🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹
*🚩మంగళవారం 17 జూన్ 2025🚩*
``
*రామాయణం*
ఒకసారి చదివినంత
మాత్రాన మన సమస్త
పాపాలని తీసేస్తుంది…
``
*వాల్మీకి రామాయణం*
*71వ భాగం*
```
అప్పుడు అక్కడున్న వికృత రూపములు కలిగిన రాక్షస స్త్రీలు సీతమ్మ చుట్టూ చేరి “సీతా! దేనికైనా ఇంత అతి పనికిరాదు. రావణుడు అంటే సామాన్యుడు కాదు, బ్రహ్మ కుమారులలో నాలుగో ప్రజాపతి అయిన పులస్త్యబ్రహ్మ యొక్క కుమారుడైన విశ్రవసోబ్రహ్మ యొక్క కుమారుడు రావణబ్రహ్మ. సాక్షాత్తు బ్రహ్మగారికి మునిమనవడు. లోకంలో అందరినీ జయించాడు, బ్రహ్మగారిని గూర్చి తపస్సు చేశాడు, ఎన్నో గొప్ప వరములను పొందాడు. అలాంటి రావణుడితో హాయిగా భోగం అనుభవించకుండా ఏమిటి ఈ మూర్ఖత్వం. పోనిలే మెల్లగా మనస్సు మార్చుకుంటావు అని ఇంతకాలం చూశాము,కాని మనస్సు మార్చుకోకుండా ఇలా ఉంటావేంటి, ఎంత చెప్పాలి నీకు” అని గద్దించారు.
అప్పుడు సీతమ్మ అనింది…
“ఐశ్వర్యం ఉంటే భర్తగా చూడడం, రాజ్యం ఉంటే భర్తగా చూడడం, ఒంట్లో ఓపిక ఉంటే భర్తగా చూడడం నాకు తెలియదు. ఆయన దీనుడు కావచ్చు, రాజ్యహీనుడు కావచ్చు, కాని నా భర్త నాకు గురువు, సమస్తం. సూర్యుడి భార్య అయిన సువర్చల సూర్యుడిని ఎలా అనుగమిస్తుందో, వశిష్ఠుడిని అరుంధతి ఎలా అనుగమిస్తుందో, శచీదేవి ఇంద్రుడిని ఎలా అనుగమిస్తుందో, రోహిణి చంద్రుడిని ఎలా అనుగమిస్తుందో, లోపాముద్ర అగస్త్యుడిని ఎలా అనుగమిస్తుందో, సుకన్య చ్యవన మహర్షిని ఎలా అనుగమిస్తుందో, సావిత్రి సత్యవంతుడిని ఎలా అనుగమిస్తుందో, శ్రీమతి కపిలుడిని ఎలా అనుగమిస్తుందో నేను కూడా అలా రాముడిని అనువర్తిస్తాను. మీరు నన్ను చంపి, నా శరీరాన్ని ముక్కలు చేసి తినెయ్యండి, నేను మాత్రం రాముడిని తప్ప వేరొకడిని కన్నెత్తి కూడా చూడను. రావణుడిని నా ఎడమ కాలితో కూడా ముట్టుకోను. మీరు నాకు ఇలాంటి మాటలు చెప్పకూడదు, నేను వినకూడదు” అన్నది.
అప్పుడు హరిజట అనే రాక్షస స్త్రీ లేచి… “ఈమెని రావణుడు అపహరించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పటినుంచి నా నోటి వెంట లాలాజలం కారిపోతోంది. ఈమెని ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నాను” అన్నది.
ఈ మాటలు విన్న ఏకజట అనే రాక్షస స్త్రీ లేచి అన్నది… “నేను బయట పడితే ఎవరన్నా ఈ విషయం చెప్పేస్తారేమో అని భయపడ్డాను. కాని హరిజట బయటపడింది కాబట్టి చెప్తున్నాను, ఆకలితో ఉన్నవాడు ఎదురుగా భోజనాన్ని పెట్టుకుని తినకుండా ఎలా నిగ్రహించుకొని ఉంటాడో, అలా నేను కూడా ఈ నరకాంతని ఎదురుగా పెట్టుకొని తినకుండా నిగ్రహించుకొని ఉన్నాను. ప్రభువు ఎలాగూ అనుమతి ఇచ్చాడు కదా ఈమెని దండించమని, కాబట్టి ఈమె పీక పిసికేసి తినేద్దాము. ఈమె హృదయమునకు కిందన ఉండే భాగము, గుండె, మెదడు నాది అన్నది.
అప్పుడు మిగతా రాక్షస స్త్రీలు, నావి కాళ్ళు, నావి తొడలు, నావి చేతులు అని వాటాలు వేసుకున్నారు.
తరువాత అజముఖి అనే స్త్రీ… “ఈమెని అందరమూ సరిసమానంగా వాటాలు వేసుకుందాము. తొందరగా కల్లు తీసుకురండి. ఈమెని తింటూ, కల్లు తాగుతూ, నికుంబిలా నాట్యం చేద్దాము” అంది.
అప్పుడు సీతమ్మ ఏడుస్తూ… “ఇక్కడ మరణిద్దామన్నా కూడా నాకు స్వేచ్ఛ లేదు” అని అనుకొని, ఆ రాక్షస స్త్రీలని చూసి భయపడుతూ కూర్చున్న చోట నుంచి లేచి శింశుపా వృక్షం మొదటికి వెళ్ళి కూర్చుంది.```
*రేపు… 72వ భాగం*
*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*
*🙏జై జై శ్రీ రామ్.!🙏*
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి