16, జనవరి 2026, శుక్రవారం

సాహిత్యమనగానేమి

  *సాహిత్యమనగానేమి? సహితానాం భావః సాహిత్యమ్. సహితములైన వానియొక్క భావము సాహిత్యము. సహితమనగా కూడుకొని యున్న అని యర్ధము.లోకమునందు - చెప్పుచున్నారు. కాని నిజముగా హితమైన దానితో కూడి యున్నదని యర్థము. = హితమనగానేమి.? హితం మనోహారిచ దుర్లభంవచః అని భారవి వ్రాసినాడు. హితమును, మనోహరియునైన వాక్కు దుర్లభము. ఏ మాట మనోహారిగా నుండునో, మనస్సునకు - తాత్కాలికమైన యొక పొంగును తెచ్చునో, అట్టిదియు హితమైనదియునైన మాట దుర్లభము. హితమనగా నేమి. హితమనగా పథ్యము. అనగా తత్కాలమునం దయిష్టముగా నుండి అనంతర కాలమునందు మేలును సమకూర్చునది. వైద్యుడు పథ్యమును చెప్పును. అది తినుట కష్టము. కాని తిన్నచో వ్యాధి కుదురును. మొత్తముమీద సాహిత్యమనగా - తత్కాలమునందు హితముగా నుండదు. అనంతర కాలమునందు హితముగా నుండును. తరువాత మేలును సమకూర్చును. తరువాత ననగా నెప్పుడు? దానితో నీవు పరిచయము - వృద్ధి చేసికొని, దానిలోని సౌందర్యము నాస్వాదించుట కలవాటుపడి, ఆ సౌందర్యము ననుభవించుచు నానందము పొందగలిగినంత జీవలక్షణము పెంపొందించుకొని, అందులో చెప్పబడ్డ మహా విషయములే యదార్థములని తెలిసికొన్న తరువాత నది సాహిత్యమగును.*

కామెంట్‌లు లేవు: