16, ఏప్రిల్ 2024, మంగళవారం

కాశీ యాత్ర ర (మొదటి భాగము)

 కాశీ యాత్ర (మొదటి భాగము)


ఈ ఏడు ఫెబ్రవరి నెలలో నేను నా శ్రీమతి కలసి రామేశ్వరము ఒక యాత్రికుల సమూహంతో బస్సులో వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని బస్సుకు టికెట్ల డబ్బులు కూడా కట్టి చివరి నిమిషంలో కారణాంతరాలవల్ల ప్రయాణాన్ని విరమించుకోవలసి వచ్చింది. ఈశ్వరుని అనుగ్రహం లేదు అని సరిపెట్టుకున్నాము. ఈ విషయంలో మేము వ్యాకులపడి ఉన్నామని తలంచి మా కుమారుడు మమ్ములను ఉత్సాహ పరచనెంచి గత మార్చి నెలలో వారణాశి ప్రయాణముకు విమాన టికెట్లు బుక్కు చేసినాడు. మా ప్రయాణం ఏప్రియల్ 4వ తారీకు రాత్రి 7-40 నిముషములకు హైదరాబాదు విమానాశ్రయం నుండి మొదలై 9వ తారీకు ఉదయం 9-15 నిముషములకు తిరిగి హైదరాబాదు విమానాశ్రయంలో చేరుకోవటంతో ముగుస్తుంది.


ప్రయాణ సన్నాహాలు: రోజులు గడుస్తున్నాయి అనుకున్న ఏప్రియల్ 4వ తారీకు రానే వచ్చింది. నాకు ఆ రోజుకూడా రాజేంద్రనగర్ కోర్టులో ఒక కేసు వున్నది. నా కుమారుడు అనుకున్న ప్రకారం రెండు రోజులముందే బెంగుళూరు నుండి వచ్చాడు. వచ్చిన వెంటనే ప్రయాణానికి ఏమేమి సామానులు తీసుకొని వెళ్ళాలి అని నా కుమారుడు, శ్రీమతి అనుకోని బ్యాగులు సర్దుకోవటం మొదలు పెట్టారు. నేను 4వ తారీకునాడు కోర్టుకు నా క్లయింటు కారులో వెళ్ళాను. అదృష్ట వశాత్తు మా జెడ్జిగారు సెలవులో వున్నారు. కేసు తొందరగా వాయిదా వేసుకొని 12 గంటలకల్లా ఇంటికి చేరుకొని నా బ్యాగు సర్దుకున్నాను. మేము అనుకున్న ప్రకారము సాయంత్రము 5 గంటలకు రాపిడో క్యాబు బుకు చేసుకున్నాము. ఒక పది నిముషములలో క్యాబు వచ్చింది. ఒక అర గంటలో మమ్ములను విమానాశ్రయంలో దింపాడు. క్యాబుకు 600 రూపాయలు అయ్యాయి. మేము ముందుగా నా ప్రింటరులో తీసుకున్న టికెట్ల ప్రింట్లను చూపించి విమానాశ్రయాయంలోకి ప్రేవేశించాము. తరువాత మా లగేజీలను తనిఖీచేసిన  ఆమెతో మేము మా లగేజీలను క్యాబిన్లో కాకుండా మా వెంట తీసుకొని వెళతాము అని అడుగగా దానికి ఆమె సరే అని అన్నది. మీ వెంట లగేజి తీసుకునే పక్షంలో టాగ్లు వేసుకోవలసిన అవసరము లేదు అని అన్నది. తరువాత అక్కడి మానెటరును చూసుకొని మేము గేటు నెం. 17 లో విమానాన్ని ఎక్కాలని తెలుసుకొని చెక్ ఇన్ ద్వారాన్ని దాటి వెళ్ళాము. చెకిన్ మనకు మన మనీపర్సు, మొబైలు ఫోనులు కూడా అక్కడి ట్రేలలో పెట్టి అక్కడి యంత్రంద్వారా తనికీ చేయపడ్డ తరువాత మాత్రమే తీసుకొనాలి. 


మాకు వారణాసి వెళ్ళటానికి ఇండిగో విమానంలో 45వ వరుసలో సీట్లు దొరికాయి. ఆ విమానంలో 7 కేజీల లగేజి మన వెంట మరియు 15 కేజీల లగేజి క్యాబిన్లో తీసుకొని వెళ్ళవచ్చు. గోళ్ళ రంగులు, రేజరులు, మండే పదార్ధాలు, సిగరెట్ లైటరులు, చాకులు, బ్లేడులు వెంట తీసుకోవటానికి అనుమతి ఉండదు.

కామెంట్‌లు లేవు: