ ఆలోచనలోనే తేడా ఉంది. కావలసినవన్నీ పొందడం కన్నా అవసరం లేనివాటిని వదలడం వల్ల మనశ్శాంతి కలుగుతుందన్న విషయాన్ని అందరూ మర్చిపోతుంటారు. దాంతో అనవసరమైన వాటి సేకరణతో సంచి బరువై సంచితం పెరిగి ఆయాసం మిగులుతుంటుంది. ఇలా పరిణమించకూడదు అంటే పరిసరాలూ, పరిస్థితులకు అనుగుణంగా మానసిక దృక్పథాన్ని మార్చుకోవాలి. అందుకోసం కోరికలను విడిచిపెట్టాలని వేదోపనిషత్తులూ, పురాణేతిహాసాలూ, బుద్ధుడు, జినుడు తదితర మహనీయులు ఎందరు ఎన్ని విధాల చెప్పినా, స్వీయ అనుభవాలతో అర్థమైనా.. దాన్నెవరూ పట్టించుకోరు. ఆశ, కోరిక, తృష్ణ- ఇలా ఏ పేరైనా కావొచ్చు.. అది మదిలో రొదపెడుతున్నంత కాలం మనశ్శాంతి అనేది ఉయ్యాల్లో బిడ్డలాగా కళ్లెదుటే ఉన్నా కనిపించదు. దానికోసం ఎక్కడెక్కడో అన్వేషిస్తుంటాం. వెతుకులాట నిరంతరం సాగుతూనే ఉంటుంది.

ఆశ అంతరిస్తేనే..


జీవితంలో ఎంత సంపాదించినా, ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నా ఆశ గనుక అంతరించకపోతే అశాంతే కలుగుతుంది. మనశ్శాంతి దూరమౌతుంది. ఈ విషయాన్ని సాక్షాత్తు విష్ణుమూర్తే వామన అవతారంలో మనకు విశదపరిచాడు. కానీ దేవుడే దిగి వచ్చి చెప్పినా చెవికెక్కించుకోకపోవటం మనుషుల బలహీనత.


వ్యాప్తిం బొందక వగవక

ప్రాప్తంబగు లేశమైనఁ బదివేలనుచుం

దృప్తిం జెందని మనుజుఁడు

సప్తద్వీపముల నయినఁ జక్కంబడునే


అని ఎంత అరటిపండు ఒలిచి నోటికందించినట్లు వామనుడి మాటలను పోతన ఏనాడో చెప్పాడు. వచ్చిన చిక్కేమిటంటే.. దేవుణ్ణి ఆరాధిస్తామే కానీ ఆ తత్త్వాన్ని పట్టించుకోం. దొరికిన దాంతో సంతృప్తి చెందమన్న స్వామి బోధ వింటే మనశ్శాంతి మనల్ని వదిలి పొమ్మన్నా పోదు. కానీ ఏది ఉన్నా, ఎంత ఉన్నా తృప్తి చెందక.. ఇంకా ఇంకా కావాలంటూ తపన చెందుతుంటే పరిణామం ఎలా ఉంటుందో కూడా ఆ తర్వాతి పద్యంలోనే..


‘ఆశాపాశము దాఁగడున్‌ నిడుపు లేదంతంబు.. వా రాశిప్రావృత మేదినీ వలయ సామ్రాజ్యం..’ అంటూ చెప్పాడు. సర్వం చేజిక్కినా ఆశ అణగారదు. అంతులేని ఆశ అనే తాడు చివరికి అసంతృప్తి అనే ఉరితాడుగా మారుతుంది- అన్నది భావం. ఈ విషయాన్ని అర్థంచేసుకుంటే అశాంతి, నిరాశలు దూరమై మనశ్శాంతి మన కళ్ల ముందే కదలాడటం నిక్కం.


తృష్ణ ఎలాంటి వారినైనా పరాజయం పాలుచేసి అశాంతచిత్తుల్ని చేస్తుందని శ్రీరాముడు యోగ వాశిష్ఠంలో ‘..మేరు సమం ప్రాజ్ఞమపి శూరమపి స్థిరమ్‌ తృణీ కరోతి తృష్టికా నిమేషేణ నరోత్తమమ్‌...’ అన్నాడు. మేరుసమానుడైనా, మహాప్రాజ్ఞుడైనా, నరోత్తముడైనా.. కోరికల చేతిలో క్షణంలో ఓడిపోతాడు. ఓటమి మనశ్శాంతిని దూరం చేస్తుందని ఎవరూ వివరించనవసరం లేదు. కనుక కోరికలను జయించి, తృప్తితో జీవించడం నేర్చు కోవాలి. ‘తృప్తికి మించిన సంపద లేదు. సాటిలేని ఆ సంపదే మనశ్శాంతి’- అంటూ ప్రవచించారు శారదామాత కూడా.

జారుడు మెట్లు..


మనశ్శాంతి దూరమైందంటే ఈర్ష్యాద్వేషాలే ప్రధాన కారణాలు. అవి జారుడుమెట్ల లాంటివి. పైకి ఎక్కటానికి ఉపకరిస్తాయని భ్రమ కలిగిస్తాయి. కానీ ఏ ఒక్క మెట్టూ అందుకు పనికిరాదు. పైగా జారి కిందపడితే అథోగతే. ఎవరి మనసులో ఈర్ష్యా ద్వేషాలు ఉంటాయో వారికి మనశ్శాంతి దుర్లభం. ఎదుటివారి ఆనందాన్నీ, అభివృద్ధినీ చూసి ఓర్వ లేనివారికి మనశ్శాంతి దక్కకపోగా అశాంతే మిగులుతుంది. ఇతరుల సుఖసంతోషాలకు ఆటంకం కలిగిస్తూ, ఎదుటివారికి హాని తలపెట్టాలనే స్వభావం వదలనంత వరకూ మనశ్శాంతి మన దరిదాపుల్లోకి రాదన్నది అక్షర సత్యం. దుర్యోధనుడి ద్వేషభావం వల్లనే పాండవులు అరణ్యాల పాలై అష్టకష్టాలూ అనుభవించారు. అయితే దుర్యోధనుడు అంతఃపురంలో స్వర్గసౌఖ్యాలు అనుభవిస్తూ కూడా ఆనందాన్ని అనుభవించలేక దుఃఖసముద్రంలోనే కొట్టుమిట్టాడాడు. ఘోషయాత్ర సమయంలో అంతటి మానధనుడు ఘోర అవమానానికి గురై అశాంతితో రగిలిపోతూ కుమిలిపోయాడు.

అది తాడు.. ఇది దీపం

జయ శ్రీ రామ్ 

కంచర్ల వెంకట రమణ

కామెంట్‌లు లేవు: